కాశీ మజిలీలు

పిల్ల నచ్చింది

మే 2014


మా  మాలపేట్లో బత్తులోల్లంటే తెలీనోల్లు లేరు. ఎవలన్నా మాయూరికి కొత్తగా ఒత్తే  ఆల్లు గనక బత్తులోల్ల సుట్టాలైతే దారి పొడుగునా ఆల్లకి సుక్కలే కనబడతాయి . ఎందుకంటే మాయూల్లో నామాడోల్ల తర్వాత బత్తులోల్లె ఎక్కువుంటారు .

నామాడోల్ల పేటని పేరే గాని  సేనామంది  బయటూరోల్లకి బత్తులోల్లె ఎక్కువ తెలుసు. మయూరి అంబేట్ గారి బొమ్మ దాటగానే  మంచినీల నూతి దాటాక  పెత్తాత కిళ్ళీ కొట్టుంటాది. ఆ తర్వాత సుబ్బన్నగాడి ఇల్లు దాటాక , తోర్రోడి కోల్లు ఇల్లుంటాది. తోర్రోడి కోల్లంటే బత్తుల సూర్రావు కోల్లు. అదేనండీ కుంటి పెసాదం పెళ్ళం…. కుంటోడని అందరూ కుంతీ పెసాదం అంటారు గానీ మామూలు మనుషులకంటే ఎక్కువ జివున్నోడు మా పెసాదం మాయ .

అందుకే ఏకాండ పదారుమందినికన్నాడు.  ఎసోదమ్మని అందరూ తోర్రోడి కోల్లు అంటారు గానీ, ఎవలూ ఎసోదా అని పిలవడం ఎరగన్నేన్ను. మాయమ్మది ఎసోద బాప్పది ఒకూరే గనక  మాయమ్మా ఎసోదమ్మ కలిసే పెరిగారు గనక  మాయమ్మొక్కతే ఒలేయ్ ఎసోదా అని పిలుత్తాది. మాయూరిగురించి  మొదలెట్టి తోర్రోడి కోల్లు ఇల్లని సెప్పి అంతా సాగదీత్తన్నాడేట్రా అనుకోకండి . అంత పనోడైనా మా బత్తులోల్ల పెసాదం మాయని కొందరు తోర్రోడి కొడుకనీ, కొందరు ఎసోద్దాని మొగుడనీ అంటారు . అందుకే నాకూ అలాగే గుర్తు.  సెలవుపెట్టింది రెండ్రోజులే కదా ! రేపు సందాల హైదరాబాదు ఎలిపోతా కదా అని  మా కాలవ గట్టుని కొబ్బరి బొండాల కోసం మా మక్కిసేసుగాడు, నేనూ, మా సినతమ్ముడి కొడుకు బుడ్డంగాడు ఎల్తన్నాం,  నూతినీలు తాగి సేనాలయ్యింది కదా అని నూతికాడాగాము .

ఎవల్దో టేక్షీ వొచ్చి మా ముందాగింది .  మేము నీలు తాగేసి ఒత్తుంటే , టేక్షీ ఆపినతను  బత్తులోల్లింటికి  ఎల్లాలి ఇది నేరేల్లంకే కదా అన్నాడు . ఎనకేమో సెట్లో ఉన్న పెద్దమనిషి  తెల్ల సొక్కాఏసుకుని , తలకి నూనె రాసుకుని , తగువుకెల్లే  పెద్దమనిషి  ఏసంమీదున్నాడు. “ బత్తులోల్లా” “ఏ బత్తులోల్లూ?” అన్నాన్నేను. బత్తుల సూర్యారావు  ఇంటికన్నాడు.  అంత పద్దతిగా పేరు మొత్తమన్ పలికే సరికి  అబ్బో ఈల్లెవరో టౌనుసరుకు లాగున్నారు అనుకున్నాను.

