ఈ వారం కవి

ఒక స్పష్టమైన detachedness కనబడుతోంది

ఫిబ్రవరి 2013

ఈ వారం కవి’ నారాయణస్వామి వెంకటయోగి ….తెలుగు కవిత్వంలో మూడు దశాబ్దాల కదలికలకు ప్రత్యక్ష సాక్షి. కల్లోల దశాబ్దం నించి సంక్లిష్ట దశాబ్దం దాకా, సంక్లిష్ట దశాబ్దం నించి ప్రపంచీకరణ అనంతర దశాబ్దం దాకా అనుభవాల్నీ, జ్నాపకాల్నీ  తన అక్షరాల సందుకలో పొందు పరచిన కవి. మంచి చదువరి. లోతయిన బుద్ధి జీవి.

 

 

కలల కల్లోల మేఘం నించి ఇప్పటి మీ కవిత్వం దాకా మీ ప్రయాణం గురించి ఏమంటారు?

కల్లోల కలల మేఘం 1992 లో వచ్చింది. అప్పుడు నేను విరసం లో చాలా చురుగ్గా పనిచేసే వాణ్ణి. విరసం కార్యవర్గ సభ్యుడిని. ఉద్యమమే ఉఛ్వాస నిశ్వాసాలుగా బ్రతికిన రోజులవి. కవిత్వం సాహిత్యం విప్లవోద్యమానికి ఉపయోగపడాలని, ప్రజల చేతిలో ఆయుధం కావాలని కదం తొక్కిన రోజులవి. అందుకే మీరు కల్లోల కలల మేఘం లోని దాదాపు ప్రతి కవిత లో ఆ నిబద్ధత చూస్తారు. కల్లోల కలల మేఘం లోని కవితలు 1984 – 1992 మధ్య రాసినవి. అప్పుడప్పుడే అస్తిత్వ వాదాలు తలెత్తి ఊపిరి పోసుకుంటున్న సందర్భం. విప్లవోద్యమ సందర్భానికీ, అస్తిత్వ వాదాల సందర్భానికీ స్పందించి రాసిన కవితలున్నాయందులో. కానీ మాకప్పుడు విప్లవోద్యమమే ప్రధాన దృష్టి. అందుకే ఉద్యమం లోని విభిన్న ధోరణుల వాదోపవాదాల గురించి  రాసిన కవితలు కూడా కల్లోల కలల మేఘం లో ఉన్నాయి. ఇది వస్తువుకి సంబంధించింది. ఇక రూపం విషయానికొస్తే – అనేక ప్రభావాలనుండి బయటపడుతూ సొంత గొంతుక వెదుక్కుంటున్న పరిణామం మీకందులో కనబడుతుంది. అప్పటికి, పెద్ద పెద్ద సంస్కృత సమాసాలతో, క్లిష్తమైన పద బంధాల పదచిత్రాలతో రాయడం ఒక గొప్ప విషయంగా అనుకున్న సందర్భం అది. అందుకే చాలా కవితలు ఆ ప్రభావ ఛాయల్లో కనబడతాయి.

అయితే భిన్నంగా రాయాలి,  కొత్తగా చెప్పాలి అన్న తపన, 1988 నుండీ రాసిన కవితల్లో అగపడుతుంది. కల్లోల కలల మేఘం లో కవిత్వమే లేదని కొట్టి పారేసిన వాళ్ళూ ఉన్నారు, పదునైన విమర్శతో ప్రేమతో సమర్థించిన అఫ్సర్ లాంటి వారూ ఉన్నారు – ఫ్రీ వర్స్ ఫ్రంట్ అవార్డ్ ప్రకటించిన సహృదయులూ ఉన్నారు. అయితే ఇవాళ్ళ వెనక్కి చూసుకుంటే, మళ్ళీ కల్లోల కలల మేఘం ప్రచురించాల్సి వస్తే నేనే నిర్ద్వంద్వంగా కొన్ని కవితలని తీసేస్తాను (ముఖ్యంగా విప్లవోద్యమ వాదోపవాదాల మీద రాసినవి). అప్పుడప్పుడనిపిస్తుంది కూడా – ఇవి రాసింది నేనేనా అని. 1992 నుండీ 2000 వరకూ కూడా కవిత్వం రాసాను. అయితే చాలమంది లాగా నేను విపరీతంగా రాసే కవిని కాదు. పద్యం చాలా రోజులు లోలోపల తిరిగి తిరిగి,  మరిగి మరిగి నాలోంచి బయటికొస్తుంది. వస్తే ఒకే సారి వెల్లువలా కొన్ని పద్యాలొస్తాయి. రాకపోతే యేండ్ల తరబడి రాయనే రాయను. అదో మనసికావస్థ. కానీ ఎప్పుడూ దుఃఖం లోలోపల సుడులు తిరుగుతూ ఉంటుంది. ఒక సౌఖ్యానికీ, విలాసానికీ , ఉదాసీనతకీ ఎప్పుడూ లోను కాలేదు – complacency కి తావివ్వలేదు. పొరలు పొరలు గా అలలు అలలు గా పద్యాలు లోపల తిరుగుతూ ఉంటాయి. ఒకటే తపన ఎప్పుడూ – కొత్త వస్తువుని ఎట్లా పట్టుకోవడం – కొత్తగా ఎట్లా చెప్పడం – ఇదే తపన.

