ముఖాముఖం

భూమధ్యరేఖ

నవంబర్ 2014

కాశిగాడిగురించి మాట్లాడమంటే చాలా మాట్లాడొచ్చు.. అందరిలో కలిసిపోతాడు. అన్నం మెతుక్కి అతుక్కుపోతాడు. ఎవన్నీ వదలకుండా love you లతో హింసపెడతాడు. ఎటువంటి మనుషుల్తో అయినా అల్లుకుపోవడం, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సర్దుకుపోవడం తెల్సినవాడిగా కనిపిస్తాడు.

“చేపలకి ఎవడైనా వలవేస్తాడు, సముద్రానికే వలవెయ్యాలి” అన్నట్లు ఉంటుంది వాడి వ్యవహారం. అదే అదే. వాడి ఫ్రెండ్ లిస్ట్ సంగతి చెప్తున్న. తనని ఎవరు ఏమనుకుంటున్నారనే స్పృహలేకుండా ఎంతమందినైనా ప్రేమించగలవాడు, ఎవరు అన్నం పెట్టినా మర్చిపోకుండా కన్నీళ్ళతో అమ్మని తల్చుకునేవాడు, అదేంపెద్ద విషయం కాదన్నట్టు ఎంతదూరమైనాపోయి మనుషుల్ని కలిసొచ్చే ఓపిక ఉన్నవాడు కాశిలో ఉంటాడు. ఎంతకి అంత ఎటకారంగా సమాధానం చెప్పేవాడూ వాడిలోనే ఉంటాడు.

ఇంకా మాట్లాడ్తే- బతకడం నేర్చుకున్నతనాన్ని సహించలేక బరిబాతగా ఉండటాన్నే తన stutus గా update చేసుకుంటాడు కాశి. మాటలు తగిలించుకోవడం అలవాటు చేసుకోలేక చమక్కులు విసరడాన్ని prefer చేస్తాడు. లేనిపోని మాటలంటే I’m pervertly alright అని సర్దుకోగలిగే నిబ్బరం ఉంది కాశికి.

***

అసలిట్లా ఉండేవాడు కాదు వీడు. రెండేళ్ళ ముందు- అమీర్‌పేట్ అమ్మాయిల మైత్రివనం స్నేహాలగురించి, పంజాగుట్ట సెంట్రల్లో పర్సులు ఎగరిపోవడంగురించి పిచ్చిరాతలు రాస్కుంటూ అల్లరిగా నవ్వేవాడు. కార్టూన్లని పోలి ఉండే కార్టూన్లు గీసుకునేవాడు. ఎప్పుడు మారిందో తెలీదు ఆ phase. బహుశా జేబులు ఖాలీ అయిన రోజూ, ఆత్మీయులచేతినుండి కొన్ని అన్నం మెతుకులు కురిసి అమ్మనాన్నల్ని గుర్తుచేసిన రోజూ..అది ఏ రోజో-

దేనిగురించి గొంతు చించుకోలేదు. ఆ రోజు, కాస్తంత దుఃఖపు జీరతో కంఠంలోంచి వాడి మాటలెట్లా వస్తాయో అట్లే వచ్చింది వాడి కవిత్వం. ఒక emotional plane లోనూ, silenceలోనూ తనని తాను ప్రకటించుకుంటూ, చూసింది చూసినట్టు గీయాలని తపించిపోయే పిల్లాడిలా అనుభవించింది అనుభవించినట్టు రాసేందుకు బాల్యంలోకి వలసపోయాడు కాశి. సమకాలీన సామాజిక విషయాలు వాడికి పట్టలేదు. పడవలరేవులో కలుసుకునే మనుషులు, కలిసి వెతలు కలబోసుకుని నవ్వుకునే మనుషులూ, ఒడ్డునానుకునున్న ఊరూ, నల్లచీర కట్టుకున్న నిశిసుందరెవరో వీధులెంబడి తిరుగుతున్నట్టు చీకటిపడే దాని తీరూ- వాడి కవిత్వమయింది. అమ్మా,నాన్నా వాడి ఆత్మలో ఒదిగిపోయారు. గోదారిలో గంగమ్మ సీర, కోటిపల్లి తిరునాళ్ళలో కొనుక్కున్న నెమలీకలు వాడు కథలయ్యాయ్. అంతకంటే చాలముందే -”నా వానా, నా పడవ నాకిచ్చేయ్/నా చద్దిబువ్వ, నా బెల్లం ముక్క/నా టైరుబండి, నా మట్టిరోడ్డు నాకు తెచ్చిచ్చేయ్ /దేవుడా నా బాల్యం నాకిచ్చేయ్” అన్న వాడి అరుపు అందరిలోకి చొచ్చుకుపోయి అందరిలోనూ వాన్ని కలిపేసుకుంది.

