కాశీ మజిలీలు

బేగొచ్చేత్తా..

జూన్ 2014

మా రాయుగారి సెట్టుల్ని రాలిన పిందులన్నీ ఏరుకొచ్చి గుమ్మాలో ఏసాడు మానాన . అందులో కొన్ని పెద్దయ్యన్నీ ఏరి మాకు తీసేసి, మిగతాయి ఊరోల్లకి పంచేది మాయమ్మ. బడున్నప్పుడు ఎలాగా పెద్దగా ఆడుకునేవోన్ని కాదు. సెలవల్లో కూడా ఆడనియ్యకపోతే సిర్రెత్తుకోచ్చేది నాకు. నేలాబండాట ఆడుకోడానికి బడిబిల్లింగు దగ్గరికెల్లినోన్ని పిలిపించి గుమ్మాలో సంచిమీద మామిడికాయలేసి గీత్తా కుచ్చుందిమాయమ్మ.

” ఎందుకు పిలిసావే” అనడిగితే ” ఇయ్యాల బోల్డు పనున్నాది ఇల్లు కదిలావంటే ఒల్లో సీరేత్తాను” అన్నాది మాయమ్మ. తైతిక్కలు తొక్కి ఏడిసినా ఏమాత్రం పట్టించుకోలేదు. తెగీ తెగని బండకొడవలొకటి తీసుకుని నేనూ మామిడి కాయలు గీత్తా కుచ్చున్నాను. టెంక ముదిరిన కాయలన్నీ అరిసేతిలో పెట్టుకుని సిన్నతొక్కులా కొట్టింది మాయమ్మ. మిగతాయేమో సిన్న సిన్న ముక్కలుగా కోసేవోన్ని నేను.

సంసారానికొచ్చిన కొత్తలో సారెక్కువట్టుకొచ్చిందంట మాయమ్మ మా ఇంట్లో ఏడెనిమిది ఇత్తడి పల్లాలున్నాయి . ఓ ఐదారు స్టీలుపల్లాలు కూడా ఉన్నాయి . ఉప్పు కలిపిన ముక్కల్ని పల్లాల్లో ఆరేసి తడారిపోయాక మళ్ళీ సంచిమీద అరిసి ఆరబెట్టింది మాయమ్మ. నా మనసంతా నేలాబండాట మీదే ఉంది. పనిమానేసి ఎలిపోదామన్నా ఓ పక్క మాయమ్మ కుచ్చుంటే లెగలేదు. మొన్న అరుగెక్కుతూ పడిపోతే ఈ అరుక్కూడా ఎక్కలేవేంటే అనడిగాను. వొచ్చీరాని నవ్వు నవ్వి “కడుపులో సెల్లుంది కదరా” అందుకే ఎక్కలేనని సెప్పింది.
యిప్పుడు గురుతొచ్చి ఇల్లు కదలలేదు నేను. రోజూఉన్న ఎండకంటే ఇయ్యాల ఇంకాత గట్టిగా ఉంది ఎండ. ఒంటిగంటైపోయినా ఇంకా పన్లోనుంచి అన్నానికి ఇంటికి రాలేదు మా నాన. ఒకలిద్దర్ని అడిగిసూసింది. నన్ను కూడా ఎల్లి గుడుకాడ తాతయ్యని అడిగిరమ్మంది.

నేనెళ్లి అడిగితే. మీ నాన బేపనమ్మగారి సుబ్బయ్యకి ఇల్లు కట్నాకి ఎల్లాడన్నాడు. వొచ్చి మాయమ్మతో సెప్పాను. గీసిన మామిడి కాయలన్నీ తొక్కు తీసేసి సేతులు కడుక్కొచ్చి టిపినికర్రలో అన్నమెట్టుకొచ్చింది. పెద్ద తూము దాటాక ఏటిగట్టెక్కే ముందు పరలో ఉంటాడు మీనాన అక్కడకెళ్ళి, కాలవ దాటి ఓ కేకేయ్యి ఒత్తాడుమీనాన అన్నాది. సరేనని ఎల్లబోతుంటే ” ఒరేయ్ ఆగరా” అని నా సేతిలో ఓ అద్దురూపాఎట్టింది. అమ్మా కాత ఒంగే అని మాయమ్మని బుగ్గ మీద ముద్దెట్టుకోబోతుంటే పైకి కాత బాధపడుతూ లెగిసింది.ఓహో కడుపులో మా సెల్లుంది కదా ! అందుకే మాయమ్మ లెగలేదేమోనని మాయమ్మ కడుపుమీద. ఓ ముద్దెట్టుకూని టిపినికర్రట్టుకూని బయల్దేరాను. సేతిలో అద్దురూపాయుంది కదా కాలు కుదురుండదు. కాలవరేవుకాడ అచ్చమ్మ కొట్టుకాడ పావలాకి నాలుగు నారింజ తొనలు కొనుక్కుని రొండు నా జేబులో ఏసుకుని మిగతారొండూ ఎనక్కెల్లి మాయమ్మకిచ్చాను. నీకొగిటి, సెల్లికొగిటి అని సేతిలో పెడితే, నవ్వుతా అంది. “సెల్లి అప్పుడే తినదురా నేను తింటే మీ సెల్లి తిన్నట్టే” అని మాయమ్మొగిటి తీసుకుని నాకొగిటియ్యబోయింది. నువ్వు తింటే సెల్లి తిన్నట్టే కదా అయితే నువ్వేతిను అని అది మాయమ్మ సేతిలో పెట్టేసి పరిగెట్టుకొచ్చేసాను.. ” ఒరేయ్ నాన అన్నానికి ఆల్చిమవుతాది బేగా ఎల్లరా” అని అరిసింది మాయమ్మ. ఇనబడింది గనక నేను కూడా ఆ ఎల్తున్నానే” అని అరిసాను.

