డైరీ

తాళం చెవి దొరకడం లేదు!

మార్చి 2015

ప్రవేశిస్తున్న ప్రతిసారీ “లాకిన్ పీరియెడ్”గురించి స్పృహ
మూడేళ్ళా.. ఐదేళ్ళా.. అని
తలుపులు తెరుచుకుని.. మళ్ళీ మనమే మూసుకుని.. తాళంకూడా వేసుకుని
లోపల బందీ కావడం ఎంతకాలమో తెలియని అనిశ్చితి
మెడలో తాళి కట్టబడ్డ తర్వాత
“లాకిన్ పీరియెడ్” ఒక జీవితకాలం..ఇద్దరికీ
అప్పుడప్పుడు అనివార్యతలు లాకిన్ పీరియడ్ ను ధ్వంసం చేయమంటాయి
ప్రి-మ్యాచుర్డ్ పెనాల్టీలు భయపెడ్తాయి
ఉల్లంఘనకూ.. విముక్తతకూ సిద్ధపడుతున్నపుడు
తాళం చెవి దొరకదు.. ఎక్కడో పడిపోతుంది..వెదకాలి
ఇద్దరు మనుషుల మధ్య దూరాన్ని తెలుసుకోవడమే తెలియనప్పుడు
రెండు మనసుల మధ్య దూరం అస్సలే అర్థంకాదు
ప్రయాణం కూడా పరిధినుండి కేంద్రం వైపా..కేంద్రం నుండి పరిధివైపా బోధపడదు
నడకమాత్రం తప్పదని తెలుస్తూనే ఉంటుంది
గమ్యం స్పృహ కలుగగానే
ఎదురుగా ఉన్న బస్సు నుదుటిమీదున్న బోర్డును చూస్తావు
చేరవలసిందక్కడికే.. కాని ప్రయాణం ఎంతసేపో..ఎందుకో తెలియదు
కాలం..వేగం..దూరం.. ఉనికీ అస్థిత్వాల స్పృహ
మధ్య ఒక కనబడని ముడి.. ఒక ఒకటి.. ఒక మూడు
అది పదమూడో.. ముప్పయ్యొక్కటో.. ముడిని విడదీయాలి
కుడి ఎడమల మీమాంస.. దూరంగా భూమ్యాకాశాలు కలుస్తూ
దిగంత రేఖ..కలిపేదా..విడదీసేదా
చేయిని మడుస్తే సరిగ్గా నోటిదగ్గరికే చేరిక..డైమెన్షనల్ ఆక్యురసీ
“బయో-మాథమేటిక్స్” ఉంటుందా
ముక్కు తలపై ఎందుకు నిర్మించబడలేదో..చర్మం చూడడం..కళ్ళు మాట్లాడడం
మనసు మెలమెల్లగా హృదయంగా పరివర్తిస్తూండడం
శక్తి వస్తువై..వస్తువు మళ్ళీ శక్తిగా మారుతూ నిరంతర నిత్యత్వం..అంతా ప్రహేళిక
మజిలీలు మజిలీలుగా యాత్ర
ఏకునుండి దారం.. దారం నుండి వస్త్రం..మంచుదుప్పటిని కప్పుకుని ప్రకృతి
తీపి నది ఉప్పుగా మారుతానని తెలిసీ సముద్రసంగమ కాంక్షతో పరుగెందుకు

నదిని అందుకోడానికి ఒక్కడుగుకూడా వేయలేని సాగర నిస్సహాయత..శిక్షా.?
ఎ టి ఎం చీలికలో కార్డ్ దూరిన తర్వాత “పాస్ వర్డ్” జ్ఞాపకం రావడం లేదు
టైమౌట్ హెచ్చరికలు అందుతున్నపుడు
నిర్ణయించుకోవాలి.. రణమా.. విరమణమా-ఏదో ఒకటి

**** (*) ****