కవిత్వం

మనోవిలాపం

ఫిబ్రవరి 2015

వెలుతురు శిల్పంలా కళ్ళల్లో నీ రూపం
కిరణాల అంచులకి గుచ్చుకుంటూ
నరాల్లో పాకుతూ నీ జ్ఞాపకాలు

ఏడుపుదీవిలో ఏకాకినైపోయాను
గాయం మాన్పుకోవాలి

ఎక్కణ్ణుండొచ్చావో… రెక్కలు తొడిగావు
ఎగరగల్గినంతా ఎగిరాను, హఠాత్తుగా ఏమైందో – తెలీదు.
కఠినమైన యథార్థంమీద వేగంగా మోదుకుని
వేసవి సుడిగాలిలో దిశకొక రేణువుగా ఎగిరిపోయాను

ఇదిగో ఇన్నాళ్ళకి మళ్ళీ నన్ను నేను దోసిట్లో పోగుచేసుకుంటున్నాను

వైరాగ్యాన్ని బలవంతంగా పులుముకుంటున్నాను
సున్నితత్వానికి తెలిసింది హింసించడమొక్కటే!

తెలుసు, అన్నీ తెలుసు తెలియకూడని వాటితో సహా అన్నీ తెలుసు

తీగ వదిలేసిందనో పువ్వే వదిలించుకుందనో నిందించడం తప్ప!
కొత్త మొగ్గ తొడగడం చూసి శపించడం తప్ప

ఇవి కూడా తెలిస్తే, వైరాగ్యమేమంత దూరమో కూడా తెలుసు.