కథ

నవ్వే ఏనుగు బొమ్మ

సెప్టెంబర్ 2017

ఈ రోజు పద్మినీ టీచర్ కి ట్వంటీ రూపీస్ ఇస్తుంటే గట్టిగా మాట్లాడ్డమో లేక దగ్గడమో చేయకపోతే ఫరీద్ గమనించడు. అంతకీ చూడకపోతే, వాడిని బల్లిలా అతుక్కుని కూర్చునే యూసుఫ్ ని ఏదో వంకతో పిలవాలి. నేను డబ్బులివ్వడం చూసాడంటే ఫరీద్ మొహం గాజర్ గడ్డలా మారుతుంది. లేకపోతే మాటిమాటికి ‘ఆమ్ చూర్’, ‘హవల్దార్’ అని పిచ్చి పేర్లతో పిలవడమే కాకుండా పక్కవాళ్లకి నేర్పిపెట్టాడు. వాడు స్కూల్ ఎక్స్కర్షన్లకి వెళ్లనివారిని, జేబులో కనీసం టూ రూపీస్ కూడా లేనివారిని ‘ఆమ్ చూర్’ అంటాడు. అలా నాతో పాటు ఇంకొందరిని అంటాడు, “హవల్దార్” అని మాత్రం నన్నొక్కడినే పిలుస్తాడు. అలా పిలవడానికి పెద్దకారణం కూడా ఏమీ లేదు. అంతా ప్యాంట్లు వేసుకుంటే నేనింకా నిక్కర్లోనే ఉన్నాను, అంతే!

అయినా, ఎవరైనా లేని బట్టలెలా వేసుకుంటారు? వాడి టార్చర్ పడలేక అమ్మని ప్యాంటు కుట్టించమని అడిగితే, ఆవిడ మూడేళ్ల కొడుకు తింగరచేష్టలకి మురిసిపోతూ నా వైపు కూడా చూడలేదు. సాయంత్రం నాన్న రాగానే రహస్యంగా చెప్పినట్టుంది, ఆయన పడక్కుర్చీలో ప్రశాంతంగా పేపర్ చదువుతూ, చాయ్ తాగుతూ పిలిచారు. దగ్గరకి వెళ్లగానే “వచ్చే ఏడాది తప్పకుండా కుట్టిస్తానురా,” అని పేజీ తిప్పారు.

అదంతా పాత సంగతి, ఇప్పుడు నా పైజేబులో రెండు కొత్తనోట్లున్నాయి. ఈరోజు టీచర్ కి డబ్బులివ్వగానే “ఆమ్ చూర్” అనడం ఆటోమాటిక్ గా ఆగిపోతుంది. ఏమో? ఫరీద్ మనసు మార్చుకుని ‘హవల్దార్’ అనడం కూడా మానేస్తాడేమో? ఇక క్లాసులో ఏ గొడవా ఉండదనుకోగానే భలే హాయిగా అనిపించిది.

షర్టుకి టై కట్టుకుంటూ ముందుగదిలోకి రాగానే టిఫిన్ బాక్స్, స్కూల్ బాగ్ టేబుల్ పై రెడీగా ఉన్నాయి. అద్దంలో చూస్తూ తల దువ్వుతుంటే గూట్లోని కిడ్డీ బ్యాంకు నాకేసి చూసి నవ్వుతోంది. నిన్నటిదాకా అది చిల్లర దాచుకునే ఏనుగు బొమ్మ, ఇప్పుడు సమయానికి ఆదుకున్న ఫ్రెండ్ లా అనిపించింది. బొమ్మని పైకెత్తి చూస్తే అది నిజంగానే నవ్వుతోంది.

***

వారం క్రితం ‘ఏ’ సెక్షన్ వాళ్లని బాలభవన్ కి తీసుకెళతారని, ఆసక్తి కలవారు వారంలోగా ట్వంటీ రూపీస్ ఇవ్వాలని పద్మినీ టీచర్ అనౌన్స్ చేసింది. ఆరోజు ఇంటికి రాగానే అమ్మకి చెప్పాను. ఏమీ జవాబు చెప్పలేదు. ‘రేపే లాస్ట్డే!’ అని నిన్న మధ్యాహ్నం కూడా గుర్తుచేసాను. రోజంతా రకరకాల క్రాఫ్ట్స్ చేయిస్తారు, ఎంచక్కా పార్కులో ఆడుకోవచ్చని ఏవేవో చెప్పాను కానీ సినిమా చూపిస్తారనే అసలు విషయం చెప్పలేదు. బీరచెక్కు శ్రద్ధగా తీస్తోంది తప్ప నోరు మెదపలేదు. “ప్లీసమ్మా! ఫ్రెండ్స్ తో బస్సులో వెళ్లడం చాలా బావుంటుంది.” అని అడిగాను. ఎప్పుడూ అంతే! ఖర్చుందంటే నోరు విప్పదు. సాయంత్రందాకా ఉగ్గబట్టుకుని, నాన్నకి చెబుతుంది. ఆయన పేజీ తిప్పినంత సులువుగా అడిగిన ప్రతీదీ వాయిదా వేస్తారు.

