ఏరా ఇంకా పడుకూనే ఉన్నవా ? ఒక్కడే ఏమీ సేస్కోలేకపోతున్నాడు రాజూ , కాత సాయమెల్లరా. పొద్దున్ననగా ఎల్లాడు, కాపుల సేలో పిండిజల్నాకి. మద్దేల కూటిక్కూడా రాలేదు అసలే జివ తగ్గిపోయింది , సేతులొనుకుతాయి,కళ్ళు తిరుగుతాయి., పిండి మూట్లు ఏటిగట్టు మీదకెక్కించాలంట. మీరెవలన్నా ఎళ్తే సాయముంటాదిరా రాజూ ! అయినా మద్దేలపూట పడుకోడమేటీ రాజు ? లెగు లెగిసెల్లు అన్నాది మా యమ్మ .. ఇంత ఇదిగా సెప్పాక ఏం సేత్తాను?కళ్ళు నులుముకుంటా లెగిశాను.
తిన్నగా గోలుంకాడకెళ్ళి దోసిల్లనిండా నీలు తీసుకుని కళ్ళు కడుక్కున్నాను. దండింమీద ఆరేసిన రుమాలిచ్చి కూసేపాగు టీ ఎట్టాను తాగేల్దిగాని అని జంతిక ముక్కిచింది చేతికి. సిన్న పిల్లోడికంటే దారుణంగా గబుక్కన తీసుకున్నాను. మొన్న శివరేత్రికి ఒత్తానన్నావ్ కదా అప్పుడొండాను అని ఇంకో జంతిక నా సేతిలో పెట్టింది.ఒద్దన్నట్టు ఎనక్కితోత్తానే తీసుకున్నాన్నేను. రాత్రంతా బస్సు పయానం కదా ఒళ్ళంతా కాత నెప్పిగా ఉన్నాది. అందుకే కామాలు పగలు కూడా బాగా నిద్దరట్టేసింది. టీ తాగేసి అరుగు మీద సైకిలు తీశాను రత్తాలమ్మ కొడుకు వంశీగాడు సూసినట్టున్నాడు దూరం నుండే రాజు మాయా బోన్నావా? ఎప్పుడొచ్చావ్ అని అరుస్తున్నాడు దగ్గరకి రమ్మన్నట్టు తాలూపాను పరిగెట్టుకుంటూ వచ్చి సైకిల్ దించుతున్న నాకు అడ్డుపడి ఆడే దించేశాడు . ‘మాయా మసాలెల్లి నేనూ ఒత్తాను మాయా’ అన్నాడు మాయమ్మ ఫక్కున నవ్వింది . మీమాయ మసాలెల్లి ఎల్తాలేదురా , తాతదగ్గరికి సేనుకాడికెళ్తాడని సెప్పింది .
మా పక్కూరు పేరు మసకపల్లి , అందరూ ఏమైనా ముక్యమైన సరుకులు కావాలంటే మసక పెళ్లెలాతాం. వంశీ గాడి నోరు తిరక్క మసాలెల్లి అంటాడు . పోనీలే ఎలాగూ గుర్తు సేశాడు నాన్నకి పిండిమూట్లు అందించేసాక అలాగే రేవు కాడికి ఎళ్దాం. మసకపెళ్ళి ఎంకట్రావ్ కొట్టుకాడకెళ్ళి సేనాలయ్యింది కదా సూసొద్దాం అనుకున్నాను . అమ్మా నేన్ను ఎళ్తున్నాను అని సెప్పి బయల్ధేరతుంటే, వచ్చేటప్పుడు కూరకేమన్నా పట్రండి అని సెప్పింది . సరేనన్ని సెప్పి సైకిలేసుకుని సింతమూల కాలవగట్టు నుంచి సేనుకాడకి బయల్దేరానుపిండి జల్లనాం అయిపోయింది కామాలుకాళ్ళూ సేతులూ కడిగేసుకుని , ముఖం కూడా సుబ్బరంగా తుడుసేసుకుని.
