ఊరు దాటిన కొన్ని మైళ్ళ తరువాత దట్టమైన మామిడి చెట్ల తోపును దాటి గుట్ట ఎక్కి చూస్తే విశాలమైన మైదానం కనిపిస్తుంది. ఆ మైదానంలో చిన్ని నీటికుంట పక్కన గుబురుగా పెరిగిన వేప చెట్టే నా ఇల్లు.
ఊరివాళ్లెవరికీ ఈ మైదానానికి వచ్చిన అనుభవంలేదు కానీ తాతముత్తాతల కాలంనుండి ఇక్కడ మాయలు మంత్రాలు జరుగుతాయని ప్రచారం వుంది. మైదానం గుండా ఎడ్ల బండెక్కి వెడితే రెండు గంటల్లో పక్క వూరు చేరుకోవచ్చు అని అంటారు కానీ ఎవరూ చూసింది లేదు. ఎందుకొచ్చిన బాధ అని రెండు రోజులు పట్టే వేరే దారినే రెండు వూళ్ల వాళ్లు ఉపయోగిస్తారు. చివరి వరుసలో వున్న మామిడి చెట్లు విరగగాసినా ఎవరూ ఆ చివరికంటా వెళ్లేవాళ్లు కాదు. ఆ చెట్ల తరువాత ఉన్నది చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివి అని అనుకునేవాళ్లం.
పదహారేళ్లప్పుడు, నా అనేవాళ్లందరూ ఈ లోకం విడిచివెళ్లిపోయాక, జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపొయ్యేదేదో ఒక సాహసం చేసి చచ్చిపోదామని ఆ మామిడి తోపు దాటుకుని వచ్చాను. గుట్ట ఎక్కి, ‘ఇదేనా ప్రపంచానికి చివర,’ అనుకుని కిందకి చూస్తే రకరకాల రంగుల్లో విరగబూసిన గడ్డిపూలతో నందనవనంలా కనిపించిన ఈ మైదానం మాయలో పడి ఇక వెనక్కి తిరిగి చూడలేకపొయ్యాను. చుట్టుపక్కల దొరికిన పండ్లు కాయలే నా ఆహారం అయ్యాయి. పక్షులు, జంతువులే నా స్నేహితులయ్యాయి. ఇక్కడ ఎన్నేళ్లనుంచి వుంటున్నానో లెక్క మరిచిపోయిన తరువాత, ఏ మాయమంత్రాలూ ఇక్కడ లేవని నిర్థారించుకున్న తరువాత జరిగిందా సంఘటన – ఓ మూడు పువ్వులు పూయడం కోసం నన్ను సంవత్సరమంతా వేచి చూసేలా చేసిన ఘటన.
***
ఈరోజు లాంటి ఒకరోజు పొద్దున్నే వేప చెట్టెక్కి ఎండిపోయినట్లున్న ఒక కొమ్మను రెమ్మ విరిచి పరీక్షిస్తుండగా గుట్ట దిగి వస్తూ కనిపించిందామె. ఆమె భుజంపై నిద్రపోతూ ఒక పాప. సంచి ఒకటి మరో భుజంపై వేలాడుతోంది. బరువును పంటి బిగువున దాస్తూ వేప చెట్టు కిందికి వచ్చి సంచిని మెల్లగా నేలపై జార్చి పాపను ఎత్తుకునే వేపమానుకు ఆనుకుని నిలబడింది. బరువుగా ఊపిరి పీలుస్తున్న శబ్దం నేనున్న కొమ్మదాకా వినిపిస్తోంది. ఏ చప్పుడు చెయ్యకుండా కొమ్మను గట్టిగా హత్తుకుని పడుకున్నాను. మా ఊరివైపు నుంచి వచ్చింది కానీ ఆమె ఎవరో గుర్తు పట్టలేకపొయ్యాను. ఊరి విడిచి వచ్చిన అన్నేళ్ల తరువాత నా సావాసకాళ్లెవరైన ఎదురొచ్చినా గుర్తుపట్టలేనేమో.
చెట్టుమీది పక్షుల అరుపులకో లేక తల్లి నడక ఆపిందని గ్రహించిందో గాని కొద్దిసేపటికే నిద్ర లేచింది పాప. పాపను చెట్టు కిందే కూర్చోబెట్టి ఆమె పక్కన కుంట దగ్గరికి వెళ్లింది. నీళ్లను అటూ ఇటూ నెమ్మదిగా పైపైన కదిపి క్షణం సేపు నీళ్లను పరీక్షించింది. నీళ్లు మంచివే అని గ్రహించినట్లుంది, మొఖం కడుక్కుని కొన్ని నీళ్ళను తాగింది. పాపను కూడా కుంట దగ్గరికి తీసుకువెళ్లి పమిట కొంగును తడిపి ముఖం తుడిచి దోసిలితో నీళ్లు తాగించింది.
