కథ

దిగంతపు అంచుల్లో

జూలై 2016

రేపే నా ప్రయాణం! ఇంత దాకా ఆశయాలని, అవసరాలని మోస్తూ నడిచాను. రేపు దారం తెంచుకున్న గాలి పటంలా గిరికీలు కొడుతూ కొత్త చిరునామాకి చేరుకుంటాను.

అర్థరాత్రి ఊహలతో రహస్య మంతనాలు జరుపుతున్నాను. ఎదురుచూపులు తప్ప లాప్టాప్ లో అలికిడి లేదు, కనీసం కారణం తెలియజేస్తూ ఈమెయిలు అయినా రాలేదు. తను వస్తుందనే ఆశ సన్నగిల్లి కార్పెట్ పై మెత్తగా ఒరిగిపోయాను.

వస్తావో రావో తెలియక
ఊసులు నిండిన రహస్యపుటరలు
ఒక్కొక్కటీ తెరిచి చూసాను
అన్నిట్లో ఒకటే రహస్యం

ఏమీ లేని సమయంలో
నాకు, నల్ల తెరకి
మధ్య సుదీర్ఘ సంభాషణ
ఏమీ తోచక కాదు.. నాలో నేను లేక

లీలగా, కలకి కొనసాగింపులా గంటారావం చెవులని సన్నగా తాకుతోంది. ఆదమరచి వింటుంటే తట్టింది, కల కాదు యాహూ మెసె౦జర్ పిలుపని.

నాతో పాటు లాప్టాప్ ఒళ్ళు విరుచుకుంది, నల్లటి ముసుగు తీసి పలకరింపు చిలకరించింది.

“హలో”

చాట్ విండో కేసి తదేకంగా చూస్తుంటే నిశ్శబ్దం సూటిగా తాకిన స్పందన.

“ఎదురుగా ఉన్నావని తెలుసు, కోపంగా కూడా ఉండి ఉంటావు. బట్ వాట్ టు డు.. ఐ యాం సారీ!”

కార్పెట్ పై పడున్నవాడిని మెల్లిగా లేచి కూర్చున్నాను. అక్షరాలు టైప్ చేసి, చేసినవి చెరిపేసి..కాసేపు సాగదీసి “వేరే ప్లాన్ ఉందని మెయిల్ పంపొచ్చు కద. పని గట్టుకుని గదిని వాక్యూం చెయ్యకుండా బెడ్రూంలో పడుకునేవాడిని” అని ఫుల్ స్టాప్ పెట్టాను.

“బుద్దూ! నేను ఇండియా అనే దేశంలో ఉంటాను, ఇక్కడ పగలు, రాత్రి అని తేడా లేకుండా సరదాగా కరెంటు తీసేస్తారన్న మాట” అని స్మైలీ పంపింది. అసలు కారణం తెలియగానే షాక్ కొట్టినంత పనయ్యింది, మొహం మాడ్చుకోక ముందు ఓ అర సెకండు ఆలోచించాల్సింది.

పది నెలలుగా నిద్ర-మెలుకువ, స్థలం- కాలం కలిసిపోయిన వింత స్థితికి చేరుకున్నాను, దానికి అసలు కారణం టోనీ. అతడిని కసిగా, ఇష్టంగా, అసలే కారణం లేకుండా తిట్టుకోని రోజు లేదు. టోనీ సరిగ్గా రెండున్నర ఏళ్ల క్రితం పరిచయమయ్యాడు..నవ్వుతూ, నవ్విస్తూ..

***

ప్లేన్ నార్త్ స్లోప్ చేరుకోగానే కళ్ళు చెదిరే తెల్లదనం చుట్టుముట్టింది. ఎయిర్పోర్ట్ నుంచి సైట్ ఆఫీసుకి కంపెనీ కారులో వెళుతుంటే మంచు మైదానాలు, అద్దంలా మెరుస్తున్న కొలీన్ లేక్, అలస్కా పైప్ లైను వెంటపడ్డాయి. దుమ్ము రేగుతున్న జగత్ టాకీస్ గల్లీల నుంచి చాలా దూరం వచ్చాను…దూరం కాదు వేరే ప్రపంచంపై వాలాను. కారు కంకర్రోడ్డు పై ఇబ్బందిగా మలుపులు తిరుగుతుంటే, దూది మబ్బులు వేగంగా నల్లబడుతున్నాయి. పట్టి పట్టి బయటకి చూడడం డ్రైవర్ గమనించి తుఫాను హెచ్చరిక ఉందని చెప్పాడు, ఆ చెప్పడం కూడా తల తిప్పకుండా చెప్పాడు.