సుట్టంటించుకుని మామిడి సెట్టు మొదల కుదురుగా కుచ్చున్నాడు మానాన. నన్ను సూడగానే నువ్వేందుకొచ్చావ్ రా అలిసిపోయి వొచ్చావ్ ఇయ్యలకి పడుకోలేక పోయవా? అయినా ఊరెక్కడికి పారిపోద్ది కంగారాగాదు నీకు అన్నాడు. ఊరు తిరుగుదామని కాదు నాన అమ్మే నేకు సాయమెల్లమన్నాది అన్నాను . సర్లే నీటిగుల్ల శాల్లో పెండికి తగిలించి ఒత్తాను ఇద్దరం ఊళ్ళోకెళ్దారి అన్నాడు . నాకు కాత సంతోషమేసింది . మామిడి సెట్టు మొదల నాన రుమాలు దగ్గర ఏదో సిన్నది ఒట్టిగడ్డి మూటుంది. ఏంటోనని ఇప్పి సూశాను .
ఆకుసేపలు కాల్చాడు ఎవరికోసం సేశాడో కూడా అడగాలనిపించలేదు. గడ్డి మూత ఇప్పేశాను,నేను ఒచ్చానని తెలుసుకదా ఇంక నాకోసమే సేసుంటాడు అనే దీమాతోటి కట్ట పరిగిలు కూడా తీశాను ,ఉప్పు కారం నిమ్మరసం పట్టించి మంచి భలే ఎర్రగా ఎగిపోయున్నాయి సేపలు నోరూరుంది నాకు.
దొంగనాకొడకా సూసేశావా ? అన్నాడు నా సెటిలో ఉన్న సేపలు సూసి , “ దా తిందామ్ అన్నాన్నేను, ఓ మూడు సెంబుల కల్లుంది తెత్తానాగు అని పొట్రాజు పాకలోకెళ్లి కళ్ళట్టుకొచ్చాడు ఇంకా సూదు నా సామిరంగా అంతా ఇంతా ఆనందం కాదు నాది. తాటాకు కోసి రెండుగా చీరి రెండు సేదలు సేసాడు కళ్ళు తాగడానికి. ఇద్దరం కల్లొంపుకుని తాగి చేపలు నంజుకున్నాం ఎంత రుచంటే ఏళ్ళు కూడా వదలబుద్ది కాక కారం అంటిన సేతులు నాకేసాన్నేను. సేలా ఆదుర్తతో తినడాం సూసి కక్కుర్తినా కొడకా, పల్లోడివై పుట్టాల్సిందిరా నువ్వు అని , లెగు మసకపెళ్ళి సెంటర్లో కెళ్దాం అన్నాడు
గోదారోడ్డునున్న ఊరు కదా సందరడే సరికి గోల గోలగా ఉంటాది ఓ రెండు మూడు సేపల దుకాణాలు , గార్లెంకట్రావ్ కొట్టు , బత్తులోళ్ల సారా కొట్టు , మేట్టారి కిల్లీ కొట్టు రాయిసెట్టు సెంటర్ కాడ రత్తమ్మ కూరగాయల దుకానము అది బాగా పేమస్సు రత్తమ్మ దగ్గర కొనేవాళ్ళ కంటే సూసేవాళ్ళు ఎక్కువుంటారు . పిక్కలు కనపడేదాకా లింగీపంచి కట్టుకుని సేనామంది మొగోళ్ళు బేరాలాడతారు . రత్తమ్మేమో ఒక్క ఉల్లిపాయ్ కూడా అరువివ్వని రకం
నానా నేనూ రాయిసెట్టుకాడ సెంటర్లో ఆగాము , బుడుగ్గాడు తాటిచాపేసి దానిమీద సేపలన్నీ రాసులుగా పోసాడు, కిట్టపరిగిలూ, బూరామాలు, సందువా సుక్కలూ ఎక్కువున్నాయి. ముచ్చటేసి సేపలన్నీ ముట్టుకుని సూశాను. ఏరా ఈడు మీ రెండోవోడు కదా అన్నాడు బుడుగ్గాడు. అవున్రా బాయా ఈడికోసమే సేపలిచ్చుకుందామని ఒచ్చాను నాలుగు సరైన పరిగిలుంటే పడెయ్యి అన్నాడు. బుడుగ్గాడిచ్చిన సేపలిఉ సైకిల్ కి తగిలించి, “దా ఎక్కు” అన్నాడు. నానా కూసేపాగు ఏటిగట్టుకెళ్ళి రేవు సూసోత్తానన్నాను. సుట్టకాల్చుదామని కామాలు , పద నేనూ ఒత్తాను అన్నాడు.
