కథన కుతూహలం

ఎండిన జీవితంలో ఓ నీటి చుక్క అలజడి!

ఫిబ్రవరి 2013

“మన సమాజం మహా క్రూరమయినది….కరుణ రసాన్ని వాహికగా చేసుకుని నేను నా ఆగ్రహాన్ని ప్రకటిస్తాను. అది కథలో వాచ్యంగా ఉండకపోవడం దాని బలహీనత కాదు-బలమే!” అని నిర్భయంగా, ఆత్మవిశ్వాసంతో విమర్శకులకు జవాబు చెప్పగల మేటి కథకుడు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు. కథా రచయితగా అమిత అనుభవజ్ఞుడు. ఈయన కథల్లోని కథా వస్తువు మన చుట్టు జరిగే సంఘటనలే. మనం నిత్యం వాడే వస్తువులే. కళ్ళజోడు, ఇంగువ, ముసురు, మబ్బు విడిచిన ఎండ ఇలాంటివన్నీ ఆయన కథా వస్తువులే. మధ్యతరగతి బతుకు బాధల్ని విన్నంత, కన్నంత అక్షరీకరించారు. సుబ్బరామయ్యగారి కథలు మధ్య తరగతి జీవితాలలో సమస్యలకు అద్దాలు. అలాంటి ఒక అద్దమే “నీళ్ళు”. కరువు ప్రాంతాలనుండి నీళ్ళు సమృద్ధిగా దొరికే ప్రాంతానికి ఉద్యోగం కోసం వలస వచ్చిన ఒక యువకుని కథే “నీళ్ళు”. ఈ కథ చదివితే, నీరు మన జీవితంలో ఇంత ప్రాముఖ్యతని సంతరించుకుందా అని ఆశ్చర్యపోకమానరు.
“అక్కడ నీటి చుక్క కనిపించదు. అన్ని కాలల్లోనూ ఒకటే కరువు. బావులన్నీ పాతాళంలోకి వెళ్ళే సొరంగాల్లాగా ఉంటాయి. తొంగి చూస్తే అడుగున ఏమీ కనిపించదు. పెద్దతాడు బొక్కెనకుకట్టి లోపలికి వదులుతూ వుంటే ఎంతకూ నీళ్ళు తగలవు. చివరకు బొక్కెన రాళ్ళ మీద పడిన శబ్దం వినిపిస్తుంది”.
అది నిరాశ, నీరసం తప్ప నీరు ప్రవహించని ప్రాంతం. ఒక బిందెడు నీటి కోసం చాలా దూరం పోయి, డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి. పొరపాటున చేయి తగిలి, తెచ్చుకున్న నీటిబిందె జారిపడితే, అసహనం పెచ్చులు మీరి, కన్నబిడ్డనైనా చావబాదడానికి వెనుకాడని దుస్థితి. నీటిచుక్కలు లెక్కబెట్టుకుని వాడుకోవాల్సిన పరిస్థితి నుండి బోల్డంత నీటిని ఒకే చోట చూసే మహదవకాశం వస్తే ఆ యువకుడి ఆనందాన్ని మాటల్లో చెప్ప సాధ్యమా! అతనికి, ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని వింతల్లో ఇదీ ఒకటి. కృష్ణా నది విస్తారంగా ప్రవహించే ప్రాంతంలో ఉద్యోగం వచ్చింది.
ఒక ఎండిన జీవితంలో చల్లని నీరు ప్రవహిస్తే వచ్చే ఆనందం ఆ యువకుడి సొంతం. అరగంటకొకసారి నీళ్ళు తాగుతాడు. ఒక గ్లాసు నీటిలో ప్రతీ చుక్కనూ ఆస్వాదిస్తూ తాగుతాడు. కళ్ళతో చూస్తూ, రుచిని అనుభవిస్తూ, గొంతులో నుండి నీరు జారుతుంటే ఆనందాన్ని మమైకం చేసుకుంటూ తాగుతాడు. ఆ అబ్బాయికి మాత్రమే నీటి ‘రుచి’ తెలుసు. పొద్దున్న, సాయంత్రం గంటలతరబడి స్నానం చేస్తూ ఉంటాడు. అమ్మ పేరున ఒక బకెట్, చెల్లాయి పేరున ఒక బకెట్ నీళ్ళు పోసుకుంటూ ఉంటాడు. అతడికి ఏది చూసినా నీటిలాగే కనిపిస్తుంది. ఒక అందమైన యువతి కళ్ళని చూసి “ఆమె కళ్ళు చెంపకు చారడేసి ఉండి తళతళ లాడుతున్న నీళ్ళను గుర్తు తెస్తాయి” అంటాడు. నీరు లేక తన చెల్లాయి జబ్బుపడి కళావిహీనంగా తయారయ్యిందిగానీ రోజూ నీళ్ళు తాగితే ఈ అమ్మాయిలాగే తన చెల్లి కూడా అందంగా, ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తాడు. నీరు తాగడం వల్లే తను అందరికన్నా ఆరోగ్యంగా ఉన్నానని ఆనందపడుతుంటాడు. నాగరికతకూ, సౌభాగ్యానికి, ఆరోగ్యానికీ నీళ్ళే కారణమని పునఃనిర్వచిస్తాడు. తను రోజూ భోజనం చేసే హొటెల్ లో “మంచినీళ్ళ పంతులుగారు” అని బిరుదు కూడా సంపాయిస్తాడు.