రెండిల్లుదాటి మొండీదికెల్లాక ఆ సివార్న మలుపు దగ్గర పుల్లల మోపుతోవొత్తా కనిపించాడు మానాన . నేను కాత ముందుకెళితే మానాన ఇంకాత ముందుకొచ్చాడు. గంగులిల్లి దాటగానే బత్తులోల్లింటి అరుగుమీద తిరగలిమీదున్నాది కోడిపెట్ట. సిట్టిబాబోల్ల కోడిపుంజు దాన్ని ఎప్పుడూ తరుముతా ఉంటాది. నేను గంగులిల్లి దాటగానే భూషణం మాయోల్ల వంటపాక మీన్నుంచి గబాల్న దూకింది. అడిలిపోయిన కోడిపెట్టేమో ఎగిరి నామీద దూకింది . సేతిలో కేరేజీ కిందుదిలేతే మూతూడిపోయి అన్నమొలిగి పోయింది. గబుక్కున మా నానసూసి పుల్లల మోపు కింద పడేసి నన్ను లెగదీసాడు. ” ఏరా నాకు అన్నమట్టుకొత్తున్నావా” అనడిగాడు కేరేజీ పైకితీత్తా అవునని తలూపాను . కోడిపుంజు దూకడం వాళ్ళ పడిపోడం సూసాడు కదా ! పుల్లల మోపులోది ఓ కర్రలాగి పుంజు మీద ఇసురుతూ ఎంత తొక్కినా దీని ఏవ తీరదు , ఆ పెట్టేమో దొరకదు దాన్నీ, దీన్నీ కోసి ఒండేయాలొరేయ్” అని తిట్టుకున్నాడు. అ తరవాత ఎండని అన్నమిచ్చిరమ్మందని మాయమ్మని కూడా తిట్టుకున్నాడు. పుల్లల మోపు బరువుగా ఉండి తల నొక్కుతుందేమో, మొలనున్న లింగీపంచి ఇప్పేసి మొలకి తలనున్న రుమాలు సుట్టుకున్నాడు. లింగీ పంచి మడతసుట్టి నా సేతికిచ్చి ” ఒరేయ్ మోపెత్తుకుంటుంటే ఇది నా తలమీదెట్టు” అన్నాడు. సరే అని నాకు మానాన తల అందదు కదా అందుకని పక్కనున్న అరుగుమీదెక్కాను మానాన బరువుగా ఎత్తుకునే సరికి నేనాలింగీపంచిని తలమీదేశాను ఆదేమో సరిగా పల్లేదు, కాత ముందుకొచ్చి మానాన కళ్ళు కప్పేసింది. ” ఒరేయ్ కంట్లో పడ్డాది తియ్యిరా అన్నాడు”. అది తీసి పుల్లల మోపులో ఉన్న ఓ పుల్లమద్దికి తోశాను. అరుగుదిగాక నా సెయ్యి అందిమ్మని, మానాన నాకు సెయ్యందిచ్చాడు. ఇంటికాడ పెద్దరుగుమీద పుల్లలమోపు పడేసి , సేలా ఇకారంగా “ఒలే శేంతా” అని మాయమ్మని కేకేసాడు. మాయమ్మ ఎందుకో ఇబ్బందిగా నడిసొచ్చింది. అమ్మ నన్ను ఎండలో పంపిదనే కోపంతో అమ్మని గసిరాడు. మానానలా తిడతా ఉంటే , మాయమ్మ మాటాడలేదు. గట్టిగా అరుత్తా కాత ముందుకొత్తే పులరుపుకి జడుసుకున్న లేల్లాగ భయంతో తలుప్పక్కకి జరిగింది. గోలుం దగ్గర కాళ్ళు కడుక్కుని వచ్చి పీట ముందేసుకుని , గుద్దకింద సంచరుసుకూని అన్నానికి కుచ్చున్నాడు మానాన. మాయమ్మెదో సెప్పబోయి భయం భయం గా నక్కుతా ఉంది. అన్నమింక లేదేమో అని నా అనుమానం. మెల్లగా దగ్గరకొచ్చి ” సత్తియ్యా అన్నమింక లేదు ” అన్నాది. ” ఎంతొండావే ” అని అడిగితే “మాయుడు బియ్యమే ఉన్నాయి , సందాలెల్లి బియ్యం కట్ట తెత్తానన్నావు కదా అందుకే మాయుడుంటే ఒండేసాను అన్నాది. నాగమ్మ దగ్గరతెచ్చి ఎసరెట్నా అంటే వొద్దులేయే అని కాత పక్కకు జరిగి గడపనట్టుకూని పైకి లెగిశాడు. నాకు మొదట జాలేసింది. తర్వాత సిట్టిబాబోళ్ళ కోడిపుంజుమీద కోపమొచ్చింది. పుల్లల మోపులోనుండి ఓ కొబ్బరి కమ్మలాగి మా ఈదిలో ఎతుక్కుంటా బయల్దేరాను ఆ పుంజెక్కడ కనపడ్డా సంపేద్దామని. నీతిపూడోళ్ళ సింత సెట్టుమీదా, బుంగావోల్ల ఇటుగ్గుట్ట కాడా ఎతికాను, సత్తివోతమ్మ గుడుసుమీద కూడా ఎతికాను అక్కడా కనపల్లేదు. ఎలాగైనా మళ్ళీ కనబడకుంటా ఉంటాదా అని ఇంటికొచ్చేటప్పటికి మానాన లింగీ పంచి కట్టుకుని సొక్కాయేసుకున్నాడు. ఇందాక మొలక్కట్టుకున్న రుమాలు కోసం ఎత్తుకుతున్నట్టున్నాడు, దండిమ్మీదా , సూర్లోనూ ఉన్న బట్టలు తీత్తాకనబడ్డాడు. నేను గుమ్మాలోకెళ్లి ఆ కొబ్బరికమ్మట్టుకూని నిలబడితే ” ఒరేయ్ ఎదవనా కొడకా! ఆ రుమాలిలాగియ్యిరా దానికోసమే నేను ఎతుక్కుంటున్నాను” అన్నాడు. ఎక్కడికెళ్తున్నావ్ అనడిగితే “రేపు వొచ్చే పున్నానికి యానాపెంకన్న తీర్ధం కదా రధానికి రంగులెయ్యాలంట రమ్మనారు ఎళ్తే రొండొందలిత్తారు” అన్నాడు. అలాగే ఎళ్ళు. మరి ఈ ఏడు నన్ను తీర్థానికి తీస్కెల్లి రంగులరాటం ఎక్కించాలి. కాగితం పువ్వు, కల్లాజోడు కొనియ్యాలి. ఒచ్చేటప్పుడు రంగునీళ్లు కూడా కావాలిఅన్నాను. ” అలాగేరా ఈ ఏడు పండగే నీ దగ్గరకొస్తాది సూడు” అన్నాడు . నాకామాట అర్ధమవలేదు.

