వ్యాసాలు

రూపు

జూన్ 2016

ప్రస్తావన

అనగనగా – గిరిక అనే ఓ అందమైన తెనుగు ప్రబంధనాయిక. ’అందమైన’ అంటే సాదా సీదా అందం కాదు. వెన్నెల వెలుగుకే తట్టుకోలేక ఎలుగెత్తి శోకాలు పెట్టేంత సుకుమారి. జ్యోతిష్య,వ్యాకరణాది శాస్త్రాలను ఔపోసన పట్టిన మహా పండితుని కలం నుంచి జాలువారిన ముగ్ధ. సంస్కృతంలో అయితే ’తన్వి’. ఆ అమ్మాయి కోనలమధ్యన కేళీమందిరంలో కూర్చుని వీణ వాయిస్తూంది. ఆ వీణానాదాన్ని అధిష్టానపురపు రాజు విన్నాడు. ఆ అమ్మాయి ఆనవాళ్ళు కనుక్కుని రమ్మని తన అనుంగుమిత్రుణ్ణి పంపినాడు. ఆ నర్మసచివుడు వచ్చి, ఆ అమ్మాయిని కాస్తా చూశాడు. చూసి వచ్చి తన మిత్రుడు, యజమాని అయిన మహారాజుకు ఆమె అందం గురించి సుదీర్ఘంగా చెప్పాడు. అందులో భాగంగా ఆ అమ్మాయిని నఖశిఖపర్యంతమూ వర్ణించినాడు. అలా చెప్పి కడకు ఇలా అన్నాడు

ఉ||
స్వైరవిహారధీరలగు సారసలోచనలున్నచోటికిన్
భోరున లాతివారు చొరఁబూనినచో రసభంగమంచు నేఁ
జేరక పువ్వుఁదీవియల చెంతనె నిల్చి లతాంగిరూపు క
న్నారఁగఁ జూచివచ్చితి నవాంబురుహాంబక నీకుఁ దెల్పగాన్.
(వసుచరిత్రము – 2.55)

నవ అంబురుహ అంబక = క్రొందామరల వంటి కనులు కలిగిన ఓ మహారాజా!
స్వైరవిహారధీరలగు = స్వేచ్ఛావిహారంలో ప్రౌఢలయిన
సారసలోచనలు = పంకజాక్షులు
ఉన్నచోటికిన్ = నివాసం ఉన్న స్థలానికి
భోరున = హఠాత్తుగా
లాతివారు = అన్యులు
చొరన్ పూనినచో = చొచ్చికొని పోవడానికి ప్రయత్నించినప్పుడు
’రస’ భంగము అంచున్ = స్వారస్యము చెడుతుందని
నేన్ చేరక = నేనక్కడికి వెళ్ళక
పువ్వున్, తీవియల = పూలు మరియూ తీగల యొక్క
చెంతనె = సమీపాన
నిల్చి = నిల్చి
లతాంగిరూపు = ఆ తీవవంటి శరీరముగల చిన్నదాని రూపు
కన్నారఁగన్ చూచి = నేత్రములకు తృప్తికరమగునట్టు చూచి
నీకున్ తెల్పగాన్ = నీకు వివరించుటకు
వచ్చితి = వచ్చినాను.

ఓ వెల్లతామర వంటికనులు గలిగిన మహారాజా! తమ నెలవులో స్వేచ్ఛావిహారంలో మునిగిన సారసలోచనలు ఉన్న చోటికి అన్యులు చొరబడరాదు. అలా వెళితే రసభంగమవుతుంది. అందుకని నేను ఆమె సమీపానికి వెళ్ళి ఆమె క్రీడలకు భంగం చేయక, దాపుల నున్న పూలతీవెల మాటున నిలబడి కనులనిండుగా ఆ అమ్మాయి”రూపు”ను నీకు తెలుపడానికి చూచి వచ్చినాను.

