కవిత్వం

ఇలానో ఇంకోలానో!

నవంబర్ 2014

నేనిలానో ఇంకోలానో ఉంటాను
ఉండాల్సిందేగా
నీకు నచ్చేలా ఉండడాన్ని నిరసిస్తూ ఎంతకాలం ఇంకా
నా దారిలో నేను బతుకుతూ ఉంటే ఏమైందో తెలియని ఒకానొకచోట ఇద్దరం కూర్చున్నట్టు
అనిపిస్తూ ఉండడం ఏమిటి?
నేను మళ్ళా అంతరంగీకరించుకోవడం ఎందుకు?
పగలో రాత్రో పుడతాను నాకు నేనుగా
మళ్ళీ ఎప్పుడో రమిస్తాను నాలో నేనే
ఇక నీ గురించి ఏం చెప్పను
నా చేతులన్నీ నిన్ను తాకడం, తాకినట్టు భ్రమించడం నావల్ల కాదు
పైకి మాత్రం ఇద్దరం ఒకేలా కనిపిస్తాం
ఎప్పటికీ మారం
కొత్తగా చెప్పేదేముంది ఇంకా ఎప్పుడూ ఉంటూనే ఉంటాం ఇలానో మరోలానో
నాలోకో నీలోకో ఎప్పుడోకప్పుడు ప్రయాణిoచాల్సిందేగా ఒకరికొకరం ఇష్టం ఉన్నా లేకపోయినా
ఏదోకరోజు నా మనసు కొంత ఇష్టాన్ని పోసుకుని నీమీద కురవడం అంత బాగోకపోవచ్చు
ఎందుకంటే ఇప్పటి దాకా ఎవరి సమాధుల్లో వాళ్లుండి ఇలా ఒక్కసారిగా తవ్వుకోవడం ఎందుకు
కాసేపయ్యాక మళ్ళా నచ్చుకుంటాం నువ్వూ నేనూ
ఒకసారి నడుస్తాం,నవ్వుతాం …నడకా నవ్వూ మామూలే మనమే కొంచం కొత్త
ఇలానో ఇంకోలానో
మళ్ళా కలుద్దాం