సెప్టెంబర్ నెల చిరుచలి. వేడి వేడి కాఫీ కప్పుతో బాల్కనిలోకి వచ్చాను. సూరీడు మబ్బుల చాటున దాక్కుంటూ నేలతో దోబూచులాడుతున్నాడు. బంగారు వర్ణపు కిరణాలు సూర్య భగవానుడిని ఇట్టే పట్టించేస్తున్నాయి. రాత్రి ఏ ఘామునో చినులు కురిసినట్టున్నాయి. నేలంతా చెమ్మగా వుంది. కుంపట్లో విరబూసిన గులాబీ చిరుగాలికి తలాడిస్తుంది. కాఫీ సిప్ చేస్తూ మొక్కల దగ్గరకు వెళ్ళాను. ఆదివారం ఉదయాలంటే నాకెంతో ఇష్టం. ఆకాశాన్ని చూస్తూనో, మొక్కలను స్పర్శిస్తునో గడపటం కోసం వేకువ జామునే మేల్కొంటాను. వీకెండ్ అని పగలు పదింటి దాకా పక్కపై దొర్లటం నాకస్సలు నచ్చదు. లేట్ గా నిద్ర లేస్తే సగం రోజు అప్పుడే అయిపోయినట్టే వుంటుంది.
ఈ మధ్య ప్రతీ వారాంతరం ఎవరో ఒకరి ఇంట్లో ఎదో ఒక పార్టీ. పూజలనో, పోట్లక్ పార్టీలనో , పుట్టిన రోజులనో స్నేహితులతో గడపడమవుతుంది . ఒక్కోసారి పార్టీలు ఎక్కువైనా విసుగ్గానే ఉంటుంది. ఫ్యామిలీ టైం, పర్సనల్ టైం మిస్ అయిపోతున్నాం అనిపిస్తుంది. అందుకే ఈవారం ఏ పార్టీకి రాము అని చెప్పేసాను.
అన్నయ్య ఏ సంగతీ చెప్పలేదు. వస్తున్నాడో లేదో? లీవ్ ఏమైందో? ఆలోచనలు అన్నయ్య వైపుకు మళ్ళాయి.
ఎన్నేళ్ళయిందో అన్నను చూసి. ఆరేళ్ళు దాటిపోయాయి. పెళ్ళయ్యాక ఆస్ట్రేలియా వచ్చేసాను. కొత్త ఉద్యోగం, వెంటనే సెలవు పెట్టలేనని మొదటి సంవత్సరం ఇండియా వెళ్ళలేదు. ఆ తర్వాత ప్రేగ్నేన్సి, డెలివరీకి అమ్మ నాన్న రావటంతో మరో ఏడాది వెళ్ళలేదు. నా కొడుకు చందు నెలల పిల్లడుగా వున్నప్పుడు అన్నయ్య పెళ్ళికని వెళ్ళటమే. పెళ్లి హడావుడి తీరితీరక మునుపే అన్నయ్య అమెరికా వెళ్ళిపోయాడు. ఇప్పుడు తండ్రి కూడా అయిపోయాడు. మేనకోడలి ఫోటోలు చూసి మురిసిపోవటమే. అన్నయ్య కూడా నా కూతుర్ని చూసింది లేదు. మేము ఇండియా వెళ్ళినప్పుడు వాళ్లకు కుదరకపోవటం, వాళ్ళు వెళ్ళినప్పుడు మేము వెళ్ళలేక పోవటం. ఇలా ఆరేళ్ళు దాటిపోయాయి.
ఫోన్ రింగయ్యింది.
“నురేళ్ళాయుస్సురా ……ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను.”
“నా లీవ్ confirm అయింది. టికెట్స్ బుక్ చెయ్యాలి. మీ ప్లాన్ ఏంటో చెప్పు . మీ ఇటినరి డీటెయిల్స్ ఇవ్వు “, అన్నయ్య గొంతులో ఆనందం ఉరకలేస్తుంది.
“లైన్ లో ఉండు. బావగారిని నిద్ర లేపి ఫోన్ ఇస్తాను. ఫ్లైట్ డీటెయిల్స్ తనకే తెలుసు”, అన్నాను.
నిద్ర చెడగోట్టకులేరా. పోనీ తర్వాత చేస్తాను అంటూ అన్నయ్య వారిస్తున్నా వినకుండా ఈయన్ని లేపి ఫోన్ చేతిలో పెట్టాను. ఫోన్ సంభాషణల్లో బంధాలు వృద్ది చెందాల్సిన కాలం. అవకాశాన్ని మొహమాటాల కోసం ఎందుకు వదులుకోవాలి?
వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూ వుండగా నేను పిల్లల్ని నిద్ర లేపాను.
