కథ

బౌండరీ దాటిన బాలు

జూన్ 2016

రో క్లాసు చదువుతున్న జంగారెడ్డి పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు. సాయంత్రం ఆట మొదలు పెట్టినపుడు “కొత్త కార్కు బాలు జర మెల్లగ కొట్టున్రి… ” అని అందరికీ మరీ, మరీ చెప్పాడు. ఆ ఫుల్టాస్ పడేదాకా అంతా అతని మాట విన్నట్టే అనిపించింది. బౌలర్ చెయ్య జారడం..బాటింగ్ చేస్తున్న షాజర్ కి బాలు బదులు ఫుట్బాలు కనిపించడం అరక్షణం తేడాలో జరిగింది, మిగిలిన అరక్షణంలో బాలు తాడి చెట్టంత ఎత్తెగిరి మైదానం పక్కనున్న ముళ్ళ పొదల మధ్యన పడింది.

ఆటగాళ్ళు జరిగింది దిగమింగుకునే లోపు షాజర్ కాలనీ వైపు బాణంలా దూసుకుపోయాడు, జంగారెడ్డి కసిగా కాస్త దూరం వెంబడించాడు కానీ బాలు వెతకాలనే ఆలోచన అతడిని వెనక్కి తెచ్చింది. వికెట్లతో పొదలు నెడుతూ అడుగడుగునా గాలించాడు, ఎంత వెతికినా బాలు ఆచూకీ చిక్కలేదు. అంత దాకా ఓపిగ్గా చూస్తున్న సూర్యుడు ఆశ వదులుకుని ఆకాశపు జారుడుబల్లపై చల్లగా జారుకున్నాడు, గ్రౌండ్లో చీకటి నిశ్శబ్దంగా ఆవరించింది.

అంతా తప్పు చేసిన మొహాలతో విడిపోయాకా జంగారెడ్డి, సుబ్రహ్మణ్యం మిగిలారు. నిగ, నిగలాడుతూ ఊరించిన ఎర్రటి బంతి, తండ్రిని రెండు నెలల పాటు వెంట పడి, సాధించిన అందమైన కల… రంగు మార్చుకుని చీకటిలో కలిసిపోయింది. అపురూపంగా దాచుకున్న బాలుని గొప్పకి పోయి పోగొట్టుకున్నాననే భావం జంగారెడ్డిని పాత పుండులా సలుపుతోంది. రోజూ క్రికెట్ సామాగ్రి పట్టుకుని పరువుగా ఇంటికి నడిచేవాడు, ఈ రోజు అవి భుజాలపై భారంగా అనిపిస్తున్నాయి.

జీవం లేని మొహంతో “బాపూని మస్తు సతాయించి కొనిపించినా, గిప్పుడు పొడగొట్టిన సంగద్దెలిస్తే చాన కోపమయితడు” అన్నాడు జంగారెడ్డి

”ఇంటికెళ్ళగానే మీ అమ్మకి చెప్పు, ఆవిడ చెబితే మీ నాన్న కోప్పడరేమో.?…” అని మాములుగా అన్నాడు సుబ్రహ్మణ్యం.

“అవన్నీ నడ్వవు….” అని అంటుంటే అన్ని దార్లు మూసుకున్నాయన్న భావం స్పష్టంగా తెలుస్తోంది.

జంగారెడ్డి ఇంటి ముందుకు చేరుకోగానే “నువ్వేం కంగారు పడకు, ఏం చెయ్యాలో పొద్దున్నాలోచిద్దాం” అని రాత్రిపై భరోసా మోపి ఇంటి ముఖం పట్టాడు సుబ్రహ్మణ్యం.

రెండు గదుల ఇంటికి చేరుకోగానే జంగారెడ్డి గుమ్మం ముందు కాసేపు తచ్చాడాడు. ఓ మూడు సార్లు ఇంటి చుట్టూ ప్రదక్షిణం చేసాడు. ఎంతకీ తండ్రి మాటలు వినబడకపోయేసరికి కాస్త నిబ్బరంగా ఇంట్లోకి అడుగుపెట్టాడు “అమ్మా! బాపు ఏడుండు?” అని యాదమ్మని అడిగాడు

మొదటిసారి తండ్రిని అడిగాడని ముచ్చటపడింది యాదమ్మ “నాయన పెద్ద సారెంబడి హుజురాబాద్ పోయిండు, రేపొస్తడు” అని సాగదీస్తూ జవాబు చెప్పింది.