1992 నుండి 1997 దాకా చాలా పరిణామాలు చోటు చేసుకున్నయి. నా జీవితంలో, నేను ఊపిరిగా పీల్చిన ఉద్యమాల్లో , నేను ప్రాణంగా కన్న మిన్నగా భావించిన స్నేహ సంబంధాల్లో చాలా మార్పులొచ్చినయి. కొన్ని నేను తట్టుకోలేక పోయాను – కొత్తగా వస్తున్నఆలంబనలని బలంగా స్వీకరించి స్వంతం చేసుకోలేకపోయాను. యేదో కోల్పోయిన అనుభూతి. ఆ అనుభూతిని వ్యక్తం చేస్తూ పద్యాలు రాసాను – కానీ అవి ఎక్కడో పారేసుకున్నాను. 1998 లో కేవలం మూడే మూడు పుస్తకాలతో అమెరికా వచ్చాను. శ్రీ శ్రీ మహా ప్రస్థానం, అజంతా స్వప్నలిపి, తిలక్ అమృతం కురిసిన రాత్రి. అంతే. నా కల్లోల కలల మేఘం కూడా వెంట తెచ్చుకోలేదు. అమెరికా లో నా ప్రతి వంటరి క్షణంలోనూ  ఈ మూడు పుస్తకాలే తోడుగా నిలిచాయి. ఇక్కడికొచ్చాక, ఇక్కడ తెలంగాణ కోసం కృషి చేస్తున్న వారితో పరిచయాలు –. రచ్చబండ మీద మిత్రులతో సాహిత్య రాజకీయ సంభాషణలు – ఆయా సంభాషణల్లో నా గొంతు వినిపించాను. అడపా దడపా ఒకటో అరో పద్యాలు – నన్నట్లా సజీవంగా ఉంచినయి. అయితే 1999 మే లో మారోజు వీరన్న బూటకపు ఎన్కౌంటర్ లో అమరుడయ్యాడన్న వార్త అశనిపాతం లా తాకింది. పెద్ద షాక్ . యెడతెగని దుఃఖం – ఇప్పటికీ – బహుశా ఎప్పుడూ పొంగి పొర్లుతూనే ఉంటుందనుకుంటా. మళ్ళీ కవిత్వం రాయాలి అన్న తపన ఎక్కువైంది. 2001 లో శివారెడ్డి నవీన్ శివశంకర్ గార్లు తానా సభ ల కొచ్చి మా యింటికొచ్చారు. నా పద్యాలు చూసి శివారెడ్డి సార్ కౌగలించుకుని ” నాన్నా నువ్వింకా బతికే ఉన్నావు” అన్నారు. “అమెరికా జీవితం గురించి రాయి”  అన్నారు. కానీ అదేమిటో,  ఇక్కడికి వచ్చి 14 యేండ్లయినా ఈ జీవితం నాది కాదనే అనిపిస్తుంది. నా ప్రాణమంతా అక్కడ నా తెలంగాణ పల్లె మీదే  తొక్కులాడుతుంది. యెప్పుడూ ఈ జీవితంతో నేను identify కాలేనేమో?

