డైరీ

ఆఖరి చూపు!

డిసెంబర్ 2014

స్ స్టాపులో నా ఎదురుచూపులకు తెర దించుతూ దూరంలో బస్సు. కళ్ళతో చకచకా ఫ్రేములు మార్చాలి. మొదట నెంబర్ ప్లేట్ పైన. “మెహదీపట్నం టు హయత్ నగర్”. తర్వాతి ఫ్రేమ్, ఫుట్ బోర్డ్ పైన. ఫర్లేదు, నెట్టుకుపోగలం. చివరి ఫ్రేమ్, బస్సులోని మధ్యభాగం. లోపలిదాకా వెళ్ళగలిగితే, నిలబడ్డవాళ్ళకి గాలి ఆడే అవకాశమూ వుంది.

తేరగా దొరకడానికి సిటీబస్సు సీటేమీ ఐఐటి సీటు కాదు. అది ఒక పూర్వజన్మ సుకృతం. అయితే సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లుగా అకుంఠిత దీక్షాదక్షతలకు అర చటాకు అదృష్టం తోడైతే సిటీబస్సు సీటూ సంపాదించగలం. దానికి కొన్ని టెక్నిక్కులు ఉన్నాయి.

బస్సు ఎక్కడంతోనే సీట్లలో కూర్చున్నవారి మొహాల్ని నఖశిఖపర్యంతం పరిశీలించాలి. కొన్ని ఫేసుల్ని చూడగానే తెల్సిపోతుంది, మధ్యలో దిగిపోయే ఫేసులని. మరికొన్ని డిపో ఫేసులుంటాయి. అంటే బస్సు డిపో వరకూ, వీలైతే లోపలిదాకా వెళ్తాయి. ఇందులో చాలావరకూ గురక ల్యాండ్లో ఉంటాయి. కండక్టర్ లేపేవరకూ నిద్రలేవని ఫేసులు. ఈ రెండూ కాక కొన్ని డిప్ప ఫేసులు ఉంటాయి. మాటిమాటికీ కిటికీలోంచి బయటకు చూస్తుంటాయి. ఇక తర్వాతి స్టాపులోనో, దాని తర్వాతి స్టాపులోనో దిగిపోయేట్లుగా హడావుడి పడ్తుంటాయి. కానీ, ఎక్కడా దిగకుండా చివరి స్టాప్ దాకా ప్రయాణిస్తాయి. ఈ ఫేసులున్న సీట్ల పక్కన నిలబడ్డమంటే నరకం క్యూలో నిలబడ్డట్టే లెక్క.
మధ్యలో దిగిపోయే ఫేసుని నిర్ధారించుకుని సదరు శాల్తీ ఉన్న సీట్ రాడ్ మీద ఒక చెయ్యినీ, అతనికి ముందున్న సీట్ రాడ్ మీద ఇంకో చెయ్యినీ వేసి శాల్తీని అష్ట దిగ్బంధనం చేయాలి. ఎంత దృఢంగా నిలబడాలీ అంటే గాలికి బస్సులు పల్టీలు కొట్టవచ్చుగాక, నువ్వు మాత్రం నీ ఉడుంపట్టు వదలరాదు. వెనుక ఉన్నవాళ్ళు ముందుకూ, ముందున్నవాళ్ళు వెనక్కూ, కండక్ఠర్ ఏకంగా బస్సులోంచే తోసెయ్యాలని ప్రయత్నించినా, ఆ ప్రయత్నాల్లో భాగంగా వారెంత అరిచినా, కరిచినా మనం మాత్రం మన ఇండివిడ్యువాలిటీ రాడ్ వదలకూడదు.

మొత్తానికి సీట్ సంపాదించి కూర్చున్నాను. ఆ ఆనందం గురించి వర్ణించడానికి ఏ కాళిదాసులూ, కన్నదాసన్లూ పనికిరారు. ఆ క్షణాన నువ్వొక చక్రవర్తివీ, ఛత్రపతివీ. నువ్వు సాధించిందేమిటో నీ పక్కన నిలబడ్డ ఫేసుల వైపు ఓరకంట చూసినా అర్థమైపోతుంది. లోకంలోని దీనత్వంతో మనకేల?… మొబైల్ తీసి, హెడ్ ఫోన్స్ పెట్టుకుని, కళ్ళూ, చెవులూ మూసుకుని, సాంగ్స్ వినడం మొదలుపెట్టాలి. ఇక అప్పుడు జీవితం సప్తసాగర గీతం. అన్నదమ్ముల వలెను బస్సులు, స్టాపులన్నీ దాటవలెనోయ్ అంటూ నోటికొచ్చిన పద్యాలు. పడ్తూ, లేస్తూ, మొత్తానికి ఆ ఆర్డినరీ బస్సు ఆబిడ్స్, కోఠి, మలక్ పేట దాటి దిల్సుక్ నగర్ చేరింది. ఇక్కడ అసలు కథ మొదలైంది.

