కథ

జీవించేందుకు సూత్రాలేమిటి?

అక్టోబర్ 2016

తెలతెల వారుతూంటే నిద్ర లేని రాత్రిని విసుక్కుంటూ మంచం దిగి బాల్కనీలోకి వచ్చాను. ఆకాశం దిగులుగా ఉందని తోచింది. నా మనసులో దిగులు ఆకాశానికి పులిమేసి చూస్తున్నానా లేక ఆ మబ్బులు నిజంగా ఆకాశానివేనా? ఇంతలో చటుక్కున వాన చినుకులు ఆరంభమయ్యాయి. నా అశాంతికి మృదువైన లేపనంలా చల్లని జల్లు ముఖాన్ని తాకుతోంది. ఒక్కసారిగా తెలియని ఆనందమేదో నా చుట్టూ పల్టీలు కొట్టింది. నన్ను పలకరించింది. చేతిలో టీ కప్ తో వచ్చి బాల్కనీ అంచున కూర్చున్నాను.

ఇష్టంగా నేను ఏర్పరుచుకున్న వ్యాపకాన్ని వదిలి పారిపోయి వచ్చేసేను. ఈ నచ్చకపోవటాలు నాకు ఎక్కువే. నాలుగైదేళ్లుగా ఏకాగ్రతతో ఒక రూపుకు తీసుకొచ్చిన బొటీక్ ‘శింగార్’ని, రేణు స్నేహాన్ని వదిలి ఇంటి కొచ్చాను. కొన్నేళ్లుగా వచ్చేందుకు ఇష్టపడని నాన్న ఇంటికి నా ఒంటరితనాన్నితోడుగా తీసుకుని వచ్చాను. ఈ ఇల్లు నాకు పరాయిగా మారిపోయి చాలా ఏళ్లైంది. చదువు నిమిత్తం పదిహేనేళ్లకే ఇంటికి దూరమైన నేను మళ్లీ వచ్చి ఉన్నదే లేదు. ఎప్పుడొచ్చినా ఒకటి రెండు రోజులు, ఒక అతిథిలాగా. అంతే. ఇప్పుడైనా నాన్న ఉద్యోగ రీత్యా దూరంగా ఉండటం వల్ల నా ఒంటరితనానికి ఎలాటి ఆంక్షలూ ఉండవని ధైర్యంగా వచ్చాను.

ప్రక్కింటి సంధ్య ఆంటీ తాళం ఇస్తూ చెప్పింది, ‘పల్లవీ, నువ్వు వచ్చే ముందు కాస్త చెప్పివుంటే ఇల్లు శుభ్రం చేయించి ఉండేదాన్ని. మధ్య మధ్య శుభ్రం చేయిస్తున్నా కాని ఇల్లంతా ఎలా ఉందో మరి. ప్రొద్దున్నే భాగ్యం వస్తుందిలే. ఈ రాత్రికి భోజనానికి మా ఇంటికొచ్చెయ్’
‘వద్దాంటీ. రాత్రి భోజనం ఏర్పాటు అయిపోయింది. రేపు కలుస్తాను’ అంటూ ఆవిడ ఇచ్చిన మంచినీళ్ల సీసాలు అందుకుని ఇల్లు తాళం తీసేను.

ఇంటికి వెళ్తున్నానని నాన్నకి చెప్పటంతో ఆయన చాలా సంబరపడిపోయారు. నా పలకరింపుకోసం ఆయన ఏళ్ల తరబడి ఎదురుచూస్తూనే ఉంటారని తెలుసు. కానీ పలకరించాలనే ఉండదు, ఏంచెయ్యను? రాత్రి పడుకోబోయేంతలో నాన్న కాల్ చేసేరు,

’అమ్ములూ, ఏమైనా తిన్నావా? అలమరలో ఇస్త్రీ దుప్పటి తీసుకుని పక్క వేసుకో.’ ఒక్కక్షణం ఆగి,

‘ఇక్కడికి వచ్చెయ్యరా తల్లీ’ అన్నారు.

‘కుదరదు నాన్నా.’