ఈసారి అక్కడిదాకా వెళ్లనివ్వద్దని గట్టిగా అనుకున్నాను.

కళ్ళు మూసుకుని ఆలోచిస్తే మంచి ఐడియాలు వస్తాయని జంగారెడ్డి చెప్పాడు. వాడు చెప్పినట్టు చేస్తే, తలనొప్పెట్టింది తప్ప ఏ ఐడియాలు రాలేదు. అవసరం లేకపోయినా పుస్తకానికి అట్ట వేసాను, తమ్ముడిని కాసేపు ఆడించాను, ఇల్లంతా తిరుగుతూ ఆలోచించాను, అయినా ఏమీ తట్టలేదు.

సాయంత్రం మబ్బులు పట్టి వాతావరణం మారింది. సన్నగా చినుకులు పడుతుంటే, అమ్మ చేస్తున్న పని ఆపి బయటకి పరుగెత్తింది. కంగారుగా దండెంమీంచి ఆరిన బట్టలు తీస్తుంటే, నేనూ వెనకాలే వెళ్లి కాస్త సాయం చేసాను. “రేపే లాస్ట్డే!” అని మళ్లీ గుర్తు చేసాను. ఆ హోరులో ఎలా వినపడిందో తెలీదు కానీ, వెంటనే “వద్దు, నాన్న పంపరు.” అని మొదటిసారి నోరు విప్పింది.

అంత దాకా ఏదో ఓ మూల నాన్నని ఒప్పిస్తుందని కొంచెం ఆశ పడ్డాను, నిక్కచ్చిగా పంపారనగానే అమ్మపై పిచ్చికోపమొచ్చింది. అప్పుడు కళ్లు ఎగరేసి దగ్గరకి పిలిచే ఫరీద్, ఏ కారణం లేకుండా నవ్వే వాడి ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. “ఏమడిగినా…లేదు, కాదు, వద్దు అంటారు,” అని విసవిసా లోపలికెళ్లి కిడ్డీబ్యాంకు తెచ్చి, అమ్మచేతిలో పెట్టాను. “నా సేవింగ్స్ మొత్తం తీసేసుకుని, ట్వంటీరూపీస్ ఇయ్యి.” అని విసురుగా అడిగాను. కాసేపు బొమ్మలా చూస్తూ నిలబడింది.

ఏమనుకుందో తెలీదుగానీ, “సరే నాన్నని అడుగుతాను.” అని నవ్వి వెళ్లిపోయింది.

అది నిన్న జరిగింది.

ఇప్పుడు నాజేబులో రెండు కొత్తనోట్లున్నాయి.

ఏనుగుపొట్టలో చిల్లర అలానే ఉంది.

***

రిక్షాలక్ష్మయ్య రోజూ ఏడు కొట్టకుండా ఇంటి ముందుంటాడు, ఈ రోజు ఏడు దాటి మూడు నిముషాలయినా రాలేదు. అప్పటికే వీధిలోకి రెండు మూడు చక్కర్లు కొట్టి వచ్చాను. వీధిలో తోక నాకుతున్న నల్లకుక్క తప్ప ఎవరూ కనపడలేదు. కాసేపట్లో మంత్రం వేసినట్టు అంతా మారిపోతుంది. స్కూటర్లు పొగలు గక్కుతాయి, స్కూల్ పిల్లలు గోల చేస్తారు, గేటు వెనుక గాజుల చేతులు టాటా చెబుతాయి. అంతా వెళ్లిపోగానే వీధి ఖాళీ అయిపోతుంది.

రిక్షా బెల్ వినగానే బాగ్ తో, లంచ్ డబ్బాతో బయటకి వచ్చాను.