భట్టుమూర్తి లేదా రామరాజభూషణుడు రచించిన వసుచరిత్రమహాప్రబంధం లోని ద్వితీయాశ్వాసపు ఘట్టం ఇది. అల్లసాని పెద్దనాదుల సమక్షంలో సాహిత్యపు విద్యలను నేర్చి, సంగీత, జ్యోతిష్య శాస్త్రాది విద్యలను కరతలామలకం చేసుకుని మహాప్రతిభతో, అసమాన వ్యుత్పత్తితో రచించిన గ్రంథం వసుచరిత్రము. దాదాపు ప్రతిపద్యంలోనూ ఏదో ఒక విధమైన చమత్కారాన్ని, లేదా శ్లేషనూ నిర్వహించిన కవితాగరిమకు సాక్షి ఈ కావ్యం. ఒక్కో పద్యంలో – అర్థమవుతున్న కొద్దీ పొరలుపొరలుగా విడివడే అనేక భావాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈ సంవిధానం సంస్కృతంలో బాణభట్టు కాదంబరి కావ్యంలోనూ, కాళిదాసు కావ్యాదులలోనూ కనిపిస్తుంది కానీ తెనుగు కావ్యంలో అప్పటికి బహుశా రాలేదు. వసుచరిత్ర ఈ విషయంలో సంస్కృతకావ్యాలను ఎకసెక్కం గలదు – అంటే అతిశయోక్తి కాదు.

తిరిగి పై పద్యాన్ని చూస్తే- వ్యాఖ్యాతలు చెప్పిన విశేషాలు ఇవి.

1.’సారసలోచనలు’ – ఇది సాభిప్రాయపూర్వకమైన ప్రయోగం. “సారసలోచన” లను అన్యులు చూస్తే “రస” భంగమవుతుంది. అంటే సా”రస”లోచన – సాలోచన అవుతుంది. బొమముడితో కినుకవహిస్తుంది. ఇది ఒక అందమైన శబ్దచిత్రం.

2. సారసలోచనలు = సార + సలోచనలు కూడాను.

3. రాజుగారి నర్మసచివుడు ’సారసలోచన’ను – ’నవాంబురుహ అంబకు’డైన తన ప్రభువుకు కట్టబెడుతున్నాడు. అంటే పద్మాలవంటి కన్నులు కలిగిన అమ్మాయి గురించి కొంగ్రొత్తతామరల కనులున్న తన ప్రభువుకు వివరిస్తూ, ఈడూ-జోడు కుదిరిందని పాఠకులకు సూచిస్తున్నాడు.

4.’లతాంగి’ అనడమూ సాభిప్రాయమే. ఎందుకంటే చెబుతున్న ఆ కథానాయిక తండ్రి కోలాహలుడనే ఒక కొండ. ఆ అమ్మాయి తల్లి శుక్తిమతి అనే వాగు. వాగుతల్లికి, కోన తండ్రికి పుట్టినది కాబట్టి ’లతాంగి’ అయింది.

5. ’పువ్వుఁదీవియల’ చెంత నర్మసచివుడు నిలబడి ’లతాంగి’రూపు చూడటం – ఇది మరొక చమత్కారం.

6. లతాంగి అన్నది ఒక రాగం పేరు కూడాను.సంగీతమర్మజ్ఞుడైన రామరాజభూషణుడు ఆ రాగపు పేరు అమ్మాయికి పెట్టటం వెనుక కూడా సాభిప్రాయం ఉండే ఉంటుంది. ఇది సంగీతజ్ఞులైన వ్యాఖ్యాతలు చెప్పాలి.

7. చాటుగా చూచిన కార్యానికి ‘రసభంగమ’న్న కారణం చూపబడింది కనుక కావ్యలింగాలంకారము.

8. నవాంబురుహ అంబక – అంటే – క్రొందామరల వంటి కన్నులుగల మహారాజా అన్న అర్థమే కాక మరి రెండు అర్థాలు ఉన్నాయి.
అంబురుట్ = నీటియందు పుట్టినది. (తామర పువ్వు, అగ్ని)
అంబకము = కన్ను, బాణము

అంబురుహ-అంబక అంటే తామరను బాణముగా కలిగిన వాడు – మన్మథుడు (నవాంబురుహాంబక = నవమన్మథుడు)
అంబురుహాంబక = నీటియందు పుట్టిన అగ్నిని కన్నుగా గలిగిన వాడు (నవాంబురుహాంబక = వెలిగే అగ్నియే నేత్రముగా గలిగినవాడు)
వసురాజును చిచ్చరకంటిగా ఉద్యోతించి భట్టుమూర్తి చేసిన ప్రయోగం సాభిప్రాయమని, ఆ ప్రయోగం వెనుక గల స్వారస్యాన్ని నారాయణాచార్యులవారు అద్భుతంగా వివరించారు. వారి విమర్శను విమర్శతరంగిణి పుస్తకంలో చదువుకోవచ్చు.