నాన్నకి గుడ్ నైట్ చెప్పేను, కాని నిద్ర వస్తేగా. అలమర తెరిచి చిన్నప్పటి కథల పుస్తకాలు, అపురూపంగా వేసి దాచుకున్న పెయింటింగ్స్ అన్నీ చూస్తూ కూర్చున్నాను.

సిధ్ధు కూడా బొమ్మలు గీసేవాడు. వాడి అనారోగ్యం వాడిని నెలకి మూడొంతులు ఆసుపత్రుల చుట్టూ తిప్పేది. అమ్మ తిండి, నిద్ర లేకుండా వాడితో గడపటం నిన్నమొన్న విషయంలా అనిపిస్తుంది తలుచుకుంటే. వాడు పుట్టినప్పుడు నాకు ఆడుకుందుకు ఒక చిన్న నేస్తం దొరికేడని మురిసిపోయేను. అమ్మ ముద్దు చేసినట్లే నేనూ వాడిని ముద్దు చేసేదాన్ని. వాడు పెరుగుతూంటే వాడి అనారోగ్యం పెరుగుతూ వచ్చింది. రానురాను అమ్మ నాకు సంబంధించిన పనులన్నీ నన్నే చేసుకోమనేది. అమ్మ నా కళ్లెదుటే ఉన్నా నా కోసం సమయాన్ని కేటాయించలేని స్థితి. అదంతా సిధ్ధూ మూలంగానే అని కోపం వస్తూండేది.

ఆరోజు నాన్న క్యాంప్ నుండీ వచ్చారు. నేను చదువు అశ్రధ్ధ చేస్తున్నానని, నిర్లక్ష్యంగా తయారవుతున్నానని అమ్మ దిగులుగా నాన్నతో చెప్పింది. తనవైపు నుండి క్రమంగా ఎదురవుతున్న దూరాల్ని నేను సహించ లేకపోతున్నానని, అదే నా ప్రవర్తనలోని విపరీత ధోరణికి కారణమనీ అమ్మకి తెలియదా? పోనీ, నేను ఎందుకలా ఉంటూన్నానో నాన్నకైనా అర్థం కాలేదా? ఒక్కనాడూ నా అలకనీ, బెంగనీ తీర్చే ప్రయత్నం చెయ్యనేలేదు. నా పసిమనసుకి ఇంత సులువైన పరిష్కాకారాలు తెలుస్తుంటే నాన్నకెందుకు తెలియవు?!

నాన్న కూడా తమ్ముడిని కొంచెం చూసుకుంటే అమ్మతో నేను ఎప్పటిలాగే ఆడుకోవచ్చు కదా. ఇదివరకైతే అమ్మా, నేనూ ఆడే ఆటల్లో రోజూ కలవకపోయినా శెలవొస్తే మాత్రం నాన్నమాతో జేరిపోయేవారు. కానీ సిధ్ధూ పుట్టేక, నాన్నఆఫీసు పని నిమిత్తం టూర్లతో ఎక్కువ గడిపేస్తూండేవారు.

అమ్మతో పాటు నాకు నాన్నకూడా నచ్చటం మానేసేరు.

తమ్ముడి వైద్యం కోసం నిరంతరం చేసే ప్రయత్నాలు, ఖర్చులు నాన్నని ఒక ఒత్తిడికి లోను చేసి, ముభావంగా, మునుపటి సరదాలకి దూరంగా ఉంచుతూ వచ్చాయేమో, ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది. కానీ నేను పోగొట్టుకున్న మధురమైన బాల్యాన్ని, ఆ అపురూపమైన క్షణాల్ని ఇప్పుడెవరైనా తీసుకొచ్చి నాకు ఇవ్వగలరా? అందుకే ఈ ఇంటి మనుషులు నాకు ఏమీ కారన్నది సరైనదే.