యెమ్. ఎస్ ఆఖరి సెమిస్టర్ లో ఉండగా నేను చదివే ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ కి పెద్దగా జీతాలు ఇవ్వరు, పైపెచ్చు వీసా జనాలకి ఉద్యోగం దొరకడం కష్టమన్నాడు కేతన్, అదే సాఫ్ట్వేర్ అయితే సెటిల్ అవ్వడం తేలికని సలహా కూడా ఇచ్చాడు. నా రూం మేట్ ఉపదేశాన్ని మధ్యలో కట్ చేసి ఫీల్డ్ మారే ప్రసక్తి లేదని గంభీరంగా చెప్పాను. అయితే కేతన్ చెప్పినట్టే జరిగింది, నానా అవస్థలు పడి వీసా కొన ఊపిరితో ఉండగా ఈ మారుమూల అవకాశం దొరికింది. దగ్గరకి చేరుకునే దాకా ఆశయం ఇంత ఖచ్చితంగా ఉంటుందని ఊహించలేదు.

సైట్ ఆఫీసంటే అందమైన, అంతస్థుల భవనం కాదు. కాస్త ఎక్కువ గదులున్న చెక్క కేబిన్. నాలుగు లేయర్ల దుస్తులతో, సామాన్లతో వెయిటింగ్ ఏరియాలోకి బరువుగా అడుగుపెట్టాను. జాయినింగ్ పేపర్లు రిసెప్షనిస్ట్ కి ఇచ్చి కుర్చీలో స్థిమితపడ్డాను. ఎదురుగా కూర్చున్న గిరజాల జుట్టు వ్యక్తి చాలా ఆసక్తికరంగా కనిపించాడు. పుస్తకం చదువుతూ, చిరునవ్వులు నవ్వుతూ పుస్తకాన్ని ప్రదర్శిస్తున్నాడు.

ఓ అరగంటకి ఉధృతంగా కురుస్తున్న మంచు, హోరుగా వీస్తున్న గాలి హోరాహోరీగా కలియబడ్డాయి. వాతావరణం అంత త్వరగా మారేలా అనిపించలేదు, నన్ను రిసీవ్ చేసుకోవాల్సిన హైరింగ్ మేనేజర్ జాడ లేదు. కాలక్షేపంగా మారిన గిరజాల జుట్టు వ్యక్తి పుస్తకం పక్కన పెడుతూ నన్ను గమనించాడు. మొహం తప్పు చేసినవాడిలా పెట్టుకుని తన పేరు ఆంథోనీ మోజీ అని అదే రోజు ట్రైనీగా చేరడానికి వచ్చానని పరిచయం చేసుకున్నాడు. కబుర్లలో పడిన కాసేపటకి మెషిన్ లోంచి కాఫీ ఒంపుకుంటూ “కాఫీ కావాలా?” అని అడిగాడు, ఆ క్షణం కాఫీ కాదు వెచ్చటి స్నేహ హస్తం అందించాడని ఊహించలేదు.

కొంత కాలం దాకా పరిసరాలని పట్టించుకునే వీలు దొరకలేదు. ఇహెచ్ఎస్ పని కష్టమైనా, కాస్త అలవాటు పడగానే మంచు దేశపు ఖాళీతనం నాలో నిండిపోయింది. మా ఇల్లు, ఇంటి ముందు భోగి మంటలు గుర్తొచ్చేవి. సైట్ నుంచి క్యాబిన్ కి వెళ్లే దారిలో దిగంతాన్ని తాకే నీలి ఆకాశం, విశాలమైన పాల మైదానాలని చూసినప్పుడల్లా తిరిగి వెనక్కి వెళ్లలేని చోటికి వచ్చాననే భావం వేధించేది. ఎంతకీ తెమలని ఫీల్డ్ పనితో పగలు, రాత్రి కలిసిపోయేవి. సైట్ నుండి కేబిన్ చేరుకోవడం తెల్లారేదాకా వస్తువులా ఓ మూల పడుండం నిత్యకృత్యంగా మారింది. అప్పుడప్పుడూ టోనీ చొరవగా తలుపు తట్టి పిలిచేవాడు, అతని క్యాబిన్ కి వెళ్లి బేస్బాల్ చూసేవాళ్ళం.