బత్తుల  సూర్రావు అనేసరికి ఉన్న పళంగా గుర్తురాలేదు నాకు . మళ్ళీ అడిగాను “ ఏ బత్తుల సూర్రావండీ?” అని  ఆ పెద్దాయన సూసిన సూపుకి ఆయనకి కోపమొచ్చిందో , చిరాకొచ్చిందో నా ఎదవబుర్రకి ఎలిగింది కాదు .  మా మక్కిసేసుగాడు ఇన్నాడుకామోసు “అదేరా బాయా  కుంటోడింటికి “ అన్నాడు. నాతో కాకుండా  మళ్ళీ ఆ పెద్దయనైపు తిరిగి  కుంటాయనుంటాడు కదండీ ఆల్లింటికేనా అనడిగాడు . అవును బాబూ అన్నట్టు సూసాడాయన. ఆ పెద్దాయన మొకంలో అదోరకం సూపు కొట్తోచ్చినట్టు కనబడింది నాకు.

మా పెసాదం మాయ పెద్దోడు కదా ఈడికేమో పదారు, పదేడేల్లుంటాయి . పెద్దోన్ని ఈడు అలా అనేసరికి  ఆయనకి నచ్చలేదేమో  ఉడికీ ఉడకని అన్నం మెతుకులాటి కోపం మొకానేసుకున్నాడాపెద్దాయన  ఆయనింకా కోపం తాలుక కిల్లీని నములుతుంటే  మక్కిసేసుగాడు “ ఒరేయ్ కాసోడా తోర్రోడింటికి ఒచ్చారెహే” అన్నాడు. బత్తుల సూర్రావు తాతని అందరూ తోర్రోడనే అంటారు. అదేదో ఆళ్ళ ఇంటిపేరన్నట్టు అందరికీ అలాగే గుర్తుండిపోతాది . ఎవలూ సూర్రావుతాతని బత్తుల సూర్రావు అని పిలవరు  అందుకే నాకు అర్ధం కాక ఎవలండీ అని అడిగాను. మా సూర్రావు తాతకీ , మా  పెసాదం మాయకీ మేమిచ్చిన గౌరం సూసేమో  అయన కారుదిగి మీరు ప్రసాదం కి ఏమవుతారు అనడిగాడు. మక్కిసేసుగాడేమో పెసాదం గాడు నాకు బుల్నానవుతాడండీ, నేనాడికి కొడుకొరస అన్నాడు. నేనేమో కాస్త పద్దతిగా , నాకు మావయ్యవుతాడండీ అన్నాను. కారు లోపలకెల్లదు ఇక్కడాపి నడిసెల్లాలి అన్నాను .  తోడురా బాబూ అన్నాడు కాత పద్దతిగా.

సేసుగాడు నాతోపాటు కదులుతూ పదరా బాయా  మల్లోచ్చి ఎల్దారి బొండాలకి అన్నాడు. ఆ పెద్దయనేమో ఒకరు సాల్లే బాబూ నీ పని ఎందుకు డిస్టబ్బవడం అంటుంటే. ఓహో బాగుందండీ మీయొరస నాకు ఏపనీ లేదనే ఈ పొడుగోడు కొబ్బరి బొండాలు తియ్నాకి  నన్ను సెట్లెక్కిద్దామని తీసుకొచ్చాడు.  మధ్యలో మీరొచ్చి ఎడ్రెస్సడిగి  ఆన్ని మాత్రమే తీసుకెళ్తున్నారు!  ఆడిపనే నా పని , నా పనే ఆడి పని  వుదిల్తే ఇద్దర్నీ వొదిలేయాలి లేపోతే నేనూ ఒత్తానంతే అన్నాడు . రా బాబూ అని ఆయననేదాకా  సెయ్యట్టేసుకున్నాడు సేసుగాడు. సరేరాబాబూ కాదు , సరే రా బాబూ అనండి అన్నాడు.  ఆయన రాజకీయ నాయకుడిలాగా వొచ్చీరాని నవ్వునవ్వాడు.