ఎప్పటిలానే పాతరిక్షాతో, నవ్వు మొహంతో ముసలి లక్ష్మయ్య ఇంటిముందున్నాడు. రోజూ ఒకేలా నవ్వుతాడు. లక్ష్మయ్యకి మా వెనుక బస్తీలో ఉంటాడు, అతనికి పదేళ్ల మనవరాలు తప్ప ఇంకెవరూ లేరు. నన్ను రెండో క్లాసు నుంచి టంచనుగా స్కూల్ కి తీసుకెళ్తాడు, ఎప్పుడూ నాగా పెట్టిన గుర్తులేదు. రిక్షాలో కూర్చుంటూ అలవాటు ప్రకారం చూస్తే చివరింటి సంజయ్ నాన్న స్కూటర్ పై కూర్చున్నాడు, అచ్యుత్ ఆటో ఎక్కుతూ నాకేసి చూసాడు. వాళ్లు నాలా ఆరో క్లాస్ చదువుతున్నారు కానీ కాలనీ స్కూల్ కి వెళ్లరు, బేగంపెట్ పబ్లిక్ స్కూల్ కి వెళతారు. అందుకే నాకేసి చూస్తారు తప్ప నవ్వరు. నేనూ అంతే! రోజూ అటువైపు చూస్తాను తప్ప నవ్వను.

లక్ష్మయ్య రిక్షా తోసుకుంటూ ఒక్కొక్క ఇంటిముందు ఆగుతూ, ఇంకో ముగ్గురిని ఎక్కించుకున్నాడు. అందులో ఒకడు చందు, ఇంకో ఇద్దరు రెండో క్లాసు పిల్లలు. చందు ఎక్కగానే రిక్షా గజగజా వణికింది. లక్ష్మయ్య హేండిల్ని బలంగా పట్టుకోవడంతో కుదుటపడింది. చందు ఎక్కగానే పెద్దగా జాగా మిగలకపోవడంతో ఒక పిల్లాడు మూల కూరుకుపోయాడు. రిక్షా మూలుక్కుంటూ స్కూల్ వైపు కదిలింది. సన్నగా, పుల్లలా ఉండే లక్ష్మయ్య మమ్మల్ని ఎలా తొక్కుతాడో నాకెంతకీ అంతుపట్టదు. ఒకసారి ఎప్పుడో అదేమాట అడిగితే నవ్వి ఊరుకున్నాడు తప్ప ఎలాగో చెప్పలేదు.

రెండురోజులుగా దగ్గుతున్నాడు, ఆయాసపడుతూ తొక్కుతున్నాడు. ఏమైందని అడిగితే సిగ్గుపడుతూ “సర్ది జేసిందిబిడ్డా,’ అంటాడు. “మెయిన్ రోడ్ దగ్గర డాక్టర్ కి చూపించుకో,” అని సలహా ఇస్తే “దవఖనకిబోతే సూది మందిస్తరు, ఊకుంటే రెండుదినాల్ల తక్వతది,” అన్నాడు. ఏమాటా విననివాళ్లకి మనం మాత్రం ఏం చెబుతాము.

రోజూ అర్థం కాని కబుర్లు, పాటలు పాడుతూ తొక్కే మనిషి ఉలుకూ పలుకూ లేకుండా తొక్కుతున్నాడు. కాలనీ దాటేదాకా బాగానే తొక్కాడు కానీ వినయ్ నగర్ దగ్గరకి రాగానే రోడ్డు నిటారుగా ఉంటుంది. అక్కడ తొక్కలేక కష్టపడుతుంటే సైకిల్ చైన్ కాస్తా ఊడిపోయింది. మేమంతా రిక్షా దిగి రోడ్డుపక్కన నిలుచున్నాము. చందు మొదట్లో దిగనని మొండికేస్తే మిగతా పిల్లలు ఘొల్లున నవ్వారు. తిట్టుకుంటూ దిగి నాపక్కగా నిలబడ్డాడు.

