కవిత్వం

గుల్జార్ కవితలు రెండు

జనవరి 2013

అదేదో నాక్కూడా కాస్త నేర్పగూడదూ?

చాలా సార్లు గమనిస్తూంటాను -
ఒక దారం ఐపోతుందా,

ఇంకో దారమేదో తెచ్చి కలుపుతావు
ఇంకో దారం చిక్కుపడుతుంది, ఓర్పుగా విడదీస్తావు
మరో దారం తెగిపోతుంది, నేర్పుగా ముడివేసి ముందుకు సాగుతావు
నీ అల్లికలో ఒక్క ముడి గానీ, ఒక్క చిక్కుగానీ వెతికినా కనిపెట్టలేరెవరూను

నేను ఒకే ఒక్కసారి అల్లాను ఒక ప్రేమని! ఒక బాంధవ్యాన్ని!
నా అల్లికలో చిక్కులూ ముడులూ ఖాళీలూ అన్నీ తేటతెల్లంగా కనపడిపోతూ ఉంటాయి..

నీ రహస్యమేంటో నాకు తెలిస్తేనా!

 

వీడ్కోలు

శ్రుతి చేసిపెట్టిన వీణ నుంచి
ఠంగ్ మంటూ అపశ్రుతితో తెగిపోయిన తీగెలాగ
సన్నటి పట్టు దారమ్మీద
వేలుతెగి కారుతున్న చిన్న రక్తపు బొట్టులాగ
గుండెలోపల ఎక్కడో ఒక సన్నటి వేదన
నీ చూపుల్లో అల్లుకుపోయి చిక్కుపడ్డ
నా చూపుల్ని విడదీయాల్సి వచ్చినప్పుడు

వీడ్కోలు క్షణాలు
నిట్టూర్పులు నిండిన నిర్దాక్షిణ్య క్షణాలు..

 

అనువాదం: సత్య భామ పప్పు