ఇంటికి సుట్టాలొత్తారని ఎసోదమ్మకి ముందే తెలుసేమో! ఇల్లు బాగా సర్దింది. గలాసులూ, సేమ్బులూ కిటికీల మీదలేవు ఒబ్బిడిగా బల్లమీద దబ్బిదించింది. వొకట్లో గోలుం దగ్గర ఎంగిలి కంచాలు వొదిలేసి లేవు. సుబ్బరంగా సబ్బెట్టితోమి అలమార్లో  పెట్టినట్టుంది. అంతా సక్కగా కనబడతుంది. బద్ది మంచమరిసి తలకాడ రొండు  దిండ్లేసి పైన తెల్లదుప్పటరిసి వోచ్చేవోల్ల కోసం సిద్దం సేసినట్టుంది.  నన్నూ ఆ పెద్దాయన్నీ సూడగానే గుమ్మలోనుండి పైకి లెగిసింది. అగున్న అర నిమసంలోనే  అన్నీ సూత్తానని తెలుసు మా ఎసోద బాప్పకి. అల్లుడా చినపిల్ని సూన్నాకి అమలాపరానుండొచ్చారు  అన్నాది. ఓహో మరి సెప్పలేదేంటే! మరి మాయేడీ అనడిగాను. కూల్డింకులు తెత్తానని ఊళ్ళోకెల్లాడ్రా అన్నాది. కుచ్చోండిబాబూ అని మోడు కుర్సీలేసి, ఆ పెద్దాయన్ని ఆయనతో పాటోచ్చిన ఆ ముసలాయన్ని , ఆ పెద్దాయన భార్యనీ  కుచ్చోమంది . ఇంకో కుర్రోడున్నాడు పెళ్ళికొడుకు కామోసు! కాత హడావుడిగా  వున్నాడు కదా  పెల్లికొడుకే అయ్యుంటాడు నేను ఎవర్నీ ఏమీ అడగలేదు. మా బాప్పేమో నన్ను పక్కకి రమ్మని  కేకేసింది. నాకేదో పని సేప్తాడని అర్ధమయ్యింది నాకు. అనుకున్నట్టు గానే ఒరేయ్ అల్డా ! రొండో తోము దాటగానే  ఒంకరసెట్ని బొండాలున్నాయ్ లాక్కురారా అన్నాది. గెడ్డమట్టుకుని కూడా బతిమాలింది. ఇంకా తప్పదని సరేలే అన్నాను. బొండాలు తీయించుకొచ్చి  సెలిపి అందరికీ అందించాను. పెద్దాయన బొండం తీసుకుని  నా పేరడిగాడు” రాజండీ “ అన్నాన్నేను . మంచోడండీ ఆ రెండిళ్ళ తర్వాత ఈడిల్లు అని మా ఇంటోపు సూపించాడు. ఇంజెనీరు సదుంకున్నాడు  అన్నాడు మా పెసాదం మాయ. అవునా “పద్దతిగా ఉన్నాడు పిల్లోడు అన్నాడాయన” సేనా పద్దతైనోన్నేగానీ నాకు మాత్రం పిల్లనియ్యకుండా మీదాకా వొచ్చాడు మా పెసాదం మాయ  అన్నాను . అందరూ నవ్వారు. మేముండగా ఎవలూ ఏమీ మాటాడుకోలేదు. వొత్తా వొత్తా ఒరేయ్ మాయా కొబ్బరిబొండాలు తీయిన్చినందుకు డబ్బులియ్యాలోరేయ్ అన్నాను. అలగలగే అన్నాడు.