2005 లో యేడేళ్ల తర్వాత మొదటి సారి మళ్ళీ యిండియా వెళ్ళాను. అది నాకు పెద్ద జోల్ట్.  బ్రహ్మాం డమైన కుదుపు.  నేను 1998 లో వదలి వచ్చిన మన దేశం కాదది – నా హైదరాబాదు కాదది – అంతా కొత్తగా ఉంది. యేడేండ్లలోనే నేను నా మాతృభూమికి పరాయివాణ్ణయిపోయాను. గ్లోబలైజైషన్ లో సింగారించుకున్న నా హైదరాబాదు నన్ను చూసి  అంజాన్ కొట్టింది. నా వాడకట్టు అవ్వ “మల్లెప్పుడొస్తవు బిడ్డా”  అని గుడ్ల్లల్ల నీళ్ళు కుక్కుకుంది. మా యింటి వెనక నా చిన్న నాటి ప్రియ నేస్తం నా చెరువు మాయమై పోయింది. మా యింటి ముంగటి మా వెంకటక్క భివాండి కి బతుక పోయి మల్లా శవమై వాపస్ వచ్చింది. “యాడికి పోయిన్రు”  అంటూ తిరిగిరాని తమ్ముళ్ళ కోసం పొక్కిలైన వాకిళ్ళ ఇళ్ళ చెదలు పట్టిన మొగురాలకు కూలబడి యేడుస్తున్న అక్కలు కనబడ్డరు. నా సందుకలో నా తొలియవ్వనాల క్షణాల నెమలీకలు  రెపరెపలాడే కరపత్రాలై పలకరిస్తున్నాయి. నేను చేతిలో బ్రష్ పట్టుకుని రాత్రుళ్ళు జాజి రంగు అక్షరాలతో ‘విప్లవం వర్ధిల్లాలి’ అని రాసిన గోడలు ఎక్కడా కనబడలేదు – విరసం సభకు రాండ్రి  అని అపరాత్రి వేళ పోస్టర్లు అతికించిన బస్టాప్ లు, బస్సులూ కానరాలేదు – యేమయి పోయింది – నేను వత్తిలా వెలిగించిన నా యవ్వనం – యేమయిపోయినయి,   రోజుల తరబడి తిండి తిప్పలు లేక కాళ్లరిగేలా తిరిగిన ఉద్యమ ప్రయాణాలు?  వీరన్ననూ, ఇంకా అనేకమంది  నా ప్రియ నేస్తాలను,  దారితప్పిన ప్రయాణాల్లో కోల్పోయిన  నా యవ్వన గమ్యాలను – మళ్ళీ వెతుక్కోవడంలో,  nostalgia లో భవిష్యత్తు కనుక్కోవడంలో, నేనూ నా తరం  కోల్పోయిన నా అస్తిత్వం  నాకు మళ్ళీ దొరికినట్టనిపించింది . నా చుట్టూరా వినబడే వాన శబ్దం,  నాలోనే  కురుస్తున్నదనే నాకర్థమైంది.

 

నాదైన  భాష నాకు కొత్తగా దొరికింది. దాదాపు యేడేండ్లలో రాసినన్ని పద్యాలు యేడు నెలల్లో రాసాను. నా అంతులేని దుఃఖ ధారకు భావ, భాష, అక్షర రూపం దొరికింది. నేను పోగొట్టుకున్నాననుకున్న అస్తిత్వం కొత్త వస్తువుగా కొత్త రూపంతో కొంగ్రొత్త భాషతో పద్యాలుగా ప్రవహించింది. ఈ పద్యాలు నా ప్రియ మిత్రుడు అఫ్సర్ చూసాడు. తొలిరోజుల్లో కల్లోల కలల మేఘం ను ఆదరించిన స్వరం కన్నా ఉత్సాహంగా “ఇది కొత్తగా ఉంది ఇక ఆపకు రాయి” అన్నాడు. ఫలితమే 2006 లో “సందుక”. సందుక లో నా లాంటి వాళ్ళ – ఒకప్పుడు ఉద్యమాల్లో చాల చురుగ్గా పనిచేసి అనేక కారణాల వల్ల దూరమై మళ్ళి తమ అస్తిత్వాన్నీ ఉనికినీ వెతుక్కుంటున్నా వాళ్ళ వేదనని – తెలంగాణా పల్లె నుండి దూరమైన నాలాంటి అనేక మంది దుఃఖాన్నీ , తెలంగాణ పల్లెల దుర్భర జీవన వేదననీ పట్టుకున్నాననుకుంటున్న! సందుకలో మూడు సాధించాననుకుంటున్న – ఒకటి: ప్రధానంగా భాష – మన తెలంగాణ భాష – కల్లోల కలల మేఘం  సంస్కృత సమాస భూయిష్ట పదచిత్రాల భాషనుండి జీవితంతో తొణికిస లాడే  తెలంగాణ భాష ను పద్యాల్లో ఆవిష్కరించాను – రెండు:  వస్తువు – ప్రవాసిగా అమెరికా లో జీవిస్తున్న నేను,  సర్వం కోల్పోయిన నా తెలంగాణ వాడకట్టు పట్లా, వొకప్పుడు అమితంగా ప్రేమించిన ఉద్యమాల పట్లా నాలో లోలోపల వానగా సుడులు తిరిగే nostalgic ప్రేమను  పద్యాల్లో కురిపించాను – మూడు:  సందుకలో ఒక సంభాషణ ఉన్నది – నేను నాతోనే చేసుకునే సంభాషణ – ఉద్యమాలే ఊపిరిగా బ్రతికిన నాకూ అమెరికాకు  ‘పారిపోయి’ వచ్చిన నాకూ అనునిత్యం జరిగే ఒక నిరంతర సంభాషణ సందుకలో ఉన్నది. చిన్నప్పటి నుండీ ఒంటరి వాడినైన నేను నాతో నేను మాట్లాడుకునే అలవాటు ఇప్పటికీ మానలేకున్నాను. అదే సందుక పద్యాల్లో ప్రతిఫలించింది అనుకుంట!

