కవిత్వం

పద”బంధాలు”

ఏప్రిల్ 2015

కొన్ని పదాలకు
చక్కెర కారుతుంది చిట్టితల్లీ!
చిన్నప్పటి యాది నంత
తియ్యగా చప్పరిస్తాయి

కొన్ని పదాల గురించి
గుండెకి మాత్రమే తెలుసు
నోటి నుండి రాలినపుడు
మనమంతగా పట్టించుకోవద్దు

కొన్ని పదాలు
చెమటని ముద్దాడినప్పటి సంగతి
నీకు తెలియదు
నువ్వింకా చిన్నపిల్లవి

కొన్ని పదాలు
బతికించడానికి తోడొస్తాయి చిట్టితల్లీ
నేను ఒంటరిని ఐనప్పుడు
నాక్కొంచెం శ్వాసని నింపుతాయి

కొన్ని పలుకులు
చెర్వుకట్ట మీది గాలులై
వేదనల్ని మోసుకుపోతాయి చిట్టితల్లీ
మల్లీ జ్ఞాపకమొచ్చినపుడు కూడా
పరిమళముంటుంది

చిట్టీ…కొన్ని పదాలు
మనల్ని శుభ్రం చేయడానికి కలుస్తాయి
రక్తసంబంధాలని బాహ్యంగా
కుట్టిపెడతాయి

కొన్ని పదాలు
నువు నమ్మవు…గుండెను పిండుతాయి
గుర్తొచ్చిన క్షణాన
బతికున్నందుకు బాధ పుడుతుంది

కొన్నిపదాలు
కడుపుల కెలుకుతాయి
గడిచిన కాలం మీద
నడిచిన పాదాలను నమ్మబుద్ది కాదు

చిట్టితల్లీ…కొన్ని పదాలు
దుఃఖానికి చిల్లులు పెడతాయి
ఏ ఆయుధాలు చేయని
నాశనం చేసి మనసును పూడుస్తాయి