9. ‘సారసలోచన ‘ లను లాతివారు – అనగా అన్యులు చూస్తే రసభంగమవుతుంది. స్వజాతి కి చెందిన నవాంబురుహాంబకుడు మాత్రము సమీపమునకు పోవచ్చుననుట.

పద్యంలోని మిగతా విశేషాలు అటుంచితే – ’లతాంగిరూపు’ అనే సమాసంలోని “రూపు” గురించి, ఆ శబ్దం తాలూకు నేపథ్యానికి నాటి చారిత్రక, రాజకీయ, సాంఘిక వాతావరణాన్ని అన్వయించడానికి చేసిన ప్రయత్నం ఈ వ్యాసం.

లతాంగిరూపు = అంటే లతాంగి యొక్క ఆకారవిశేషము, లేదా లతాంగి యొక్క సౌందర్యము అని సాధారణంగా స్ఫురించే అర్థం. వసుచరిత్రకు అద్భుతమైన విమర్శ వ్రాసిన వజ్ఝల చినసీతారామశాస్త్రి గారు, ఈ కావ్యానికి అద్భుతమైన టీక కూర్చిన శేషాద్రి రమణ కవులున్నూ “లతాంగిరూపు” అంటే “ఆ యువతి యొక్క సౌందర్యము” అనే అర్థం చెప్పారు. వసుచరిత్ర కావ్యాన్ని అద్భుతంగా విమర్శించిన పుట్టపర్తి నారాయణాచార్యుల వారూ, రవ్వా శ్రీహరి గారూ, రాజన్న కవి గారు తదితరులు మాత్రం ఇక్కడ ఒక విచిత్రమైన, విశేషమైన అర్థాన్ని చెప్పారు.
ఆ వ్యాఖానాల్ని ఇక్కడ పరిశీలిద్దాము.

1. గిరికాదేవి వృత్తాంతమును చెప్పినంతనే వసురాజామెను వివాహమాడనెంచెను. ఆమె యవివాహితయా? కాదా? అన్న ప్రశ్న యేల తట్టలేదు? దీనినిఁగూడ నర్మసఖుడే పరిహరించినాఁడు. అతఁడామె ’రూపు’ ను జూచినాఁడు. అవివాహితలైన స్త్రీలు మెడలో ’రూపు’ అనునొక ఆభరణమును గట్టికొనుచుండిరట. – ఇది పుట్టపర్తి వారి విశ్లేషణ. (ఆచార్యుల వారి విశ్లేషణ ప్రకారం – లతాంగి ‘రూపు ‘ అనే విశేషాన్ని సాభిప్రాయంగా చెప్పిన కారణాన ఇక్కడ పరికరాలంకారం.)

2. రూపు అన్నది ఒక ఆభరణం పేరు. మద్దెల ఆకారములో అర అంగుళము నిడివిగల బంగారముతో చేసిన పూస. పెండ్లి కానున్న కన్యలు దీనిని మెడలో ధరించెదరు. – ఆచార్య రవ్వా శ్రీహరి (వీరి ఊహకు మూలం పుట్టపర్తి నారాయణాచార్యుల వారి వ్యాసమట).

3. ’రూపు’ శబ్దముపైన ఒక లక్షణామూలకమైన వ్యంగ్యము నిర్వచింపవచ్చును.బొడ్డు లేని డాలరుగల సువర్ణహారమునకు “రూపు” అని పేరు. దీనిని కన్య రజస్వల అయిన తొమ్మిదవ రోజున మెడలో వేయుదురు. డాలరుపైన సరస్వతీవిగ్రహముండును. వివాహ సమయమున ఈ “రూపు” ఆభరణమును తీసి తాళి కట్టింతురు. రాయలకాలములో, ప్రత్యేకించి పెనుగొండ ప్రాంతములోని సంప్రదాయమిది. – రాజన్న కవి.