తండ్రి ఇంట్లో లేడని వినగానే జంగారెడ్డి మొహం మొగ్గలా విచ్చుకుంది, వెంటనే ముడుచుకుంది- అవును ఈ రాత్రికి రేపటికి మధ్య ఎంత దూరముంది? ఈ లోపు బంతి దొర్లుకుంటూ వస్తుందా… వచ్చి రక్షిస్తుందా? అనుకోగానే మొహం నిండా దిగులు అలుముకుంది. కాళ్ళు కడుక్కుంటూ “అమ్మా! ఇగో ఇంటున్నవ… బాలు షాజర్కి ఇచ్చినా, రేపిస్తడు” అన్నాడు.

మొహం ప్రశ్నలా పెట్టింది యాదమ్మ, ఏదో గుర్తొచ్చి పనిలో పడింది.

జంగారెడ్డి దోరగా కాల్చిన చపాతీలో చక్కర జల్లి, గట్టిగా లుంగచుట్టి, అలవాటు ప్రకారం కొరికాడు. చేదుగా అనిపించింది,

“బాపూ రేపొస్తడు” అని స్వగతంలో అనుకున్నాడు. పడుకునే ముందు “బాపూ వచ్చినంక ఏమయితదో” అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.

“వీన్కి ఆవారా తిర్గుడు బాగెక్కువైంది, బాలు పొడగోట్టిండు..ఒక లచ్చం లేదు, సద్వు సంద్దెల్లేవ్” అన్నాడు మల్లారెడ్డి

“నువ్వుండు.. నేన్ జెబ్తా” అని కలగజేసుకుంది యాదమ్మ

“నడిమిట్ల రాకు, ఈడుంటే ఇట్లనే బిగ్డాయించిపోతడు. పొద్దుగాల తోడ్కబోయి గౌరమ్మింటికాడ హాస్టల్ల పెడ్త, సక్కగయితడు ” అన్నాడు

“బాపూ! నేను అత్తమ్మ దగ్గర్కి బోను, ఈడనే ఉంటా” అని జంగారెడ్డి ఏడుస్తున్నాడు

“నువ్వు ఏడ్వు… మొత్తుకో” అని మాటలు కరకుగా వినిపించాయి.

“బాపూ.. కిర్కిట్ ఆడ, గన్నీ బంద్ జేస్తా…“ మాటలు చీకట్లో కలిసిపోయాయి.

“ఇగో ఇంటున్నవా, ఈని బట్టల్ సర్దు” అని మల్లారెడ్డి గట్టిగా అరిచాడు. ఆ అరుపు మారుమ్రోగుతుంటే భయపడి బయటకి పరుగెట్టాడు జంగారెడ్డి, పరుగెడుతుంటే ఎదురుగా లోతైన గుహ కనిపించింది. తండ్రికి దొరకడం కంటే చీకటి మెరుగనిపించి లోనికి పరిగెట్టాడు. ఏమీ కనపడక పోయినా వెనక్కి చూడకుండా పరిగెడుతున్నాడు. గుహ తరువాత మరో గుహ…అరలు అరలుగా దాటుతున్నాడు. చెప్పులు తెగిపోయినా ఒగురుస్తూ పరిగెడుతున్నాడు. చాలా సేపటకి మిణుకు, మిణుకుమంటూ మెరుస్తున్న దీపపు కాంతి కాస్త దూరంలో కనిపించగానే కాస్త ఊపిరోచ్చింది. అది దీపంలా కాదు చేతులు చాచి పిలుస్తున్న స్వేచ్ఛలా అగుపించింది. లేని సత్తువని కూడగట్టుకుని చివరి అడుగు వేయగానే ఎవరో బలంగా తోసినట్టు ఎగిరెళ్లి పడ్డాడు. ఒగురుస్తూ లేచి, గాలిలో తడిమి చూస్తే గుహ ద్వారం వద్ద ఉక్కు ఊసలు…బయట దీపం ఉజ్జ్వలంగా వెలుగుతోంది.

