కవిత్వం

ఈ క్షణం…

సెప్టెంబర్ 2015

కీచురాళ్లు ఎన్ని రకాలో తెలుసా? అదిగో విను: ‘చిర్రప్…చీర్రప్’ అని ఒక గుంపుతో ‘చిట్ చీట్ చిటా చీట్’ అంటూ మరో గుంపు జుగల్ బంది, బ్యాక్ గ్రౌండ్ లో సన్నగా, ఉండీలేనట్టుగా, ‘గీఈఈ..’ అంటూ మరో గుంపు. కీచురాళ్లెప్పుడూ నిద్దరోవు. మధ్యాహ్నమైనా, మధ్యరాత్రి మెలుకువలోనైనా ఒక్క క్షణం ఒంటరిగా వుండనివ్వవు. తలలో గీ పెట్టే నరాల హోరుకు దరువేస్తూ రెక్కలు ఆడిస్తూనే వుంటాయి.

నా బావిలో నేను
కీచురాళ్ల సంగీతాన్ని పరవశించి వింటుండగా ఎక్కడినుంచి ఊడిపడ్డావు నువ్వు?
కొంచెం కబుర్లు, కీచురాళ్ల గురించేలే… ఏదో ఒకటి – నాకు తెలిసిందేదో, చెప్పాను కదా?

మ్ .. పాపం చాలా దూరం నుంచి వెతుక్కుంటూ వచ్చినట్లున్నావు. నీతో పంచుకోవాడనికి నా దగ్గరేం లేవు. కనిపించడంలేదూ? ఇది ఎండిపోయిన బావి.
నెలవంకను వణికించిన ఆ చిక్కటి చలి రాత్రి నడిజాములోనే కన్నీటి చుక్కలు కూడా ఇంకిపోయాయి.

పోపో, నీతో ఆటలాడేంత తీరిక లేదు నాకు.

అయినా బొక్కబోర్లా పడితే పర్యవసానం ఏడవడమే అని నాకు తెలీదు?

నా లోకి, చూ..డకలా! తుళ్లుతున్న పసిపిల్లలని చూస్తున్నప్పటి మెరుపు
నను చూస్తున్న నీ తడి కళ్లల్లో…

అదీ! అలా, కాసేపు అటు చూస్తూ కూర్చో. నువ్వు బయల్దేరితే ఇంకా మంచిది.

మ్ … ఏదో చేస్తున్నాను కదా ఈ బావిలో. ఇప్పుడే, నువ్వొచ్చేముందే,… ఏం చేస్తున్నాను?

హా, గుర్తొచ్చింది … కీచురాళ్ల సంగీతం వింటున్నా కదా? అక్కడెక్కడో రెక్కలార్చుతునే వున్నాయి దూ.రం..గా … దూ…. రం….. గా.

లోలోపలి నీ నవ్వు నాకు తెలుస్తోందని నీకూ తెలుసు.
నేనిలా పొరలు పొరలుగా విడిపోతూ ఉక్కిరిబిక్కిరవుతోంటే., దయలేదూ నీకు?

ఆ…గు!!! ఒకే ఒక్కక్షణం!

ఇప్పటికీ ఆటలాడలేను. ఇక ఉన్నదంతా నిజం!

ఎప్పుడో ఎందుకో సందేహల్లో, సంధిగ్ధాల్లో కప్పేసి ఉంచుకున్న నేను
నీ ముందిప్పుడు,
… నగ్నంగా!

ఏడిపించేది కాదు, కట్టిపడేసేది అసలే కాదు
అతిశయంతో ఉక్కిరిబిక్కిరి చేసి, ఎక్కడెపుడు గుర్తొచ్చినా గుండె ఉప్పొంగి చిర్నవ్వుకునేది
రేపు ఉంటుందో లేదో చెప్పలేను, కానీ ఈ క్షణం వుంది
నీపై
ఉన్మత్త ప్రేమ

ఏం?…
ఇక, అందుకోవూ
నన్నీక్షణాన?

పోనీ…
మిణుగురులా ఇంకొక్కసారి మెరిసి మాయమయ్యేముందు
నా విశ్వాంతరాలలోని ఒక్కొక్క నక్షత్రమూ
మరి మరి పలవరించేట్టు
చెప్పి వెళ్లవూ
నా గురించి నాకు
నీ వేళ్లతో పెదిమలతో