ఓ రోజు “అబీ..ఇలా ఒంటరిగా ఉండడం మంచిది కాదు. కాస్త అందరితో కలుస్తూ ఉండు” అని చనువుగా హెచ్చరించాడు. టోనీ చొరవ లేకపోతే బహుశా డిప్రెషన్ లోకి జారిపోయేవాడినేమో…

ఏడాది కష్టపడి ఇంట్రడక్టరీ పీరియడ్ పూర్తి చేసాము, మానేజర్ కి మా కమిట్మెంట్ నచ్చడమే కాకుండా ఒక స్నేహితుడిగా, మెంటర్ గా ప్రోత్సహించేవాడు. మా ఇద్దరికీ హ్యూస్టన్ ఆఫీసులో మంచి జాబ్స్ వచ్చేలా సహాయపడ్డాడు. కంకర్రోడ్డు వదిలి రహదారికి వెళుతుంటే చాలా సంతోషంగా అనిపించింది, ఆ ఉత్సాహం కాస్తా హ్యూస్టన్ చేరుకున్న కొద్ది రోజులకి ఆవిరయిపోయింది. అడుగుల దూరంలో అందుబాటులో ఉండే స్నేహితుడు, మైళ్ళు విస్తరించిన మహా నగరానికి చేరుకోవడంతో దూరమయ్యాడు. ఇద్దరం ఆఫీసులో తప్ప బయట కలుసుకోవడం బాగా తగ్గిపోయింది.

ఓ రోజు మీటింగ్ టైం కంటే కాస్త ముందుగా కాన్ఫరెన్స్ రూంకి చేరుకున్నాము, అప్పటికి రూంలో ఎవ్వరూ లేరు. పవర్ పాయింట్ స్లైడ్స్ సరి చేసుకుని, రివ్యూ చేస్తుండగా “అబీ..ఐ లవ్ రెబెక్కా” అన్నాడు టోనీ. కాస్త పరధ్యానంగా విన్నానేమో జోక్ చేస్తున్నాడని అనుకున్నాను. అతని కేసి చూస్తే నలుగుతున్న భావం అప్రయత్నంగా బయట పడ్డట్టు మొహం కాస్త తీక్షణంగా ఉంది.

“అంతుపట్టని రహస్యాలు అంతరిక్షంలో లేవు, మనిషి అంతరంగంలో ఉన్నాయి” ఎక్కడో రాసుకున్న వాక్యం అప్పుడు గుర్తొచ్చింది. వాళ్ళిద్దరూ డేటింగ్ సైట్లో కలుసుకున్నారని తెలుసు, ఆన్లైన్ చాటింగ్ తప్ప ఎప్పుడూ ప్రత్యక్షంగా కలుసుకోలేదని కూడా తెలుసు. కాలక్షేపమనే గాలి బుడగ, ప్రేమగా స్థిరపడిందంటే అసహజంగా అనిపించింది.

“టోనీ! ఆన్లైన్ పరిచయాలు సరదా కబుర్లకి పరిమితం చెయ్యాలి” అన్నాను.

“అబీ! రోజంతా అదే ధ్యాస, బెక్కా చాటింగ్ చేస్తుంటే పక్కనుండి కబుర్లు చెబుతున్నట్టే ఉంటుంది” అని అనునయంగా అన్నాడు.

నా అభిప్రాయాలు టోనీకి నచ్చకపోవచ్చు కానీ స్నేహితుడితో సూటిగా మాట్లాడడం బాధ్యతగా అనిపించింది. “నాకెందుకో నువ్వొక కాట్ ఫిష్ వలలో చిక్కావనిపిస్తోంది. వెన్నెలని చూసి సూర్యుడు మురిసినట్టు నీ ఫీలింగ్స్ రెబెక్కావని మురిసిపోతున్నావు” అని నచ్చచెప్పటానికి ప్రయత్నించాను.