నేను వున్న కొమ్మనుంచి వాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నారు. అలిసిపోయినా తల్లీకూతుళ్లు ఆహ్లాదంగా వున్నారు. ఆ పాపకు రెండు మూడేళ్లు వుండొచ్చు. కొత్త వింత ప్రపంచం మాయలో మునిగిపోయి మౌనంగా తల్లిని అనుసరిస్తోంది.
ఆమె చెట్టుకిందికి వచ్చి సంచిలోంచి రెండు రొట్టెలు తీసి ఒక రొట్టె పాపకు ఇచ్చి తానొక రొట్టె నములుతూ కూర్చుంది.
రొట్టె తిన్నంత తిని, మిగిలింది పక్కనే మట్టి పెకిలిస్తున్న పిచ్చుకకు వెయ్యబొయ్యింది పాప.
“వద్దమ్మా. రొట్టె ముక్కలు ఆ పిచ్చుక తినగలదో లేదో. పైగా సాయంత్రం దాకా మనం వున్న కొన్ని రొట్టెలతోనే సరిపెట్టుకోవాలి. మన దగ్గర తిండి అయిపోతే పిచ్చుక మనకేం బువ్వ పెట్టదు కదా?” చిరునవ్వుతో అన్నదామె.
“నాకు ఆకలేసినప్పుడు గింజలు పెట్టమని పిచ్చుకనే అడుగుతా.” ముద్దు ముద్దు మాటలతో అంది పాప.
“పిచ్చుకమ్మకు పిల్లలు వుంటే ఆ గింజలు తన పిల్లలకు పెట్టుకోవాలి కదా. పోనీ తను ఏరుకొచ్చిన పురుగుల్ని ఇస్తుందేమోలే,” అలసిన ఆమె మొఖంలో పాప పట్ల వాత్సల్యంతో పాటు చిలిపితనం చూసి నేనే చిర్నవు నవ్వుకున్నాను.
“యాక్, నాకు పురుగులొద్దు,” అని మిగిలిన రొట్టెను గబ గబా తినేసింది పాప.
ఎన్నో ఏళ్ల తరువాత మనుషులు కనపడడం, అందులోనూ తల్లీ కూతుళ్లు ప్రేమగా మాట్లాడుకోవడం విని సంతోషం పట్టలేకపొయ్యాను. “ఎవరు మీరు?” అని పెద్దగా అడగబోయి చివరి క్షణంలో ఆగిపొయ్యాను. ఇటువైపు మానవమాత్రులెవరూ రారనుకుని జంతువుల్లో జంతువులా తిరుగుతున్నాను. పాప సంగతేమోగానీ నన్ను చూసిందంటే ఆమె గుండె ఆగిపోవడం ఖాయం. పిచ్చుకలు, జంతువులతో పాటు లేవడం అలవాటవడం వల్ల పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకుని, పొదల్లో దొరికిన పండ్లు తిని చెట్టెక్కినందుకు సంతోషపడ్డా మధ్యాహ్నానికైనా ఇక్కడ్నుంచి కదుల్తారో లేదోనని దిగులు పట్టుకుంది.
“అమ్మా, ఇక్కడ భలే వుంది. పిచ్చుకలతో కలిసి ఇక్కడే వుండిపోదామా?” చెట్టు పక్కనే గడ్డిపూలలో పొర్లాడుతూ అడిగింది పాప.
“హమ్మో!” అని నేను పైకే అనబోయాను. అప్పటికే సంచిని భుజానికి తగిలించుకున్న ఆమె పాపను గడ్డిలోంచి లేవనెత్తి, “ఇక వెంటనే బయల్దేరాలి మనం. సాయంత్రం లోపల పక్క వూరు చేరుకోవాలి. అంటే ఇంకా చాలా దూరం వెళ్లాలి. దార్లో పిచ్చుకలతో కుందేళ్లతో మాట్లాడుతూ వెళ్లాలంటే సమయం కావాలి కదా మనకు?” పాప జుట్టుకు అంటుకున్న గడ్డి పోచలను మెల్లగా తీస్తూ పాపను బుజ్జగించింది. చీకటి పడేలోగా మైదానం దాటెయ్యాలనుకుంటోందని అర్థమయ్యింది నాకు. పాప చెయ్యిపట్టుకుని మైదానం అంచుల్లోకి చూస్తున్న ఆమె మొఖంలో దిగులేదో కదలాడుతోంది.
