కవిత్వం

సెలయేరు

ఏప్రిల్ 2015

నువ్విలాగే పారుతూ ఉండు
నీ వద్దకు వచ్చి దోసిళ్ళతో పలకరిస్తాను

ఈ ఎదపై నువ్వు దాటిన గుర్తులు
లోపలి పొరల్లోనికి ఇంకిన చెమ్మ
గలగల లాడే పాటలాంటి నీ మాటలు

ఇంకేం కావాలి నేను చిగురించడానికి.

ఈ చిల్లుల సంచిలో నిన్ను దాచలేక
ఉండిపొమ్మని అడగలేను

ఎండిన ఆకులనో కొమ్మలనో ఇచ్చి వెళ్తావు
అవి ఇప్పటికీ నాతో మాట్లాడుతుంటాయి

చల్లగా ముద్దాడి పోతూ
ఈ రాళ్ళ కుప్పను తిరిగి ఏమీ అడగవు.

నిశ్చలమైన తీరాన్నై
నిన్ను పారనివ్వడం తప్ప ఏమీ చేయలేను