ఎప్పుడూ సౌమ్యంగా ఉండే గొంతు స్థిరంగా మారింది “అదే ప్రశ్న ఎన్నో సార్లు వేసుకున్నాను, అన్ని సార్లు ఒకటే జవాబు- నాకు లుక్స్ కంటే కంపాటిబిలిటీ ముఖ్యం” అన్నాడు.

“నేను అనేదల్లా మనిషిని చూడకుండా పుట్టేవి సరైన భావాలు కావని మాత్రమే. ఐ డోంట్ వాంట్ యు టు గెట్ హర్ట్” అన్నాను. అంత కంటే ఎక్కువ క్యాట్ ఫిష్ ఆన్లైన్ మోసాల గురించి చెబుదామనుకుని ఆగిపోయాను, టోనీ వినేలా స్థితిలో లేడు.

“అబీ. మై ఫ్రెండ్! సలహాకి సమయస్పూర్తి ఉంటే సరిపోదు. కొన్ని కనీస అర్హతలు ఉన్నాయి…” అన్నాడు.

“అర్హతలు…?”

“సలహాకి అనుభవం, సహానుభూతి రెండూ ఉండాలి, అవి లేకపోతే సలహాల ముసుగులో సొంత భయాలు అవతల వ్యక్తిపై రుద్దడం అవుతుంది” అని మెత్తగా అన్నాడు.

కాన్ఫరెన్స్ రూంలో జనం పోగవడంతో మా సంభాషణకి తెరపడింది.

నా గురించి టోనీకి తెలుసు, కానీ పూర్తిగా తెలియదు ‘Man is gregarious inside than outside’ అని నా మిగతా పరిచయం చేసుకోలేదు, “అనుభవం లేకుండా..” అని ఎత్తి చూపిన వెలితి నన్ను వదలలేదు.

కొత్త లాప్టాప్ కొనడమే కాదు, ఓ వీకెండ్ కుస్తీ పడి యుటిలిటీస్ అన్నీ లోడ్ చేసాను. ఆఫీసు నుంచి రాగానే డయల్ అప్ కనెక్షన్ట్ తో నెట్ కి కనెక్ట్ అవ్వడం, బ్రౌస్ చెయ్యడం సరదాగా మొదలయ్యింది, తెలిసేలోపు వ్యసనంగా మారింది. నా కొద్ది రోజుల అనుభవంతో బయట ప్రపంచానికి, ఆన్లైన్ లోకానికి చాలా పోలికలు కనిపించాయి. లెక్కలేనన్ని నెట్వర్కింగ్, ఫ్రెండ్షిప్ సైట్ల చుట్టూ చక్కర్లు కొట్టేవాడిని. మొదట్లో వింతగా, మొహమాటంగా అనిపించేది (ఎవరో చూస్తున్నట్టు), రాను రాను భయం పోయింది. చూసిన చాలా మటుకు దేశీ ప్రొఫైల్స్ సినిమాలు చూడడం, పాటలు పాడడం హాబీలుగా రాసుకున్నారు. నాకు పాటలతో, సినిమాలతో ఇబ్బంది లేదు కానీ అంతా ఒకేలా అనిపించడంతో ఉత్సాహం ఇగిరిపోయింది. ప్రయత్నాలు ఆపేయబోతుంటే ఓ ఫోటోలోని నవ్వు పట్టి ఆపింది. ఆ అమ్మాయి పేరు సుచిత్ర, బొంబాయిలో పని చేస్తున్న మీడియా కన్సల్టెంట్. బయోగ్రఫీలు చదవడం, బ్రాండ్ రీసెర్చ్ హాబీలుగా రాసుకుంది. ప్రొఫైల్ ప్రత్యేకంగా అనిపించి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను.