 

ఇటీవలి మీ కవితల్లో కనిపిస్తున్న మార్పు ప్రత్యేకించి ఎప్పటి నించో చెప్పగలరా?

సందుక తర్వాత యేమిటీ అనే ప్రశ్నకు అనేక రకాలుగా సమాధానం చెప్పుకుంటున్నా.  చాలా మంది నా సందుక పద్యాలనూ, తర్వాతి పద్యాలనూ చూసి ఇవి నువ్వు రాసావంటే నమ్మలేకున్నాం – యేడి మా కల్లోల కలల మేఘం నారాయణస్వామి అని అడిగారు-ఆ intensity లేదంటూ కొంత మంది పెదవ్విరిచారు. ఇవి పద్యాలే కావన్నారు – ఈ భాషే అర్థం కాలేదన్నడో పెద్ద సాహితీ విమర్శకుడుగా పేరున్న కవి మిత్రుడు !  తెలంగాణ ఉద్యమం తీవ్రమౌతున్న సందర్భంలో కూడా ఫుట్ నోట్స్ పెట్టాలి వీటికి అన్నారు! అయితే నేను ప్రదానంగా నేర్చుకున్న విషయాలు ఇవీ – ఒకటి – పద్యం తన వస్తువు తగ్గట్టుగా ఎప్పుడూ కొత్త భాషనూ, రూపాన్నీ వెతుక్కుంటూనే ఉంటుంది. ఆ process ని సక్రమంగా, నిజాయితీగా,  కొనసాగించి నెరవేర్చగలిగితే కవి సఫలీకృతుడవుతాడు. మంచి పద్యం పుడుతుంది. అయితే కొత్త వస్తువూ, కొత్త భాషా కొత్త రూపమూ కొత్త పనిముట్లూ వగైరాల తో పాటు కవి యెంతో కొంత యేదో ఒక స్థాయిలో సందర్భంలో పద్యంలో తాత్వీకరణ చెందాలి. తాను గ్లోబల్ గా ఆలోచించి స్థానికంగా రాసినా, స్థానికంగా ఆలోచించి గ్లోబల్ స్వరం తో  రాసినా – తాత్వీకరణ చాలా important – అంటే, తన అనుభవాల్ని   కవి,  ఒక పసిపిల్లవాడి అమాయకత్వంతో అనుభవించి,   ఆ అనుభూతులని బలమైన పదచిత్రాల ద్వారా, దృశ్యాల ద్వారా పాఠకుల వూహాప్రపంచం లోకి, plane of thought లోకి తీసికొచ్చి, అక్కడ్నుండి విభిన్నంగా , ఒక విమానంలా  పైకెగసి పోవాలి.  తన అనుభూతుల తాత్విక మూలాల్ని కనుక్కొంటూ,  ఒక కొత్త దృక్కోణం నుండి పద్యాన్ని  స్థల కాలాతీతం చేసి,   తద్వారా పాఠకునికి తన అనుభూతుల్ని అపరిచయం (defamiliarize)  చేయాలి. . అందుకోసం కవి వైరుధ్యాలను సమర్థవంతంగా వాడుకోవచ్చు. వైరుధ్యాల మధ్య ఉన్న గతితార్కిక సంబంధం ప్రతిభావంతంగా పద్యంలో చెప్పగలిగితే, పద్యం విశ్వజనీన స్థాయికి  elevate అవుతుంది.  పాఠకునికి  తన అనుభూతుల ప్రపంచాన్ని పరిచయం చేస్తూనే కవి,   తిరిగి విభిన్న స్థాయిల్లో వాటిని అపరిచయం చేయడం వల్ల పద్యానికి తాత్వికత సిద్ధిస్తుంది  -  పద్యానికి అనేక dimensions నీ , multi layered స్వభావాన్నీ  ఇస్తుంది.

 