ఒంటి నిండా చెమటతో జంగారెడ్డి ఉలిక్కిపడి లేచాడు. అది కలలా అనిపించలేదు, జరగబోయేది కాస్త ముందుగా చూస్తునట్టు అనిపించింది. ఆ క్షణం తన భవిష్యత్తు బాలుకి చుట్టుకుందని అర్థమయ్యింది.

***

మతిమరుపు సూర్యుడు తాజాగా ఉదయించాడు, కలత నిద్ర జంగారెడ్డిని భయపెడుతోంది. లేచిన క్షణం నుంచి గోడకి ఆనుకుని పుస్తకాలు ముందు నటిస్తున్నాడు, నిజానికి నిముషాలు లెక్కపెడుతూ గడప కేసి చూస్తున్నాడు. “ఈడు నా తీరుగ ప్యూను గావొద్దు, పెద్ద సారు లెక్క గావాల..” అని అరిగిపోయిన రికార్డులా తండ్రి అరవడం విన్నాడు. విని విని విసిగిపోయాడు. ప్రపంచంలో ఏ పొరపాటు జరిగినా కొడుకు చదువు నిర్లక్ష్యం చేస్తున్నాడని అనుకుంటాడు. చిరాకు స్థాయిని బట్టి తిడతాడు లేక కొడతాడు. అందుకే జంగారెడ్డికి చదువంటే విరక్తి కలిగింది, క్రికెట్ ఆడుతున్నంత సేపు సంతోషంగా ఉంటాడు.

“పెద్ద సారు లెక్క గావల్నంటే బాగా సద్వాలే.. కిర్కీట్ బాట్ పట్కోని కాదు.. గా బాపనోల్ల పిలగాని లెక్క సద్వాలే.. ” అని యధాలాపంగా అంది యాదమ్మ.

“సుబ్బుగాడు దినమంతా మైదాన్లనే ఉంటడు” అని లోపల గట్టిగా అరిచాడు..

కుంటుతూ, కుంటుతూ గోడ గడియారం పన్నెండు కొట్టింది. గంట కొట్టిన వేళ ఒక విశేషం జరిగింది

“చాయ్కి పాల్లేవు… జర మల్లేష్ తానకి బోయి ఒక ప్యాకిట్ తీస్కరా” అని రెండు రూపాయలు జంగారెడ్డి చేతిలో పెట్టింది యాదమ్మ.

పాల అవసరం ప్రాణ ప్రతిష్ట చేయగానే “అమ్మా! సుబ్బు తానకి బోయి జర సేపు సద్వుకుంటా, ఒస్త ఒస్త పాల్తెస్త ” అన్నాడు. నూరి పోసిన మాటలు కాస్త ఆలస్యమైనా ఫలితం చూపించాయని ఆవిడ మోహంలో సంతోషం తొణికిసలాడి “జల్దీన రా.. “ అని పంపింది.

గడప దాటగానే రేసు గుర్రంలా పరిగెత్తి స్నేహితుడు సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నాడు. “సుబ్బూ.. బాపూ క్యాంపుకి బోయిండు, సాయంత్రం ఒస్తడు..” ఒగురుస్తూ అన్నాడు జంగారెడ్డి.

“తిడతారు, లేదంటే నాలుగు తగిలిస్తారు.. దానికంత భయమెందుకు?” కొట్టడం పెద్దవాళ్ళ హక్కులా సావకాశంగా చెప్పాడు సుబ్రహ్మణ్యం.