***

ఉదయం నుండి స్నేహితులు, కొలీగ్స్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ప్రయాణపు హడావిడిలో ముక్తసరిగా మాట్లాడి పెట్టేసాను. మధ్యాహ్నం సెంట్రల్ పార్క్ నుండి టోనీ ఫోన్ చేసాడు, రెబెక్కాని మొదటిసారి కలిసిన ఉత్సాహంలో హుషారుగా మాట్లాడుతున్నాడు. ఎక్కడెక్కడికి వెళ్లారో, ఏం షాపింగ్ చేశారో వివరాలు చెబుతున్నాడు, తర్వాత ప్లాన్స్ కూడా చెబుతున్నాడు. పార్క్ హోరు గాలికి సగం మాటలు వినబడట్లేదు. అయినా భావం చేరవలసిన చోటికి చేరుకున్నాకా మాటలతో పని ఏముందని ఊకొట్టాను. రెబెక్కాతో కూడా మాట్లాడించాడు. ఏ కారణం లేకుండా రెబెక్కాని ‘కాట్ ఫిష్’ అన్నందుకు ఎక్కడో కలుక్కుమంది, ఫోన్ పెట్టేయబోతూ ఇద్దరూ కలిసి తీయించుకున్న ఫోటో ఈమెయిల్ చెయ్యమని అడిగాను.

లాప్టాప్ మూసి బాగ్లో పెడుతుంటే చూపులు ఎదురుగా ఉన్న డెస్క్ పై నిలిచిపోయాయి. సుచిత్ర పుట్టిన రోజుకి పంపిన గ్రీటింగ్ కార్డు కాగితాలు ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతూ పేపర్ వెయిట్ ని వదుల్చుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నాయి, పక్కనే సుచిత్ర పంపిన గ్రీటింగ్ కార్డు ఉంది. ఉద్వేగం హద్దు మీరితే అక్షరాలని ఆశ్రయించడం నా పాత బలహీనత. బరువు మోయలేని కాగితాలు కాలంలో కలిసిపోయాయి, మిగిలినవి గాలికి రెపరెపలాడుతున్నాయి, గ్రీటింగ్ కార్డుతో పాటు కాగితాలు తీసి జాగ్రత్తగా ఫైల్ లో సర్దాను.

***

కేబిన్లో చీకటి పరుచుకుంది, దుప్పటీ కప్పుకుని ప్యాసెంజర్లు గాఢనిద్రలో ఉన్నారు. వెనక సీట్ల నుండి ఓ చంటి పిల్లాడి ఏడుపు వినిపించి, కాసేపటికి ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. మానిటర్లో సినిమాలు మార్చి, మార్చి చూసినా ఏవీ ఆసక్తిగా అనిపించలేదు. పక్క సీట్లోని మామ్మ సన్నటి గురక పెడుతూ మంచి నిద్రలో ఉంది. లైట్ ఆన్ చేసి లాప్టాప్ బ్యాగ్ తెరవబోతూ కాసేపు సంశయించాను. సొంత దస్తూరీతో నాకు లవ్ హేట్ రిలేషన్- మొహమాటంగా ఉంటుంది, చాకలి పద్దులా అనిపిస్తుంది, పదం పదం రాసుకుని మెరుపు పుడుతుంది, గుండెల నిండా ఊపిరి నింపుకున్నట్టు ఉంటుంది.. మనస్థితిని బట్టి రాతల రాతలు..ఒక్కో కాగితం తిరగేసాను.

రాహుకేతువులు గ్రహణం రోజు మాత్రమే సూర్యచంద్రులని మింగుతారు, నేను ఇష్టంగా చేరుకున్న త్రిశంకు స్వర్గం అసలు నేనంటూ లేకుండా చేసింది. నిలకడ లేని గమ్యం వైపు అలసిన పరుగు, ప్రతి క్షణం ఏదో వేదన. ఈ రోజు సెల్ఫ్ హెల్ప్ పుస్తకం తిరగేస్తుంటే ఉలిసిస్ సిండ్రోమ్ తో బాధ పడే వారు మందులతో కాదు, మనుషులతో నయమవుతారని ఉంది. వీళ్ళు భలే రాస్తారు మందులు దొరుకుతాయి కానీ మనుషులెలా దొరుకుతారు, అంతా హడావిడిగా పరిగెడుతుంటారు. భయం అనేది ఎక్కడో లేదు నీలోనే ఉందని కూడా రాసారు, ఓ అర క్షణం రిలీఫ్ గా అనిపించింది. మళ్ళీ నేను, నా తన్హాయి… ఎన్ని పాత్రలు పోషిస్తే ఈ పూట గడుస్తుందో…