“పిల్లలు..పిల్లలు మామయ్యా ఫోనర్రా…లేవండి లేవండి. ఈసారి ఇండియాకి మామ కూడా వస్తున్నాడోచ్”
“Get me a PSP మామ. I would like to have…”, ఏడేళ్ళ నా కొడుకు ఇంగ్లీష్ లో ఊదరకోట్టేస్తున్నాడు.
“చందు…తెలుగులో మాట్లాడు”, గుర్తుచేస్తూ వార్నింగ్ ఇచ్చాను.
“మామ నాకు బార్బీ డాల్ కావాలి”, వచ్చిరాని మాటలతో ముద్దు ముద్దుగా చెపుతుంది నా కూతురు.
మేనమామ బంధంలో ఎంతో ఆత్మీయత వుంటుంది. పుట్టింటి మమకారమంతా రంగరించిన అనుబంధం అది. చిన్నప్పుడు నేను, అన్నయ్య వేసవి సెలవుల కోసం ఆత్రంగా ఎదురుచూసే వాళ్లము. అమ్మమ్మ వండే కొబ్బరి బూరెలు, చక్కిడాలు, పప్పుండలు మా ఇద్దరికీ ఏంతో ఇష్టం. తాతయ్య పొలం నుంచి ముంజులు, కొబ్బరి బొండాలు, మామిడి పళ్ళు తెప్పించేవారు. పాడి, పాలేర్లతో ఆవరణంతా కోలాహలంగా ఉండేది . రాత్రుళ్ళు ఆరు బయట నవ్వారు, మడత మంచాలపై పొడుకుని మామయ్యా చెప్పే కధలు వింటూ, ఆకాశం వైపు చూస్తూ నిద్రలోకి జారుకోవటం..అదొక మధురానుభూతి. మా వేసవి సెలవులు ఏంతో సందడిగా సాగేవి.
“ఎన్నో సంవత్సరాలు అయిందిరా మనం కలిసి. కనీసం మన పిల్లలకు ఒకరికి ఒకరు తెలిదు. ఈసారి క్రిస్మేస్ హాలిడేస్ కి ఇండియా వెళ్దాం. నువ్వేం చేస్తావో నాకు తెలీదు.” , మంకు పట్టు పట్టాను. దాని పలితమే ఈ సన్నాహాలు.
భారీ ఎత్తున షాపింగ్ చేసాను. పిల్లలకు, అన్నయ్యకు , వదినకు అందరికి గిఫ్ట్స్ కొన్నాను. నేను పిల్లలు ముందు వెళ్ళాము . ఈయనకు ప్రాజెక్ట్ డెలివరీ ఉండటంతో పది రోజుల తర్వాత వస్తారు. అమ్మ నాన్న కళ్ళలో ఆనందం.
అన్నయ్య కుటుంబాన్ని రిసీవ్ చేసుకోవటానికి మేమందరం ఎయిర్పోర్ట్ కు వెళ్ళాం. అన్నయ్యను చాలా సంవత్సరాల తర్వాత చూస్తుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆనందమూ, దుఃఖము కలగలిసిన భావోద్వేకం.
“జర్నీ బాగా జరిగిందా?”, వదినను పలకరించి అన్నయ్య చేతిని పట్టుకున్నాను.
“లావయ్యవురా, పొట్ట కూడా వచ్చింది”, నవ్వుతూ అన్నాను.
“ఎన్నాళ్ళకు…”, అన్నయ్య కౌగిలించుకున్నాడు. వాడి కళ్ళలోనూ సన్నటి తడి.
ఇల్లంతా సందడే సందడి. అమ్మ ఏవేవో వండిపెట్టాలని హైరానా పడిపోతుంది. మనవలు, మనవరాళ్ళు పరాయి దేశంలో పుట్టి పెరిగారు, వాళ్ళకు ఎక్కడ ఏ ఇబ్బంది కలుగుతుందోనని నాన్న కంగారు. ఇంటికి చుట్టాలోచ్చినట్టుంది అమ్మ నాన్నలకు.
“మీ అన్నయ్య అంటుంటే ఏమో అనుకున్నాను. భానుకి అన్నీ మీ పోలికలే. మేనత్త పోలికలు”, వదిన తన కూతుర్ని చూస్తూ అంది.
“నా బంగారు తల్లి”, మురిపెంగా ఎత్తుకుందామని చేతులు జాపాను. కొత్త వారిని చూసి భయపడినట్టు ఏడుపు లంకించుకుంది.
“అత్తమ్మ…మనం ఫోటోలో చూసామే… కంప్యూటర్ లో మాట్లాడాము..ఆ అత్తమ్మ”, వదిన చెపుతోంది.
“నీకోసం నేను ఏం తీసుకొచ్చానో తెలుసా…”, భానుని ఆకర్షించటానికి ప్రయత్నిస్తుంటే , మనసు పరిపరి విధాల ప్రశ్నించింది.