***

కవిత్వంగురించీ, “భూమధ్యరేఖ”గురించీ మాట్లాడటమంటే ఏమంత తోచదుగానీ..

గోదావరిలో కలిసే పిల్లకాల్వని వినడం ఎలా ఉంటదో, అలా ఉంటది వాన్ని వినడం. పుల్లలు పోగేసి చేపలు కాల్చిచ్చే నాన్న ప్రేమ, ‘ఒరేయ్.. ఒరేయ్’ అని పిల్చుకునేంత చనువు ఎంతమందికి దొరుకుతుందిగనక?! దాన్ని రాసుకునే అదృష్టం ఎంతమందికి వస్తుందిగనక?

అక్కడ- “గిన్నెలో గుప్పెడు మెతుకులు ఎంతకీ అయిపోవు ” అని ఒడ్డునానుకుని ఉన్న ఒక ఊరిగురించిన సంగతులు చెప్తూ మొదలైన “భూమధ్యరేఖ” – దడేలుగాన్నీ,సలాది సుబ్బయ్యనీ,రాజాగాన్నీ.. తన గుర్తుల్లోకి అసంకల్పితంగా చొరబడే ఇంకెందరో వ్యక్తుల్నీ, ఇంకెంతో అమాయకత్వాన్ని కన్న నేరేడులంకనీ-

అప్పుడప్పుడూ..వానొస్తుంటే టిక్‌టిక్‌మనే గిన్నెల సంగీతాన్నీ, రాత్రంగా మెలిదిరిగిపోయిన వరిచేల దుఃఖాన్నీ, దుప్పట్లోపడ్డ సిగ్గుల్ని చూడలేక చీకటి సిగ్గుపడ్డ వింతైన విషయాల్నీ, బద్దెమంచెంతోపాటే బిగించి కట్టిన వొదులొదులు బంధాల్నీ-

అన్నిటికంటే ముఖ్యంగా పిల్లలకి ఆకలైతే మెతుకుల్లాగా మారిపోయే అమ్మనీ,నాన్ననీ..తిరిగే నగరంలో అన్నం పెట్టిన ప్రతీ చేతినీ, కలిసిన మనుషుల్లోని ఆత్మీయ స్పర్శనీ, అరువుతెచ్చుకున్న ఏకాంతంలో కూర్చుని ఆలోచిస్తుంటే ఎరుకలోకి వచ్చే అనుభవాలసారాన్నీ.. తల్చుకుంటూ తల్చుకుంటూ గుక్కపెట్టకుండా సాగిపోతది.

అంతేనా? పిల్లానెత్తుకున్న నాన్ననిచూస్తూ దేవగన్నేరైన అమ్మల ముఖాల్నీ, సైకిల్ తొక్కుతూ ఫెడల్ జారి పడిపోయినప్పుడు కొట్టుకుపోయిన పిల్లాడి చేతుల్నీ చూపించుకుంటూ భూమినంతా ఒకసారి చుట్టివస్తది.

“అరుగుమీది సున్నంబొట్లన్నీ అమ్మలాగానే నవ్వుతున్నపుడు” ఆ తాటాకిల్లు మనదే అనిపిస్తది. “గుల్లముగ్గు మెలికల్లో” మన కళ్ళు కూడా చిక్కుకుంటాయ్. సుళ్ళు తిరిగే కన్నీళ్ళని ఆపుకుంటున్న క్షణంలో మనమూ అక్కడే ఉన్నామని అనిపిస్తది.

***

వాడు రాస్తున్న భాషలో ఉండే సందిగ్ధం మన గమనింపులోకిరాకుండాపోదు. చదివిన భాషకీ, బతికిన భాషకీ ఉన్న difference అందులో కనిపిస్తుంటుంది. గోదావరి భాషకున్న ప్రాకృతిక సౌందర్యమేదో వాడి expression ని elevate చేస్తూ వస్తోందనడంలో ఎటువంటి సందేహంలేనందున భయాన్ని బయమని రాసినా, కూర్చోవడాన్ని కుచ్చోవడం అని రాసినా అభ్యంతరం అనిపించదు- కూరదాక, గాలిబొమ్ము లాంటి పదాలెన్నున్నా అడిగి తెల్సుకోవాలని కుతూహలంగా ఉంటది కూడా..