ఇంతకీ మీము బొండాలు తాగుదామని ఎల్లి ఆల్లందరికీ ఇచ్చొచ్చాము గాని మేము తాగాలేదు. తెచ్చుకోలేదు. ఒళ్లంతా సెమటట్టి సిరాగ్గా ఉన్నాది , తానం సేసోద్దామని నూతికాడకి ఎల్తుంటే  ఈలోపు నామాడోల్ల నల్లసూర్ర్రావు  కేకేత్తున్నాడు. గబగబా తానం సేసోచ్చి  ఒల్లుకూడా సరింగా తుడుసుకోకుండా బనేలుకూడా ఎస్కోకుండా సొక్కా తగిలించుకుని ఎల్తుంటే ! నల్లసూర్రావు మళ్ళీ కేకేసి “ఒరేయ్  పేంటూ, సొక్కాయ  ఏస్కుని రమ్మనాడు”  అన్నాడు నల్ల సూర్రావు . మా నానెక్కడున్నాడ్రా మాయా అనడిగితే ఎసోదమ్మ ఇంటికి రమ్మనాడు అన్నాడు. ఓహో సుట్టాలొచ్చారు కదా  ఆళ్ళని ఏ యానం దాకానో , ఏ దాచ్చారందాకానో  దారి సూపియ్యలేమో అనుకుని  మళ్ళీ ఆగి కాళ్ళకి షూ కట్టుకుని  మీసాలు దువ్వుకుని  మా ఎసోదబాప్ప ఇంటికెల్లాను. మా నాన , ఎసోదబాప్ప  అందరూ నవ్వుకుంటా మాటాడుకుంటున్నారు . దగ్గరకెల్లాక మానాన ఆ పెద్దాయన్ని “ఒరేయ్ దాట్లుగా అడిగో నీ అల్లుడొచ్చాడు అన్నాడు” నన్ను సూపించి . నాకు ఆచ్చిరిమేసింది. ఆ పెద్దయనేమో ఒరే కాసే నువ్వే కాదు , నీ కొడుక్కూడా బువ్వగాడే రా  ఇందాకే నాకు మీయోడి ఆతిద్దం ఇచ్చాడు అన్నాడు. దారా కూకో అని నాకో కుచ్చె ఏసి కుచ్చోమన్నాడు మానాన . ఒకైదు నిమసాలాగి ఏనాన ఎందుకు రామ్మనావ్ అనడిగాను. ఇయ్యేల నీకు సమందం సెటిల్ సేసాం అన్నాడు. నాకు నమ్మబుద్ది కాలేదు. మనింటి పక్క బాలోగుమాయోల్లు ఉన్న తలం ఈల్లదేరా  ఈడికి కరెంటాపీసులో జాబోత్తే కాకినాడెలిపోయాడు. ఇప్పుడేమో బొబ్బర్లంకలో ఉంటున్నాడు  అన్నాడు . బొబ్బర్లంక అనగానే నాకు ఎంటికలు నిక్కబొడుచుకున్నాయ్. ఏమీ మాటాడవేట్రా పలకరించీల్లని అన్నాడు మానాన. “ నమస్తే సారూ ! నా పేరు రాజు “ అన్నాను . ఆ తెలుసులేరా  డా ఇలారా కుచ్చో అని మంచమ్మీద కాత పక్కకి జరిగాడు. నేను కుచ్చున్నాక మీద సెయ్యేసి దగ్గరికి లాక్కుని “ఏరా మర్చిపోయావా ? నీ సిన్నప్పుడు నేనే నిన్ను ఎక్కువెత్తుకున్నా” అన్నాడు. నేనేమో అయితే నేను మీమీద  ఎక్కువుచ్చేసుంటా అన్నాను . అందరూ ఒకేసారి పకాల్ననవ్వితే నేనూ నవ్వాను.  అందరూ ఒకేసారి పైకిలెగిసి. మానానతోటి “మరి రేపు రండ్రా కాసే!” అన్నాడు ఆ పెద్దాయన. రేపెందుకండీ ఉప్పుడే వోచ్చేతామన్నాను. కాత నావి మీవాడు మంచి భలేవోడ్రా అన్నాడు. ఎలాగూ మీవాడు ఎక్కువరోజులు  ఊళ్ళో ఉండడు అంటున్నావ్ కదా రేపు వొచ్చేయండి మరి అని మళ్ళీ అన్నాడు. తరవాత ఆల్లెల్లిపోయాక .  ఆళ్ళ పిల్లోడికి సమందానికొచ్చారేమో  కదా నానా అన్నాను . ఆల్లు మనకి సుట్టాలైతే కుంటిమాయోల్లకి వరస కలదురా అన్నాడు.  వరసలు కలవని సమందాలు మా ఊళ్ళో ఎవలూ సేసుకోరు.