రోజూ మాతోపాటు వచ్చే రిక్షాలు మమ్మల్ని దాటుకుని వెళుతుంటే ప్రేయర్ బెల్ కొడతారని భయమేసింది. అసలే మాది చాలా స్ట్రిక్ట్ స్కూల్. ప్రిన్సిపాల్ నుండి బెల్ కొట్టే ప్యూన్ దాకా అంతా కోపంగా ఉంటారు. స్కూల్ డ్రెస్ నుండి అటెండెన్స్ దాకా, ప్రతిదీ పద్ధతిగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఇంటికి మెమో వెళుతుంది. స్కూల్ కి ఎంట్రన్స్ దగ్గర రెండు గేట్లు. రావడం లేటయితే ప్రేయర్ అయ్యేదాకా, మొదటి గేటు బయట నిలబడాలి. ప్రేయర్ అయ్యాక వస్తే, మొదటి పీరియడ్ అయ్యేదాకా రెండవ గేటు బయట నిలబడాలి. గేటు ఏదైనా, డ్రిల్ టీచర్ బెత్తం దెబ్బలు తిన్నాకే క్లాసుకి పంపుతారు. అంతా మా నాన్న ఫ్యాక్టరీ లోలా ఒక పధ్ధతి ప్రకారం జరుగుతుంది.

ఒకసారి జంగారెడ్డి సంతకం చేసిన రిపోర్ట్ కార్డు టీచర్ కి ఇవ్వడం మర్చిపోయాడు. క్లాసయ్యాక గుర్తొచ్చి స్టాఫ్ రూమ్ దగ్గరకి పరిగెత్తాడు. టీచర్ కోసం బయట తచ్చాడుతూ ప్రిన్సిపాల్ కంట్లో పడ్డాడు. అంతే! ఆయన ఆఫీసుకి తీసుకెళ్లి శుభ్రంగా తిట్టి, మెమో ఇచ్చి పంపారు. అది తెలిసాకా స్టూడెంట్స్ స్టాఫ్ రూమ్ చుట్టుపక్కలకి కూడా వెళ్లడం మానేశారు. ఈరోజు మొదటి పీరియడ్ దాటితే, నాపేరు లేకుండా లిస్టు ఆఫీసుకి వెళ్లిపోతుంది. నాకు స్టాఫ్ రూమ్ దగ్గరకి వెళ్లేంత ధైర్యం లేదు.

***

ఫరీద్ ఏడాది క్రితం మా క్లాసులో చేరాడు. వాడు చేరకముందు కరెంట్ షాక్, చోర్ పోలీస్ లాంటి పరిగెత్తే ఆటలు, పేపర్ రాకెట్లతో పోటీలు పడేవాళ్లం. వాడు వచ్చీ రాగానే కబుర్లతో క్లాసుని కబ్జా చేసాడు. వాడికి తెలుగు అస్సలు రాదు, ఎక్కువగా ఉర్దూలోనే మాట్లాడేవాడు. కొన్నేళ్లు సౌదీలో ఉండివచ్చాడేమో సెంట్ సీసాలు, రంగురంగుల పెన్సిళ్లు, ఫారెన్ బబుల్ గమ్ తెచ్చి చూపించేవాడు. అంతా వాడి చుట్టూ చేరి వస్తువులని తాకి తెగ మురిసిపోయేవారు. పాతబస్తీ గొడవలు, సినిమా కథలు చెప్పేవాడు. బార్కాస్ లో చుట్టాలున్నారనగానే నల్ల మోటార్ సైకిల్ పై గుంపుగా వెళ్లే వస్తాదులు గుర్తొచ్చి వాడంటే భయపడేవాళ్లం. ఒకసారి స్కూల్ ఫంక్షన్ కి జీన్స్, టీ షర్ట్ వేసుకొస్తే అంతా ఆశ్చర్యంగా చూసారు. నేను జీన్స్ ప్యాంటు చూడడం అదే మొదటిసారి! నాకు వాడు చూపించే వస్తవులు అంతగా నచ్చకపోయినా కబుర్లు, కథలు విపరీతంగా నచ్చేవి. ఎంత టార్చర్ పెట్టినా ఆ ఒక్క విషయం కోసం కుక్కలా వాడి దగ్గరకి చేరేవాడిని. అది ఎలా అంటే, ఎంత భయమేసినా ఫాస్ట్ బౌలింగ్ ఆడాలనిపిస్తుంది, మిర్చీబజ్జీ కారంగా ఉన్నా తినాలనిపిస్తుంది.. అలానే ఫరీద్ గాడు కూడా!

ఫరీద్ మొదటి సారి చెప్పిన సినిమా కథ కంటే, సినిమా ముందు కథ నాకు బాగా గుర్తుంది.

