డైరీ

నిర్మోహం

ఏప్రిల్ 2016

జీవితాన్ని నిష్కామంగా, నిర్లిప్తంగా గడిపేస్తున్నానని, గడిపెయ్యాలని అనుకుంటానా..
అవును, రోజూ అనుకుంటూనే ఉంటాను
ఏ సంతోషపు శిఖరాలూ అధిరోహించలేను, ఏ దుఃఖపు గుహలూ దర్శించలేను
నాకొద్దీ మాయామోహపు బంధనాలు
అందుకే ఒక నిమిత్తమాత్రురాలిగా, ఒక ప్రేక్షకురాలిగా మారిపోతూ ఉంటాను
రాత్రి వరండాలో పుస్తకంతో కూర్చుంటానా
నా దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేస్తూ చందమామ నవ్వుతాడు
పైగా అడుగుతాడు కదా
నన్ను చూసి కూడా అలా నిర్మోహంగా జీవితాన్ని ఎలా చూడగలవు అంటూ
నన్ను కాదని తప్పించుకుని లోపలికి వస్తానా
వాకిటి గదిలో కొలువైన ఆ జీవం లేని కబుర్ల పెట్టె నేనున్నాను అంటూ నన్ను పలకరించబోయింది
ఎక్కడెక్కడివో ఎవరెవరివో అసహనాల్ని, ఆనందాల్ని నాలోకి ప్రసారం చేసే ప్రయత్నం చెయ్యబోతుంది
సరేలే
నాపేరే నిర్లిప్త అని చెప్పి
ఏమి ఎరగనట్లే దుప్పటి కప్పుకుని నిద్ర పోయే ప్రయత్నం చేస్తాను
ఎప్పటివో దృశ్యాల
ఎన్ని దశాబ్దాల నాటివి
క్లాసులో అల్లరికి ఝాన్సి టిచర్ ఆప్యాయంగా కోప్పడినట్లో
మంచి మార్కులకి మెచ్చుకున్నట్లో ఏవో జ్ఞాపకాలు
ఒక్క సెలవూ పెట్టాలనిపించని తియ్యని ఆ స్కూలు రోజులు
ఇంటి నుండి స్కూలుకి, స్కూలు నుండి ఇంటికి చేరవేసే రిక్షావెంకన్న
చిన్నప్పుడు తను ఇస్కూలుకి వెళ్లనేలేదని చెప్పేవాడు,
అయినా చిత్రంగా పదహారో ఎక్కం అడిగినా కూడా చెప్పేసే వాడు
ఎప్పుడో తాటిపళ్లు, ముంజెలు అమ్మేవాడుట, అలా అమ్ముతూ లెక్కలు, ఎక్కాలు నేర్చేసుకున్నాడట
భలే కదా, మేరీ టీచర్ అలా సరదాగా లెక్కలు నేర్పచ్చుగా
ఇంకా
నిద్ర రాకుండా ఏవేవో గతకాలపు మరువం, విరజాజుల కదంబం అప్పుడే విచ్చుకుంటున్నట్టు
అప్పుడెప్పుడో, అమ్మమ్మ వూరెళ్లబోతే
రైలు స్టేషన్లో ప్లాట్ఫాం మీద
ఎవరి చేతికో బేడీలు వేసి కొడుతూ తీసుకెళ్ళిన పోలీసు
పాపం, మంచివాడిగా మారమని చెప్పి వదిలి పెట్టచ్చుగా
దొంగ ముఖంలో బోల్డు దిగులు అవునూ,
అప్పుడోసారి సబర్మతీ ఆశ్రమం చూసేందు కెళ్లినప్పుడు గాంధీగారితో ఆ పరిసరాల్లో నేనూ తిరిగినట్టుగా ఎందుకలా అనిపించింది
స్వాతంత్రోద్యమంలో గాంధీగారితో పాటు పనిచేసిన తాతయ్య అక్కడే ఉండేవాడట
తాతయ్య చనిపోయిన తొమ్మిది నెలలకే నేను పుట్టానట
తాతయ్యే నారూపంలో మళ్ళీ పుట్టేడని అమ్మమ్మ చెప్పేది కదా
అవునా, తాతయ్యే నేనా? అందుకే సబర్మతీ లో అలా
అవును, నాకు ఇప్పుడు తెలిసిపోయింది

చార్మినార్ చౌరస్తా గుర్తొస్తోందేమిటిప్పుడు
ఒక పురాతన జ్ఞాపకంలా
అక్కడి ముత్యాల దుకాణాలు, ముసుగుల్లో చకచకా కదిలే సౌందర్యాలు , ఆ రంగురంగుల రాళ్ల గాజుల దుకాణాలు
అక్కడ వీధుల్లో కాళ్ళ క్రింద నలిగే దుమ్ము కింద నిశ్శబ్దంగా పరుచుకున్నట్టుండే ఏదో కనిపించని అశాంతి
ఏ ఒక్క చిన్న అలజడికైనా పెను ప్రకంపనలు పుట్టిస్తూ
అక్కడి మనుషుల జీవితాల్ని తిరగ రాసే ఒక భయానక వాతావరణం
మత్తుగా, ఒక స్వల్ప విరామ నిద్ర ముసుగులో ఉన్నట్లు
లేదు,లేదు వట్టిగా అలా కనిపిస్తుంది , అంతే
ఎప్పుడో చరిత్రలో జరిగిన ఏ విషాదమో ఒక భయాన్ని జ్ఞాపకంగా మిగిల్చిందా
అయినా ఏ అశాంతులైనా, అసహనాలైనా వ్యక్తి జీవితంలో సంక్లిష్టతనే కదూ చూబిస్తూంట
వాటిని నా ప్రేమతో ఇట్టే మాయం చేసెయ్యనూ
నిత్యం అతి సహజంగా హిందూ, ముసల్మానుల జీవితాల్ని ఒక సమిష్టి కుటుంబపు సాంప్రదాయ సౌందర్యంగా చూబిస్తూనే ఉంటాయి ఆ పరిసరాలు!
ఆ సన్నివేశానికి ఏ రాజకీయ నజరో తగలకూడదని నేను ఎప్పుడూ ప్రార్ధిస్తూ ఉంటాను
ఇప్పుడివన్నీ ఎందుకు తలుచుకుంటున్నాను
నే పెట్టిన నిర్మోహపు హద్దుల కావల ఎటు ప్రవహిస్తోందీ మనసు
నిద్ర పట్టిందో లేదో నాకే అర్థంకాని స్థితి
ఒక రాత్రి వేళ
కిటికీ బయట వర్షం చప్పుడు నిద్రపోతున్న నన్నుతట్టి లేపుతుంది
ఒక సుగంధంలా, ఒక కమ్మని రాగంలా చుట్టుకుంటుంది
తలుపు తీసి బయటకు రమ్మంటుంది
చేతులు చాచి తనను స్పర్శించమంటుంది
నిజంగా ఇవేవీ నావికావని, ఈ ప్రపంచం నాది కాదని ఎలా బ్రతకటం, కష్టం కదూ?!

**** (*) ****

Painting: B. Kiran Kumari