నేడు నాది కాదు, రేపటిపై ఆశలు లేవు
ఆటు పోట్ల నడుమ కెరటంలా
ఓ క్షణం నువ్వు, మరో క్షణం నేను
సందోహంలో మౌన గీతం ఆలపిస్తూ
చీకటి రాత్రుల సావాసం చేసాను
ముగింపు లేని యాత్రకి సంతకం చేసాను

సాయంత్రం కేతన్ బలవంతపెడితే న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళాను. వాతావరణం ఉల్లాసపు పరిమళంతో నిండిపోయింది, రంగు, రంగుల సీతాకోకచిలుకలు సందడిగా తిరుగుతున్నాయి. గుమిగూడిన చూపులు నూతనత్వం కోసం తహతహలాడుతున్నాయి. సందోహంలో ఏకాకినై పన్నెండింటి దాకా గడిపాను, కేక్ కటింగ్ తంతుతో విముక్తి పొందాను. రాత్రి సైడ్ వాక్ పై ఎంత సేపు నడిచానో తెలీదు.

నాచు పట్టిన గోడపై గొంగళి పురుగు
తనలో తాను సమాధి అయి
శిధిలపు శకలంలా వేలాడుతోంది
ఉలుకు లేదు, పలుకూ లేదు
అసలు చలనమే లేదు
వచ్చి పోయే వసంతాల ఆరాటం లేదు
దిగంతం కేసి చూపులు తప్ప.. ఏ ఆరాటం లేదు

సుచిత్ర లాగిన్ అయింది, పలకరించకుండా గుమ్మం ముందు తచ్చాడాను. పాత తచ్చాటలు ఒక్కొక్కటీ గుర్తొచ్చాయి.

వారం రోజులు నెమరు వేసుకుని తేనె కళ్ళ అనితని సివిక్స్ నోట్స్ అడిగాను, “ఎందుకు?..” అన్నట్టు చూసింది. ఆ సున్నా చూపు కోసం మళ్ళీ అడగాలనిపించింది, నిక్కరు వేసుకునేవాడికి రెండో సారి అడిగే ధైర్యమెక్కడిది?

పక్కింట్లో నందివర్ధనం చెట్టు, సంగీత సాధన చేస్తున్న మామీ కూతురు రంజని మెదిలాయి. రాగయుక్తంగా పాడేది, అందంగా బొమ్మలు వేసేది, అంతకంటే అందంగా నవ్వేది. ఓ ఆదివారం పొగ జిమ్ముతున్న పాత లారీ వచ్చింది, నడ్డిపై ఇంటెడు సామాన్లు నింపుకుని కూడా రంజనిని లాక్కుని వెళ్ళిపోయింది. నందివర్ధనం పూలు ఉన్నాయి కానీ ఇల్లు మూగబోయింది.

రెహనా కాలేజీ సీనియర్ మాత్రమే కాదు నడిచొచ్చే హుందాతనం, మౌనం కలవరపెడుతుందని కలలో కూడా అనుకోలేదు. ఉదయం పార్కింగ్ లో స్కూటీ ఆగగానే ప్రాణం లేచొచ్చేది, వెళ్లిపోతుంటే నిరీక్షణ మొదలయ్యేది… ఉచ్ఛ్వాస నిశ్వాసలంటే అవేనేమో…

ఎన్నో తచ్చాటలు… పేరు పెట్టలేని, ఆ క్షణం అన్నీ అయిన సందర్భాలు… నోట్బుక్ లో దాచుకున్న నెమలీక లాంటి అపురూపాలు.

సుచిత్రతో చాట్ చెయ్యడం తప్పని దినచర్యగా మారింది. ఎదురుగా జీవంలేని స్క్రీన్, వాటిపై గుప్పెడు జీవం పోసే అక్షరాలు, చదువుతుంటే నిశ్శబ్దపు అణు విస్పోటం…

బ్యాగ్లోంచి కాగితం తీస్తుంటే నా చెయ్య పక్క సీట్ మామ్మని తాకింది, ఆవిడకి మెలుకువ వచ్చి వెలుగుతున్న లైటు కేసి, నాకేసి మొహం చిట్లిస్తూ చూసింది. సారీ అనబోతుంటే కాస్త జాలిగా చూస్తూ “బాబూ! ఆఫీసు పని చేస్తున్నావా?” అని హిందీలో అడిగింది. సీరియస్ గా మొహం పెట్టి “లేదు ప్రేమ లేఖలు చదువుతున్నాను..” అన్నాను. అనుమానంగా నవ్వింది. బాటిల్ మూత తీసి కాసిన్ని మంచి నీళ్ళు తాగి నిద్రలోకి జారుకుంది.