కూళ్ళ ఊళ్ళో నుండి దొనోళ్ళు ఓ పది మందిదాకా సైకిల్లేసుకుని ఒచ్చారు దాన్లో ఒకాయాన్ని పలకరించాడు మా నాన ఒరేయ్ గంగిసెట్టిగా వొలకట్టుందా రేవుమీద? అనడిగాడు. అందుకే కదరా ఒచ్చాము, లేపొతే మీ ఊరోళ్ళతోటి సంసార సెయ్యడానికా అన్నాడు ? ఆ మాటతోటి ఆయన నాన్నకు బాగా తెలుసు కామోసు అనుకుని,ఆళ్ళందరూ గోదాట్లో కెళ్లడానికి నామాలు సర్దుకుంటుంటే ” ఆల్లు రానిత్తే మనమూ ఎల్దామా” అన్నాను నేను మా నానతో, కొత్తకోరిక లాగా అనిపించిందేమో మానానకి సైకిల్ స్టాండేశాడు సీన్ అర్ధమై సంతోసమేసింది నాకు. ” నీ కొడుకా అన్నాడు గంగిశెట్టి అన్న ఆ పెద్దాయన అవున్రా హైదారాబాద్ లో ఉంటున్నాడు శివరేత్రికని వొచ్చాడని సెప్పాడు .
ఏం సదుంకున్నావ్ బాబూ, ఎక్కడ పంజేత్తావ్ ? జీతమెంతొత్తాది? అని అడిగాడు . నామలో కుచ్చోడానికి సోటు ఎతుక్కునే పనిలో అతను అడిగిన దానికి సమాదానం సెప్పలేదు. ఏం మాటడ్డేటిరా మీయోడు అన్నాడు . దానికి సమానంగా మానాన నవ్వుతున్నాడు . నా వివరాలన్నీసెప్పాను.
నేనూ, మానాన , గంగిశెట్టి అన్న పెద్దాయన ఓ నామలో ఎక్కాం. వలపన్నడానికి ఇంకో ముగ్గురు మా ఎనకాల నామలో వొత్తున్నారు. సరిగ్గా ఇసకతిప్ప మూల్లోణించి కోటిపల్లి రేవు మీదగా బయలుదేరాం. దూరంగా బాలత్రం రేవుమీద వలకట్టేసారంటా, ఇయ్యాల రేవు పైమీదకెళ్తేనే పనవుద్ది అని మాటాడుకుంటున్నారంతా , ఓహో ఒకలు వల పన్నినకాడ ఇంకొకడు వలపన్నకూడదట, నీళ్లున్న గోదారి కూడా నీదీ, నాదీ అని పంచుకుంటారా ? అని అడిగాను . అది కాదురా నీటిమీదారేసిన గంగమ్మ సీర సింపకూడదు అన్నాడు . గంగమ్మ సీర సింపడమేంటి అసలు నేను ఏమడిగాను ? నాన్నేమి సెప్తున్నాడు అని ఎర్రిమొకం ఏసుకుని సూశాను .
నా ఓలకం గంగిశెట్టి గారికి తెలిసిపోయిందేమో గంగమ్మ సీర సింపడం అంటే నీటిమీదోచ్చే సంపదని పంచుకోవడం అని సెప్పాడు . కూసేపాగు అర్ధమయ్యేటట్టు అన్నీ సెప్తాను అన్నాడు . ఎనకాల నామల మీద మిగతా వాళ్ళు వలలు తోడుకుంటున్నారు . పూస కట్టుకట్టి నీటి మీద ఓ రెండు, మూడు ఎకరాల దూరంనుంచి పరుచుకుంటూ వస్తున్నారు . వలకి కట్టిన తెల్లని పూసలు నీటిమీద తేలి వొల జాడ చక్కగా కనిపిస్తుంది .