సిధ్ధు పుట్టేవరకూ అమ్మ కొంగు పట్టుకుని తిరిగేదాన్ని. అమ్మ చెప్పే కథలు, అమ్మతో ఆటలు, అమ్మ పెట్టే గోరు ముద్దలు అన్నీ నా ఒక్క దానికే స్వంతంగా ఉండేవి. అమ్మ నాకున్న ఒకేఒక స్నేహితురాలు. నాతో చదివే ప్రక్కింటి పిల్లలు ఆటలకి పిలిచినా అమ్మని వదిలి వెళ్లేదాన్ని కాదు. ఇంటిపనుల్లో సాయంగా ఉండే లక్ష్మి నన్ను బుజ్జగించి స్కూలుకి తయారుచేసేది. క్రమేపీ ఆమె దగ్గర ఒక ఓదార్పు వెతుక్కునే దాన్ని. అమ్మని నాన్నని చూసినప్పుడల్లా శత్రువుల్నిచూసినట్లే అనిపించేది. ఈ ఇల్లు, ఇంట్లో వాళ్లు నాకేమీ కారు, వీళ్లకి దూరంగా వెళ్లిపోవాలి అన్న ఆలోచన స్కూలు చదువు ముగిసే సమయానికి నాలో బలంగా ఏర్పడిపోయింది.

అంతే, రెసిడెన్షియల్ చదువుకి వెళ్లిపోయాను. ఇంటికి, అమ్మకి, నాన్నకి, సిద్ధూకి దూరంగా నాదైన ఒక ప్రపంచంలోకి వెళ్లిపోయాను. సిధ్ధూ అనారోగ్యం వాడిని భౌతికంగా మాయం చేసింది. వాడి వైద్యం గురించి వెళ్లి వస్తూ ప్రమాదంలో వాడితో పాటు అమ్మ కూడా మాయమైపోయింది. అలాటి పరిస్థితిలోనూ నాకు ఎలాటి దుఃఖం కలుగలేదు. నేను పొందవలసిన అమ్మ ప్రేమని వాడు లాక్కు పోయాడని వాడిమీద ఉన్నకసి వాడి నిష్క్రమణతోనూ తీరలేదు. పైగా వాడితో పాటు అమ్మనీ పట్టుకుపోయాడు.

సెలవులకైనా ఇంటికి రాని నన్ను చూసేందుకు నాన్న మాత్రం వచ్చి వెళ్లేవారు. ఇంటికి రమ్మని పిలిచినా ససేమిరా అనేదాన్ని. నా ప్రవర్తనతో నేను ఎవరిని శిక్షిస్తున్నానో నాకే తెలియదు. ఇల్లు జ్ఞాపకం వస్తే అమ్మ జ్ఞాపకం వస్తుంది. కానీ, అమ్మ నన్ను అసలు ప్రేమించిందా? లేదు. నేను కూడా అమ్మని ప్రేమించ లేదు. అమ్మే వద్దనుకున్న నాకు నాన్న అస్సలే వద్దు.

ఒకసారి సీతత్త నన్ను కలిసేందుకు హాస్టల్ కి వచ్చింది. ‘నాన్ననీ పూర్తిగా మర్చిపోయవా అమ్ములూ? నువ్వు కూడా దూరం అవటం నాన్న తట్టుకోలేకపోతున్నారు’ ఆవిడ మాటలు మౌనంగా విన్నాను. నోరు విప్పలేదు.

చదువుకునే రోజుల్లోనూ, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేప్పుడూ ఎవరితోనూ ఎలాటి అనుబంధాన్ని పెంచుకోలేదు. అందర్నీ అపరిచితుల్లాగానే చూసేను.

