1
సూర్యుడు గోడదూకి ఇంట్లోకి రాగానే
చీకటి చీర విప్పి లోకం మీద పరిచింది.
కళ్ళు మిటకరిస్తూ
చుక్కలు.
2
చీకటి కొమ్మ నుంచి
రాత్రిగ్లాసులోకి విరిగిపడ్డ
ఓ ఐస్ క్యూబ్ లాంటి
కల.
అబ్బ!
ఎప్పుడూ అంతే
మత్తెక్కేలోపే కరిగిపోతుంది.
3
ఆకు చాటున నిలబడి
పూర్తిగా విప్పకనే
మత్తెక్కించే లోకాలని చూపిస్తుంది.
బొద్దు బొండుమల్లె.
4
సిగ్గుతో విచ్చుకున్న పువ్వు నడుం చుట్టూ
మరీ చిన్నదై బిగుసుకుపోయిన సిగ్గు బిళ్ళలా…
అది తొడిమేనా?!
5
రాత్రినదిలో చీకటితో కొంగు ముడివేసుకొని
సరిగంగ స్నానాలు చేసినట్టుంది పువ్వు.
ఆకు చాటుగా ఇంకా గుడ్లప్పగించి చూస్తున్న
మంచు బిందువులు.
6
శిశిరం కన్నుగీటింది. ప్రకృతి పచ్చ పైట జార్చింది.
ఇక రాత్రిని పొడిగించుకుంటూ
శీతాకాలం అక్కణ్నుంచి కదలనే కదలదు.
7
అంత పెద్ద ఆకాశంలో పుట్టినా
ఈ చిన్ని ఆకు నడుమొంపునే ఊగడం ఇష్టం
చిలిపి చినుకుకి.
8
అప్పుడు
పాపికొండల మధ్య పారే సన్నని పాయలా ఉండేది
ఇప్పుడు
సువిశాలమైన ఇసుక మీద పరుచుకున్న గోదారైంది.
నడుం కాదండోయ్!
9
కొండల్లోంచి
కొంగు బిగించి
తిప్పుకుంటూ తిప్పుకుంటూ
నీల్లెత్తుకు పోతుంది.
గలగల మంటున్న గులకరాళ్ళ పట్టీలు.
ఒడ్డును ఒరుసుకుంటూ తెల్లలంగా కుచ్చిళ్ళు.
లోతులు కొలవకుండా చెప్పొచ్చు
అది ఖచ్చితంగా గోదారే.
10
లోకంలోని వెలుగునంతా నూరి
ఆకాశం కంటికి కాటుక అద్దుతూ
మళ్ళీ
చీకటే.
వీటిలో నాకెక్కువగా నచ్చినవి 2,4,5. 4లోని సిమిలీ బాగుంది.
10లో పొసగనితనం, వైరుధ్యం కనిపించినయ్.మొత్తానికి అభినందనలు.
ఎలనాగ గారు,
చదివి మీ అభిప్రాయం పంచుకున్నందుకు చాలా చాలా థాంక్స్.
మొదటి వాక్యానికే వావ్ అని గట్టిగా అరిచి ప్రతీ పదాన్నీ, ప్రతీ భావాన్ని గుండేల్లో జాగ్రత్తగా ఓ మంచుబిందువులా జాగ్రత్తపర్చుకుంటూ చదువుకున్నా ను మళ్ళి మళ్ళీ….అయినా తనివితీరక ఓ పది ప్రింటవుట్లు వేసి పదిమందికి పంచి చదివింఛాను. ఎక్కడున్నారండీ ఇన్నాళ్ళూ? ఎవరింతకీ మీరు? చాలా బావుంది అని మాత్రమే అని ఈ కవితకి అన్యాయం చెయ్యలేను.
బ్యూటిఫుల్!
వాసుదేవ్ గారు,
మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ప్రోత్సాహనికి ధన్యవాదాలు
కుమార్ గారు,
థాంక్స్.
కవితలో ఏదో కట్టిపడేసే ఆకర్షన వుందండీ.
మెటఫర్లదా, దృశ్యానిదా, బిగింపుదా చెప్పలేను కానీ
బావుంది.
థాంక్స్ శ్రీనివాస్ గారు.
అంత పెద్ద ఆకాశంలో పుట్టినా
ఈ చిన్ని ఆకు నడుమొంపునే ఊగడం ఇష్టం
చిలిపి చినుకుకి.
రచిత జీ..!!
ప్రతి పదం ప్రకృతిలో రాలిన ఒక వాన బొట్టు. బొట్టు బొట్టు చేరి పద ప్రవాహమైంది. ఆ ప్రవాహం వెంట మా చేయి పట్టుకుని నడిపించుకుని వెళ్ళింది మీ కవిత…!
శాంతిశ్రీ
రచిత గారూ,
మీ కవిత చాలా బాగుంది. 7 తో ఆపేస్తే సరిపోతుంది. 8,9,10 కవితని పలచన చేశాయి… మధ్యలో మీ వ్యాఖ్యానంతో సహా
7 పరమ ఆద్భుతంగా ఉంది. ఇటువంటి కవితకి మీరిచ్చిన ఆరంభం ఎమ్తబాగుమ్దో, 7 లాంటి Parting Shot ఉండాలి.
అభివాదములతో
శాంతిశ్రీ గారు,
మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది. ధన్యవాదాలు!
మూర్తి గారు,
మీ కామెంట్ దొరకడం అదృష్టం. మీ సూచనలు చాలా బాగున్నాయి.
థాంక్ యు సో మచ్!
చాలా బాగున్నాయండి మీ చిలిపి చినుకులు.
క్యూట్ అండ్ పర్ఫెక్ట్