సీకటి పడింది నీటిమీద కూడా సూరీడు కనపడట్లేదు గోదారి మొత్తం ప్రశాంతంగా ఉంది అప్పుడు దాకా ఎదోటి మాటాడుకున్నోళ్ళంతా ఒక్కసారే సైలెంటై పోయారు. నాకు ఇంతగా అనిపించింది . అందరూ మేట్టార్ని సూసిన ఒకటో తరగతి పిల్లల్లాగా చాలా కుదురుగా ఉన్నారు . అటుసూడు అన్నట్టు కళ్లతో సైగ చేశాడు గంగిశెట్టి గారు. నీల్లకి చలేస్తున్నట్టు ఒణికి పోతున్నాయి , నీటిమీద సన్నగా ఇంకో నీటిపొర కనబడింది చీకటి కదా, కనిపింఛీ, కనిపించకుండా ఉంది . సీకటడింది, ఎలాగూ గాలి తిరిగే టైమే కదా అందుకొచ్చిన అలలేమో అనుకున్నాను . కాని నీటి అలలమీద కూడా అలలు కనబడతున్నాయి. మొదటి సారి సూసా కదా ఏమన్నా పెమాదమేమో అని అనిపించింది మెల్ల మెల్లగా ఆ పొరలు మాదాకా పాకుతూ ఒచ్చాయి .
మా దగ్గరున్న గంగిశెట్టి గారు , దూరంగా ఉన్న దొనోళ్లని సైగ చేశాడు , వాళ్లకేమర్ధమయ్యిందో తెలీదుగానీ ఓ పదీ పదిహేను నిమిషాల్లో మాసుట్టూ ఓ మైలు దూరం వల కట్టారు . నాకు సీన్ అర్ధమయ్యింది. ఇక్కడేదో పెద్ద జాతి సేపలున్నాయి కదా అన్నాను . ” నోర్ముయ్”అన్నట్టు సూశాడు గంగిశెట్టి గారు . అంతా అయిపోతే దన్నమెట్టుకుని వొచ్చేయండి” అని దూరం ఉన్న నామల మీద ముసలాయన అరుస్తున్నాను నానా గంగిసెట్టే గారు దోసిల్లోకి నీళ్ళు తీసుకుని ఒదిలి ,మనసులో ఏదో కోరుకున్నారు.
నీటికింద చేపలగుంపు తిరుతున్నప్పుడు , నీటి మీద ఓ పొర ఏర్పడతాదంట. దాన్ని గంగమ్మ సీర అంటారట నట్టేట్లో నామేసుకుని తిరిగేవోల్లకి ఇది కనిపిత్తాదట.. సేపలన్నీ గంగమ్మ స్నేహితులంట వాటితో గంగమ్మ తల్లి జలకాలాడి, ఒళ్ళు ఆరేసుకుంటూ తిరుగుతూ , తన సీరని నీళ్ళపైన ఆరేత్తాదని, ఆ ఆనవాళ్ళు కనిపెట్టి అక్కడ వలపన్నినవాళ్ళకి గంగమ్మ దొరుకుతుందట, అన్నాడు మానాన . మొత్తానికి గంగమ్మ కటాక్షం దొరికింది అన్నాడు గంగిశెట్టి గారు . రేవులో నీళ్ళు ఒదిలి దణ్ణం పెట్టుకుని ఇసక లంకపక్కనుంచి ఒడ్డుకొచ్చేశాము . రుమాలు పిండుకుంటూ ” ఒరేయ్ సత్తిగా కాత మందు తాగెళ్దాం సెంటర్లో ఆగు అన్నాడు ” గంగిశెట్టి గారు .
అమ్మకి కూర తెత్తామని సెప్పామ్ కదా తొరగా ఎల్లాలి అన్నాను . నానేమో ఒరేయ్ సెట్టిగా రేపు తాగుదాంలే నేను ఎలిపోవాలి అన్నాడు. మసకపెళ్ళి సంతలో ఇచ్చుకున్న కట్ట పరిగిలు కాత సింత పులుసేసి చక్కగా ఒండింది మా అమ్మ , నానా ,నేనూ సెరో పెగ్గూ ఏసి సక్కగా కడుపునిండా తిన్నాం… చక్కగా తిన్నప్పుడు మనకి పొట్ట బరువెక్కుద్ది కదా , సెయ్యి కడుక్కుని లెగకుండా అలాగే కుచ్చున్నాను. నాన కూడా సెయ్యి కడుక్కుని కాళ్ళు ముందుకు సాపి కుచ్చున్నాడు . మేం తినేసిన ఎంగిలి కంచాలు తీసేసి, సెయ్యి తుడుసుకోడానికి రుమాలిచ్చింది మాయమ్మ , కానీ అలవాటు పెకారం నానా,నేనూ సెయ్యి తుడుసుకోడానికి మాయమ్మ సీర సెంగు అందుకున్నాం .