వరుణ్ తో పరిచయం, స్నేహం, కలిసి జీవించాలన్న ఆలోచనలు ఏవీ స్థిరంగా మిగల్లేదు. అతనిలో నాకు నచ్చినదల్లా అతనికీ తన ఇంటితో పెద్దగా అనుబంధం లేదన్నవిషయం ఒక్కటే. కానీ తన కుటుంబంలో తను ఎదుర్కొన్న ఒంటరితనం పోగొట్టుకోవాలనేవాడు. తన తల్లి కూతుళ్ల పెళ్లిళ్లు, వాళ్ల పిల్లల పెంపకాల్లో మునిగి తనని ఎక్కువగా పట్టించుకోలేదన్న అసంతృప్తి చెబుతుండేవాడు. దానికోసం పెళ్లి చేసుకోవాలని అనేవాడు. తనకంటూ ఒక కుటుంబం కేవలం తనది మాత్రమే కావాలనేవాడు. అలాటి జీవితంలోనూ నేను ఇమడలేననిపించేది.
‘మీ నాన్న గారిని కలిసి వద్దాం పద’, అంటే నేను ఒప్పుకోలేక పోయాను. ‘నాజీవితం కేవలం నాది, నాతండ్రి పాత్ర ఏమీ లేదు’ అని ఖచ్చితంగా చెప్పేసరికి వరుణ్ నా నుంచి కొంచెం కొంచెంగా దూరం జరగటం మొదలెట్టాడు.

చేస్తున్న ఐ.టి. ఉద్యోగం విసుగొచ్చింది. ఎలాటి ఆకర్షణా కనిపించలేదు. రిజైన్ చేసి కొన్నాళ్లు పెయింటింగ్ క్లాసులకి వెళ్లేను. బొటీక్ ఒకటి మొదలు పెట్టాలని ఆలోచన్లో ఉండగా రేణుక కలిసింది. ఆమె ఆలోచనలతో కొంత సారూప్యం కనిపించి కలిసి వ్యాపారం మొదలు పెట్టేను. నిజానికి దానిని ఒక వ్యాపారం లాగా కాకుండా ఒక కళగానే తీసుకున్నాను. రేణు, నేను కలిసి చేసిన డిజైన్లు, ప్రయోగాలు జనానికి నచ్చటం మొదలైంది. రేణు దాన్ని వ్యాపారంగా ఇంకా విస్తరించాలని ఆలోచన మొదలు పెట్టింది. మా అభిరుచిని ఇష్టపడే వారిని మరింత మందిని పోగుచేసుకుందుకు నాకు మాత్రం అభ్యంతరం ఎందుకు?!

విశాఖలో ఒక బ్రాంచ్ మొదలు పెట్టాలని, దానికి తను పూర్తి బాధ్యత తీసుకుంటాననీ చెబుతూ వచ్చిన రేణు ఉమ్మడి కుటుంబపు ఒత్తిళ్లతో తన మేనకోడలు బాల ని షాపుకి తీసుకురావటం, విశాఖ బ్రాంచికి నన్ను వెళ్లమనటం నాకు నచ్చలేదు. నా వ్యతిరేకత స్పష్టంగా చెప్పేను. నా పట్టు నేను వదల్లేదు. రేణు నన్ను ఒప్పించే ప్రయత్నం వదల్లేదు. అది నాకు సరిపడదని తెలిసి మెల్లిగా ‘శింగార్’ కి దూరం జరుగుతూ వచ్చి ఇక ఇప్పుడు పూర్తిగా వదిలి వచ్చేసేను.

మళ్లీ మరో క్రొత్త మజిలీ. ఆలోచిస్తున్నాను. ఎంతసేపైందో అలా కూర్చుని.

గమనించనేలేదు వాన వెలిసింది, ఆకాశంలో తెల్లని మేఘాలు పరుగులెడుతున్నాయి ఎక్కడికో!

ప్రొద్దున్నే సంధ్యాంటీ వచ్చి పలకరించింది.