మానాన సైకిలెక్కి ఎలిపోతుంటే ఒరేయ్ పిల్లోడా అన్నం పడేసావా? మీనాన పన్లోనుంచొచ్చి అన్నం తినలేదు సూసావుకదా అన్నాది. నీకు అన్నమెట్టిచ్చాక మాటిట్టోల్ల ఎంకన్నొచ్చాడు. ” ఓలప్పా అన్నమెట్టే అని నోరు తెరిసి అడిగితే ఉన్న కాతంతా ఆడికెట్టేశాను” అన్నాది. పర్లేదులేయే రంగెయ్యనాకే కదా సందాల బేగొచ్చేత్తాల్లే అన్నాను. అన్నాను గాని కడుపు కాళీ లేకపోయినా నాకు ఆకలిగా ఉన్నట్టు అనిపించింది . ఇంక మాయమ్మయితే గడపట్టుకూని జారతా కుచ్చుండుపోయింది. అలాగే ఈదమ్మటా మానానసైకిలికేసి సూత్తా అది కనపడకుండా పోయేదాకా అలాగే సూత్తాఉండిపోయింది. మలుపు తిరిగి మానాన సైకిలి మాయమైతేనేగానీ మాయమ్మ నన్ను పట్టించుకోలేదు.

అన్నమెలా ఒలిగిపోయిందిరా అని అడిగింది కాసేపాగి. “గంగులిల్లి దాటాక భూషణ్ణంమాయోల్ల పాకమీన్నుండి కోడిపెట్ట దూకిందమ్మ! గబాల్నా అది మీద పడితే కంగారులో పడిపోయాను అన్నమొలిగిపోయింది” అన్నాను. మనుసులమీద దూకనాకి ఆనాసైతికి ఏం పోయే కాలం ? అని కోడి పెట్టని తిడుతుంటే “అదిగో ఆ సిట్టిబాబోళ్ళ కోడిపుంజే దాన్ని తరిమింది ఆదేమో నామీద దూకింది “ఆ రెండాటిల్నీ సంపేతానియ్యాల” అన్నాను. ఆ కోళ్ళుమీదున్న మాయమ్మ కోపాన్ని పంచుకున్నందుకో, మానాన తినలేదని నేనూ బాదపన్నందుకో మాయమ్మ ననుకాత దగ్గిరికి లాక్కుని తలనిమిరింది.

సందాల అయిదున్నారా ఆరు గంటలవుతుంటే సూరీడెలిపోయి సీకటడింది మాయూల్లో. సీకటడిందని సెప్పడానికన్నట్టు ఈదిలైన్లు ఎలిగారిపోయాయి . ఒక అరగంట దాకా దీపాలెలిగించకుండా సూసాము. అయినా కరెంటు రాట్లేదింకా!. ” ఇల్లి సీకటిగా ఉండకూడదురా గూట్లో దీపం బుడ్డున్నాది తీసుకురా ఎలిగిద్దిగాని” అని పొయ్యెలిగిత్తా అన్నాది మాయమ్మ . దీపం కిందెట్టాక మూత్తీసి ఒత్తి పెద్దదిసేసి ఎలిగించి సేతికిచ్చింది. “గాలేత్తుంది కదా ఆరిపోతాది అందుకే కాత పెద్దొత్తెట్టాను లోపలకెళ్ళాక వొత్తి సిన్నదిసెయ్యి అన్నాది” దీపం గూట్లో దీపమెట్టేసి వొత్తి తగ్గించి వొచ్చేశాను.

“ఇంట్లో బియ్యం లేవుకదే పోయ్యెలిగించావేటీ” అన్నాను. “ముందు కూరొండుతాను మీ నాన బియ్యమట్టుకొత్తానన్నాడు” అన్నాది. మంచం కింద సంచిమీదరిసిన ఉల్లిపాయలూ, బియ్యంపెట్టి మూల్లో ఎండ్రొయ్యల డబ్బా ఉంటాయి పట్రా అన్నాది. ఇంట్లోకెళ్లి తెచ్చిచ్చాను.

“అయ్యో అక్కడే తడిగుడ్డలో సుట్టిన తోటకూర కాల్లుంటాయి పట్రా” అన్నాది. అయ్యికూడా తెచ్చిచాను. ముదిరిపోయిన తోటకూరకాల్లని ఎండ్రొయ్యలేసుకుని ఒండుకుంటే బలే రుసిగా ఉంటాయి. అన్నీ కలిపేసి పొయ్యిమీద కూరెట్టింది మాయమ్మ . ఇంకా కరెంటు రాలేదు. సీకటి ముదురుతా ఉన్నాది. నాకు మెల్లగా ఆకలేసినట్టు అనిపిత్తుంది. పొయ్యి దగ్గర కుచ్చునందుకు సెమటలెట్టాయి. లెగిసొచ్చి గుమ్మాలో కుచ్చుంది మాయమ్మ. నేను మెల్లగా పక్కకు సేరి ఒల్లో తలపెట్టుకూని పడుకున్నాను. ఎప్పుడు నిద్దరట్టిందో తెలీలేదు నిద్దరోయినట్టున్నాను ఒరేయ్ రాజూ లెగరా లెగరాఅంటే మెళుకువొచ్చింది గానీ లెగలేదు. మాయమ్మ మంచమ్మీద పడుకోబెట్నాకి తీసుకెళ్తుంటే సైకిలు బెల్లు ఇనపడింది . అడ్డ కర్రలో బియ్యం మూటేసుకుని దొర్లించుకొచ్చాడు మానాన. మాయమ్మ నన్ను పడుకోబెట్టేసింది. నాకోసం తెచ్చిన గార్లూ , ఒక రస్కుల పేకట్టు నాతల దగ్గరెట్టేసి. బయట పొయ్యికాడ కుచ్చుంది మాయమ్మ. మరిగిన ఎసర్లో బియ్యమేస్తుంటే పుల్లలెగదోశాడు మానాన. అందరూ నిద్దరోయారు కదా! కాసేపుడికి కుతకుతమని అన్నం ఉడుకుతున్న సప్పుడు ఇనపడతుంటే అళివేలు మంగా, ఎంకన్నబాబూ మా పొయ్యి దగ్గరున్నట్టే ఉంది.