కవిత్వం

వడదెబ్బ

మే 2014

పచ్చగా ఉండే చెట్టు ఎండవాడిపోయేది
నిండుగా ఉన్న చెరువు నీరు కారిపోయేది

వస్తూ వస్తూ
నాకు సెలవలు తెచ్చేది
వెళ్ళేప్పుడు
చలికాచుకోమని ఎండు కట్టెలిచ్చేది

పగలేదో రాత్రేదో తెలియని చలువ గదుల్లో

జీతానికి జీవితాన్ని అమ్ముకునే ఖరీదైన రోజుల్లో
మారిపోయే కాలాలు మాత్రం తెలుస్తాయా?

ఎర్రటి ఎండకో సారి మళ్ళీ ఎండాలి

పట్టపగలు నిర్మానుష్య వీధుల్లో నిర్భయంగా తిరగాలి
ఆ సాయంత్రం పిల్ల కాలువైన చెరువుకు ఈత నేర్పి రావాలి

కాలుతున్న రేకులపై నీళ్ళు చల్లి మాయమవటం అంటే ఎమిటో ప్రత్యక్షంగా చూడాలి
తడిసిన కాళ్ళతో వేసిన పాదాల గుర్తులెతుక్కోవాలి

తప్పదు ఏదో ఒకటి చేసి
వడదెబ్బ తగిలిన జీవితానికి
ఇకనైనా వైద్యం చేసుకోవాలి.