లోకంలోని పిల్లలంతా ఇంటరే చదువుతున్నట్లు అనిపిస్తుంది, ఇక్కడకు రాగానే. దయతల్చి వదిలిపెడ్తే కాలేజీలోంచి వచ్చి బస్టాపులో పడ్డట్టుగా కుప్పలు తెప్పలుగా అమ్మాయిలూ, అబ్బాయిలూ. వాళ్ళ మీద స్వారీ చేస్తున్న మోతబ్యాగులు. సందడే సందడి. నానాపటేకర్ గొడవ. బిలబిలమంటూ బస్సులో అప్పటికే ఉన్న సంఖ్యకు నాలుగింతలు వచ్చి చేరారు. ఎక్కారు కానీ, లోపలకు రావాలంటే అబ్బాయిలకు నామర్దా. బస్సు లోపలి ప్రా౦త౦ నిషిద్ధ ప్రాంత౦. ఒకరి మీద మరొకరు కుప్పకూలుతూనైనా సరే, ఫుట్ బోర్డ్ మీద నిలబడి, మొహానికి తగిలే ఎదురుగాలిని జుర్రుకోవాలి. స్టాపు స్టాపునా ఎక్కాలీ, దిగాలీ, దిగేవాళ్ళని దయతల్చి దిగనివ్వాలి.

సరే, ఇదంతా రోజూ ఉన్నదే. దిగాల్సిన స్టాపు దగ్గర పడింది. లేచి మెల్లగా డోర్ వైపు వెళ్ళాలని ప్రయత్నం. రద్దీలో అడుగు తీసి అడుగు వేయడమే కష్టంగా ఉంది. నువ్వు దిగిపోతే మా పెరెంట్స్ మాకు ఖర్చులకు డబ్బులివ్వరు అని దబాయిస్తున్నట్లుగా ఒక్కరూ కదిలి దారి ఇవ్వడం లేదు. బస్టాప్ మరింత దగ్గర పడింది. అతి కష్టమ్మీద ఒక నలుగుర్ని పుట్ బోర్డ్ నుండి బతిమిలాడి పక్కకు తప్పించా. అబ్బాయిలతో మాట్లాడగలం. ఎడాపెడా తగుల్తున్న ఆ ఆజానుబాహు బ్యాగుల్తో ఏ భాషలో సంభాషించడం? జీవిత౦ ఈరోజుకు బ్యాగుబలి అయ్యేట్లుగా ఏమూలో కీడు శంకించింది. అతి కష్టమ్మీద బస్సు ఆగినట్లే ఆగి వెంటనే స్టార్టయ్యింది. ఫుట్ బోర్డ్ మీద సీన్ సితార. జిబ్రాల్టర్ రాక్స్ లాగా ఉన్నారు అబ్బాయిలంతా, కదలక మెదలక.

అదియొక పద్మవ్యూహము. అభిమన్యుడు ఆవహించుట అత్యావశ్యకము. విపరీత బలప్రయోగముతో, ఎవరిని, ఎటువేపుకు, తోసివేయుచున్నానో తెలియనివాడినై, కాల్జేతుల లక్ష్యము కేవలం బస్సు నుండి భూమ్మీదకు లంఘించుటయై, హతవిధీ. ఈ తొడతొక్కిడిలో ఎవరిదో చెయ్యో, కాలో, బ్యాగో తగిలి నా కళ్ళద్దాలు కిందకు జారిపోయాయి. వెతుక్కోవడానికి మెట్లపైకి వొంగడానికి కాదు కదా, తల కిందకు వాల్చి చూడడానికే అసాధ్యంగా వుంది. ఇక, నాలుగేళ్ళుగా నా శరీరంలో భాగమైపోయిన కళ్ళద్దాల గురించి ఆలోచించడం అనవసరం. తోపుకు సంబందించిన ఊపును కొనసాగించుటే తక్షణ కర్తవ్యంగా, ఆశయంగా, ఆదర్శంగా భావించి, ఒక్క దుముకుతో బస్టాప్ భూమిపై పడ్డాను. బస్సు సాగిపోతూనే వుంది. ఫుట్ బోర్ఢ్ మీద క్రిక్కిరిసి వున్న శతాధిక బాలుర మధ్యన, సూదిమొన మోపు స్థలము కూడా దృశ్యానికి అందకుండా వుంది. కానీ ఆ క్షణాన రెండు శబ్దాలు మాత్రం నాకు విస్పష్టంగా వినిపించాయి. ఒకటి, వాళ్ళ కాళ్ళకింద పడి నలుగుతున్న నా కళ్ళద్దాల చప్పుడు. రెండు, నా లోలోపలి మూలుగు.

**** (*) ****