కవిత్వం

పిడికిట్లో గాలి ఉందా?

మే 2016

గాలిలాగే అన్నీ కనబడవు
కాని తెలుస్తాయి
స్పర్శతో.. అనుభూతితో.. ప్రకంపనలతో

బంధాలైనా బాంధవ్యాలైనా ఏర్పడ్డానికి హేతువులుండవు
చినుకులకు మట్టితో ఏమిటి సంబంధం
కొంత పరిమళాన్ని దానం చేస్తూ
వర్షం వెళ్ళిపోతూనే ఉంటుంది తీరాలను దాటుకుంటూ –

నగ్నంగా గుడిసెల్లో పిల్లలు
పిల్ల కాల్వల్లో కాగితపు పడవల్ని వదుల్తూ.. పరుగెత్తుతూ.. అరుస్తూ
భాషే ఉండదు.. ఒట్టి బోసి పాదాలు.. జలజలా నవ్వులు

పడవెళ్ళిపోతున్నప్పుడు
కొంత కోల్పోతున్నప్పటి వీడ్కోలు దుఃఖం
అంతా నల్లగా అంటుకుపోతున్న తారు బంక.. బంధం

ఎవరెవరికి ఎవరు ఎక్కడి పరిచయాలో.. ఎక్కడ తటస్థపడడాలో
అల్లుకుపోతారు.. ఆకాశంలో మేఘాల్లా
ఒకరికోసం ఒకరు త్యాగిస్తూ
నిండా ఒక ధ్యాన నిశ్శబ్దంతో రాలిపోతున్న నక్షత్రాలౌతూ

కుటుంబమే ఒక పుష్ప గుచ్ఛమౌతుందో
అలలు అలలుగా మనుషులే కుటుంబాలౌతారో
అప్పటిదాకా కానరాని వర్షపు చినుకులు మబ్బుల్లో పొటమరించినట్టు
ఒక అన్నా తమ్ముడు, అక్కా చెల్లీ, ఒక మనిషి ఒక నీడ
ఒక పునాది ఒక గోడ గోడపై వ్రేలాడే ఒక పటం
మూసిన పిడికిట్లో బందీయైన గాలి
ఉందో లేదో తెలియదు

ఉనికి ఒక ప్రశ్నగా మొలకెత్తుతున్నపుడు
ఎగురుతున్న గాలిపటం దారం ఎక్కడో ఎవరి చేతుల్లోనో దాక్కుని
కుతకుతా అన్నం ఉడుకుతున్నప్పటి అంతః విస్ఫోటనం
మంట, గిన్నె బియ్యం, నీరు, చివరికి అన్నం
అంతే బాంధవ్యాలు అర్థం కావు

పక్షీ ఆకాశం, పువ్వూ మట్టీ, కొమ్మా చిగురు
పాదానికి ముల్లు దిగగానే కన్నీటి రసస్పర్శ

నిజానికి శరీరం అభౌతికమే
ఒక దిగుడు బావిని మెట్లు మెట్లుగా చూస్తున్నపుడు
ఎక్కడానికే కాదు దిగడానిక్కూడా మెట్లు కావాలన్న ఎరుక
లోపల చల్లగా చీకటిగా గుప్త ప్రాణంలా
నీళ్ళు
అంతా కాగితపు పూల పరమ సౌందర్యమే
పరిమళ స్పృహ అవసరమా ?

పాదాలు పాదాలుగా మనుషులు సమూహాలౌతున్నపుడు
దారి ఎరుక నడక స్పృహ ఉండాలిగాని
వంతెన గురించిన చింతన ఎందుకు?

ప్రవాహానికెదురీది వాగును దాటుతున్నప్పుడు
చేతిలో చేయేసి దడికట్టి ఎదురొడ్డడమే బంధం
అడుగులు అడుగులుగా గమ్యం వైపు నడవడమే బాంధవ్యం
శిరస్సూ పాదాలూ రెండూ ఆద్యంతాలు భూమ్యాకాశాలు
సమాకలించు అవధులను తెలుసుకుంటూ -

*