అబ్బూ మేరె కు, అల్తాఫ్ కో పిచ్చర్ దిఖానే దిల్షాద్ టేటర్ లేకే గయే. హమ్ లోగా పహున్చే కీ వాఁ పే క్యా పబ్లిక్ తీ మాలూం? ఏక్ దూసరే కో ఫుల్ డకల్ లేరే, కుచ్ లోగా మార్ బి లేరే తే.. అబ్బూ కైసే తో భి కర్కే టికీటా లేకే ఆయే. బడీ ముష్కిల్ సె గుస్గుస్ కె టాకీస్ మె గయే, అందర్ బైట్తే కీచ్ లైటా పూరే బంద్ కర్ దియే. అంధేరా చా జాతేకీ సబ్ ఏక్ దం సె ఖామోష్ హోగయే. మై ఔర్ అల్తాఫ్ పరదే కు టక్లేతేవే, ఆజూ బాజూ దేఖ్ లేతేవే హువే బైటే తే, హల్లూ బాత్ బీ కర్ లేరే. జో పబ్లిక్ దేర్ సే ఆయీ గిర్తే పడ్తే అంధేరే మే సీటా డూండ్ లేరే..ఏక్ మోటా తో మేరే పావ్ పే పావ్ రఖే కుందల్ దియా, క్యా దర్ద్ హుయి మాలూమ్? .

జర్రి దేర్ కె బాద్, కోయీ పీచే సే “అబ్ బహుత్ హోగయా, పర్దా ఖోల్రే!!” బొల్కే చీకా, జోర్ సే సీటీ మారా…మేరె కు ఐసా లగ్రా మై పూరా దిన్ వహీ సీట్ పే బైటా హు.. ఆఖిర్ మే పరదా ఉఠా, వొ బీ ఫుల్ మ్యూజిక్ కె సాథ్, క్యా సీటియాన్ పూచో నక్కో, ఆంగ్ పే కాటే ఆగయేమాలూమ్? ట్రేలరా ఏక్ బె బాద్ ఏక్ దిఖాయే, ఫారూకీ, జిందా తిలిస్మాత్ కె ఎడ్బర్ టైజా దాల్రే తే, ఫిర్ లంబా సా న్యూస్ రీల్ భి చలాఏ, ఓ తో ఖతమీ నహి హోరా థా. జబ్ పిక్చర్ కె లంబరింగ్ షురూ హువా, క్యా చీక్నా, క్యా చిల్లానా, సీటీయా చలే మాలూం? .. హీరో బులెట్ పే జారహేతో పీచే సే హిట్ గానా చలా.. హవా సే హీరో కె బాలా ఫుల్ ఉడ్రే…..

(నాన్న నన్నూ, అల్తాఫ్ ని దిల్షాద్ టాకీస్ కి తీసుకెళ్లారు. కొత్త సినిమా అవ్వడంతో జనాల అరుస్తూ, ఒకరినొకరు తోసుకుంటుంటే చాలా భయమేసింది. నేనయితే టిక్కెట్లు దొరకవనే అనుకున్నాను. నాన్న మమ్మల్ని ఓ మూల నిలబెట్టి, కాసేపు మాయమయి టిక్కెట్ల తో ప్రత్యక్షమయ్యారు. ఎలా సంపాదించారో తెలీదు కానీ భలే ఆశ్చర్యమేసింది. మేము జనాలని తప్పించుకుంటూ, ఎలాగోలా హాల్లోకి వెళ్లి కూర్చున్నాము. సీట్లలో సర్దుకున్న కాసేపటికి లైట్లు మెల్లిగా ఆరిపోయాయి. చుట్టూ గోల కూడా ఆగిపోయింది. నేనూ అల్తాఫ్ తెర కేసి చూస్తూ, చుట్టుపక్కల చూస్తూ రహస్యంగా కబుర్లు చెప్పుకున్నాము. కాస్త ఆలస్యంగా వచ్చిన ప్రేక్షకులు చీకట్లో సీట్లు తడుముకుంటూ, దేనినో తగులుకుని తూలుతూ వెళుతున్నారు. ఓ భారీకాయం నా కాలు తొక్కి పచ్చడి చేసింది, ఎంత నొప్పెట్టిందో తెలుసా? గట్టిగా అరవబోతూ ఆపుకున్నాను.