దిక్కులు చూస్తూ నడక మొదలెట్టి కొన్ని అడుగులు వేసిందో లేదో హఠాత్తుగా ఆగి, “అమ్మా, చూడు!” అని ఉత్సాహంగా అరిచి తల్లి చెయ్యి విడిపించుకుని గుట్టవైపు పరిగెత్తింది పాప. అటు వైపు నేనూ తలతిప్పి చూశాను. ఎవరో ఒక యువకుడు వాళ్ల వైపు పరిగెడుతూ వస్తున్నాడు. పాప అతని మీదకు దూకింది. పాపను ఎత్తుకుని, మ్రాన్పడి నిలబడిపోయిన ఆమె దగ్గరికి వగరుస్తూ వచ్చాడతను.
పాప కిందకు దిగి ఇద్దరినీ చూస్తూ కాసేపు నిలబడిపోయింది. ఇంతలో తన జుట్టును ఎగరేసిన గాలి తెమ్మరవెంట పరిగెత్తి గడ్డిలో ఆడుకోవడం మొదలెట్టింది. ఆడుకుంటూనే అతని వైపు చూసి అరిచింది, “నువ్వు కూడా మాతో రా!”
అతను ఆమెకు దగ్గరగా వచ్చి ఆమె చెయ్యందుకుని, “వెళ్లొద్దు.” అని అన్నాడు.
“వెళ్లాలి, వేరే దారి లేదు కదా?” ఆమె చెయ్యి మెల్లగా విడిపించుకుని అన్నది.
“ఏదో ఒకటి చేద్దాం. చెప్పకుండా వచ్చేశావు. ఎందుకిలా?”
“నీతో చెబితే వెళ్లనివ్వవు. నువ్వూ మాతో రాలేవు. ఊరివాళ్లకు నేనంటే పడదు. మాతో స్నేహం చేసినందుకు నిన్ను కూడా మెల్లగా వెలేస్తున్నారు. అయినా, ఇంత త్వరగా ఎలా కనుక్కున్నావు మమ్మల్ని?” ఆమె ఆశ్చర్యపోతూ అడిగింది.
“నువ్వు వెళ్లిపోతావని అనుకుంటూనే వున్నాను,” బాధతో అన్నాడతను, “వేకువజామున ఎందుకో ఉలిక్కిపడి మేల్కున్నాను. బయటి తలుపు తెరుచుకుని వుండడం గమనించి మీ గదికి వచ్చిచూస్తే లోపల ఇద్దరూ కనిపించలేదు. కాసేపు దిక్కు తోచలేదు. ఊరి నుంచి దూరంగా తొందరగా వెళ్లిపోవాలని మైదానం వైపే వచ్చివుంటావని అనిపించి ఇటువైపునుంచే వెతకడం మొదలెట్టాను. గుట్ట ఎక్కి చూడగానే కుంట పక్కన మీరు కనిపించారు,”
అతను చుట్టూ చూస్తూ అన్నాడు, “మామిడి తోపు దాటి మైదానంలోకి ఎవరూ రారు. ఇంతసేపు మీకేదైనా జరిగిందేమోనని ఎంత భయపడ్డానో. ”
“ఊర్లోని జనాలకంటే చెడ్డదా ఈ ప్రదేశం. అయినా ఇంతవరకూ మాకు ఏ ఆపదా రాలేదు. చూడు ఇక్కడంతా ఎంత ప్రశాంతంగా వుందో. పాప కూడా ఇక్కడే వుండిపోదాం అని అంటోంది.”
కాసేపు ఏమీ మాట్లాడలేదు అతను. చెట్టు కిందకి వచ్చి మానుని ఆనుకుని నిలబడ్డాడు.
చెట్టు బెరడు ముక్కలను బలవంతంగా పెకిలించి దూరంగా విసిరికొట్టి, “నేనంటే ఇక ఇష్టం లేదా?” ఉక్రోషంగా అంటున్నాడు.
“నువ్వంటే ఎప్పటికీ ప్రేమే, మా యిద్దరికీ. నీతోనే ఉండిపొవ్వాలని, నీలో కలిసిపొవ్వాలని నాకెన్ని కలలో. కానీ నీ కళ్ల ముందే వుండి నీతో ప్రేమగా వుండలేక ఏడుస్తూ వుండడం నాకు ఇష్టం లేదు. అందుకే నా కలల్ని నాతో తీసుకెళ్తున్నా.” అతని దగ్గరికి వచ్చి చిర్వవ్వుతోనే అన్నదామె.
“నిన్ను కడదాకా ప్రేమించాలనే పిచ్చి కల తప్ప వేరే కలలేవీ లేవు నాకు. ఇక ఆ పసిది నా రక్తం పంచుకు పుట్టుకపోయినా, అది నా ఊపిరే,” పాపవైపు చూస్తూ మెల్లగా అన్నాడతను.