ఫోటోలతో బంధాలు ఏర్పడతాయా ? VOIP మాటలలో ఆత్మీయత వినిపిస్తుందా? మనిషితో బంధానికి స్పర్శ ఎంతో ముఖ్యం. అందులోనూ పిల్లలను ఎత్తుకుని ముద్దుపెట్టుకోవటం, వారితో ఆడి పాడటం చేస్తేనే ఆ అనుబంధం ఏర్పడుతుంది.
నేను అన్నయ్య చెరో దేశంలోకి చేరాక, మొదట్లో వారం వారం పలకరించుకునే వాళ్లము. వారం నెలలుగా ఎప్పుడు మారిందో మా ఇద్దరికీ తెలీనేలేదు. ఆ తర్వాతర్వాత పండగలకు, పుట్టినరోజులకు, పెళ్లి రోజులకు శుభాకాంక్షలు చెప్పుకోవటం వరకే పరిమితమయ్యాము. ప్రతీ రోజు మైళ్ళ మైళ్ళు డ్రైవ్ చేసి ఆఫీసులకు పరుగులుపెట్టటం. అలసిన దేహాలతో, తలపులతో సాయంత్రం గూటికి చేరటం. వీకెండ్ ఇంటిపని, వంట పని, పార్టీల హాజరు. మొత్తానికి యంత్రాల్లానో, మరమనుషుల్లానో తయారయ్యాం. జీవితంలోని సున్నితత్వాన్ని ఎక్కడో పడేసుకున్నాం. వారం వారం అమ్మ నాన్నలకు ఫోన్ చేసినప్పుడు, “అన్నయ్య కబుర్లేంటి” అని అడగటం వరకే పరిమితమయింది మా తోబుట్టువుల సంబంధం. ఇక మా పిల్లల పరిచయాలు skype పరిమితాలే.
కలవటమయితే కలిసాం కానీ కుదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకున్నదే లేదు. మనసు విప్పి మాట్లాడుకున్నదే లేదు. కాలం విసిరేసిన దిక్కులలో ఎవరికి వారం ఇరుక్కుపోయాం. మా బంధుత్వం కమ్యూనికేషన్ గ్యాప్ లో ఎంతగా నలిగిపోయిందంటే…ఇద్దరమూ గంభీ
ఎన్నోసార్లు అన్నయ్యను మిస్ అయ్యానని చెప్పలేకపోయాను. రిసేస్సన్ టైంలో అభద్రతా భావంతో నలిగిపోయినప్పుడు, ఇళ్ళు కొనుక్కుందామనుకున్నప్పుడు సలహా సంప్రదింపులకు మనవారు లేకపోవటం, ఉద్యోగం మానేయ్యలా వద్దా అని నిర్ణయించుకోలేనప్పుడు……
“ఎలా ఉంది లైఫ్?”
“going on and on. It’s hectic most of the times”, మా ఇద్దరి ప్రశ్నలు సమాధానాలు ఇవే.
“మంచి ఫ్రెండ్స్ ఉన్నారా?”, అడిగాడు అన్నయ్య.
“ఉన్నారు….వీకెండ్ పార్టీలు, పిక్నిక్స్, స్లీప్ ఓవర్స్ కామన్. వీకెండ్ హాయ్ బాయ్ ఫ్రెండ్స్ కు కొదవే లేదు. కష్టంలో ఆదుకునే నేస్తాలు ఒకరిద్దరు లేకపోలేదు. నేను నడుం నొప్పితో మంచానికి అతుక్కుపోయినప్పుడు, పిల్లలను తీసుకెళ్ళి రెండు రోజులు వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. కాకపోతే ఎదో మొహమాటపు తెర ఎప్పుడూ ఉంటుంది. ఇబ్బంది పెడుతున్నామే అనే సంశయం వీడదు. “, చెప్పాను.
“ya, I Know… మనసును హత్తుకునే నేస్తాలు కరువే ఈ రోజుల్లో . కష్టం సుఖం పంచుకునే స్నేహాలకు తీరికేది? “, అన్నయ్య స్పందన అదే.
నెల రోజులు ఎలా గడిచిపోయాయో తెలీనే లేదు. తిరుపతి మెట్లు, షిరిడి మొక్కు తీరాయి. చుట్టాలు, భోజనాలు, పలకరింపులు అయ్యాయి. అక్కడో రోజు ఇక్కడో రోజు ఎక్కడా ఉన్నట్టే లేదు. అమ్మనాన్నలపై బెంగే తీరలేదు, అన్నవదినలతో కబుర్లు చెప్పినట్టే లేదు. పిల్లల ముఖపరిచయాలు అయ్యాయి అంతే. అంతలోనే తిరుగు ప్రయాణం. అమ్మ పిండి వంటలు వండుతూ చీరకొంగుతో కళ్ళు ఒత్తుకుంటుంది. నాన్న బజారు పనులంటూ, సూటుకేసు బరువులంటూ తన బెంగను మా కంట పడనీకుండా తిరుగుతున్నారు.
