డైరీ

నేను, ఆమె, అక్షరాలు…

ఫిబ్రవరి 2015

మాట్లాడటానికి ఏమీలేక,  పుష్పించడానికి అవకాశం లేక, శూన్యంలా కుప్పగా పోయబడటాన్ని రాయడానికి అనుకూలమైన స్థితి అనుకుంటాను. నాలో మొత్తం దహించబడిన తర్వాత మసిబారిన మనస్సును కాగితం మీద గీస్తూవుంటాను. చితికిన గాయాలు స్రవిస్తుంటే జీవిస్తున్న అనుభూతిని అక్షరాలలో నింపుతుంటాను.రెప్పల మధ్యన ప్రశ్నలు జారిపోతుంటే పదాలుగా పేర్చి దాచుకుంటాను.వ్రాయడానికి వేదనకంటే గొప్ప ప్రేరేపణమేది?

ఆమె గురించి తప్ప నేనేదీ వ్రాయలేదు. ఆమెను చంపిన ప్రతీసారీ నా నుండి పుడుతూనే ఉంటుంది. పువ్వులు నలిగిపోయిన చోట, గాజు గది పగిలిపోయిన చోట ఆమె కోసం కవిత్వాన్ని లేపనంగా పూస్తూ ఉంటాను. ఇచ్చిపుచ్చుకోవడానికి ఏమీలేక గాయాలను ముద్దాడటమే ప్రేమించడం మాకు.రాత్రిని నింపుకున్న ఆమెపై నేను మాటనై చల్లగా కురుస్తుంటే లోలోపల ఒంటరితనపు మడతలు సరిచేస్తూ ఆమె కొన్ని గడవని క్షణాలను నాకు కానుకిస్తుంది.

ఒంటరిగా నడుస్తున్నపుడు అక్షరాలకు అనుకరణ అవసరంలేదు. మనసును పరుస్తున్నపుడు భావం వివరించాల్సిన పనీలేదు. దేహాలు ప్రపంచంతో నశించినా, ఈ ఆకాశమంత కాగితంపై నేను, ఆమె, అక్షరాలు సజీవులం.

**** (*) ****