మరి complaints ఏం లేవా? అంటే ఉన్నాయనే చెప్తాను. “but poetry is such a stubborn thing” అన్నాడు ఎవడో .వీడు అంతే monotony గురించి పెద్దగా పట్టించుకోడు. జీవితంలో ఉన్నదే రాసుకోవాలి కదా?! తప్పదు మరి-

ఒక్కోసారి పేదరికానికి పేటెంట్ రైట్ తీస్కున్నట్టుగా ఉంటది వాడి కవిత్వం. విసిగిపోతాంగానీ, ఎక్కడో ఓ చోట ఆ భావోద్వేగతీవ్రతలోకి తప్పిపోకుండా ఉండలేం. కొన్నిసార్లేమో ఆశ్చర్యపరిచే విరుపులేవిలేకుండా సాధారణంగా నడిచిపోతది వాక్యం. పోనీ-

“నిన్ను చూడ్డానికొనే నేనొచ్చాను/మా ఊళ్ళో చలేసినపుడు మంటేసి/ నువ్వొస్తావని కూచున్నాను/ చలేస్తే ఏడవకూడదని అమ్మొచ్చి చెప్పేదాక / పుల్లలు ఎగదోస్తూ నువు మాట్లాడ్తున్నావనే అనుకున్నాను”

ఇట్లా కవిత్వం వాన్ని రాసుకుంటూపోయిన చోట వాడు రాసింది కవిత్వంకాకుండా ఎట్లాపోతది?

-నందకిషోర్


కాశి రాజుతో కాసిన్ని కబుర్లు


1. హాయ్ కాశీ! పుస్తకం పని ఎందాకా వచ్చింది?

పుస్తకం పనులన్నీ అయిపోయాయి. నాకు తెలిసిన వాళ్ళందరూ ఈ ప్రశ్నే అడుగుతున్నారు . అక్టోబర్ లో బుక్ వస్తుందని ప్రోమోషన్స్ చేశా కదా! అందుకయ్యుంటుంది. అన్నిపనులూ ఎవరికీ చెప్పకుండా చేసేస్తున్నావే అని మీలాంటి వారు కొందరు అంటూ ఉన్నారు. మరీ డీటీపీ లకు ప్రూఫ్ రీడింగులకు అందర్నీ వాడేసుకుంటామా ఏంటి? ఎవర్ని ఎక్కడ వాడాలో అక్కడే వాడుంకుందామని చాలా మందికి పని చెప్పలేదు. బుక్ రిలీజ్ అయ్యాక వాడుకోవాల్సిన వాళ్ళు నానుండి తప్పించుకోకుండా ఉంటే వాళ్ళనీ వాడుకుంటానండీ.

2. పేరు భలే ఉందే “భూమధ్య రేఖ”. ఎందుకు పెట్టావ్ ఆ పేరు? మీ ఊరి పేరో, గోదారొడ్డో, కాశీ మజిలీలో ఎందుకు పెట్టలేదు?

పేరు చూశాక ఎంతో కొంత ఇంట్రస్ట్ కలగాలి ఆ బుక్ ముట్టుకోడానికి. గోదారొడ్డు, గడ్డిపరక అనేవి ఎవరూ పెట్టుకోకపోయినా వినేసిన టైటిల్సే. అయినా ఇంత ఆలోచించి టైటిల్ పెట్టలేదు. “బువ్వగాడు” అని మా నాన్న గురించి రాసిన పోయెం లో ఓసోట ఆకలిని, అత్మాభిమానాన్ని కలిపిన భూమధ్యరేఖ రా ఈ ఏడుపు అని మా నాన్నన్నాడు. ఆత్మాభిమానం చంపుకోలేక ఆకలితో ఉన్న రోజు మా ఇద్దరిమధ్య ఇంటరాక్షన్ ఈ పోయెం. ఆ పేరే కాస్త బాగుంది అనిపించి పెట్టేశా . నా బెస్ట్ ఫ్రెండ్ ఒకన్ని అడిగాను. ఆడూ సరే అన్నాడు. మా నాన్నకి చెప్పాను టైటిల్ ఇదిరా అని. “ఒరేయ్ ఎదవనా కొడకా అప్పుడు నేను నాటకాలెసెవోన్ని కనక అలాంటి డైలాగులు సెప్పాను. అది పట్టుకుని నువ్విప్పుడు నాటకాలేస్తున్నావా ? అని నవ్వాడు. తర్వాత నీ తిక్కకి నువ్వే మంచి పేరెట్టుకోగలవ్ నీ ఇష్టం అనేసాడు. ఇంకొటోరోయ్ నీ బుక్ రిలీజ్ కి రమ్మన్నావ్ కదా! ఓ రొండ్రోజులు ముందే సెప్పు. నేను ఇల్లొదిలి రావాలంటే మరీ కవిత్వం కాకపోయినా ఏదో ఒకటి చెప్పాలి మీ అమ్మకి లేపొతే పంపియ్యదది అన్నాడు.