తర్వాత కాగితం తీశాను.

జాబ్ = పేచెక్ + వీసా స్టేటస్ అని టైపు చెయ్యగానే జవాబుగా స్మైలీ పంపింది. తన జాబ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుందని చెప్పింది. నాకో నిజమైన అనుమానం మొదలయ్యింది. అసలు మంచి ఉద్యోగాలు ఇండియాలో దాచారేమోనని. ఏది ఏమైనా సమాంతర రేఖ దగ్గర కలుసుకున్న విభిన్న ధృవాలం.

ఈ రోజు ‘హై’ అండ్ ‘లో’ మొమెంట్స్ గురించి చాలా సేపు మాట్లాడుకున్నాము.

ఎప్పుడైనా స్తబ్దుగా అనిపిస్తే కిటికీ తెరుస్తాను, ఓ బుల్లి పిట్ట కొమ్మలకి హడావిడిగా పాఠాలు చెబుతుంది, అర్థమయినట్టు ఆకులు రాలడం, ఒక్కోసారి సన్నటి జల్లు జత కలవటం జరుగుతుంది. అసలు కిటికీ తెరిస్తే ఆలోచనలు పురి విప్పుకుంటాయి. ఇంతకంటే సహజమైన కౌన్సిలింగ్ ఇంకేమైనా ఉంటుందా? మా ప్రొఫెసర్ చెప్పినట్టు ‘అందరికీ ఒకటే మందని చెప్పలేము, ఎవరి విరుగుడు వాళ్ళే వెతుక్కోవాలి” అంది. నేను నా అపార్ట్ మెంట్ కిటికీ తెరవను అని చెప్పాలనుకున్నాను. టైప్ చేసిన అక్షరాలు నా చాట్ విండోలోనే మిగిలిపోయాయి.

సుచిత్రతో పరిచయం పెరిగాకా అద్దంలో అనామకుడు అలానే ఉన్నాడు, లోపలి గొంగళి పురుగు రూపాంతరము చెందింది.

ఈ రోజు టోనీని కసి తీరా తిట్టుకున్నాను, “అనుభవం లేకుండా.. “అంటూ సవాలు విసరకుండా ఉండి ఉంటే ఇలా బందీగా మారేవాడిని కాదు. మ్యూజిక్ ప్లేయర్ లో మంచి ఊహలాంటి పాట “బాబూజీ ధీరే చల్నా, ప్యార్ మే జర సంభల్నా..” వస్తోంది. జారుడు బల్లపై జాగ్రత్తగా నడవమంటుంది, పడతామని తెలిసినా జారుడుబల్ల ఎక్కడం, జారడం, అడుగందని లోతులో పడడం దీని నైజం.

ఇప్పుడు నవ్వుకునే వెసులుబాటు లేదు. పగలంతా రాత్రి కోసం ఎదురుచూస్తాను, రాత్రి కొవ్వొత్తిలా కరిగిపోతుంది. కరిగే క్షణాల్లో కొత్త ప్రపంచం అవిష్కరిస్తాము. దూరాలు నడుస్తాము..నదులు, పర్వతాలు, పచ్చిక బయళ్ళు, జలపాతాలు ఒకటేమిటి అన్ని ప్రకృతి రూపాలలో మేమే.. చీకటి కుబుసం విడిచే దాకా పాటలు, కథలు, పుకార్లు విశ్లేషిస్తూ ప్రపంచం చుట్టివస్తాము.

నిన్న సుచిత్రతో మాట్లాడుతుంటే కార్పెట్ ఆరు బయట డాబాగా మారిపోయింది. తిలక్ కవిత్వానికి కూడా అందని అందమైన రాత్రి. చిక్కటి చీకటి తెరపై అందంగా అద్దిన రెండు నక్షత్రాలు మెరుస్తున్నాయి, నల్లటి తెరపై ఆలస్యంగా ఎగురుతున్న తెల్లటి కొంగల జంట కాసేపు ఆగి నన్ను చూస్తున్నట్టు అనిపించింది.