4. రూపు శబ్ద ప్రయోగముచే గిరిక యవివాహిత యని సూచింపబడెననియు, రూపన యవివాహితలు ధరించు ఆభరణవిశేషమనియు దెలియవచ్చుచున్నది. రూపులను నాణెములను బాలికలు పూసలతో ధరించుట మనకు తెలిసిన విషయమే. – కిళాంబి రాఘవాచార్యులు గారు గారు (1931)

రూపు- తీగె

మెడచుట్టూ వేసుకునే ఆభరణాన్ని సంస్కృతంలో కంఠిక లేదా గ్రైవేయకం అన్నారు. కంఠిక అనకుండా, గళాభరణము (మెడలో వేసుకునే నగ) ను పోతన – ఆంధ్ర భాగవతంలో వామనావతార ఘట్టంలోని ప్రముఖపద్యంలో ప్రస్తావించాడు.

మ||
రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రంబై, శిరోరత్నమై,
శ్రవణాలంకృతియై, గళాభరణమై, సౌవర్ణకేయూరమై,
ఛవిమత్కంకణమై, కటిస్థలి నుదంచద్ఘంటయై, నూపుర
ప్రవరంబై, పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.
(8-623)

కంఠిక తెలుగులో ’కంటె’ లేదా ’కంటు’ గా మారింది. కంటె అంటే – గట్టినగ. కంటె ను మగవాళ్ళు కూడా ధరిస్తారు. ఈ కంటె – జానపదుల వ్యవహారంలో కుత్తికకంటు, లేదా కుత్తికంటు . అంటే వదులుగా ఉన్న గొలుసు కాకుండా, గొంతుకు చుట్టూతా కాస్త బిగుతుగా వేసుకునే నగ. గొంతు క్రింద ఉన్న చిన్న ’గుంత’ కు హిక్కాసూత్రమని పేరు. దానికి పైభాగానే ఈ కంటె అనే నగ అమరి ఉంటుంది.

ఆముక్తమాల్యదలో మాలదాసరి – తులసిమాలలు తొడిగిన కంటెను మెడలో వేసుకుంటాడు.


..
గీ||
వలుద వనమాలకంటె యు, మలిన తనువుఁ
బట్టె తిరుమన్ను, బెదరుఁ గెంబుట్టుఁ జూపుఁ
బసుపుఁబొడి తోలు వల్వంబు నెసకమెసఁగ
వచ్చు సేవింప సురియాళు వైష్ణవుండు. (ఆముక్తమాల్యద 6-6)

మెడలో తులసిపూసలు కూర్చిన ఇత్తడి నగ, మురికి శరీరం, బెదురుచూపులు, పసుపు రంగు సెల్లా (ఉత్తరీయం).ఇదీ మాలదాసరి వర్ణన.

రామప్ప గుడిలో కుడ్యసుందరి మెడలో కూడా “కంటె” కనిపిస్తుంది. గమనించండి.

ఈ “కంటె” అనే ఆభరణం గుండ్రంగా ఉంటే రూపు. సాఫుగా (చదునుగా) ఉంటే తీగ. రూపు ను పెళ్ళికాని అమ్మాయిలు ధరిస్తే, తీగెను పెళ్ళయిన స్త్రీలు ధరిస్తారు.

“రూపు” శబ్దానికి “ఆభరణం” అని అనుమానాస్పదమైన అర్థం వచ్చే సందర్భం అన్నమయ్య కీర్తనలో ఒకచోట కనిపిస్తుంది.

॥పల్లవి॥
పరతత్త్వం బగు బాలుఁడు
పరిపరి విధముల బాలుఁడు
॥చ॥
వెన్నలు దాఁకఁగ వేట్లాడుచును
సన్నపు బడుచుల సంగడిని
కన్నెలు దూరఁగఁ గలకల నవ్విన
పన్నిన మాయల బాలుండు
॥చ॥
బచ్చన రూపు ల పాయపుఁ బడుచులు
నిచ్చలుఁ గొలువఁగ నెమ్మదిని
నచ్చిన వేంకట నగమున నాడెడి
పచ్చిల పదకపు బాలుండు