“ఆవన్నీ అయిపోయినయి.. ఇప్పుడు సీదా హాస్టల్ల పెడ్తడు” అని రాత్రొచ్చిన కల పూస గుచ్చినట్టు చెప్పాడు. సుబ్రమణ్యానికి కల చూసినట్టు అనిపించడంతో విపరీతంగా భయం వేసింది. తను మాట్లాడే మాటలు సగం పైగా కోతలని, మిగతా సగం దాటవేయడమని జంగారెడ్డికి తెలీదు. నమ్మకం పెట్టుకుని వచ్చాడు, వమ్ము చేయకూడదని అనిపించడంతో “కొఠీలో కార్కు బాల్ కొట్టు నాకు తెలుసు” అని తోచిన సలహా ఇచ్చాడు. జంగారెడ్డి జేబులోంచి రెండు రూపాయలు తీసి చూపించాడు.

***

బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న పాన్ డబ్బాలోంచి “సలామ్మే..ఇష్క్.మేరీ జాన్…జరా కబూల్ కర్నా..“ పాట వినిపిస్తోంది. డబ్బా వెనుక నక్కిన మిత్రులు చూస్తున్నారు, ఇద్దరికీ గుండె చప్పుడు బయట నుండి వినిపిస్తోంది. ఓ అరగంట తర్వాత దుమ్ము రేపుతూ సిటీ బస్సు పొగరుగా ఆగింది. వారి చూపులు బస్సు దిగిన వారిని, ఎక్కేవారిని పరీక్షగా చూసాయి. బస్సు బయలుదేరే చివరి నిముషంలో బస్సెక్కారు. మరో మారు చుట్టూ చూసి ఓ మూల స్థిమితపడ్డారు.

కండక్టర్ టికెట్లు కొడుతూ, నిక్కర్లని అనుమానంగా చూసాడు “ఏడికి బోవాల?” అని అడిగాడు.

అలవాటులేని ప్రశ్నకి ఏం చెప్పాలో తెలియక మొహామొహాలు చూసుకుని “కోఠీ” అని ఎలక్షన్ రాలీలా ఒకేసారి అరిచారు.

“గదే..రామ్ కోఠీనా? కింగ్ కోఠీనా?” అని చేతి సంచీలో చిల్లర పైకీ, కిందకి కలియతిప్పుతూ అడిగాడు కండక్టర్

“కార్క్ బాల్ దొరికే కోఠీ” అని జంగారెడ్డి వైపు గర్వంగా చూసాడు సుబ్రహ్మణ్యం. మండుటెండలో మంచి జోక్ వేశాడని దగ్గరగా కూర్చున్న పాసెంజర్లు నవ్వుకున్నారు.

“బాలు రోడ్డు మీద దొర్కదు” అని పాసెంజర్లని మరోసారి నవ్వించాడు కండక్టర్

పిల్లల అవస్థ చూస్తున్న పెద్ద మనిషి “ఉమెన్స్ కాలేజీ దగ్గర మస్తు దుక్నాలుంటయ్” అని కలగజేసుకుని సహాయపడ్డాడు.

కిటికీలోంచి కదిలే దృశ్యాలని మైమరచి చూస్తున్నారు. ఇద్దరికీ సొంతంగా చేస్తున్న మొదటి సుదీర్ఘ ప్రయాణం. బ్రిడ్జిలు, కార్లు, దుకాణాలు కనిపించి చెరిగిపోతున్నాయి, మళ్ళీ కొత్త బొమ్మలు పుడుతున్నాయి. సుబ్రహ్మణ్యం కాస్త అప్రమత్తంగా ఉంటూ ఆగిన ప్రతి చోటా “కోఠీ వచ్చిందా? కొఠీ వచ్చిందా?” అని పక్క వారిని అడుగుతుంటే ఎదురుగా కూర్చున్న విద్యార్థికి విసుగొచ్చి మొహాన్ని పుస్తకంలో ముంచాడు. అరగంట తర్వాత ఇంకో పెద్దమనిషి సహాయంతో ఉమెన్స్ కాలేజీ దగ్గర దిగారు.