‘పల్లవీ, రాత్రి నిద్ర పట్టిందా? ఇదిగో ఈ పిల్ల నస్రీన్. మన ఇంట్లో పనుల్లో సాయంగా ఉంటుంది. నువ్వు స్నానం చేసి వచ్చెయ్. కలిసి టిఫెన్ చేద్దాం. నస్రీన్ ఇల్లు శుభ్రం చేసి తాళం పట్టుకొస్తుందిలే, నేను వెళ్తున్నాను, ఇంకా పని అవలేదు’ అంటూ ఆవిడ వెళ్లిపోయింది.
నస్రీన్ వైపు చూసేను. వాన వెలిసేక ఇందాక ఆకాశంలో కనిపించిన తెల్లని మేఘం లా అనిపించింది. కళ్ల చుట్టూ పులుముకున్న కాటుక ఒక క్రొత్త మెరుపుని ఇచ్చింది ముఖానికి. పలకరింపుగా నవ్వేను. ఆమె నవ్వింది బిడియంగా. వయసు పదహారో పదిహేడో ఉంటుంది.
టిఫిన్ తింటూంటే ఆంటీ చెప్పింది ఇదివరకు పని చేసిన భాగ్యం మనవరాలే నస్రీన్ అని. భాగ్యం కూతురు ఎవర్నో ప్రేమించి, అతనితో వెళ్లిపోయి, పెళ్లి చేసుకుని నానా బాధలూ పడిందనీ, ఆఖరికి తెగ తెంపులు చేసుకుని ఏడాది క్రితం పిల్లలతో తల్లి దగ్గరకి వచ్చేసిందని చెప్పింది.

భాగ్యం అల్లుడికి భార్యతో పాటు పిల్లలు చర్చికి వెళ్లటం నచ్చలేదు. తన కొడుకు తనతో పాటు మసీదుకొచ్చి ప్రార్ధన చెయ్యాలని, కూతురు బురఖా వేసుకోవాలని ఆంక్షలు పెట్టేడు. తనకు నచ్చిన మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంట్లోకి తీసుకొచ్చేడు. దానితో భాగ్యం కూతురు అక్కడ ఇమడ లేక, తన బ్ర్రతుకు తాను బ్రతకగలనని పిల్లలతో ఇల్లు వదిలి వచ్చింది. భార్యతో, కూతురితో తనకు సంబంధం లేదని కొడుకుని మాత్రం తీసుకు వెళ్ళిపోయేడు ఆమె భర్త.

కూతురు చెప్పకుండా పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందన్నకోపం మనసులో పెట్టుకోకుండా భాగ్యం ఆదరించింది. ఈ ఆలోచన దగ్గర మనసు స్తబ్దుగా అయిపోయింది.

ఒంటరిగా ఆ ఇంట్లో తిరుగుతుంటే ఏదో తెలియని అశాంతి. వంటింటి బాల్కనీలో తులసిమొక్క, దానితో పాటు ఉండే కనకాంబరం మొక్క, మల్లె మొక్క… అవన్నీ ఎన్నేళ్ల క్రితం జ్ఞాపకాలో! ఒఠ్ఠి కుండీలు మిగిలేయి. వాటిల్లో ఎండిపోయిన మట్టిలో నీరు పోసేను. తులసిమొక్క పెట్టిన కుండీకి అమ్మ పసుపు, కుంకుమ పెట్టి రోజూ పూజ చెయ్యటం జ్ఞాపకం వచ్చి అప్రయత్నంగానే కుండీ చుట్టూ ఆ ఆనవాళ్లకోసం చూసేను. నిర్వ్యాపకంగా ఉన్న నా మనసు పాత రోజుల్లోకి వెళ్లి ఒక సాంత్వన కోరుతోందా? అందుకేనా చిన్ననాటి ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది నేను? రేపటి గురించి ఏవేవో చెయ్యాలన్న ఊహలు, ఆవేశం ఏమైపోయాయి? మూడు దశాబ్దాల జీవితం రేపటి మీద ఎలాటి ఆశల్ని మిగుల్చుకోనేలేదా? ఎక్కడుంది లోపం? ఉద్యోగజీవితంలో చుట్టూ ఉన్నఎందరినో చూసాను. ఎవరిని చూసినా ఏదో సాధించాలన్న తపనతో పరుగులు పెడుతూనే ఉన్నారు. పరుగు ఆపేసి నిలబడిపోయి ఏంచెయ్యాలన్న సందిగ్ధంలో మిగిలిపోయింది నేనేనా? జీవితాన్ని సవ్యంగా నడుపుకోవట్లేదన్న అసంతృప్తి ఏదో నన్ను ఆవరించి ఉందా? సవ్యంగా అంటే ఏంటి? ఎలా?

