నువ్వొస్తున్నావట
ఔను, పాత ఉక్రోషాలన్నీ మర్చేపోయిందీ మనసు
వచ్చేస్తున్నావ్, నాకు తెలుసు.
వేల మైళ్ల దూరాన్ని మనో వేగంతో ముందే దాటేస్తావ్,
ఇంతలోనే నడి ప్రయాణపు పలకరింపువవుతావు.
ఒట్ఠి పిచ్చివాడివి!
సమాంతరంగా నీతో ప్రయాణం చేస్తూనే ఉన్నానన్న వాస్తవం మరిచేపోతావ్
ఓహ్, నిజంగా వచ్చావ్.
అదే మబ్బుపట్టిన సాయంకాలం, అదే ఎదురుచూపుల వాకిలి
ఆ కాసిని మెట్లూ అధిగమించలేని అలసట నీ అడుగుల్లో
నీ ముఖంలో ఒక దైన్యం
మాటల దొంతరలు పేర్చని ఓ నిశ్శబ్దం
ఆ కళ్లల్లో ఏదో వెదకబోయి అర్థం కాక నిలబడ్డాను
ప్రకృతి వాయిద్యాలని శ్వాసించే నేను
నీ కబుర్ల కోసం నిలువెల్లా అశాంతినై పోయాను.
ఏం విన్నాను?
ఏమో, ఒక్క ముక్కా అర్థం కాలేదు.
కానీ …
పంచరంగుల కలలు కనే వయసులో
సప్త వర్ణ సంగమాన్ని దర్శించానంటున్నావ్
అప్పుడెప్పుడో సరదాగా వారణాశి చూడాలనుందన్న నన్ను
ఆ మహా శ్మశానాన్ని ఏం చూస్తావంటూ
ఎంతలా కోప్పడ్డావ్! జ్ఞాపకముందా?
పుష్కరం నాటి తొలి పలకరింపునీ
ఈ రోజే విచ్చిన తాజా సుగంధంలా దాచిపెట్టుకున్న నన్నేం చెయ్యమంటావ్?
నన్నూ, నా స్నేహాన్ని వదిలి ‘సెలవంటున్న నిన్నేం చెయ్యను, చెప్పు!
సూర్యాస్తమయాల్ని చూసి దుఃఖించే మనసు
ఊరుకుంటుందా?
రచయిత్రి అనురాధ “పునరపి” ఆమె ఇతర కవితల్లాగే సున్నితంగా ఉంది. ఆమె కవితలు నన్ను nostalgic చేస్తాయి. తెలుగు కి దూరంగా ఉన్న నాకు “పునరపి ” అంటే ఏమిటో ఆమె మాటల్లో విశదీకరిస్తే నేను కృతజ్ఞురాలినౌతాను.
కవితని రచయిత్రిగారు తనదైన శైలిలో వెలిబుచ్చేరు . బావుంది .
తినగా తినగా వేము తియ్యన అన్నట్టు…ఈ కవిత కి ఎన్నో అర్ధలో కనపడుతున్నాయి.
ఓహో పుష్కరాల గురించి రాసినట్టు ఉంది అని ఒక సారి , ఇంకో సారి passing cloud గురించి రాసినట్టు, మరింకో సారి ప్రియతమ రాక గురించి రాసినట్టు, ఇలా ఇంకా ఎన్నెన్నో అనిపిస్తున్నాయి. ఇలాంటి ఎన్నో అనుభవాలు వస్తూ వెళ్తూ ఉంటాయి మన రోజూ వారి జీవితం లో.
పునరపి అంటే మరల మరల (repetition or cycle ) అని విన్నట్టు గుర్తు. పునరపి అన్న టైటిల్ భలే ఉంది.
అనురాధ గారి టైటిల్స్ కొత్త రకం గా ఉంటాయి. మన వెన్నంటే ఉంటూ కనపడి కనపడని నీడ లాగా వుంది.