ఎదవ కొడకా ఇంకా చిన్న పిల్లోడివేరా అన్నారు ఇద్దరూ ఒకేసారి . అమ్మకేసి, నానకేసి సూశాక గంగిశెట్టి కి గంగమ్మ సీర దొరికితే నాకు సేంతమ్మ సీర దొరికింది అని నాలో నేనే నవ్వుకున్నాన్నాను . అప్పుడు మానానేమో నావలాగా , మాయమ్మెమో గోదారిలాగా కనిపించారు .
*** ** ***
GOOD. చాల బాగుంది
…కాశి మజిలీలు
టైటిల్ కుదేరింది
అదేరింది
కాశి గోవిందరాజు గారి కధ గంగమ్మసీర బాగుంది ……… అలా గోదారి అలల మీద ప్రయాణం చేయించి అమ్మ కొంగుకు ప్రేమగా ప్రేమతో కట్టేశారు ……… కూతంత వంశీ ప్రభావం కనిపిత్తాది కతలో అని అంతా అనుకుంటారు…. సహజం … కాశిరాజు గారు మీకు అభినందనలు .
రామూ గారూ వంశీ గోదావరి యాసలో రాశారు గనక ఐనా ప్రభావం ఉందని అంటారు . నిజానికి అది గోదారి ప్రభావం
కాశీ మా బాగా సెలవిచ్చారు , ఎవరు ఎన్ని సార్లు ఒకేలా వ్రాసినా గోదారి యాస , గోస మహా రుసి !!
చాలా బాగా రాశారు. యాసతో గోదారొడ్డున షికారు చేయించారు.
‘నేను-మా నాన్న కలిసి పెగ్గేశాం’ అన్నదొక్కటే నచ్చలేదు.
అద్బుతం గా ఉంది .. కానీ నాకు ఇద్దరు కలిసి పెగ్గేసం అన్నది నచ్చలేదు
ఏటండీ, కాశీ గోరూ..! మీ ఊరెళ్లేప్పుడు నన్నూ తీస్కెల్తానన్నారుగా.. మరేటీ..శివరాతిరికి నన్నొదిలేసి ఒక్కరే ఎల్లిపొయ్యారేటి..! మీ నాన్న దగ్గిరకెల్దామని అడిగితే “ఎల్దాం సారూ” అన్నారు గుర్తులేదా.? “180 ఎం.ఎల్. చాయ్ కూడా తాగుదాం’ అన్నారు. మరి మీరేమో మీ నాన్నతో కల్లు, పెగ్గూ తాగేసి అమ్మొండిన సేపల కూర కడుపు నిండా తినేసొచ్చారూ..ఇదన్నాయం కదూ..?
శ్రీ గారూ , మనిభూషన్ గారూ … కుటుంభ సమేతంగా పెగ్(కల్లు మాత్రమే ) వేస్తాం
కాశీ సాహిత్య కథా రాజ్యం సృజనాత్మకంగా ఉంది!
గంగమ్మ చీర అంటే ఏవిటో అనుకున్నాను…. బాగా చిత్రీకరించారు మీ వివరణతో కన్నులకి కట్టినట్లుగా. గోదారి యాస బాగుంది.
నీళ్లున్న గోదారి కూడా నీదీ, నాదీ అని పంచుకుంటారా ? ee prashna aalochimpajestundi..
