కవిత్వ ప్రపంచం

మన భయం – జ్బిగ్నీవ్ హెర్బర్ట్

నవంబర్ 2013

మన భయం
రాత్రి అంగీ తొడుక్కోదు
గుడ్లగూబ కళ్ళతో ఉండదు
శవపేటికను తెరవదు
కొవ్వొత్తినీ ఆర్పదు.

చనిపోయిన వాడి ముఖంతోనూ ఉండదు

మన భయం
”జాగ్రత్త! డ్లుగా వీధిలో వేడిగా ఉందని వోజిక్ ని హెచ్చరించండి’
అంటూ
జేబులో దొరికే కాగితం ముక్క

మన భయం
తుఫాను రెక్కలమీద ఎగరదు
చర్చి శిఖరమ్మీదా కూర్చోదు
అది భూమ్మీదే సాదా సీదాగా నడుస్తుంది

మన భయం
మృత్యువు ముంగిట్లో,
హడావుడిగా సర్దుకున్న
వెచ్చని బట్టలూ, రొట్టే, తుపాకుల
మూట లాగుంటుంది.

మన భయం
చనిపోయినవాడి ముఖంలా ఉండదు.
చనిపోయిన వాళ్ళు
మనతో చాలా మృదువుగా, సౌమ్యంగా ఉంటారు.
మనం వాళ్లను మన బుజాల మీద మోస్తాము
వారితో ఒకే దుప్పట్లో పడుకుంటాము.

వాళ్ల కళ్లను మెత్తగా మూస్తాము
పెదవులను సుతారంగా సర్దుతాము
యేదైనా ఒక యెండిన చోటు వెదికి
వారిని పూడ్చి పెడతాము.

మరీ లోతుగా కాదు
మరీ పైపైనా కాదు.

*** *** ***

రెండవ ప్రపంచ యుద్దం కాలంలో సోవియట్ల చేతా జర్మన్ ల చేతా దురాక్రమణకు గురై, యుద్దం తర్వాత సోవియట్ల అధీనమైన తూర్పు పోలండ్ లోని ల్వోవ్ లో 1924 లో పుట్టిన జ్బిగ్నీవ్ హెర్బర్ట్ రాసిన పద్యమిది. తాను స్వయంగా నాజీల దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడి, ఆ ప్రతిఘటన కాలంలో కవిత్వం రాయడం ప్రారంభించాడు. యుద్దం తర్వాత ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు, న్యాయ శాస్త్రం, తత్వ శాస్త్రం చదువుకున్నాడు. వార్సా లో గుమస్తా ఉద్యోగాలు చాలా చేసాడు. ‘కమ్యూనిస్టు’ సెన్సార్ షిప్ రోజుల్లో ఆయన పద్యాలు టేబుల్ సొరుగుకే పరిమితమయి పెద్దగా వెలుగు చూడలేదు.

అయితే హెర్బర్ట్ తన పద్యాల్లో క్రమేపీ మెరుగు పెడుతూ వచ్చిన ప్రత్యేక శిల్పం, చాలా పెద్ద ప్రభావాన్నే కలుగజేసింది. పెద్ద ప్రయాసపడకుండా, చిన్నగా గుసగుసలాడినట్టుండే హెర్బర్ట్ పద్యాలు గొప్ప ప్రతిభావంతమైన శిల్పంతో, నిగూఢమైన పొరలు పొరల తాత్వికార్థాలతో పాఠకుల హృదయాల్లో బలమైన ముద్ర వేస్తాయి. ఆయన వుద్దేశ్యంలో, యుద్ధం పాత సాహిత్య శైలులనీ, ప్రమాణాలన్నింటినీ పనికిరానివిగా మార్చేసింది. ‘యెంతో భాషా జ్ఞానం ఉన్న నేను నా విప్లవోద్రేకాన్నీ, నిరసననూ చెప్పడానికి గొప్ప పదజాలమూ, శబ్దాడంబరమూ, తదితర పటాటోపాలతో పద్యాలు రాసిఉండవచ్చు – నా పాఠకులను ఉర్రూతలూగించ వచ్చు! కానీ అందుకు భిన్నంగా, నిర్దిష్తమైన నా వ్యక్తిగత అనుభవాలను, పరిస్థితులను, వాటిలోని మానవీయతను ఒక విశాలమైన దృక్పథం తోనూ, తాత్వీకరణతోనూ నా పద్యాల్లో చెప్పాలని ప్రయత్నించాను. నిరలంకారంగానూ (anti-rhetoric) అదే సమయంలో అత్యంత గాఢంగానూ ఉండే శైలిని యెంచుకుని అభివృధ్ధి చేసాను” అంటారు హెర్బర్ట్. ఒక గొప్ప sensibility తో, చారిత్రికతతో, కట్టుకథల పట్ల వైమనస్యం తో, ఒక చేదు నిజాన్ని నిగూఢమైన ఉత్ప్రేక్షల తో మనసుకు హత్తుకు పోయేలా చెప్పడం హెర్బర్ట్ పద్యాల ప్రత్యేకత. ఆధునిక సమాజపు దౌర్జన్యాలను (అవి పెట్టుబడి దారీ వ్యవస్థవైనా, ‘కమ్యూనిస్టు’ వ్యవస్థవైనా ) తనదైన శైలితో, వ్యంగ్యంతో కూడిన అనితర సాధ్యమైన ఊహాశక్తి గల పద్యాలతో వ్యతిరేకించారు హెర్బర్ట్ . సమాజం పట్ల స్పష్టమైన బాధ్యతతో, sensibility తో , నిరలంకారమైన శైలిలో తీవ్రమైన భావావేశాన్ని పలికించే హెర్బర్ట్ పద్యాలు, అనేక దురాక్రమణలకు గురైన ఒక సంక్షుభిత సమాజపు చారిత్రిక హృదయ స్పందనలు.

ఈ పద్యం లో రాసిన ”జాగ్రత్త! డ్లుగా వీధిలో వేడిగా ఉందని వోజిక్ ని హెచ్చరించండి’ వాక్యానికి ఒక ప్రత్యేకత ఉంది. 1960 లలో పోలండ్ ఇంకా సోవియట్ యూనియన్ స్థాపించిన ‘కమ్యూనిస్టు’ నిరంకుశ పాలనలో, సెన్సార్ షిప్ లో ఉన్నప్పుడు, కేవలం జేబులో దొరికే చిన్న కాగితం ముక్కే ఒక జీవితం ధ్వంసం కావడానికి దారితీసిన భయానక పరిస్థితులను ఈ వాక్యం లో హెర్బర్ట్ అత్యంత నిగూఢంగానూ, నిరలంకారంగానూ, తాత్వీకరించారు. ప్రదానంగా ఈ పద్య లోని వాతావరణం ఆ కాలంలోని పోలండు సమాజం పరిస్థితులను ప్రతిబింబిస్తుంది.

పెద్ద పదజాల పటాటోపాలు, లేకుండా, చిన్న చిన్న మాటలతో, పోలికలతో గొప్ప పద్యాలు యెట్లా రాయవచ్చో తెలుసుకోవడానికి హెర్బర్ట్ పద్యాలు పాఠ్య పుస్తకాల్లాంటివి.