డైరీ

చుట్టూపక్కల చూడరా చిన్నవాడా!

ఫిబ్రవరి 2015

దే సమస్య. అపరిచితుల మొహాలు అప్రధానమైపోయాయి. ఎక్కడో అందమైన మొహాలు ఎదురైతే తప్ప, మొహాలు చూడ్డం మానేసాం. ముఖ్యం టైము లేదు. ఆగే వీలు లేదు. స్పీడ్. రన్ రాజా రన్. రోడ్లు ఉన్నది సాధ్యమైనంత వేగంగా సాగడానికే. వెళ్తున్నది బండిపైనైనా, కార్లోనైనా. బస్సులోనైనా. మేరే నైనా. ఇదే పరిస్థితి కదా నైనా సెహ్వాల్.

మహా అయితే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిముషాలు. అక్కడా పక్కవాళ్ళ మొహాలు చూసే అదృష్టం లేదు. అందమో, ఆరోగ్యమో, తల కాపాడుకోవడమో, మొహం చాటేయడమో… రీజనేదైనా అందుబాటులో ఉన్న బహుళార్ధసాధక రక్షణ కవచాలు అడ్డు. వాటికి తోడు ఆ కాస్త వ్యవధిలోనే అటెండ్ చెయ్యాల్సిన మొబైల్ కాల్సుంటాయి. కొల్లేరు కాకుండా చూడాల్సిన కొన్ని కొంపల బాధ్యతలు ఉంటాయి. ఇన్నింటి మధ్యన కొత్త మొహాలూ, చెత్త మొహాలూ ఏం చూస్తాం, నా మొహం?!

యాక్సెసిబిలిటీ లేదంటాం కానీ, వేర్ దేరీజ్ ఎ విల్, దేరీజ్ ఎ విల్స్ ప్యాకెట్. బస్టాప్, బేకరీ, కేఫ్, రిపేర్ సెంటర్, కిరాణా కొట్టు, చికెన్ సెంటర్, బార్ అండ్ రెస్టారెంట్… ఇవీ జీవితంలో తాత్కాలిక వేగనిరోధక శక్తులు. కాళ్ళూ, చేతులూ కాసేపైనా పార్కింగ్ చేసుకోవాల్సిన ప్రదేశాలు. భాయియోం ఔర్ బెహనోం. ఆగుము. ఇదే రకరకముల వదనారవిందముల వుద్యానవనము. ఒక్కొక్క మొహమును పరికింపుము. ఇదే మందుల షాపు. ఇదే బ్లడ్ బ్యాంకు. జీవితానికి.

కరపత్రములలోవలె తల త్రిప్పి చూడుము. ఒక మొహంలోని ఆందోళన ముందు నీ చింత జింతాక జితా జితా. మరియొక మొహంలోని క్యాడ్బరీస్ సెలెబ్రేషన్స్ నిన్ను కొత్త వైబ్రేషన్స్ దారిన పొయ్యే దానయ్యను చేస్తాయి. ఆ మహాతల్లి రెండు కనుబొమల మధ్యన తీర్చిద్దినట్టున్న కుంకుమబొట్టును చూడరా కుంకుమభట్టూ. నాగేశ్వరరావు కన్నా బుద్ధిమంతుడిలా బొట్టు పెట్టుకుని, నీ తండ్రి వెనకాల లూనాపై కూర్చుని, ఆంజనేలు గుడికి పోయిన రోజులు గుర్తొస్తాయి. ఇంకొక తండ్రి చంకలోని చిన్నారి పొన్నారి కిట్టయ్య నవ్వుల నావలో మన జీవితం అవలీలగా దాటెయ్యొచ్చనిపిస్తుంది.

మనుషుల సౌకర్యం ఉన్నచోటల్లా మొహాలు చూస్తుండండి. ముఫ్త్ మే. మొహానికో చరిత్ర ఉంది. ఈ చరిత్రలు రంగు రంగుల సిరాలతో. ఒక్కో మొహం ఒక సిగ్నేచర్ బాటిల్. నవనవోన్మేషంగా కాసేపైనా బతికింపజేసే నవరతన్ తైలం. మొహంలోని ముడుత పర్వతాల్ని ఎక్కి దిగి, కళ్ళలో ఉన్నదేదో కళ్ళతోనే తెల్సుకొని, నుదుర్లని రెండుసార్లు గుద్దుకొని, మీసాల మీది నిమ్మకాయల్తో లెమన్ రైస్ చేసుకుని తిందాం. నీ కంటి చెమ్మా, నే చూడలేనమ్మా అంటూ ఎవరికీ వినపడకుండానైనా పాడుకుందాం. మనల్ని మనం కాపాడుకుందాం. జై బోలో జిందగీ అందాం.

(Painting: Karen Elzinga)

**** (*) ****