ఎటు చూసినా జన ప్రవాహం, ఎత్తైన సినిమా హోర్డింగ్లు, తీక్షణంగా వెళ్తున్న సిటీ బస్సులు, తోపుడు బండిపై అరటిపళ్ళు, నిక్కర్ వేసుకున్న బక్క ప్రాణాలకి ఊపిరి ఆగినంత పనయ్యింది. పెద్ద వాళ్ళ చేతులు పట్టుకుని ఫుట్ పాత్పై నడవడం ఒక ఎత్తు, ఏ చేతుల సాయం లేకుండా ప్రవాహంలో దిగడం అతి పెద్ద సాహసం. చిన్న పిల్లలని బొంబాయి ఎత్తుకెళ్ళే ముఠా హైదరాబాద్లో ఉందని రేడియోలో ప్రకటనలు వినడంతో ఎవ్వరినీ దారి అడగొద్దని నిర్ణయించుకుని నడుస్తున్నారు. దుకాణాల బోర్డులు చూస్తూ అరగంట తిరిగారు. బట్టలు, పుస్తకాలు, మిఠాయి, సమస్త సామాన్లు కనిపిస్తున్నాయి తప్ప బాటు, బాలు బొమ్మ ఉన్న దుకాణం ఒక్కటీ కనిపించలేదు. ఇక సుబ్రహ్మణ్యం నిజం చెప్పక లేదు “నేను మా నాన్నతో వచ్చాను” అన్నాడు. మాములుగా అయితే జంగారెడ్డి గట్టిగా అరిచేవాడు, జుట్టు పీక్కునేవాడు. సందర్భం కాదని ఊరుకున్నాడు.

క్లోక్ టవర్ దగ్గరకి రాగానే ఒక ప్రతిపాదన చేసుకున్నారు. గళ్ళ లుంగీ కట్టుకుని, పాన్ నములుతూ “అల్లమురబ్బా…అల్లమురబ్బ” అని అమ్ముకుంటున్న వ్యక్తిని ఒక పది నిముషాలు గమనిస్తూ వెంబడించారు. ముఠావాడు కాదని గట్టిగా అనిపించాకా జంగారెడ్డి అతని దగ్గరకి వెళ్లి “అన్నా! కిర్కిట్ దుక్నం ఏడుంది?” అని అడిగాడు. ఆ వ్యక్తికి మనుషులని గమనించడమే పని, పనిలో పని వీళ్లని కూడా గమనించాడు. కాన్వెంట్ పిల్లలు ఆట పట్టిస్తున్నారని “మియా ఆంఖ్ నహీ దిఖ్ రా క్యా… ఓ ఆగే క్యా హై???” (కళ్ళు కనిపించట్లేదా, ఆ ఎదురుగా ఏమిటి?) అరిచినంత పని చేసి ఎదురుగా చూపించాడు. అక్కడ ఊరిస్తూ ఆట వస్తువుల దుకాణం కనిపించింది. తిట్టించుకున్నా ఫలితం దక్కిందని సంతోషంగా అటు వైపు వెళ్లారు.

దుకాణం నిండా జనం మూగి ఉన్నారు. యజమాని జర్దా నములుతూ హడావిడిగా తిరుగుతున్నాడు.

“అన్నా! కార్కు బాలు కావాల” అని అడిగాడు జంగారెడ్డి

దుకాణం వాడు “దో రుప్యే” అని నిచ్చెనెక్కి పై సొరుగు నుండి కొత్త బాలు తీసి కౌంటర్ పై పెట్టాడు.

బస్ టికెట్లు కొన్నాకా మిగిలిన చిల్లర మొత్తం అద్దాల కౌంటర్ పై పోసాడు, యజమాని రెండు సార్లు లెక్క పెట్టి “ఆఠానా కమ్ హై” అన్నాడు.

ఆ మాట వినగానే ఇద్దరు మొహామొహాలు చూసుకున్నారు. ఆశించకపోయినా అంతా సవ్యంగా జరుగుతోందని భయంగా ఆశ్చర్యపడ్డారు, ఇప్పుడు భయం మిగిలింది. సుబ్రహ్మణ్యం గొంతు సర్దుకుని “ప్లీజ్ తర్వాత ఇస్తాము” అన్నాడు. యజమాని నవ్వుకున్నాడు, ఎదురుగా ఉన్న ’క్రెడిట్ టుమారో’ బోర్డ్ చూపించాడు. “ఐసే రోజ్ ఆతే” అని పక్క గిరాకీ దగ్గరికి వెళ్ళాడు.