చిన్న వాదన పెను తుఫానుగా మారుతుందని ఊహించలేదు, ఈ వెనుతిరుగని ప్రవాహంలో ఏమయినా పర్వాలేదు

ఆచి తూచి నూరేళ్ళు గడపచ్చు, ఆరని జ్వాలలో దూకి ఈ క్షణం ఆహుతి కావొచ్చు.
జలపాతాల అందాలను కెమరాలో బంధించవచ్చు, నయగారాలని వర్ణిస్తూ గేయాలు రాయవచ్చు.
నాకు దూకి లోతులు తెలుసుకోవాలని ఉంది, అ ప్రయత్నంలో మాయమవాలని ఉంది.

***

ముందు రోజు “నిన్ను ఎయిర్పోర్ట్ లో ఎలా పోల్చుకోను” అని అడిగితే పసుపు రంగు చుడీదార్ వేసుకుంటానని చెప్పింది, పసుపు నాకిష్టమైన రంగని ఒకే ఒకసారి చెప్పి ఉంటాను అయినా భలే గుర్తుంచుకుంది. నిజానికి ఏ ఆనవాళ్ల అవసరం లేని పరిచయం మాది.

వడిలిన మొహాలు ప్లేన్ దిగి భారంగా బాగేజ్ క్లెయిమ్ వైపు కదులుతున్నాయి, పక్క సీట్ మామ్మ వీల్ చైర్ లో నన్ను దాటుతూ “అంతా అనుకున్నట్టే జరుగుతుంది”’ అని దీవించి వెళ్ళిపోయింది. జీవితంలో అతి ముఖ్యమైన అడుగులు వేస్తూ వెళుతుంటే కస్టమ్స్ సిబ్బంది అడ్డు పడ్డారు, బహుశా నా ఆదుర్దాని వేరేలా అర్థం చేసుకున్నారో ఏమో పూర్తిగా తనిఖీ చేసి భంగపడి వదిలారు.

అరైవల్ లాంజ్ మెట్లు దిగుతుంటే చూపులు పసుపు రంగు కోసం వేగంగా గాలించాయి, లాంజ్ లోకి చేరుకోగానే వేగం సరి చేసుకుని అన్ని వైపులా చూసాను, సుచిత్ర గానీ పసుపు రంగు చుడీదార్ గానీ కనపడలేదు. సమయం సాపేక్షం కనుక ఎంట్రన్స్ వైపు ఎంత సేపు చూసానో చెప్పడం కష్టం, యెస్.టి.డి బూత్ నుండి సుచిత్ర నెంబర్ కి ఫోన్ చేసాను, రింగయింది కానీ ఏ జవాబు లేదు.

ఎటు చూసినా ఆత్మీయ కౌగిలింతలు, చెమ్మగిల్లిన చూపులు, వెనుతిరుగలేని బంధాలు, అసలు ఎయిర్పోర్ట్ అంటేనే ఉద్వేగపు కూడలి. సుదీర్ఘ నిరీక్షణ పుట్టేది అక్కడే, ముగిసేది అక్కడే..వచ్చి, వెళ్లే మనుషులను చూస్తూ గడిపాను, కాఫీ కప్పుతో అడుగులు కొలుస్తూ నడిచాను. అప్పటికే చీకటి చిక్కపడింది. సుచిత్ర ఎందుకు రాలేదని ఆలోచనలు అన్నీ దిక్కులా పరిగెడుతున్నాయి. బాగ్ లో గ్రీటింగ్ కార్డు పెట్టుకున్న విషయం గుర్తొచ్చింది. కార్డు తీసి చూస్తే అడ్రస్ దొరికింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా ఎయిర్పోర్ట్ బయట పడ్డాను.

తేలిపోయిన గాలిపటం నేలపై వాలింది, నడకని వెంబడించే నీడలా అడుగులకు అలజడి తోడయ్యింది, అనుక్షణం కలవరపెడుతోంది… అయినా పట్టు వదలను, సందేహాలు సుడిగాలి వంటివి, స్థిరత్వం ఉన్న చోట అది వచ్చిన జాడ కూడా తెలియదు. గమనం గురి తప్పదు. ఇట్ విల్ బి ఎ ఫెయిరీ టేల్ ఎండింగ్!

**** (*) ****