ఒక్కోసారి సగం తెరిచిన గది కూడా మాట్లాడుతుంది
తన కడుపులో ఉన్న కిటికీలు బయట ప్రపంచాన్ని పూర్తిగా మింగనూ లేవూ కక్కనూ లేవూ
అటూ ఇటూ కర్టన్లతో కప్పుకుంటూ చూస్తుంటాయి నిన్నో నన్నో
ప్రతిరోజూ కొన్ని ఉదయాలనూ సాయంత్రాలనూ నా కళ్ళలో పోసి పోతుంటాయి
నుసులు పట్టిన నుదురు కన్నాల్లో నులుముకుంటూనే ఉంటా
నిన్నటినో రేపటినో తలుచుకుంటూ కూర్చుంటాను బూజు పట్టిన మూలల్లో
రెక్కలు తెగిన సీతాకోకచిలుకలు కొన్ని గోడ మీద పాకుతూ కనిపిస్తాయి నా ముందు
వాటి రక్తపు చుక్కలు నా పక్కగా నదులవుతాయి
అందంగా కూస్తూన్న బల్లిపిల్లల పలకరింపు నాకు కొత్తేమీ కాదు
గొంతులో వెక్కిళ్ల శబ్దం అప్పుడప్పుడూ పరావర్తనం చెందుతూ
నేలకతికించిన నాపరాళ్ల సందుల్లో దాక్కోవడం బాగా గుర్తు
ఇంకని సున్నపు చెమ్మ గదంతా గంధమై పులుముకోవడం చూస్తుంటాను
పగలో రాత్రో బిగ్గరగా చప్పుడు చేస్తూ
తలుపులు గాలిని మింగేసి దుమ్మును జల్లడం
అప్పుడు నా చేతివేళ్ళు చీపురు పుల్లలై కడుగుతూ పోతుంటాయి
నన్నెందుకు పంపించేస్తున్నావు తన నుండి దూరంగా అంటూ విసిరే ప్రశ్నలు
నా ముఖానికి తగులుతూ తోసేస్తాయి
నన్ను ఊడ్చేసుకోలేని అగాధంలోకి.
ప్రతి కవిత ప్రతిసారి … అదేమో ఒక నిబద్ధత లో రాసినట్టు ఒకో అక్షరం పేర్చుకుంటూ అసలు ఇంతందం గా ఎలా రాస్తారు ?
మీ కవిత లో ఓ వింత గమ్మత్తు ఉంది . మీరు వాడిన ప్రతీకలు సహజత్వం పట్టుకోలేకుండాను, అలాగని అసహజత్వానికి పట్టు దొరక్కుండానూ ఓ గొప్ప అనుభూతిని చదువరికి అందించాయి . ప్రతీ వాక్యం ఒక్కో కవితేమో అన్నంత గొప్పగా అక్షరం అక్షరం నేర్పుగా పొదిగారు. హాట్స్ ఆఫ్ టు యు తిలక్