“మరోసారి తప్పక కలుద్దాం. ఇలాగే ఇద్దరం ప్లాన్ చేసుకుని వద్దాం”, ఒకరికి ఒకరం చెప్పుకుని వీడ్కోలు తీసుకున్నాం.
* ******************************
“నాన్నకు హార్ట్ స్ట్రోక్, వెంటనే బైపాస్ చెయ్యలంట”, అన్నయ్య ఫోన్. నాకు నోట మాట రాలేదు.
“పానిక్ అవ్వకు. చెప్పేది విను…ఇద్దరం ఒకేసారి వెళ్ళటం కన్నా ఒకరి తర్వాత మరొకరు వెళ్దాం. ఆపరేషన్ కాబట్టి ముందు నేను వెళ్తాను. నా లీవ్ అయ్యే నాటికి నువ్వు వద్దువు”, అన్నయ్య డ్యూటీలు డివైడ్ చేసాడు.
“ఎమోషనల్ అవ్వకుండా ప్రాక్టికల్ గా ఆలోచించు”, మావారి సలహా, ఊరడింపు.
ఆపరేషన్ రోజున ప్రతీ అరగంటకు ఫోన్ చేస్తూనే వున్నాను. ఏవో భయాలు, మరేవో ఊహలు నన్ను నిలువనివ్వలేదు. అప్పటికప్పుడు అన్నీ వదిలేసి వెళ్లిపోవాలనిపించింది. తల్లిదండ్రుల బాగోగులు దగ్గరుండి చూసుకోలేని జీతాలు, జీవితాలు. ఏ తీరాలకు పయనిస్తున్నాం, ఏ దరికి చేరుకుంటాం…….. ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నన్ను అన్నయ్య ఫోన్ రక్షించింది, “నాన్న బాగానే వున్నారు.”
నాన్న హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి నేను వెళ్ళాను.
“థాంక్స్ రా “, అన్నయ్య కళ్ళలోకి చూడలేక నేల చూపులు చూస్తూ చెప్పాను. అసలు థాంక్స్ ఎందుకు చెప్పాను? కృతజ్ఞతా లేక అపరాధ భావనా? ఏమో…. ఆలోచించాలంటేనే భయమేస్తుంది.
నాన్న కొద్దికొద్దిగా కోలుకుంటున్నారు.
“పిల్లల్ని వదిలి వచ్చావ్. అల్లుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో. నాన్నను నేను చూసుకుంటాను . నువ్వు బయల్దేరమ్మా”, అమ్మ ఎక్కడ లేని ధైర్యాన్ని తెచ్చుకుంది.
రిటర్న్ టికెట్ confirm చేసేలోపే, నాన్న గుండె రెండోసారి మొరాయించి మమ్మలందరినీ వదిలి వెళ్ళిపోయింది. నాన్న లేని లోకంలోకి నన్నెవరో బలవంతంగా విసిరేశారు. హటాత్తుగా పదేళ్ళు పైబడినట్టు కుంగిపోయి, లేని పెద్దరికాన్ని తెచ్చిపెట్టుకుని గాంభీర్యాన్ని ఒలకబోస్తున్నాను. ప్రవాసీ జీవితం నేర్పించిన నిబ్బరం నన్ను ఈ పరిస్థితిలో ఆదుకుంది. అమ్మను పొదిగిపట్టుకుని జరగాల్సిన ఏర్పాట్లన్నీ జరిపించాను.
ఈయన, పిల్లలు, అన్నయ్య కుటుంబం ఆఘమేఘాలపై వచ్చి వాలారు. షాక్ లో నుంచి తేరుకోకమునుపే అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయి. బంధువులు, స్నేహితులు ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయారు.
అమ్మ బేలచూపులు ఒంటరితనాన్ని, దిగులుని మోస్తున్నాయి.
“అమ్మను నాతో తీసుకువెళ్తాను. కాస్త కుదురుకున్నాక నీ దగ్గరకు వస్తుందిలే అన్నయ్య. నువ్వేమంటావు?”, అన్నయ్యను అడిగాను.
“అమ్మను అడుగుదాంరా. అమ్మకు ఎక్కడికి రావటానికి ఇష్టపడితే అక్కడికే తీసుకువెల్దాం”.
“నేనెక్కడికి రాలేను. ఈ ఇంట్లో మీ నాన్న జ్ఞాపకాలు నాకు తోడుగా వుంటాయి. అక్కడకు వచ్చి ఉండలేను”, అంది అమ్మ.
“నిన్ను ఇలా వదిలి వెళ్ళలేం అమ్మా. నీకు మా ఇద్దరిలో ఎవరి దగ్గర స్వతంత్రంగా వుంటుందో అక్కడికే వెళ్ళు. ప్లీజ్ అమ్మా..”, అన్నయ్య బ్రతిమాలాడు.