ఎర్రటి తెల్లటి గడ్డిపూలను జుట్టులో అలంకరించుకుంటూ ఆమె దగ్గరికి వచ్చింది పాప. ఆమె పాపను ఎత్తుకుని అతనికి ఇంకా దగ్గరగా వచ్చి నిలబడింది. పాప ఆమె జుట్టులో ఒక తెల్లపువ్వును తురుముతుండగా ఆమె అతని జుత్తుని ప్రేమగా ముట్టుకోబొయ్యింది, అతను ఆమె చెక్కిలిని మునివేళ్లతో తట్టబొయ్యాడు.
హఠాత్తుగా కళ్లు మిరిమిట్లు గొలుపుతూ అతని ముందు మెరిసిన మెరుపుతో నాకళ్లు బైర్లు కమ్మాయి.
కాసేపటికి కళ్లు చికిలించి చూస్తే దిగ్భ్రాంతితో నిలబడిపోయిన అతనొక్కడే కనిపించాడు.
ఒకచేత్తో మానును ఆసరాగా పట్టుకుని ఇంకో చేతి పిడికిలి మెల్లగా విప్పాడు. అతడి పిడికిలిలో బెరడు ముక్కలకు బదులు రెండు బ్లీడింగ్ హార్ట్స్ పూలు తడిగా మెరిసాయి. ఆ రెండుపూలను గుండెకి అదుముకుంటూ మాను మొదట్లో కూలిపోయి, చిట్లిపోయాడతను.
కొద్దిసేపు ఆగి చెట్టు దిగి కిందికి వచ్చి చూస్తే అప్పటిదాక లేని మొక్క ఒకటి మాను మొదట్లో కనిపించింది. ఆ మొక్కకున్న ఒక కొమ్మకు వేలాడుతున్న మూడు ఎర్రని పూలు గాలిలో అల్లిబిల్లిగా వూగుతూ కనిపించాయి. చెట్టు కింద ఆ కొత్తమొక్క, కొన్ని అడుగుల ఆనవాళ్లు తప్ప పొద్దుటినుంచి జరిగిన తతంగమంతా అబద్దమైనట్టు మైదానం ఏ మార్పు లేకుండా, ప్రశాంతంగా వుంది. జిట్టల రెక్కల చప్పుళ్ల మధ్య నా గుండె చప్పుడు ఎంతోసేపటిదాక వినిపిస్తూనే వుంది. ఇంత జరిగినా నాలో ఏ భయమూ లేదు, ఉద్విగ్నత తప్ప. నాలో ఎక్కడో దాగివుండిన అశాంతి కూడా మాయమైపొయ్యింది.
***
ఇది జరిగి చాలా కాలం గడిచింది. ఆ తరువాత ఇంకెవ్వరూ ఇటువైపు రాలేదు. వేప చెట్టు అప్పటిలాగే అందంగా వుంది. కొమ్మలను ఇంకాస్త విస్తరించుకుంది. ఇంకే మొక్కా ఎదగని చెట్టు నీడలో పెరిగి పెద్దదై మానును అల్లుకుపోయి కొమ్మల్లోకి కూడా దూరిపోయిన తీగకు ప్రతి సంవత్సరం ఈ కాలంలోనే మూడు ఎర్రని పూలు పూస్తాయి. ఆ పూలు కొమ్మనే అంటిపెట్టుకుని వున్న కొన్ని రోజులు ఓ పసిదాని కేరింతలు గడ్దిపూలలోంచి తేలివస్తాయి. పూలు వడలి కిందపడగానే వాటి పటుకొమ్మ కూడా రాలి పూలతోపాటు మట్టిలో కలిసిపోతుంది. మళ్లీ పాప కేరింతలు వినడానికి సంవత్సరమంతా ఎదురు చూస్తుంటాను నేను.
**** (*) ****
Painting: Eunike Nugroho
అద్భుతంగా ఉంది. కథ చాలా కొత్తగా కూడా ఉంది.
అరణ్య మిహిర్ గారికి అభినందనలు!
ధన్యవాదాలు రామకృష్ణ గారు.
కథనం బావుంది.. ఒక ప్రవాహం వెంట వెళ్ళుతున్న భావన కలిగింది….
ధన్యవాదాలు రాజకుమారి గారు.
చాల రోజులవుతోంది ఇంత మంచి కథ చదివి. మరీ మరీ చదవాలి అనిపించేట్టు, లోతుల్లో స్పర్షకి తెలియని అలికిడి చేస్తూ- కవితలా ఉంది ఇంచుమించు.