ఇక పోతే దేన్ని గాఢంగా అనుభవించామా, దేనికి గుండె తీవ్రంగా స్పందించిందా అనేదాన్ని  యెట్లాగూ పద్యం తీవ్రత స్పష్టంగా పట్టిస్తుంది. సందుక తర్వాత రాస్తున్న పద్యాలలో ఇది కొంత చైతన్యయుతంగానే ప్రయత్నిస్తున్నా! అట్లే గత కొన్ని యేండ్లుగా మన జీవితాల్లో ఒక కొత్త సందర్భం ప్రవేశించింది. మన భాష electronic భాషగా మరణించి ఘనీభవించింది. మన సంబంధాలు అంతర్జాల సాలెగూళ్లలో ఇరుక్కుపోతున్నాయి. మన మధ్య ఒక కొత్త మౌనం, ఒక కొత్త ‘నిర్వీర్యతా’ , చేష్టలుడిగినతనమూ   కనబడుతోంది. వొక చిత్రమైన వొంటరి తనం. అందరూ చుట్టూ ఉన్నా యెవరూ లేనితనం. అందరూ కలుస్తున్నా యుగాలుగా ఎవరూ కలవని తనం, అందరూ యెంతో పరిచయమున్నా అంతా అపరిచితుల్లా అనిపించడం, ఎంతో తెలిసిన తోవలోనే నడుస్తున్నట్టున్నా అంతా డేజావూ లాగే  అంతా మళ్ళా తెలియనట్టే, అంతా కొత్తగానే, అంతా కాటగలిసిన కీకారణ్యం  లాగానే, తెలిసినట్టున్న ప్రయాణం లో తెలువని తోవలో దారిపొడుగునా గుచ్చుకుంటున్న పూలముళ్ళే!  యిటీవల రాస్తున్న పద్యాల్లో గతానికీ, కాలానికీ భాష్యం చెప్ప జూస్తూ ఈ స్థితి ని తాత్వికంగా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నా! అయితే మళ్లా అదే సందిగ్ధం – ఈ కొత్త స్థితిని చెప్పడానికి మన భాష మారాలా- పద్యం రూపం మారాలా – సంప్రదాయ పాద విభజనతో రాసే వచన కవిత్వం సరిపోదేమో అనిపిస్తుంది. కొత్త రూపం రావాలేమో అనిపిస్తుంది. పదాలు, పాదాలు, వాక్యాలు, పేరాలు అన్నీ కలగలిసిపోయిన ఒక కలలోలాంటి స్థితి – ఒక అపరిచిత ఎలక్ట్రానిక్ భాషలో గడ్డకట్టుకుపోయిన శీతల  శిథిల స్థితి – దీన్ని యేది సరిగ్గ పట్టుకోగలిగితే అదే సరైన పద్య రూపం – యేది పాఠకుడికి అందితే అదే మంచి పద్యం – in other words – పద్యం  చాలా ఫ్లెక్సిబిల్ అయిపోవాలి – volatile అయిపోవాలి – స్పష్టాస్పష్ట  స్వప్నస్థితైన  మన భౌతిక,  మానసిక స్థితిని పట్టుకోవడానికి, గతమూ, భవిష్యత్తూ మాత్రమే ఉన్న మన వర్తమాన రాహిత్యాన్ని ప్రతిఫలించడానికి  పద్యం తనకు తానుగా ఒక అస్థిరమైన రూపం దాల్చాలేమో?  పద్యానికి సరైన రూపంకోసం ఈ అన్వేషణ అనంతమనుకుంటా! ప్రతి కాలంలో, ప్రతి యుగంలో కవులిట్లా దుఃఖించీ దుఃఖించీ తపించీ తపించీ పద్యాలను కొత్త రెక్కలు తగిలించిన  పక్షుల్లా ప్రపంచం మీదకు వదుల్తారనుకుంటా!

అయితే ఒకటి మాత్రం  నిజం – పాత భాషతో, పాత డిక్షన్ తో, పాత పదచిత్రాలతో ఈ కొత్త స్థితిని చెప్పలేము. నిశ్శబ్దం శబ్దంగా,  శబ్దం నిశ్శబ్దంగా నెలకొన్న ఒక ఆధునికానంతర అత్యాధునిక ప్రశాంత గందరగోళ స్థితి ని చెప్పాలంటే కాలాన్నీ స్థలాన్నీ దాటి మనకు బాగా పరిచయమున్న అపరిచిత పదచిత్రాల, పాదాల, వాక్యాల, రూపాల, సంగీతాల పద్యాలని పాడాలనుకుంటా – కాదు గుసగుసగా  చెప్పాలనుకుంట! ఇప్పుడు!

 

ఈ మధ్య రాస్తున్న కవుల్లో మీకు కనిపిస్తున్న పాసిటీవ్/ నెగెటివ్ అంశాలు ఏమిటి? వొక సీనియర్ కవిగా మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా?