3. ఈ పుస్తకం గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే ఏం చెప్తావ్?

మరీ మూడుముక్కలా? ఈ మాట మా ఊళ్ళో బెమ్మంగాడితో, మక్కిశేషుగాడితో పేకాడినపుడు ఇన్నమాట. పేకాట గురించి మూడు ముక్కలు చెప్పమంటే చెప్తా గానీ పుస్తకం గురించి కుదరదండీ.

4. ఎందుకు రాస్తావోయ్ కవిత్వం? మొదటిసారెప్పుడు రాశావ్? దేని గురించి రాశావ్? స్కూల్ నోట్ బుక్ లోనా, కాలేజ్ లో గ్రీటింగ్ కార్డ్ లోనా? డైరీలోనా?

నవ్వొస్తుంది. పెద్దగా ఇంట్రెస్టింగ్ ప్రశ్నేం కాదు. కానీ సమాదానం చెప్పాలనే ఉందిలే. నా తొమ్మిదో తరగతిలో రాశాను. స్కూల్ గోడమీద రాశాను. ఇచ్చట మూత్రం పోయరాదు అని గోడమీద రాసుండేది. మనుసులు తప్ప మరెవరూ అనే టాగ్ లైన్ మా హిందీ మాస్టారు పోస్తూ చూస్తుండగా రాశాను. మొన్నీ మధ్య ఫేస్ బుక్ లో ఆయన ఫోటో పెడితే. ఆయనే గుర్తుతెచ్చుకుని. ఒరేయ్ కాసోడా నువ్వింకా కవిత్వం రాస్తానే ఉన్నవా అన్నాడు. ఆయనంటే భలే ఇష్టం నాకు.

5. అమ్మ, నాన్న, అన్నం ముద్ద, గోదారి, మీ ఊరు, నీ చిన్నతనం- వీటి మీద నాలుగు మాటలు చెప్పు?

నాలుగేంటి బొల్డన్ని మాటాడే ఓపికుంది. మా అమ్మంటే నా డార్లింగు. ఎప్పుడాకలేసినా గుర్తొస్తాది. మా నాన్న దొంగనాకొడుకు (ఇలా మా తమ్ముడు తిడతాడు) . అన్నం ముద్ద అంటే అది మేడ్ బై మా అమ్మానాన్న. నా చిన్నతనమా! కాస్త సిగ్గేస్తాది. ముక్కుచీమిడీ దాన్ని తుడుచుకునే ముడ్డీ ఇంకా అలాగే ఉన్నాయ్. ఇప్పుడు కూడా అలాగే చేస్తాను. ఎప్పుడైనా బైటకెళ్తే ముక్కుచీమిడి సీదినపుడు వెంటనే ముడ్డికి తుడుచుకుంటా. ఆ తర్వాతే జేబులో కచ్చీపు ,దువ్వెన ఉన్నాయన్న సంగతి గుర్తొస్తాది. చిన్నతనం అంటే ఎప్పటికీ పోనీ మంచి బుద్దబ్బా.

6. ప్రేయసి 1,2,3,……13,14… ఇది ఆగదా? ఏంటి కత?

అది లవ్ సిరీస్ కదా ఆపితే ఎట్టా! ఇది సినిమా డైలాగే అయినా చెప్పడానికి బాగుంది కదా ! నాకు ఎక్కువగా వాగడం అంటే (అదే మాటాడ్డం) అంటే ఇష్టమండీ. నేను లేదా నాతో బాగా కొందరు మాటాడిన మంచి సందర్భాలను అలా రాశాను. ఇంకా రాస్తాను.

7. నీ పుస్తకం లో మొదటి కవిత గురించి, చివరి పేజీ గురించి కాస్త మాటాడు (5 మార్కుల ప్రశ్న).

మొదటి కవిత గురించి అని కాకుండా మొదటి పేజీ గురించి మాటాడమంటే బాగుండేది. “అమ్మనో నాన్నో పెంచలేనోడివి ఎందుకన్నావ్ అనడిగిన నాలాంటి దొంగనా కొడుకుల్ని కన్న నాన్నలందరికీ ఇది అంకితం” అనుంటుంది. ఇక చివరి పేజీలో అంటారా అక్కడ కాస్త తెలివిగా అందరికీ ధన్యవాదాలు అని ఒక ముక్కలో తేల్చేసా. నాకు మిత్రులు ఎక్కువ, పేర్లు రాస్తే అదొక పుస్తకమైపోతుందని.

