కవిత్వం

తగవు

జూన్ 2015

తనినీ ఆమెనీ
వారి పెంపుడు కుక్క చూస్తూనే ఉంది

ఎప్పటినుంచో వారు
ఒకరి మీద ఒకరు అరుచుకుంటూనే ఉన్నారు

వారిలో ఎవరు ముందు మొదలెట్టారో
ఏ కారణంతో మొదలయిందో
ఇద్దర్లో ఎవరికీ తెలియదు ఎప్పుడూ
తెలిసినా ఎవరూ ఒప్పుకోరు

విసిగిపోయి ఆమెకు ఆపేయాలనున్నా
అతను రెచ్చిపోతాడని అనుమానం

అతనికీ ఎక్కడో ఆగిపోదామని ఉన్నా
అలుసై పోతాడన్న భయం

ప్రపంచాన్ని రెండు భాగాలుగా చేసుకుని
ఒక ప్రపంచం నుండి అతను
మరో ప్రపంచం నుండి ఆమె
శబ్దాల్ని నిశ్శాబ్దాల్నీ
విసుగులేకుండా విసురుకుంటూనే ఉన్నారు

చూసి చూసి
వారిద్దరి మధ్యకూ పోయి
వారికంటే గట్టిగా అరుస్తూ
మొరగడం మొదలెట్టింది
వారి కుక్క