కవిత్వం

లిఫ్ట్

జనవరి 2013

నాముందు మోకరిల్లి
పైకి చేరాలనో
కిందికి పోవాలనో
ఎవరో ఒకరి
ఎదురు చూపులే

తయారై వచ్చాక
ఎవరికి వారు నమ్మకంతో
నాకు బందీలవుతారు

ఎలా కావాలంటే అలా
తీరికలేకుండా చేరుస్తూనే ఉన్నా
హఠాత్తుగా ఎక్కడో ఆగిపోతే
సరిహద్దుల్లో ఉండని సహనం

ఎవరు నానుండి విడిపిస్తారో
ఎపుడు బయటపడతారో
ఎవరి ప్రయత్నాలు ఏపాటివో

బయటపడ్డాక వెంటనే
నిర్జీవమైన మొహాలు
నిర్లిప్తమైన గుంపులో కలిసిపోతాయి

అయితేనేం
ఎప్పట్లానే మళ్లీ నాముందు
అదే ఆబగా

*
ఏకాంతమది
అడవిలోని చెట్టులా
కొమ్మమీద పూవులా
నేను
అయినా రాత్రిలా
ఏకాంతంలోకి నిన్ను నెట్టలేను
ఏకాంతాన్ని నీతో పంచుకోనూలేను

అది నీకోసమో నాకోసమో
ఆనందమో విషాదమో
నాకూ తెలీదు

నాకు నేనుగా
నాలో సంలీనమై
ఏకాంతమైపోతాను

ఒద్దొద్దు
నువ్వందులో భాగంకావద్దు

నా ఏకాంతం నాది
నీ ఏకాంతం నీది
ఏకాంతాన్ని ఎవరు పంచుకోగలరు చెప్పు