తెల్లారితే  తీర్తానికెల్తాం అన్నంత సంబరంగా ఉంది నాకు. అదేంటో తెలీదు ఎప్పుడు తలలో దువ్వునెట్టనోన్ని రాత్రిపూట నాలుగు సార్లు తలదువ్వుకున్నాన్నంట, తెల్లారాక తానానికెల్తూ మళ్ళీ తల దువ్వుతుంటే సెప్పింది మాయమ్మ. తోమ్మిదయ్యే సరికే రొండుసార్లు తానం సేసి  ఒక కొత్త జత బట్టలుంటే ఏసుకుని ముస్తాబయ్యాను . పొద్దున్నే ఎటెల్లిపోయాడో  తెలీదు  తొమ్మిదిన్నర, పదవుతున్నా ఇంకా ఇంటికిరాలేదు. కాలు కాలిన పిల్లిలాగా  ఇంట్లోకి బయటకీ తిరుగుతా ఉన్నాను. మాయక్క, మాయమ్మ తెగ నవ్వుతా ఉన్నారు. తీరా పావుతక్కవ పదికాల్లా మానొచ్చాడు. పదినిమసాల్లో తానం సేసి , తెల్ల పంచీ , తెల్లసొక్కా ఏసుకుని  బుజ్జమ్మీద తెల్లరుమాలేసుకుని సినిమాల్లో సూపించే ముసలి పెళ్లికొడుకులాగా తయారయ్యాడు. “రారా బాబూ!o  o ఓ గంట  నుండి నీకోసం సూత్తున్నాను అన్నాను. “ ఏంపని , ఎక్కడికెళ్ళాలి?” అన్నాడు  మానాన. నేను కాత కంగారయ్యి “అదేంటి  ఇయ్యాల బొబ్బర్లంక రామ్మనారు కదా” అన్నాను. పక్కున నవ్వాడు మానాన. “అదేరా నవ్వుతున్నావ్ అనడిగితే “ బొబ్బర్లంక నిన్నెవడు రమ్మన్నాడ్రా ?” అన్నాడు. అదేంటి నిన్న మాటాడుకున్నారు కదా ! ఇయ్యాల రమ్మనాడు కదా మీ సెందర్రావ్  అన్నాను. “ నిన్ను రమ్మనాడా?” నువ్వెందకన్నాడు. సమందం సూన్నాకి ముందు పిల్లోడి ఇంట్లోవోల్లు ఎల్లొచ్చాక, తరవాత పిల్ల తరపోల్లు ఒత్తారు , ఆ తరవాత ఆల్లకి  కూడా నచ్చాకా మిగతాయి మాటాన్నపుడు నువ్వెల్లాలి అని ఇవరించింది మాయమ్మ . నాకు సిరాకేసింది  న టైరుబండినీ , నా సేతిలో కర్రపుల్లని లాక్కుని మానాన పరిగెడుతున్నట్టు అనిపించింది. నా మొకం కాత  రంగుమారే  సరికి మానానకి నా మీద జాలేసింది కామోసు ! “పదరా నువ్వూ మాతో ఒద్దుగాని” అన్నాడు .  హమ్మయ్యా అనుకుని  బయల్దేరాక మా నానతోపాటు మయూరి పెద్ద , మా కుంటి పెసాదం మాయ,  కిట్ట మూర్తి తాత వొచ్చారు. బొబ్బర్లంక అడ్డ రోడ్డుకాడ అందరం నిలిసుంటే  ఆటోలో ఇద్దరు పెద్ద మనుసులొచ్చి  మీరు  నేరేల్లంకోల్లే కదా అనడిగి అటో ఎక్కించుకున్నారు.