ఈ మధ్య, ‘enhanced communications’   పుణ్యమా అని, బ్లాగులు, అంతర్జాల పత్రికలు, ముఖపుస్తకం లో కవిత్వ పేజీలు, కవి సంగమాలు అన్నీ కవులని ఒక చోట చేరుస్తున్నయి – వయసూ తరాలతో సంబంధం లేకుండా, స్థల కాలాలతో సంబంధం లేకుండా – చాలా మంచి పరిణామం – కవులందరూ ఉత్సాహంగా రాస్తున్నారు – పరిమాణం పెరిగింది బాగా! ప్రమాణరీత్యా కూడా విలువలు పెరిగాయి. ఇది తెలుగు కవిత్వానికి చాల మంచి పరిణామం. అయితే ఈ అంతర్జాల సాహిత్యానికి రెండు ప్రదాన మైన లక్షణాలున్నయి – ఒకటి – పద్యం రాసి ‘పోస్టు’ చేసాక ఇక అది ఆ కవిది ఇంకెంత మాత్రమూ కాదు. దాని మీద కవి అన్ని హక్కులూ అధికారాలూ కోల్పోతాడు. దాన్ని పాఠకులు, వారి వారి స్థల కాల నిర్దేశాల బట్టి యెట్లా  అనుభూతిస్తే ఆ పద్యం  అట్లా అనుభూతిలోకి వస్తుంది. యెట్లా స్పందిస్తే అట్లా జీవిస్తుంది. రెండు – ఇప్పుడు పాఠకుడు పద్యాన్ని తన స్వంతం చేసుకున్నాక దాని మీద తన ఇష్టం వచ్చినట్టు స్పందించవచ్చు. అభిప్రాయాలు రాయవచ్చు – కవికీ పాఠకునికీ మధ్య instant two way communication యేర్పడుతుంది. ఇక్కడ కవే పాఠకుడూ, పాఠకుడే కవి లా instantaneous గా మారిపోతున్న సందర్భం. ఇది గతంలో మనకు అనుభవం లో లేదు. ఈ కొత్త సందర్భానికి కవులు అనుభూతి పరంగానూ, తాత్వికంగానూ స్పందించాలి. అనుభూతి మాత్రమే ప్రదానం కాదు. కవి అనుభవిస్తున్న ప్రత్యేక స్థితిని ప్రతిఫలించే పద్యం తాత్విక స్థాయికి ఎదగాలి. అది కొరవడుతుందేమో అని నా అభిప్రాయం. పద్యం బహుముఖత్వాన్నీ,    multi layered స్వభావాన్నీ సంతరించుకోవడం లేదేమో అనిపిస్తుంది. కవి కావాల్సినంతగా పరిశీలననూ, దాన్ని enrich చేసే అధ్యయనాన్నీ చేయడం లేదేమో అనిపిస్తుంది. అట్లే పద్యం రూపం మీద కూడా కవులు తగినంత శ్రద్ధ పెట్టడం లేదేమో అనిపిస్తుంది. దీనికి కారణం అంతర్జాలం కల్పిస్తున్న  instant communication సౌలభ్యమేనేమో!  కవికి తాను రాసిందాన్ని వెంటనే పాఠకునికి అందవేయాలన్న ఆత్రుత కన్నా మళ్ళీ మళ్ళీ తరచి చూసుకోవాలి, సరి దిద్దుకోవాలి అన్న శద్ద్గ ఎక్కువ కావాలి. ఉదాహరణకు మీకు చాలా పద్యాల్లో “ఫలానా పదమో, వాక్యమో  తీసేస్తే పద్యం ఇంకా బాగుంటుంది కదా”  అనిపిస్తుంది. అట్లే ఒక ప్రాథమిక సూచన – ఒక పద్యంలో క్రియా వాక్యాలని వీలయినంత తక్కువగా ఉపయోగిస్తే పద్యం చిక్కనౌతుంది. ఎందరో కవులు పుంఖానుపుంఖంగా ఎక్కువ సంఖ్యలో రాయడం, అది చాలా ఎక్కువ మంది పాఠకులకు అందుబాటులోకి రావడం ఎక్కువమంది participatory reading of the text లో భాగం కావడం చాలా మంచి పరిణామాలు. అయితే దానికి తగ్గట్టు కవుల పద్యాలు, కేవలం ఉన్న స్థితిని పట్టించే పదచిత్ర స్థాయినుండి ఒక ఉన్నత తాత్విక స్థాయికి ఎదగాలని నా అకాంక్ష.. ఆ దృష్ట్యా నేను ఎప్పటికీ ఓనమాలు దిద్దుకునే చిన్న పిల్లగాడినే! నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్న నిరంతర విద్యార్థినే!

 

ఇప్పటి తెలుగు కవిత్వం మళ్ళీ 80 ల నాటి వూపు అందుకున్నట్టు మీకు కనిపిస్తున్నాదా?