జంగారెడ్డి దృష్టి రోడ్డుపై నిలిచింది, స్కూటర్పై నాన్న నడుం చుట్టూ చేతులు బిగించి వెళుతున్న పిల్లవాడు, నాన్న పక్కన నవ్వులు చిందిస్తూ నడుస్తున్న చిన్న పాప, ఎవ్వరి మోహంలో భయం లేదు. సుబ్రహ్మణ్యం కేసి ఇక వెళ్దామా అన్నట్టు చూసాడు.

పొడుగాటి చెయ్యి అద్దాల కౌంటర్ పై “ఏ లో” అని అర్ధ రూపాయి పెట్టింది, ఇద్దరూ తలెత్తి చూసారు. పొడవుగా, చిన్న గెడ్డంతో ఉన్న వ్యక్తి “మల్లారెడ్డి కె బేటే హోనా తుమ్?” అని అడిగాడు, జంగారెడ్డి నోట మాట రాలేదు.

“షాజర్ వాళ్ళ నాన్న” అని సుబ్రహ్మణ్యం గుసగుసలాడాడు. “అవును అంకుల్” అని జవాబు చెప్పాడు. ఇంకేమీ మారు మాట్లాడకుండా ఏదో కొనుక్కుని వెళ్ళిపోయాడు.

ఇంత కష్టపడి తెలియని చోటికి వస్తే, ఇలా పట్టుపడిపోయామని మొహామొహాలు చూసుకున్నారు. జంగారెడ్డికి భయపడే ఓపిక మిగల్లేదు.

***

కొత్త బాలుతో ఇంట్లోకి అడుగు పెట్టాడు జంగారెడ్డి, పడక్కుర్చీలో మల్లారెడ్డి పేపర్ చదువుతున్నాడు. పక్కన రెండు తాగి వదిలేసిన టీ కప్పులు పెట్టి ఉన్నాయి.

‘ఏడికి పొయినవుర” అని అడిగాడు మల్లారెడ్డి.

ఇంత దాకా ఏం జరిగిందో తెలీదు, ఇప్పుడు ఏం జరుగబోతోందో తెలీదు కనుక నోరు మెదపలేదు.

“గా బాలేంది?

“నువ్వు కొన్న కార్కు బాలు” అని నాన్చాడు జంగారెడ్డి.

“మరి గిదేంది రా, ఖాన్ సాబ్ ఇచ్చి పోయిండు” అని ఎర్రటి బాలు నేలపైన దొర్లించాడు, గురి చూసినట్టు అది దొర్లుతూ వచ్చి జంగారెడ్డి కాలికి తాకి ఆగింది. బాలుని పైకెత్తి చూసాడు, రెండు ఒకేలా ఉన్నాయి.

యాదమ్మ తలుపు చివర్న నిలబడి బిక్కు, బిక్కుమంటూ ఇద్దరినీ చూస్తోంది.

దూరం నుండి ఫాక్టరీ సైరన్ కూత పెట్టింది. కూత రోజూ కంటే గట్టిగా వినిపిస్తోంది. ఆ కూతలు అపశకునాలని యాదమ్మ నమ్మకం.

“ఈడ్కి రా..” అని పిలిచాడు మల్లారెడ్డి.

మెల్లిగా అడుగులు వేస్తూ తండ్రి దగ్గరకి వెళ్ళాడు.

“గంత బుగుల్బడకు” అని మల్లారెడ్డి కొడుకుని దగ్గరకి తీసుకున్నాడు, ఒళ్ళు నిమిరాడు.

“నేనేమ్మన్నర…నా తీరుగ ప్యూను గావొద్దు, పెద్ద సారు లెక్క గావాల..” అని జంగారెడ్డి కళ్ళలోకి చూసాడు.

ఊహించని పరిణామానికి జంగారెడ్డి విస్తుపోయాడు, కాసేపటికి కుదుటపడి చిందరవందరగా ఉన్న పుస్తకాలని మొదటిసారి శ్రద్ధగా చూసాడు.

**** (*) ****