అమ్మ ఏ మాట చెప్పలేదు. నేను అమ్మను బతిమాలి బుజ్జగించి నాతో తీసుకొచ్చాను.
హటాత్తుగా ఇండియా వెళ్ళటంతో చాలా పని పెండింగ్ లో ఆగిపోయింది. వచ్చీ రాగానే అమ్మను ఒక్కదాన్నే ఇంట్లో ఒదిలేసి నేను, మావారు ఆఫీసులకు, పిల్లలు స్కూల్ కు పరుగులు తియ్యాల్సి వచ్చింది.
లంచ్ చేస్తూ అమ్మకు ఫోన్ చేసాను. “భోజనం చేసావా అమ్మా ?”, అడిగాను.
“ఇంకా లేదు, తింటానులే”, అమ్మ గొంతు బొంగురుగా పలికింది. ఎంత సేపట్నుంచి ఏడుస్తూ ఉందో!? తింటున్న సాండ్విచ్ చేదుగా తగిలింది, మరింక గొంతు దిగలేదు.
అమ్మ తన దిగులును మరిచిపోయేలా చెయ్యాలని, క్రమం తప్పకుండా ప్రతీ వారాంతరం ఎక్కడికో ఒక చోటుకు వెళుతున్నాం. రానని అమ్మ గొడవ చేస్తున్న బలవంతంగా తీసుకు వెళుతున్నాం.
ఓ రోజు ఎదో మాటల్లో, “మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా దాటిపోతే అంతే చాలు”, అంది అమ్మ.
“అమ్మా….ప్లీజ్ “, నా కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి.
“ఎవరినీ తప్పుపట్టట్లేదు తల్లి. మీ జీవితాలే అంత. ఆనాడు పల్లె నుంచి పట్నానికి వలస వచ్చాం మేము. ఈనాడు పరాయి దేశానికి చేరారు మీరు. ఇదంతా అభివృద్దిలో భాగమే. దాని ముల్యమూ ప్రియమే. ఇదొక ప్రవాహం, ఈదనని ఆగితే మునిగిపోతాం.”, అమ్మ నా తమ నిమురుతూ అంది.
అమ్మది విశాల హృదయం, నాదేమో ఇరుకు దినచర్య . అమ్మను తీసుకొచ్చి ఇక్కడ పడేసాను. నా సాన్నిహిత్యాన్ని, ఓదార్పును అందించిందే లేదు.
అమ్మ ఇండియా వెళ్ళిపోతానని గోడవచేసింది. అన్నయ్య ఏమి చెప్పాడో, తన మాట కాదనలేక అమెరికా వెళ్ళింది.
అమ్మ అన్నయ్య దగ్గర వున్న రోజుల్లో, ఒక ఆస్తి వ్యవహారమై నేను ఇండియా వెళ్ళాల్సి వచ్చింది. పెదనాన్న కుతురింట దిగాను. చిన్నప్పుడు కలిసి పెరగటంతో తన దగ్గర నాకు చనువు. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఆదరంగా నన్ను ఆహ్వానించినా, నేనున్న ఆ పది రోజులు వారు ఎంత ఇబ్బంది పడ్డారో నేను కళ్ళారా చూసాను. నేను ఎంత వారించినా వినకుండా అక్క ఉదయాన్నే లేచి వంట చెయ్యటం, నేను వున్నానని ఆఫీసు నుంచి తొందరగా ఇంటికి రావటంతో ఆఫీసు పని పుర్తవ్వక రాత్రుళ్ళు లాప్ టాప్ ముందేసుకుని కూర్చునేది.
కన్నవారు లేని స్వదేశం పరాయిదేశమే అన్న విషయం అనుభవంలోకి వచ్చింది. సంవత్సరానికో, రెండేళ్ళకో చుట్టపు చూపుగా వచ్చి వెళుతుంటే బంధాలు ఎలా నిలుస్తాయి? పైగా పరుగుల జీవితాలలో……
అమ్మ అన్నయ్య దగ్గర నాలుగు నెలలు ఉన్నాక ఇండియా వెళ్ళింది. నిజం చెప్పాలంటే, ఇండియా వెళ్లాకే అమ్మ మనుషుల్లో పడింది. రెండు పూటలా గుడికి వెళ్ళటం దినచర్యగా మలుచుకుంది. పూజలు, భజనలు అంటూ ఆద్యాత్మికంగా ఊరట వెతుక్కుంటుంది .
మా ఇరుకు గదుల్లో , ఊపిరిసలపని పనుల్లో అమ్మ ఇమడలేకపోయింది……కాదు, కాదు అమ్మకు స్థానం లేకుండా పోయింది అని నేను, అన్నయ్య బాధపడుతుంటే…. ఓ రోజు కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడుతూ , ” ఆ రోజుల్లో మీ నాయనమ్మ, తాతయ్యను వచ్చి మనతో ఉండమంటే, గాలిసోకని ఆ పట్నపు నివాసాలు మావళ్ళ కాదన్నారు. అలాగే ఈ పరాయిదేశపు సౌఖర్యాలలో మేము ఇమడలేము. తరాల అంతరం ఇంతే”, అంది అమ్మ.