అందుకున్నది. తప్పకుండా అందుకున్నది. అందులో సందేహం లేదు. అయితే 80 ల లో పరిస్థితి వేరు. అప్పుడు తెలుగు గడ్డమీద ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నయి. ప్రజల పోరాటాలు అలలు అలలు గా  సాగుతున్నయి. అప్పుడు ఇంతగా బాహ్య ప్రపంచం తో ముఖ్యం అంతర్జాతీయ సమాజం తో సంబంధాలు ప్రత్యక్షంగా  లేవు. యేదో పాలస్తీనా పోరాటం గురించి వింటున్నామంతే! అంతర్జాతీయ సాహిత్యంతో కవిత్వంతో సంబంధం పుస్తకాలూ పత్రికలూ రూపేణా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇరాక్ ఆఫ్ఘనిస్థాన్ యుద్దాల్నీ, పాలస్తీనా పోరాటాలనీ ప్రత్యక్షంగా టెలివిజన్ లోనూ, అంతర్జాలంలోనూ చూస్తున్నాము అనుభవిస్తున్నాము – ముఖపుస్తకం లో అరబ్ వసంతోత్సవం లో పాలు పంచుకున్నాము. ఇప్పుడంతా ప్రత్యక్షమే – virtual గా ప్రత్యక్షం! మున్నెన్నడూ మనం చూడని అనుభవించని కొత్త సామాజిక దృశ్యం  – అయితే చిత్రంగా మన తెలుగు సమాజం ఎక్కువ శాతం ఈ సామాజిక దృశ్యానికి దూరంగా ఉన్నది. తెలుగు నేల మీద, భారత దేశం మెజారిటీ ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమాలకు ఈ కొత్త అంతర్జాల సామాజిక దృశ్యం అనుభవం లోకి రావడం లేదు. కాబట్టి ఈ మారిన అత్యాధునిక,  ఆధునికానంతర అంతర్జాల సామాజిక దృశ్యం లో భాగమైన మధ్యతరగతి కవులు వారి వారి స్థల కాల పరిమితుల వల్ల ఎక్కువ శాతం  నిజమైన ప్రజల ఉద్యమాలకు దూరంగానే ఉంటున్నారు. యెక్కువగా మధ్య తరగతి ‘స్థిర’ జీవితానికీ కెరీర్ కీ అలవాటుపడ్డ వీళ్ళను ఆ ఉద్యమాలు  ఎక్కువగా ప్రభావితం చేయడం లేదు. ఒక  స్పష్టమైన detachedness కనబడుతోంది. Urban areas లో ఉండి సామాజిక సమస్యలకు ‘స్పందించే’ ఆధునిక తరం సంగతి వేరు. వాళ్ళది క్షణికమైన స్పందనే! వాళ్ళు ఢిల్లీ లో గాంగ్ రేప్ కూ అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాటానికీ క్షణికమైన మద్దతు ని తెలుపుతారు. వీధుల్లోకొచ్చి పోరాటాలు చేస్తారు. కానీ అవి శాశ్వత పరిష్కారాల కోసమో, సామాజిక మార్పుల కోసమో చేసే పోరాటాలు కావు. వాటికా లక్ష్యం కూడా లేదు. ఈ అంతర్జాల ఆధునికానంతర తరం, ఒక  క్షణికమైన అశాశ్వత (ephemeral) జీవితాన్ని అనుభవిస్తున్నది. యేదీ శాశ్వతం కాదు. అంతా కంప్యూటర్ మానిటర్ మీద ఎలెక్ట్రానిక్ అక్షరాలున్నంతవరకే అనుభూతి!  Switch off కాగానే అంతా మాయం! ఈ క్షణికానుభూతి చెందే పాఠకులకోసం వచ్చే సాహిత్యం కూడా అంతే shallow గా ఉండే, తయారయే  ప్రమాదముంది. అది ‘ప్రేమ’ గురించి కావచ్చు, ‘మానవీయ విలువల’ గురించి కావచ్చు, స్త్రీలపై అణచివేత కావచ్చు, ఇంకా catchy గా ఉండే అనేకానేక urban జీవితాంశాలు కావచ్చు – వీటి మీద కవిత్వం వస్తోంది, క్షణికానుభూతులని కలిగించి, పాఠకుడు respond అయేట్టు చేసి – ఆ క్షణం సేపో లేదూ మహా అయితే ఆ రోజంతానో పాఠకుడు సాహిత్యసృష్టిలో భాగమయ్యేట్టు చేస్తోంది. కానీ మొత్తానికి ఆ అనుభవమే  అశాశ్వతమైనది. యెటువంటి చిరస్థాయి  సాంస్కృతానుభవాన్ని , సంస్కృతినీ నిర్మించడం లేదు. ఫలితంగా ఒక నిర్దిష్టమైన సామాజికాచరణకు, తద్వారా సామాజిక మార్పుకూ దారి తీసేట్టుగా సాహిత్యం,  ముఖ్యంగా కవిత్వం సృష్టించబడడం లేదు – పైగా అది సాహిత్యం చేసే పని అని కానీ,. అది సాహిత్యం యెజెండా లో ఉండాలని కానీ అనుకోవడం కూడా బాగా old fashion అయిపోయింది. సాహిత్యాన్ని అనుభూతించడానికి ఒక కొత్త అభిరుచి గల పాఠక సమూహాలు , అంతర్జాలంలో క్షణికమైన అశాశ్వతమైన అనుభవాన్ని ఆస్వాదించే urban elite సమూహాలు తయారవుతున్నాయేమో అని నేననుకుంటున్నాను. పోతే కవిత్వం రాసి లో ఎక్కువగా వస్తున్నపుడు సరైన నిర్దేశం జరిగినప్పుడు తప్పకుండా వాసిలో కూడా గొప్ప ఫలితాలని సాధించే అవకాశముంది – అది ప్రజల జీవితానికి దగ్గరైనప్పుడు మరింత enrich ఐ తాత్వీకరించబడుతుంది. ఆ స్థితి తెలుగు కవిత్వానికి రావాలని నా ప్రగాఢమైన ఆకాంక్ష.