నీళ్ళని బాగా ఖర్చు చెయ్యడం వచ్చిందిగానీ డబ్బులను నీళ్ళలా ఖర్చు చెయ్యడం రాలేదు. మరి, అమ్మ చెల్లాయిలకు పైసా పైసా మూటకట్టి పంపిస్తేనే కదా నీటిచుక్కలు లెక్కెటి కాస్త ఎక్కువ కొనుక్కోగలరు! తనకి డబ్బెందుకు! నీళ్ళున్నాయిగా! కృష్ణనిండా ఉన్నాయి. అవసరాలకు సరిపడినంత డబ్బు ఉంటే చాలు. పెద్ద చెల్లికి పెళ్ళి చేసేసి, చిన్న చెల్లిని, అమ్మని తన దగ్గరకు తెచ్చేసుకుని వాళ్ళ జీవితాల్లో పన్నీటి జల్లులు కురిపించాలన్నది అతని ఆశ. ఇది అర్థం చేసుకోలేని మిత్రులు అతనిని హేళన చేస్తారు. నీళ్ళను ఆశ్వాదించడం జబ్బు అంటారు. మానసిక వ్యాధి అనీ, వెర్రితనం అని నొక్కివక్కాణిస్తారు. “అధర్మం పెరిగితే అంతే, నీటిచుక్క దొరకదు.” అంటూ ధర్మపన్నాగాలు వల్లిస్తారు. అతను బాధపడతాడు. వెర్రి ఆవేశంతో ఊగిపోతాడు. ‘లేనితనం’ తన తప్పెలా అవుతుంది అంటూ తన నిస్సహాయతను అవహేళన చేసిన వారిపై విరుచుకుపడతాడు. “అవును నిజమే – మా వూళ్ళూ, మా ప్రాంతమూ వట్టి దౌర్భాగ్యపువే. నీళ్ళ కరువు ఉంటే దౌర్భాగ్యం కాక మరేమిటి? అయినా మధ్య నేనేందుకు వెర్రివాణ్ణవుతాను!” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు.
తనే నీరు, నీరే తన్ను అన్నట్టు భావించే ఆ యువకుడిని, నీటి విలువ ఏ మాత్రమూ గుర్తించే అవకాశం లేని/రాని అదృష్టవంతులు ఎగతాళి చేయడంతో అవమానం తో కృంగిపోయి కృష్ణ లో దిగి, ఆలోచనల్లో మునకవేస్తూ, అప్రయత్నంగా ఆ నీటికే అంకితమైపోతాడు.
నీటిని అమితంగా ప్రేమించిన అతన్ని, నదిలోని చల్లని నీరు మనసారా దగ్గరకు తీసుకుంది, తనలో ఐక్యం చేసుకుంది. మరెప్పుడూ దూరమవలేనంతగా పొదువుకుంది.
నది తన దోవన తాను భీకరంగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహించి పోతున్నది. ఎక్కడో కొన్ని వందలమైళ్ళ దూరంలో మారుమూల పల్లెటూళ్ళో పూరియింట్లో నిద్రలో వున్న తల్లిప్రేగు కదిలింది“.
అంతే !