అమ్మ ఎంత సులువుగా చెప్పేసిందో. ఈలెక్కన మా తరువాతి తరాల అంతరం లెక్క ఎంత పెద్దదవుతుందో?
నాన్న సంవత్సరీకం వెళ్ళిన కొద్ది కాలానికే మరో పిడుగు మా జీవితాలపై పడింది. ప్రేమించటం నేర్పించిన అమ్మ, సంస్కారాన్ని నూరిపోసిన అమ్మ తన ప్రయాణాన్ని ముగించుకుని నాన్న దగ్గరకు వెళ్ళిపోయింది.
అమ్మను కోల్పోయిన బాధలో నుంచి నేను బయటపడలేకపోయాను. ప్రవాసీ జీవితం నేర్పించిన ఏ లైఫ్ స్కిల్ నన్ను ఆదుకోలేకపోయాయి. నిబ్బరం, స్వతంత్రత, ధైర్యం ఏదీ నన్ను మానసికంగా కుంగిపోకుండా ఆపలేకపోయాయి. భారతీయత అలవరచిన సున్నితత్వం, బాంధవ్యం నన్ను వీడలేదు.
ఇంకెప్పటికీ అమ్మ ఒడిలో తలవాల్చి , అమ్మ చెప్పే వచనాలు వినలేను…… అమ్మనాన్నలతో ఇంకొన్ని రోజులు గడిపి వుండాల్సింది. ఇంకొన్ని కబుర్లు, ఇంకొన్ని కౌగిళ్ళు, ఇంకొంత ఊరట, ఇంకొంత ఆసరా మిగిలే ఉన్నాయి.
******************************
“Mom, where are we traveling on coming holidays?”, అడిగాడు చందు.
ఒకప్పుడు సెలవులంటే ఇండియా ప్రయాణంమే. ఇప్పుడు ఎక్కడికైనా ఇట్టే ఎగిరిపోగలం. అవును మరి, ప్రపంచీకరణ ప్రపంచాన్ని పల్లెటూరును చేసేసిందిగా!!??
మధి పుటలలో దాగున్న నెమలీక బయటకు వచ్చి మనసులోని మట్టివాసనను కెలికింది. స్వదేశం, పుట్టిల్లు స్మృతులలో మిగిలిపోతాయా?…… ప్రవాసీలు అక్కడి వారూ కాదు, ఇక్కడి వారూ కాదు.
“Dad is planning for a trip”, పరధ్యానంగా సమాధానం చెప్పాను.
ఇండియాలో ఎవరున్నారు? ఎవరింటికి వెళ్ళి ఎవరిని ఇబ్బంది పెడతాం? అనే సందేహాలు అసంపూర్ణంగా వదిలెయ్యకుండా….అమ్మ నాన్న ఉన్న ఇంటిని అలాగే ఉంచేయ్యాలి, ఎవరికీ అద్దెకు కూడా ఇవ్వవొద్దు. ఈ సంవత్సరం కాకపోయినా, వచ్చే ఏడాదన్నా….పోనీ కుదిరినప్పుడు మేమందరం ఆ ఇంట్లో కలవాలి. మామయ్య, అత్తమ్మ, పిన్ని, బాబాయ్…. పలకరించటానికి ఎందరో వున్నాయి.
తీగ….ఓ సన్నటి తీగ ఎప్పుడూ వేలాడుతూనే వుండాలి. ఆ తీగే తెగిపోతే, మనుషులమనే స్పృహే మర్చిపోతాం. ఇప్పటిదాకా అమ్మనాన్న వారధిగా నిలిచిన మా బంధాన్ని, ఇప్పటి నుంచీ నేనే నిలుపుకోవాలి.
గూటిని వదిలి ప్రవాసీలమైనా రెక్కల్లో బంధం లేకుండా పోతుందా? బంధాన్ని భద్రపరుచుకునే ప్రయత్నం చెయ్యాలనే ఈ నా ఆలోచన అన్నయ్య కు చెప్పాలి, తప్పకుండా ఒప్పుకుంటాడు. ఎంతైనా ఒక గూటి పక్షులము…….
simple story but touched the heart and mind..Hrudayam nizanga bharamaindi. Liked it..
Thank you Sundar reddy garu
పరయీదేసంలొ బ్రతుకు పందెంలొ మరచిపొయిన కన్నిళ్ళు మరలా గుర్తుకుతెచ్హినందుకు చాలా థాంక్స్
సురేంద్ర గారు, కన్నిరనే సున్నితత్వం ఇంకా మనలో వుంది. ధన్యవాదాలు.