ఈ లోపు వెనుక నుండి ఎవరో “ఇక చాలు, ఆట మొదలెట్టండి.” అని అరవగానే, బోలెడు ఈలలు వినిపించాయి. నాకైతే రోజంతా అదే సీట్లో కదలకుండా కూర్చున్నట్టు అనిపించి విసుగొచ్చింది. ఇక ఓపిక నశిస్తుంటే ఈలలు, అరుపులు, మ్యూజిక్ మధ్యన తెర మెల్లిగా తొలిగింది. నాకైతే పోయిన ప్రాణం లేచొచ్చింది. ముందుగా న్యూస్ రీల్ వేసారు, అది ఎంతకీ అవ్వలేదు. తర్వాత వ్యాపార ప్రకటనలు వేసారు. అవి ముగియగానే, సినిమా మొదలయింది. హీరో బులెట్ నడుపుతూ, పాట పాడుకుంటూ వెళుతున్నాడు. ఎదురు గాలికి అతని క్రాఫ్ ఎగురుతోంది, తెరపై టైటిల్స్ వెంటవెంటనే మారుతున్నాయి…ఫరీద్ పదునుగా కథ చెబుతుంటే, మనం సినిమాలో పాత్రగా మారిపోతాము. ఎంత దూరం తీసుకెళ్తే అంత దూరం…అతనితో చివరి దాకా వెళతాము.)

ఫరీద్ కొత్త సినిమా చూస్తే, మరుసటి రోజు మాకు ఆట మొదలవుతుంది. టైటిల్స్ తో మొదలుపెట్టి చివర పోలీసులు దొంగలని పట్టుకునేదాకా వివరంగా చెబుతాడు. “డిషూమ్.. బిషూమ్….“ అంటూ, గన్ ప్రేలుడు రీసౌండ్ కూడా వదలడు. అప్పుడు చుట్టూ ఉన్న వారి మొహాల కేసి చూడాలి, సీనుకి తగినట్టు రంగులు మారుతాయి. ఒక్కోసారి “కల్ కాపే రోకా..?” (నిన్నెక్కడ ఆపాను?) అని పరీక్ష పెడతాడు. సరైన జవాబు రాకపోతే వాడికి చెప్పాలనే మూడ్ పోతుంది. తర్వాత బ్రతిమాలో, కోవా ఐస్ కొనిచ్చో కథ చెప్పించుకోవాలి. .

కథలూ, కబుర్లూ చెప్పే చాక్లేట్ మొహం వెనుక ఓ రాక్షసుడు ఉన్నాడు. వెనక నుండి మొట్టికాయ వేస్తాడు, పేర్లతో ఉడికిస్తాడు, గొంతు మార్చి టీచర్ లా మాట్లాడతాడు. అది అక్కడితో ఆగితే పర్వాలేదు, అంటువ్యాధిలా అందరికీ అంటించాడు. పోనీ టీచర్ కి చెబుదామంటే వాడి చాక్లెట్ మొహం చూసి ఎవ్వరూ మన మాట నమ్మరు. అంతా వెనకుండి గుట్టుగా చేస్తాడు. మచ్చుక్కి, మొదట్లో వాడి కథ కోసం ఇంటర్వెల్ దాకా ఓపిక పట్టేవారు. రానురాను సస్పెన్స్ భరించలేక క్లాసు మధ్యలో కొద్దిగా చెప్పించుకునేవారు. ఫరీద్ ని డిస్ట్రబ్ చేస్తున్నారని, టీచర్ వాడిని తప్ప మిగతా అందరినీ బయటకు పంపింది. ఈ రోజు ట్రిప్పు డబ్బులివ్వగానే వాడు నా జోలికి రాడు.

***

ఏదో నట్టు ఊడిపోవడంతో లక్ష్మయ్య వచ్చిన దారిలో జాగ్రత్తగా వెతుకుతూ కాస్త దూరం వెళ్లాడు. అది దొరకడానికి బాగానే టైం పట్టింది. చెమటలు కక్కుతూ పాత రిక్షా చైన్ బిగించాడు. మేమంతా ఎక్కి కూర్చోగానే నెమ్మదిగా ఆయాసపడుతూ తొక్కుతున్నాడు. “పోనీ రెండురోజులు ఇంట్లో ఉండచ్చు కదా?” అని అడిగాను. “నేనింట్లుంటే మిమ్లని ఎవరిడ్సి పెడ్తరు?” అని చిన్న తువ్వాలుతో చెమట తుడుచుకుంటూ అడిగాడు. లక్ష్మయ్య సంగతి నాకు బాగా తెలుసు, అతని మనవరాలు కూడా అదే చెప్పింది. ఏ సలహాలిచ్చినా తీసుకోడు, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాడు. లక్ష్మయ్య లాంటి మొండిమనుషులు కూడా రాక్షసులే!