గంగిశెట్టి కి గంగమ్మ సీర దొరికితే నాకు సేంతమ్మ సీర దొరికింది అని నాలో నేనే నవ్వుకున్నాన్నాను . అప్పుడు మానానేమో నావలాగా , మాయమ్మెమో గోదారిలాగా కనిపించారు ….ending చాలా baavundi
శివరాత్రి పూట గంగమ్మ కటాక్షం పొందిన కాశి రాజ నీకంతా శుభమే.మీ నాన్నగారి ద్వార లోకల్ స్టోరీస్ భలే తెలుస్తున్నాయి.గంగమ్మ కథ బాగుంది.మీ చేపల వేట బాగుంది.రాజు గారు అడవి లో వేట మానేసి చేపల వేతకేల్లరాన్నమాట.
అవునమ్మా
శివరేత్రికని వెళ్ళి మద్దాన్నం పడకేసి లేచి అమ్మ ఇచ్చిన జన్తిక్ముక్క (రెండోది కూడా) కొరికి, ఓ టీ తాగి … సైకిలెక్కి నాన్న దగ్గరకెళ్ళి … అలాగే మసకపెళ్ళి సంత కెళ్ళి … ఇలా సదూతూ ఉంటే … సటుక్కున గంగమ్మ సీర గురించి చెప్పారు … బావుంది … మరి … ఫినిశింగ్ టచ్ కూడా ఇచ్చారు … నానేమో నావలాగా … మాయమ్మెమో గోదారిలాగా కనిపించారు … ఇంకా బాఉంది … సూపరు … వెలి గుడ్ … కీప్ ఇట్ అప్ …
సరే సార్ ఐ విల్ కీప్ మై గోదారి
గోదారి యాస.. గోదారితో ముడిపెడుతూ నడిపించిన కథ.. తోడుగా తల్లిదండ్రులతో పెనవేసుకున్న బంధం.. అన్నీ చాలా బాగున్నాయండీ.. అలా గోదారిలో నావ మీద తిరిగొచ్చిన అనుభూతి కలిగింది.. ఎపుడైనా వెళితే(ఇంతవరకూ వెళ్లలేదులే..!).. మీ కథ తప్పకుండా గుర్తొస్తుంది..
అనుగారూ వీలయితే నేను తీసుకెళతాను గోదారి మజ్జలోకి … ధన్యవాదాలు
మానానేమో నావలాగా , మాయమ్మెమో గోదారిలాగా … కాశీ …. కథ అధ్బుతం …
ధన్యవాదాలు అన్నగారూ
” అమ్మకేసి, నానకేసి సూశాక గంగిశెట్టి కి గంగమ్మ సీర దొరికితే నాకు సేంతమ్మ సీర దొరికింది అని నాలో నేనే నవ్వుకున్నాన్నాను . అప్పుడు మానానేమో నావలాగా , మాయమ్మెమో గోదారిలాగా కనిపించారు .”
చాలా చాలా బాగా వ్రాశావు తమ్ముడూ మీ ఊరుకు వచ్చి నీతో పాటు తిరిగిన ఫీలింగ్ వచ్చింది. నీనుంచి ఇలాంటి రచనలు మరిన్ని కోరుకుంటూ……………
నాగేంద్ర వర ప్రసాద్, రాజమండ్రి
అన్నయ్యా రావాలి మరి నాతో పాటు వచ్చి , మా ఊరు తిరగాలి , మనిద్దరం ఇసకలంకలోకి వెళ్ళాలి .. వెళ్దాం ఎపుడైనా
గంగమ్మ సీర కంటే “ఉప్పు కారం నిమ్మరసం పట్టించి మంచి భలే ఎర్రగా ఎగిపోయున్నాయి సేపలు” ఇంకా మెదడులోంచీ పోవట్లేదు. ంఇ వూరు రావడానికి ఈ ఒక్క కారణం చాలు!
నేరేడులంకకి సుస్వాగతం సారూ …. ఇండియాకి రాగానే కబురుపెట్టండి
ఎప్పట్లాగానే బ్రిలియంట్ ..
నాకీ కథ తెలుసు. ఒక సారి పాపికొండల దగ్గర ఒక చేపల బోటు అద్దెకి తీసుకుని రాత్రి చాలా సేపు తిరిగాం. ఆ బోటతను చెప్పాడు.
ఓ ఆదివారం మధ్యాన్నం తీరిగ్గా కూర్చోని ఈ కాశీ మజిలీలన్నీ చదవాలి!!
కాశీ ! అద్భుతం
చాలా బాగా రాశారు.