సాయంకాలం పనుల్లోకి వచ్చిన నస్రీన్ నవ్వుతూ పలకరించింది, ‘అక్కా, పనేదైనా ఉందా?’ అంటూ. లేదన్నాక అలాగే నిలబడి ఉండటం చూసి,

‘ఏమైనా కావాలా నస్రీన్?’ నా ప్రశ్నకి వెంటనే జవాబు చెప్పకుండా మొహమాటంగా ఉండిపోయింది. ఒక్క క్షణం ఆగి, సంకోచంగా ‘అక్కా, ఒక ఫోన్ చేసుకోవాలి.’ అంది. నా మనసులో వెంటనే వచ్చిన ఆలోచన ఈ అమ్మాయి కూడా తల్లిలా ఏదైనా ప్రేమలో పడలేదు కదా అని.

‘చేసుకో’ అన్నాను.

దగ్గరగా వచ్చి, గుసగుసగా చెప్పింది, ‘అక్కా, నాన్న పుట్టినరోజు ఈరోజు. నాన్నతో, తమ్ముడితో మాట్లాడాలి అని…’

ఇంకా చెప్పింది, ‘అమ్మకి చెప్పకుండా చెయ్యాలనుకుంటున్నా. చెబితే వద్దంటుంది’

నా అంగీకారం కోసం చూసింది. ఫోన్ అందించాను. తన చేతిలో చిన్న కాగితంలో ఉన్న నంబరును డయల్ చేస్తున్న నస్రీన్ ని చూస్తున్నాను. ఈ అమ్మాయికి తండ్రి అంటే కోపం లేదా? కొడుకుని మాత్రం స్వంతం అనుకుని తల్లితో సహా తనని పట్టించుకోని తండ్రి గురించి ఎంత తాపత్రయం.

బాల్కనీలో నిలబడి నవ్వుతూ ఉత్సాహంగా తండ్రితో, తమ్ముడితో కబుర్లు చెబుతున్ననస్రీన్ ని చూస్తే ముచ్చటగా అనిపించింది.
రెండు నిముషాల్లో ముగించి ఫోన్ వెనక్కి ఇస్తూ, ‘థాంక్స్ అక్కా. అమ్మకి తెలిస్తే కొడుతుంది కూడా.’ అంటూ నాకో హెచ్చరిక గా చెప్పి, వెళ్తానంటూ మెట్లు దిగింది.

రాత్రి భోజనం చేసి పుస్తకం తెరిస్తే సాయంకాలం నస్రీన్ రావటం మళ్లీ మళ్లీ కళ్లముందు కదులుతోంది.

నా అశాంతికి కారణమేదో నాకు తోస్తున్నట్టే ఉంది. నాకు దక్కటం లేదన్న ప్రేమ గురించి ద్వేషం పెంచుకుని, దాన్నిపదిలంగా పోషిస్తూ, మోస్తూ… నేనేం చేస్తున్నాను ఇన్నేళ్లుగా? నాకు చెప్పేవారు ఎవరూ వద్దని, లేరని కదూ నా అభిప్రాయం. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ చిన్నపిల్ల నన్ను ఎందుకిలా వెంటాడుతోంది? ఈ పిల్ల కూడా నాకేం చెప్పలేదే. మరి…, కానీ తండ్రి పట్ల ఆదరణ, ప్రేమ ఎలా వచ్చాయి ఆ పసి మనసులో?

ఏమో, రాత్రి మళ్లీ నిద్రరాని రాత్రిగానే మిగిలి పోయింది.

అయినా తెలవారి ఉత్సాహంగానే మంచం దిగాను. మొన్న ఫోన్ లో వీకెండ్ కి వస్తానన్న నాన్న మాటలు జ్ఞాపకం వచ్చి ఎందుకో తెలియని ఆనందం నన్ను ఆవరించింది. స్టేషన్ కి వెళ్లి నాన్నని రిసీవ్ చేసుకుందుకు ఏం డ్రెస్స్ వేసుకోవాలా అని ఆలోచనలో పడ్డాను.

**** (*) ****