మా ప్రయాణం నత్తనడకలా సాగుతుంటే, పాపిన్స్ తింటున్న చందుకి కూడా కోపమొచ్చింది. “రేపట్సంది ఈ ఫాల్తు రిచ్చాలరాను, ఆటోల బోతా.” అని చెవిలో చెప్పాడు. స్కూల్ కి లేట్ అవ్వడం తప్పదు కానీ కనీసం మొదటి పీరియడ్ మొదలవ్వకుండా వెళ్లినా పర్వాలేదు అనుకున్నాను.

***

స్కూల్ కి చేరుకోగానే రెండో గేటు మూసి ఉంది. తోతాపురి, జామకాయలు, కోవా ఐస్ అమ్మే బళ్లు ఒక్కొక్కటీ స్కూల్ వదిలి వెళ్లిపోతున్నాయి. లేటుగా వచ్చిన పిల్లలు గేటు బయట మాట్లాడుకుంటున్నారు. ఇక మొదటి పీరియడ్ అయ్యేదాకా ఎవ్వరినీ లోపలకి పంపరు. ఎప్పుడూ టైం కి తీసుకొచ్చే లక్ష్మయ్య ఈ రోజు చాలా లేట్ చేసాడు. జేబులో కష్టపడి సాధించిన రెండు కొత్త నోట్లున్నాయి, వాటితో ఏం చేస్తాను? స్టాఫ్ రూమ్ బయట నిలబడితే పద్మినీ టీచర్ తీసుకుంటుందా? నాకు డొక్కు రిక్షాపై పిచ్చి కోపమొచ్చింది, చందు సరిగ్గా చెప్పాడు – ‘నట్లు ఊడిపోయే ఫాల్తు రిచ్చా’.

అయినా నేను ఏమనుకున్నానో ముసలి లక్ష్మయ్యకేం తెలుసు. దగ్గుకుంటూ బస్తీకి వెళ్లిపోతాడు. అసలు ఫరీద్, లక్ష్మయ్య ఇద్దరిలో ఎవరు నన్ను ఎక్కువగా సతాయిస్తారు? ఫరీద్ ఏడిపించినా కథలు, కబుర్లు చెబుతాడు. లక్ష్మయ్య పుల్లలా ఉండి రిక్షా తొక్కుతాడు, దగ్గుతాడు, ఆయాసపడతాడు తప్ప సలహాలు తీసుకోడు. లక్ష్మయ్యే! అసలైన రాక్షసుడు. గేటు వైపు నడుస్తూ వెనక్కి చూస్తే లక్ష్మయ్య అందరినీ దించి, రిక్షాని వెనక్కి తిప్పుతున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి “మెయిన్ రోడ్ దగ్గర డాక్టర్ కి చూపించుకో,” అని జేబులో నోట్లు లక్ష్మయ్య చేతిలో పెట్టి, వెనక్కి చూడకుండా వచ్చేసాను. కాస్త ఆగినా “వద్దు బిడ్డా,” అంటూ ఏదేదో చెబుతాడు.

డ్రిల్ టీచర్ దెబ్బలు వేస్తుంటే అమ్మ గుర్తొచ్చింది. ఇంటికెళ్లగానే టీచర్ కి డబ్బులిచ్చావా అని అడుగుతుంది – ఇచ్చానని అబద్ధం చెప్పను, ఇవ్వలేదని చెబితే కోప్పడుతుంది, నాన్నకి చెబుతానని అంటుంది. అప్పుడేం చెయ్యాలి?…కిడ్డీబ్యాంకు లోంచి సేవింగ్స్ మొత్తం తీసేసుకోమని చెబుతాను. నిన్నటిలా నవ్వి ఊరుకుంటుందో?, లేక రహస్యంగా నాన్నకి చెబుతుందో?

**** (*) ****


మధు పెమ్మరాజు నివాసం హ్యూస్టన్ దగ్గరలోని కేటీ నగరం. శీర్షికలు, కధలు, కవితలు రచించడం, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం, పాల్గొనడం వీరి హాబీలు. వీరి కధలు, శీర్షికలు కౌముది, కినిగే, ఆంధ్రజ్యోతి, చినుకు, వాకిలి, సారంగ వంటి పత్రికలలో ప్రచురించబడ్డాయి.