కవిత్వం

అనంతరం

ఫిబ్రవరి 2016

మంచుపువ్వుల్లో నీ నవ్వు -
గడ్డకట్టుకుపోయిన పాట ఒకటి
చీరుకుపోయిన నా గుండెలోంచి విచ్చుకుంటూ…ఆర్తిగా
నీ పెదవులు నా పెదవందుకున్నప్పుడు
నడిరేయి వానలో
వణికిన కాంతిధారలవలె
నేను

నీ ఊపిరిలో నా పిలుపు
నా అణువణువులో మెలిపడి పురివడి
సేదతీరిన నువ్వు

అదంతా ఒక కలే

నీ కనురెప్పలమాటున బిగపట్టుకున్న వెచ్చని దిగులు ఆవిర్లని
తడిముద్దులతో అద్దుతూ
నీకోసం
సీతాకోకచిలుకంత గొప్పదాన్నవాలన్న ఆశ
తప్ప మరింకే కోరికా లేదు ఇక నాలో

అంత అద్భుత మోహంలోనూ
దొర్లుతాయి
మనసుకన్నుల్లో నలుసులై మిగలబోతున్న జ్ఞాపకాలు
ప్రియరహస్యాన్ని విప్పిచెప్పుకోగలిగిన కారణమేదో
ఇక ఎప్పటికీ తమలో దాచుకుని
లోలోంచి తొలిచి సీతాకోకను వేటగాడ్ని చేసి
ఏలాగోలా గడియారాల్ని కాస్త వెనక్కి తిప్పలేమూ
అని ప్రాణాన్ని తోడేసే క్షణాలు

పోనీలే అదంతా

కలలూ, నిజాలూ, తప్పొప్పులూ అన్నీ మర్చిపోగలనేమో
కానీ

చీకటి మెత్తగా విచ్చుకుంటున్న సమయంలో నా భుజంమ్మీద నువ్వు తలవాల్చినప్పుడు
బుగ్గను నిమిరిన నల్లని దూది మేఘంలాంటి నీ జుత్తుకుచిక్కుకుని
ఎన్నటికీ మరపుకురానిదై మిగిలిన ఒక్క కన్నీటి చుక్క తడిని
ఏం చెయ్యను?