ఇప్పుడన్నీ గూడు చెదిరిన పక్షులే.ఇండియాలో వున్నా తల్లి తండ్రుల్ని కోల్పాయక మా పరిస్థితి కూడా అదే. ఊరికి వెళ్ళాలంటే ఎవరింటికి వెళ్ళాలి .ఇది అందరి ప్రశ్నే
నిజమే లింగా రెడ్డి గారు, ఇండియా లో పల్లెటుర్ల పరిస్తితి ఇంతే. ధన్యవాదాలు.
nijam gaa ee vaishayam alsisthee….. enthoo bhadha vesthundi…bhavishyathu andhakaram gaa kanipisthundi…
Srikanth garu@ life expands positively and negatively too. thank you
కథ బావుంది. నిజమే, పక్షికో గూడుగా ఉన్న ప్రవాసజీవితంలో ఇదివరకటిలా బంధాలు ఉండాలంటే కష్టమే. కానీ తమాషాగా తెనాలిలో విజయవాడలో నివాసమున్న అన్నా చెల్లెళ్ళమధ్య కూడా ఇంతేసి అగాథాలూ ఉన్నాయి. పక్క ఊరి దాకా ఎందుకు, పక్క పేటలో, పక్క వీధిలో ఉన్న తనవారితో కలవలేని పరిస్థితులున్నాయి. బంధాలు తెగిపోడం కేవలం దూరం వల్లనే లేదు, మనుషుల్లోనే ఉన్నదేమో. దాని సూత్రం పట్టుకోవడానికి లోపలికి తవ్వుకోవాలి.
ఎంత నిజం కదూ! మనుషులకు తెనాలి, విజయవాడ కుడా దూరమే.
తవ్వాలి తవ్వాలి…మనసు లోతుల్లోకి తవ్వాలి. నెవర్లు
కథ చాలా బాగుంది ప్రవీణా. చాలా బాగా రాసారు. అమ్మ నాన్న అంటూ అక్కడ లేకపోయాక ఆడపిల్లకి పుట్టింటికి వెళ్ళడానికి కూడ ఆలోచించవలసిందే. నిజంగా పరాయి దేశంలో ఉద్యోగరీత్యానో, వివాహబంధాల వల్లనో జీవితం గడపవలసి వస్తే ఎలాగో అలా ప్రయత్నం చేసి మనం విడిచి వెళ్ళిన ఊరిలో ఏదో ఒక గూడును ఏర్పరచుకోవాలి. కొత్తపాళీ గారు చెప్పినట్టు దూరం వలనకాదు, మనుషులు మానసికంగా సృష్టించుకున్న అగాధాలను పూడ్చటం ఎవరి తరం. ఆధునిక సాధనాలు ఎన్ని సమకూర్చుకున్నా వాటిని ఉపయోగిస్తూ సున్నితమైన మానవ సంబంధాలను నిలుపుకోవడానికి ప్రయత్నం చేయడం, దానికి కావలసినంత సమయం వెచ్చించలేనప్పుడు ఏం ప్రయోజనం.
Chala bagundi.
True emotions
చాలా బాగుంది… ఇది చదువుతుంటే తెలీకుండానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి… మీరు చెప్పింది నిజం. ఇక్కడి జీవితానికి అలవాటుపడటం వలన బంధాలు, ఆప్యాయతలు & ప్రేమలు కనుమరుగవుతున్నాయి. కావాలని చేయకపోయినా అలా జరిగి పోతున్నాయి.
Pramod garu, Amoga garu thx for responding.
chaala bagundi.. intha manchi telugu katha chadivi ennallyindo..
Loved the story, rather reality for just about everyone these days. I like fellow commentor @Kothapaali’s thoughts. It perhaps is all due to the distance from hearts rather than the physical distance…
ప్రవీణ గారు, మీ ‘వొక గూడు – కొన్ని పక్షులు’ కథ చాల బాగుంది. వలస వెళ్ళిన భారతీయులు స్వదేశానికి తిరిగి రావాలన్న కాంక్ష, అందరినీ కలుసుకోవాలన్న తాపత్రయం కనపడింది.
కొంత అసంతృప్తి. “అమ్మ నాన్న ఉన్న ఇంటిని అలాగే ఉంచేయ్యాలి” అన్న ఆ ఆకాంక్ష, ఇంటి ని ఎలా పరిరక్షించుకుంటారు(అద్దె కి ఇవ్వకుండా) అని స్పష్టం చేయలేదు. అంత కన్నా ఏం చెప్పాలో కూడా నాకు తట్టలేదు. కథ కి ఇదే ముగింపు కావడం వల్ల ఈ ఆలోచన నా మనస్సు లో ఉండిపోయింది.
ఈ విమర్శ ని మీరు సహృదయం తో స్వీకరించాలని మనవి!