 

మీరు చాలా ప్రపంచ కవిత్వాన్ని కూడా అనువాదం చేశారు, చదువుకున్నారు. ప్రపంచ పటం మీద తెలుగు కవిత్వం ఎక్కడ నిలుస్తుందంటారు?

యెవరేమన్నా , ప్రపంచ పటంలో తెలుగు కవిత్వానికి చాలా గొప్ప స్థానమే ఉందనినేననుకుంట! . నేను చదివిన దేశదేశాల కవిత్వం ముందు తెలుగు కవిత్వం యే మాత్రం తీసిపోకుండా ఉన్నది. అయితే కొంత మందికి తమ తమ subjective అభిరుచులమేరకు అట్లా అనిపించకపోవచ్చు. ప్రజల ఉద్యమాలు, చైతన్యం, సామాజిక మార్పులు వుధృతంగా జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో, దేశాల్లో సాహిత్యం కవిత్వం ఆయా దేశ కాల పరిస్థితులని ప్రతిఫలిస్తూ వాటి స్థానికతని  విశ్వజనీనం చేస్తూ, తాత్వీకరిస్తూ చాలా గొప్పగా వస్తున్నది. అట్లా వస్తున్న కవిత్వమంతా గొప్పదని కాదు కానీ, గొప్ప కవిత్వానికీ, సాహిత్యానికీ సామాజిక చలనాలూ, మార్పులూ, ఉద్యమాలూ తప్పనిసరిగా చోదక శక్తులౌతాయి. ఆయా ప్రత్యేక సామాజిక సందర్భాలనుండి ఊపిరి పోసుకునే సాహిత్యం, ఆ పరిస్థితి నుండి ఎదిగి ఉన్నత తాత్విక స్థాయికి చేరితే గొప్ప సాహిత్యమౌతుంది, ఇది కవిత్వానిక్కూడా వర్తిస్తుంది. అట్లా చూస్తే, ఇవాళ్ళ లాటిన్ అమెరికాలో , మధ్య ప్రాచ్యంలో, పాలస్తీనాలో, ఇంకా అణచివేతకు గురవుతున్న అనేక దేశాలనుండి వస్తున్న కవిత్వానికి ధీటుగా  తెలుగు కవిత్వం వస్తున్నది. ఒక దురదృష్టకరమైన విషయమేమంటే, తెలుగు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలనీ, ప్రత్యేక సామాజిక సందర్భాన్నీ ప్రతిఫలించే కవిత్వానికి అంతర్జాతీయ గుర్తింపు రావాలంటే అది English లోనికి ముమ్మరంగా  అనువాదం కావాలి. ఆ పని జరగడం లేదు. మనకు మంచి అనువాదకులు కరువయ్యారు. అనువాదం చేయగలిగే వాళ్ళు, prejudices తో ముందే ఏర్పర్చుకున్న నిశ్చితమైన ఖచ్చితాభిప్రాయాలతో , తమ subjective అభిరుచుల మేరకు యేది కవిత్వమనుకుంటున్నారో దాన్ని మాత్రమే చేస్తున్నారు. అందు వల్ల మంచి కవిత్వం చాలావరకు బయటి ప్రపంచానికి తెలియకుండా పోతుంది. ఉదాహరణకు ఆ మధ్య ‘Language for a New Century’ అని ప్రధానంగా మధ్య ప్రాచ్య, ఆసియా లోని దేశదేశాల కవిత్వాన్ని – ముఖ్యంగా కొత్త శతాబ్దానికి కొత్త భాషలో కొత్త గొంతుకనిచ్చిన కవిత్వాన్ని ఒక చోట చేర్చిన అద్భుతమైన సంకలనం వెలువడింది. ఆ సంకలనంలో తెలుగు కవిత్వం కోసం చాలా ఆత్రంగా వెతికాను. తీరా చూస్తే ఒకే ఒక్క తెలుగు పద్యం కనబడింది. అది విశ్వనాథ గారి పద్యం. విశ్వనాథ మంచి కవే కావచ్చు. కానీ కొత్త శతాబ్దపు కవి కారు – కొత్త సామాజిక సందర్భాన్ని ప్రతిబింబించిన కొత్త భాషా కొత్త గొంతుకా అసలే కాదు. బాగా నిరుత్సాహ పడ్డా! యే యితర ప్రాంత దేశాలా కవిత్వానికి యే మాత్రమూ తీసిపోని సమకాలీన తెలుగు కవిత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసి తెలియజేసే ప్రయత్నం ముమ్మరంగా జరగాలి!