కవిత్వం

ప్రశాంతం

జనవరి 2013

పావురాలు
కిటికీ వద్ద చప్పుడు చేయడం లేదు
చీకట్లన్నీ దుఃఖించాయేమో
అద్దాలపై కన్నీళ్లు
కారుతున్నాయి
రోడ్డు మీద
వాహనాల రొదకేమైందో తెలియదు
జ్వరం వచ్చి పడుకున్నారేమో
పిల్లల అల్లరీ
వినపడడం లేదు
వంటింట్లో పొయ్యిపై
ఏదీ ఉడుకుతున్నట్లు లేదు

అంతా శ్మశానానికెళ్లారేమో
ఊరు ఊరంతా నిశ్శబ్దంగా ఉన్నది
నేల నేలంతా
నెత్తురు తుడిచి
అలికి ముగ్గేసినట్లుంది

కదం తొక్కే బూట్లు
మౌనంగా శవాలకు
కాపలా కాస్తున్నాయి
అలిసిపోయిన తుపాకులను
నెత్తుటి బొట్లు
పరామర్శిస్తున్నాయి

విరిగిపోయిన పెన్నుల మధ్య
తెల్లటి రక్తాశ్రువుల కాగితాలు
పగిలిపోయిన అద్దం ముక్కల్లో
ఛిద్రమైన జీవితాలు

మనసు మనసంతా
జ్ఞాపకాలు రూపాలుగా మారి
మాట్లాడుతాయని
ఆరాటపడుతోంది
ముందుకు వెళుతున్నా
ఎవరి పిలుపుకోసమే
తన్లాడుతోంది
నిలకడకు అలికిడి లేదు
ప్రయాణానికీ ధ్వని లేదు
నిశ్శబ్దంగా సమాధిపై
మోకరిల్లా
కొత్త ఏడాది
పచ్చగడ్డి మొలిచిన
శబ్దమైనా వినిపిస్తుందన్న ఆశతో..