ఈ కథ చదువుతున్నంతసేపు మన గుండె తడి అవ్వకమానదు. కళ్ళు చెమర్చక మానవు. చదివాక ఒక గుటక నీరు తాగాలనిపించక మానదు. మొదటిసారి ఈ కథ చదివినప్పుడు చలించిపోయాను. నన్ను వెంటాడి తరిమిన కథల్లో ఇదొకటి. నీళ్ళకి ఇంత ప్రాముఖ్యత ఉందా అని ఆశ్చర్యపోయాను. నీరు ప్రాణికి అత్యవసరమైనదే అయినా రోజువారీ జీవితంలో మనం గుర్తించని అతి సాధారణమైన విషయాల్లో ఇదీ ఒకటి. ఎవరైనా ఊరికే నీరు పారబోసినప్పుడల్లా నాకీ కథ గుర్తొస్తూ ఉంటుంది. ఎవరైనా దాహంతో ఆత్రంగా నీళ్ళు తాగితే ఈ కథ గుర్తొస్తుంది. అంతెందుకు, నాకు దాహమేసినప్పుడలా ఈ కథ గుర్తొస్తుంది. అప్పటివరకూ “ఆమె పల్చటి మెడ బంగారువన్నెలో మెరిసిపోతోంది. తను నీరు తాగుతుంటే గొంతులోనుండి నీరు పారదర్శకంగా కనిపిస్తోంది” లాంటి వాక్యాలే చదివిన నాకు “…గ్లాసును చేతిలోకి తీసుకుని దాన్ని నీళ్ళతో నింపి చెయ్యి పైకెత్తి ఒక్క నిముషంసేపు దానివంక కన్నార్పకుండా చూశాడు. గ్లాసులో నీళ్ళు తెల్లగా మిలమిల లాడుతున్నాయి. అతడు నెమ్మదిగా ఆ గ్లాసు నోటిదగ్గర వుంచుకుని గుక్క తర్వాత గుక్కగా నింపాదిగా తాగాడు. తాగుతున్నప్పుడు తల్లినీ, చెల్లెళ్ళనీ తలుచుకుని మరీ తాగుతాడు”. అన్న వాక్యాలు చూడగానే ఒక్కసారిగా ఎవరో గట్టిగా పట్టి కుదిపినట్టయ్యింది. కరువు ప్రాంతం నుండి వచ్చిన వారి ఆవేదన, బాధలను ప్రతీ వాక్యంలోనూ చూపించగలిగారు సుబ్బరామయ్యగారు.
సహజంగా, సమృద్ధిగా లభించాల్సినదేదైనా కొరవడితే అది ఎంత బాధో కదా! శారీరక వికలాంగం ఎంత కష్టమో ప్రాకృతిక వికలాంగం కూడా అంతే కష్టం! అది గుర్తించకపోవడం, అవహేళన చెయ్యడమే అవకరం, మానసిక వైకల్యం. కథలో అతడి జీవితంలో నీరు మాత్రమే ఇంకిపోయింది. కానీ అతన్ని ఎగతాళి చేసిన వారి జీవితాల్లో మానవత్వం, సహృదయం, కరుణ, జాలి అన్నీ ఇంకిపోయాయి. ఇది అంతకన్నా పెద్ద దౌర్భాగ్యం కదూ! బహుసా, వాళ్ళని చూసి కూడా జాలి పడాలేమో! మానవ సహజమైన వనరులు వారికి కరువైనందుకు.
ఇక్కడ ఇంకొక విషయం కూడా ప్రస్తావించక తప్పదు. ప్రకృతి సహజమైన కరువు మన చేతిల్లో లేనిది అనుకుందాం. మనుషులు పెంచి పోషిస్తున్న కరువు మాటేమిటి? ఒక ఊరిలో నీరు కొంతమందికే అందుబాటులో ఉండడం, కళ్ళెదుట కనబడుతున్న నీటిపై ఆక్షలు విధించడం లాంటివి. నా చిన్నతనంలో మా వీధిలో ఒకే ఒక్క మున్సిపల్ కొళాయి ఉండేది. వీధి చివర ఉన్న గేటింటి మామ్మగారింట్లో ఒకటి ఉండేది. ఎండాకాలంలో బావులు ఎండిపోయినప్పుడు మున్సిపల్ కొళాయి నీళ్ళే అన్నిటికీ ఆధారం. అటువంటి పరిస్థితుల్లో గేటింటి మామ్మగారింట్లో నీళ్ళకి వాళ్ళ కులస్థులు మాత్రమే అర్హులు. మిగతావారికి నిషిద్ధం. ఒకవేళ మామ్మగారింటినుండి వీధి కొళాయిలో నీళ్ళు పట్టుకోవడానికి ఎవరైనా వస్తే వారు పూర్తిచేసి వెళ్ళిపోయేవరకూ ఇతరులు దరిదాపులకి కూడా పోరాదు. ఒకవేళ పొరపాటున ఎవరి నీడైనా పడిందా బిందెడు నీళ్ళు కిందపారబోయడానికి కూడా వెనుకాడేవారు కాదు.
ఇవన్నీ ఎప్పుడో పాతికేళ్ళ కిందటి మాటల్లే అని కొట్టిపారేయొచ్చు. కాదేమో! తరచి చూస్తే ఇప్పటికీ ఇలాంటివీ ఉన్నాయి అనడంలో నాకేమాత్రం సందేహం లేదు. కాకపోతే కాస్త రంగు, రూపు మార్చుకున్నాయి. బహుసా, మతాలు, కులాలు కూడా మార్చుకున్నాయేమో!