నిన్ను చూడాలని వస్తూ
సముద్రాన్ని యథాలాపంగా దాటేసేను.
అనంతమైనది కదా,
నా నిర్లక్ష్యాన్ని నిబ్బరంగా దాచుకుంది.
బొమ్మల దుకాణం ముందు మోకరిల్లిన బాల్యంలా
ఈ గుండె నీ సమక్షాన్ని శ్వాసిస్తోంది!
మన మధ్య దూరాలూ, కాలాలూ
కనుమరుగవుతూ సాగిపోయినపుడు
సూర్యుడూ, చంద్రుడూ, నక్షత్ర రాసులూ ఇట్టే కరిగి పోయాయి.
కరిగిన ఒక్కో క్షణం
ఒక్కో జ్ఞాపకమై బరువెక్కుతుంటే
భుజాల్ని విల్లులా వంచి తిరుగు ప్రయాణమయ్యాను!
శూన్య హస్తంలా నిలబడిన ఆకాశం
స్థితప్రజ్ఞతను ఎప్పుడో నేర్చుకుంది.
ఏమీ నేర్వని నేను
ఉప్పునీటి వారధుల్ని దారిపొడవునా కడుతుంటే,
దాటి వచ్చిన అనంతం
హృదయపు సరిహద్దుల్ని బద్దలు కొట్టేసింది!
మనస్సుకి ఏంత్తో దగ్గరగా అనిపించింది ఈ కవిత .ధన్యవాదాలు అనురాధగారు ! మీ కవిత ప్రవాహం ఎప్పుడు ఇలా సాగుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను
ఉప్పునీటి వారధుల్ని కట్టడం మాత్రమే తెలిసిన
మా హృదయపు సరిహద్దుల్ని బద్దలు కొట్టేసింది ఈ కవిత.
( రమణజీవి గారి “సముద్రం” కథ చదవమని విన్నపం )