కవిత్వం

కొన్ని రాత్రుల్లో..!

జనవరి 2013

మాట నాలుక కింద మడత పడ్తుంది
బాధ గుండె చుట్టే బేలగా తిరుగుతుంటుంది
చూపుకు ఆనుతున్నదేదో మెదడుకు అందదు
పదమొక్కటీ దొరక్క ప్రాణయాతన-

పెద్దగా ఆప్షన్స్ లేవు; ఏ పక్క గోడకు తల మోదుకుంటావన్నది తప్ప,
ఏ శూన్యంలో తలకిందులుగా వేలాడ్తావన్నది మినహా-

ఏం చేస్తావు నువ్వు?!

చాప మధ్యలో సకిలం ముకిలం వేసుకుని నలుదిక్కులకూ పరుగెడ్తావు
త్రికాలాల్లోకీ అదుపు తప్పిన బస్సులా ప్రయాణాలు చేస్తావు
ఎడమ అరచేత్తో గొంతు బిగ్గరగా అదుముకుంటూ
ఏడుపు కూడా అనాథను చేసిన జీవితాన్ని అదేపనిగా తలపోస్తావు-

ఉన్నవాడివి ఉన్నట్టుగా భూమి లోపల్లోపలికి కనబడకుండా మాయమవ్వాలని అత్యాశిస్తావు, సినికల్ గా
పాడుకునే వయసు కూడా కాదని దుఖ్ఖచింతతో కుప్పకూలుతావు-

తర్వాత పెద్దగా జరిగేదేం ఉండదు…
ఫోన్ తీసుకుని ఒక్కొక్క మిత్రునికీ
నీ మరణ వార్తను చేరవెయ్యడం మొదలుపెడ్తావు!