ఓ పావుగంట తరవాత  మర్రిసెట్టుకింద ఆటో ఆగింది. రేవొడ్డున పెంకుటిల్లు , సుట్టూ కొబ్బరాకుల దడి  ఇల్లు భలే ఉంది సూన్నాకి. అదే మాట నోట్లోనుంచి పైకోచ్చేసింది. మాతో వొచ్చిన మయూరి పెద్ద “ ఒరేయ్ కాసోడా  మీయోడికి ఇల్లు నచ్చేసిందంటే  పిల్లకూడా నచ్చేద్దిరోరేయ్ ” అన్నాడు. అందరూ నవ్వారు.సేతిలో ఐదారు తెల్ల రుమాళ్ళు పట్టుకుని  గోలుం దగ్గరకొచ్చాడు  సెందర్రావు  గారు !  కాళ్ళు కడుక్కుని. మోకాలు కడుక్కుని ఎవలి మొకంమీదున్న  రుమాల్తో ఆల్లే తుడుసుకున్నారు. నేనొకటి తీసుకుని మోసం తుడుసుకుని మిగతాయి కూడా అయన సేతిలో పెట్టాను. వొకట్లో ముగ్గులూ , ముందు పువ్వుల మొక్కలూ అన్నీ బాగున్నాయి. పిల్ల కూడా బానే  ఉంటాది అనిపించింది నాకు. అందరూ కుచ్చేల్లో కుచ్చుంటే ఉన్నాయి మూడేగనక నేనూ మానాన మంచమ్మీద కుచ్చున్నాం. పెద్దావిడ మంచినీళ్ళు తెచ్చిచింది , నిన్న మా ఊళ్ళో సోసా కదా అత్తవరస అనుకుని ఊరుకున్నా . ఆ తరవాత పల్చగా ఉన్నా కాత సల్లగా ఉండే మజ్జిగిచ్చారు. అందరం తాగి గలాసులు తిరిగిత్తుంటే  ఇంట్లోకి రమ్మని పిలిసారు. అందరూ లోపలకెల్లారు గాని నాకు మాత్రం అడుగు ముందుకు పడట్లేదు. మంచ్చంమీంచి లెగకపోతే మానాన  సెయ్యందిచ్చాడు. అందరూ లోపల ఎవరెవరు ఏమ్మాటాడుకున్నారో ఇనలేదు గాని. “ నా పేరాండి, మంగాదేవి” అని ఒకే ఒక్క ముక్కిన్నట్టు గుర్తుంది నాకు. కొద్ది సేపు మాటలయ్యాక , నన్నెవరో ముక్కలు ముక్కలుగా ఇరిసి  మంటెడుతున్నట్టు  అనిపించింది .  అందరూ కదుల్తుంటే నేనూ లెగిసాను.

కత్తిమొనకి ఆముదం రాసి  దీపపుపొగారిసి ఆ నల్ల కాటుకని మా ఊరి దేవత కళ్ళకు పూసినట్టు  కనబడ్డ o రూపం  తెగ కాల్చేసింది నన్ను . తెలీగ్గా ఉన్నానో , బరువుగా ఉన్నానో తెలీని స్థితి . మందార పువ్వుకి గంధం రాసినట్టు  ఓ పసుపు రాసుకున్న మొకం  నన్ను నిలువునా రాసుకుంటుంటే  అడుగెయ్యలేని స్థితి నుండి మానాన నన్ను  ఈడ్చుకు తీసుకెల్తున్నట్టు అనిపించింది నాకు. బస్సెక్కి  కుచ్చూని  బొబ్బర్లంక రేవుసూన్నాకి తల బైటెడితే, నేను దూరమవుతున్న కొద్దీ  కాటుక కళ్ళనుండి కన్నీళ్ళు రాల్తూ , చేతులూగుతూనే ఉన్నాయి. ఇంటికొచ్చాక కూడా ఏదేదో మాటాడుకున్నారు. ఎంత ప్రయత్నించినా ఏమీ ఇనబల్లేదు. “ఆపీసునుంచిపోనోచ్చింది ఎల్తాను నానా”  అని   మాసిపోయిన బట్టలు కూడా సర్దేసి , మాసిన మనసుతో కాకినాడ బస్సెక్కి  బొబ్బర్లంక  టిక్కట్టడిగా, రైల్ టేషునుకి ఆటో ఎక్కి  బొబ్బర్లంక రాయిసెట్టుకాడ దించమన్నా , రిజర్వేషన్ లేక జనరల్ టికెట్ లైన్లో నుంచూని తీరా కౌంటర్ ముందుకొచ్చాక  ఓ మూడొందలిచ్చి  నా ఒక్కడికీ రెండు టిక్కట్లు తీసుకున్నాక గాని తెలీలేదు . ఆ  కాటుక కళ్ళలో కారే నీళ్ళతో నిండిపోయి నేను ఇద్దరైపోయానని . అందరూ అనిగిమనిగి ఉన్నపుడు డైరీ తీసి  రాస్తుంటే  రెండు చేతులు ఇంకా ఆ బొబ్బర్లంక రేవుమీదే ఊగుతున్నాయ్.