గోపీనాథ్ గారు@ విమర్శలు ఏంతో అవసరం. Thank you for the thought.
ఇండియాలో అమ్మ నాన్న దగ్గరకు వెళ్లి నెల రోజులు ఉండగలం. వారు లేని పరిస్తిలొ ఎవరింటికి వెళ్ళగలం?
ఈ రోజుల్లో ఎవరి జీవితాలలో వారు బిజీ. చుట్టపు చూపుగా వెళ్లి రెండు రోజులు ఉండగలమే కాని, సెలవులని వెళ్లి ఎవరినీ ఇబ్బంది పెట్టలేం.
ఇల్లు అద్దెకు ఇవ్వకుండా వుంచేసుకుంటే, సంవత్సరానికో పోనీ రెండేళ్ళకో ఆ అన్న చేల్లిల్లు ఆ ఇంటికి వేల్లగలరు, అందరిని పలకించి రాగలరు . కొంత లో కొంత చుట్టరికాలు, బందాలు ఉంటాయనే ఆశ.
మీరన్నది కరెక్టే! ఇంటిని ఎలా పరిరక్షిస్తారు?
ఒక ఆలోచన…..ఇంటి తాళం దగ్గరలో వున్నా బంధువులకు ఇస్తే, వారు కొన్ని నెలలకు ఒక సారి క్లీనింగ్ కంపెనీ వారిని పిలిచి శుభ్రపరచ వొచ్చు.
ఇండియా లో వున్నా ప్రాపర్టీ ని మేనేజ్ చేసే కంపెనీలు ఇప్పుడు చాలా వచ్చాయి. Nowadays there are companies or people who can collect rent every month and maintain the house too.
అన్న చెల్లెలు ఒక రెండేళ్లకు వచ్చారే అనుకోండి..ప్రతి సందులోను ఎన్నో కర్రి పాయింట్స్ ఉంటున్నాయి. వంట పెద్ద సమస్య కాదు.
ఇలా ఆలోచిస్తూ రాసిన ముగింపు ఇది.
నాకు ఇలాంటివి(ఇండియా లో వున్నా ప్రాపర్టీ ని మేనేజ్ చేసే కంపెనీలు ఇప్పుడు చాలా వచ్చాయి) తెలియనే లేదండీ!:).
మీ ఆలోచన ని పంచుకున్నందుకు ధన్యవాదాలు!
కిరణ్ గారు@ నేవర్లు
జ్యోతి గారు@ కొత్తపాళీ గారు అన్నది నిజం. దూరం మాత్రమె కాదు మన మనసులు, మనుష్యలు కుడా కారణమే! మన Priorities మారిపోతున్నాయి. Thank you.
ప్రవీణ గారూ మనషులే దూరమయ్యారో లేక మనసులే దూరమయ్యాయో కాని తీరం చేరలేని నావలో ఉన్నాం. కథ చాలా బావుంది.
బాగుందండి ముగింపు .
ధన్యవాదాలు జ్యోతిర్మయి గారు, రాధిక గారు
మనసుకి హత్తుకునేలా ఉందండి కథనం… కథ బాగుందండి.
మనసెందుకో స్థబ్దమైపోయింది
చాట్లో కలిస్తే గుర్తుచేయండి వివాంగా మాట్లాడతా
Chaala baaga raseru Praveena garu! Chala incidents, dialogues nenu annatte, vinnatte unnayi. All living abroad like me can relate to this story very well. Liked your ending.
తృష్ణ గారు, జాన్ హైడ్ కనుమూరి గారు @ ధన్యవాదాలు.
సుభద్ర గారు @ ఈ కధ మనలో నుంచే వచ్చింది.That’s a nice response from you, thank you.
katha chala baga rasarandi
Thank you Achanta.V. Subramanyam garu.
Abbabba Champesaarandi… two hours cinema chusina intha kikku raledu.Konni situations Kannellu teppinchayi nijamga. premalu aapyayathalu konukkone rojulivi kani amma nanna kosam tapana sontha vurilo illu vunchukovalanna aaratam naaku chaala nachayi. keep it up.
“two hours cinema chusina….” @
Thank you Srinivas garu.
simple and nice. ekkado kadilinchindi. ప్రేమించటం నేర్పించిన అమ్మ, సంస్కారాన్ని నూరిపోసిన అమ్మ . idi inkaa nannu bagaa kadilinchindi .
it is a very good epic . hridyanga undi manaveeya viluvallo vastunna marpulni chooparu
ప్రతీ ఇంటి కధ నాకు కనిపించింది , మీరు రాసిన ఈ పుట లో..
చాల బాగుందమ్మా.. థాంక్స్ ..
నేను ఇండియా లోనే వున్నా.. నాకు బాగా తగిలింది
మనసుకి హత్తుకునేలా ఉందండి కథనం… కథ బాగుందండి.
#VeeraReddyKesari