8. బాగా రాయాలని ఎప్పుడనిపిస్తది? రాయకుండా ఉండలేనని, ఇదిప్పుడు రాయకపోతే వల్ల కాదని?

మరీ అంత ప్రొఫెషనల్ కవినీ, లేదా కథలు చెప్పేవాన్ని కాదు కదండీ, రాయాలని ఎప్పుడనిపిస్తే అప్పుడు రాస్తాను.

9. ఎక్కువసార్లు చదివిన పుస్తకం ఏది? కవిత్వం ఎక్కువ చదూతావా కతలా, ఇంకేమన్నానా? పాత వాళ్లలో ఎవరివి చదివావు, ఇప్పుడు రాసేవాళ్లలో ఎవరివి బాగా అనిపిస్తాయి, ఎందుకు?

చదవాలనిపించే ప్రతిదీ చదూతాను, అదీ ఇదీ అనేంలేదు. ఇప్పుడు రాసేవాళ్లలో మనం ఏం రాస్తున్నామో తెలిసి రాస్తున్నారే వాళ్ళు రాసినవన్నీ చదూతాను.

10. వంశీ పసలపూడి కథలు, నామిని పచ్చనాకు ఇవి చదివావా? ఎందుకో నీ కాశీమజిలీలు చూస్తే ఇట్లాంటివి గుర్తొస్తాయి. ఏముంది నీ కాశీమజిలీల వెనక?

వంశీ నామినీ లు కధలు అందులో పాత్రలూ మాత్రమే రాయరు. ఒక ముసలోడు ఇంటినుండి ఏదో పనిమీద బయటకెళ్తున్నాడు అని రాసేటపుడు వాళ్ళిద్దరూ ఆ ముసలాడితో బయటకొచ్చి వీధి చివరిదాకా ఆ ముసలోడితో నడుస్తారు. వీధి చివర మలుపు తిరిగే ముందు ఇల్లు ఎలా ఉందో రాస్తారు. దానికి రెండిళ్ళ ముందున్న ఇంటి అరుగుమీద తిరగలి గురించీ దానిమీద నుంచున్న కోడిపుంజు గురించి రాస్తారు. కధలంటే రాసిచ్చిన పేజీలు కాదండీ బతుకులు అవి నామినీ వంశీలే కాదు ఎవర్రాసినా బాగుంటాయి. నేను రాసిన కాశీ మజిలీల వెనక కూడా బతుకులే ఉన్నాయ్. అందుకే రాయడం నాకు చాలా సులువవుతుంది.

11. ఫోటోలు తీస్తన్నట్టున్నావ్ ఈ మధ్య? ఇకనుంచి కవితకో ఫోటో పెడతావా? ఇంకేం చేస్తుంటావ్ హాబీగా? కొత్త భాషలు నేర్చుకుంటావని తెలిసింది, నిజమేనా?

అవును పొటావులు తీయడం కూడా ఓ మంచి కల అందులో ఓ కిక్కుంటది. మా ఊళ్ళో అంట్లు తోముతూ నేను చూస్తుండగా చెంగు పక్కన గుచ్చమని భర్తని ఒకావిడ అడిగింది. అతను మొగుడు చేసే పనే చేశాడు. లాగొక్కటి పీకింది. అప్పుడు ఫోటో తీశా. భలే అనిపించింది నాకు.
“ఇక నుంచి కవితకో ఫోటో పెడతావా?” అన్నది మరీ సిల్లీ కొచ్చన్. ఏదొస్తే అదడిగేస్తారా అనిపించింది. కొత్త భాషలు నేర్చుకోవాలని ఉంది. తమిళ మలయాళీ అమ్మాయిలు నాకు నచ్చేవిదంగా ఉంటున్నారు.

12. ఇంకేంటి సంగతులు? తర్వాత్తర్వాత రాయాలనుకునేవి, చెయ్యాలనుకునేవి ఏమన్నా ఉన్నాయా?

ఉన్నాయి. నవల రాయాలని ఉంది. మా అమ్మతో ఎక్కువ టైమ్ గడిపే అవకాశం దొరికితే వెంటనే అది పూర్తైపోతాది. రెండేళ్ల నుంచీ NIC లో జాబ్ కి ప్రిపేర్ అవుతున్నా అది సాదించాలి ఈసారి.

13. బావుంది. అభినందనలు. ఆల్ ద బెస్ట్ కూడా.

థాంక్ యూ చెప్పడం తప్పదు కదా. అందుకే థాంక్స్.