కవిత్వం

అలలు..

జూలై 2014

సముద్రంవలె..మనిషి నిండుగా..ప్రశాంతంగానే
కాని లోపల ఎన్ని యుద్ధాలో
ఉండీ ఉండీ ఎక్కడినుండో ఒక నిప్పురవ్వ అంటుకుంటుంది
అరణ్యం దహించబడ్తున్నట్టు జ్వలన..మంటలు..నింగికెగుస్తూ,
సరిగ్గా అప్పుడనిపిస్తుంది..ఎక్కడికైనా పారిపోవాలని
పారిపోతున్నప్పుడు..టకటకా రైలు పట్టాల చప్పుడు..లోహధ్వని
విడివడిపోవాలి..తెంచుకోవాలి..వియుక్తమై
పయనిస్తున్నప్పుడు వెనక్కి పరుగెత్తుతూ..చెట్లు..రోడ్లు..జీవితం
వర్షిస్తూ..గర్జిస్తూ..ఆక్రమిస్తూ కోట్ల జ్ఞాపకాలు
శరీరం ఒట్టి నిమిత్తమాత్రమే..తెలిసీ ఏదో అర్థంకాని పరితపన..ఆర్ద్రత
ఏకు..దారం..ఒకరినుండి మరొకరి కొనసాగింపు
ఏవో పురాస్మృతులు వెంటాడుతున్నపుడు
మూలాలకోసం అన్వేషణ
ఏవో లీలగా స్ఫురించే జాడలకోసం వెదుకులాట
నిన్నటి వెనుక ఏమిటి..రేపటి ముందు ఏమిటి..అన్న స్పృహ-

ఉండీ ఉండీ ఏ దేవాలయంలోనో ఒక పురాశిల్పాన్ని తాకుతున్నపుడు
దేహం విద్యుత్ స్పర్శతో జలదరిస్తున్నట్టు
ఆత్మ విస్ఫోటిస్తూ..విచ్ఛిన్నత సమ్మేళనాలతో పూర్ణాపూర్ణ వ్యంజనతో
లోపల వీణతీగ ప్రకంపిస్తున్నట్టు
ఒక రాగమో..ఒక నిశ్శబ్దశబ్దమో పొటమరిస్తున్నట్టు
ఏదో కరిగిపోతూంటుంది లోపల
బయటికి అంతా మామూలే..అభౌతిక అదృశ్య మాయ
హృదయం..తవ్వుతూ తవ్వుతూ బావి అడుగుకు చేరుతూంటుందికదా
సుప్తచేతనలోనుండి..బహిర్ వినీలాకాశంలోకి పక్షియై..ఎగిరిపోతూ
దేవతలు..ఉపదేవతలు..నదులు..ఉపనదులు..సముద్రాలు..మహాసముద్రాలు
శరీరానికి నాలుగు చేతులు..ఐదు ముఖాలు..అదృశ్య ప్రత్యక్షాలు
మానవ శరీరానికి ఏనుగు ముఖం..అశ్వ శిరస్సు
కళ్ళు మూడు..త్రికాల జ్ఞానం
భవిష్యత్తులోకి చొచ్చుకుపోయే చూపు
చూపులోనుండి అగ్నికీలలు..వర్షించే వసంతాలు
ఆయుధాలు సంహారానంతరం తిరిగి అమ్ములపొదిలో పునఃప్రత్యక్ష్యం
ఎక్కడో ఎవరో హృదయంతో అర్థిస్తే..ఎక్కడొ వినబడి
విశ్వాంతర ప్రతిస్పందలుంటాయా
ఆదుకునే చేతులూ..హత్తుకునే హృదయాలూ ఉంటాయా
యుగయుగాల కాలాన్ని దాటుకుంటూ దాటుకుంటూ
మనిషి తనను తాను వెదుక్కుంటూ
చుట్టూ ప్రకృతితో తననుతాను సంధించుకుంటూ..విముక్తమౌతూ
ఎక్కడో ఏదో ఒక రహస్యం బహిరంగమౌతూ..మళ్ళీ మార్మికమౌతూ
విభాగాకాంక్ష..ఏకం అనేకం..బహుళం వైయక్తికం
ఇక్కడినుండి..ఎక్కడికెళ్ళినా..ఇదే భూమి..ఇదే గాలి..ఇదే మానవ పరిమళం
అసలు సరిహద్దులుంటాయా..గీయబడ్తాయా
పరిధులనూ..అవధులనూ అతిక్రమిస్తున్నప్పుడు
ఆధారపీఠం సంగతేమిటి..కేంద్రకం

అడవులనూ..ఎడారులనూ..దేవాలయ సమూహాలనూ దాటిదాటి
అరణ్యాలనూ..ఆకాశాలనూ..పర్వతాంతర్లోకాలనూ
శిథిల సామ్రాజ్యాలనూ..ధ్వంసనాగరికతల్నీ
అధ్యయించి అధ్యయించి
ఒక సముద్రతీరంపై కూర్చున్నాడు అతడు
అలలు..తరంగాలు..కెరటాలు తీరాన్ని యుగయుగాలుగా స్పృశిస్తూ
అవిశ్రాంతంగా..నిరంతరమై..రేయింబవళ్ళు..శాశ్వతమై
ఆకాశంనుండి సముద్రం..సముద్రంనుండి ఆకాశం
అర్థమౌతోంది..కొంచెం కొంచెంగా -