పెనుగొండ ప్రాంతంలో అమ్మాయిల మెడలో “రూపు” తొడగటం ఆ అమ్మాయి – కన్య, అవివాహిత అని సూచించటానికి గుర్తు. ఆ “రూపు” ను ధరించడానికి సామాజిక కారణం ఉన్నది. ఇప్పటి ఒక తరం మునుపు వరకూ, (కొంతవరకూ ఇప్పుడూనూ) అక్కడక్కడా ధనవంతుల ఇళ్ళలో పెళ్ళి సంబంధాలు కుదుర్చడానికి కొందరు బ్రాహ్మలు ఉండేవారు. వీరిని పెళ్ళిళ్ళ పేరయ్యలు అనేవారని విజ్ఞులైన పాఠకులకు తెలిసిన విషయమే. సమాజంలో ధనవంతులు కాక సామాన్యులూ ఉన్నారు. వాళ్ళ ఇళ్ళలో పెళ్ళిళ్ళు జరగడానికి, వెనకటికి – కొంత తతంగం ఉండేది. అమ్మాయి రజస్వల అయిన తర్వాత మెడలో ’రూపు’ అనే నగను అలంకరించేవారు. రూపు – అన్న పేరు కూడా అమ్మాయి రూపలావణ్యాలను చూడమనే సంకేతానికి గుర్తు. ఏదైనా జాతర/మెరవణి లో, పెళ్ళిళ్ళలో, ఈ పెళ్ళికాని అమ్మాయిల మెడలో ’రూపు’ ను ఎవరైనా యోగ్యుడైన యువకుడు, లేదా యువకుని పెద్దలు చూడడం జరిగితే, ఆ యువకుని తల్లిదండ్రులు, ఈ అమ్మాయిని కన్య అని నిర్ధారించుకుని, అమ్మాయి తల్లితండ్రులను తమ పుత్రుని వివాహార్థమై సంప్రదించే అవకాశం ఉండేది. అంటే – జాతరలలో ఎవరైనా ఈ నగ ఉన్న అమ్మాయిని చూసినప్పుడు పరోక్షంగా పెళ్ళిచూపులు చూసి, ఆ తర్వాత ఆ అమ్మాయి పెద్దలను సంప్రదించేలా ’రూపు’ అనే నగను అలంకరింపజేయడం ఒక ఏర్పాటు. పెళ్ళయిన తర్వాత ’రూపు’ అన్న నగను తీసి వేసి, ’తీగె’ అన్న మరొక్క నగను వేస్తారు. ఇది పుట్టింటి వాళ్ళు వేస్తారు. తీగె ధరించటం తప్పనిసరి. మాంగల్యం పరులకు కనిపించరాదు కాబట్టి, తీగె ద్వారా అమ్మాయికి పెళ్ళయిందని సూచించడం ’తీగె’కు ప్రధానమైన ఉపయోగం. “మెడలో తీగె లేకపోతే, వంశం తీగ సాగద” ని ఒక పలుకుబడి. ఈ రెండు ఆచారాలు ఆనాడు పెనుగొండ ప్రాంతంలో, ప్రధానంగా కాపుల ఇళ్ళల్లో లేదా ద్విజేతరుల ఇళ్ళల్లో ఉన్నవని గ్రహించాలి. ఇతర వర్ణాలలోనూ ఈ ఆచారం ఉన్నది కానీ నిర్బంధంగా ఉన్నట్టు ఆధారాలు వ్యాసకర్తకు దొరకలేదు.

తీగెకు నానుతీగ, నాను అన్న నామాంతరాలు కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉన్నవి. మెరుగుపెట్టిన తీగెకు మొగపుతీగ అని వ్యవహారనామం.
…..
…..
విటుల మన్మథు డేయు – విరి మొగ్గ తూపు
నటన గుమ్మడి గింజ – నావమ్ము తీర్చె
బసిడి ముత్యాల నొ – ప్పగ పూర్ణ చంద్రు
తవమించు చెవుల తే – టంకాలు చేర్చె
మొగపు తీగె కు చెంత – ముత్యంపు కొలికి
జగిమణుల్ మిగులు మం – జిడి తాళి జేసె
పుంజాల దండ దా – పున నేవళమ్ము
రంజిల్లు భన్నవ – రమ్ము క్రీడించ
యిన్ని సిమ్ములకును – వన్నె బెట్టినటు
మూడు వేల్ వెలసేయు – ముక్కఱ బెట్టె
(సుభద్రాకల్యాణం – 27)

తాళ్ళపాక తిమ్మక్క ’సుభద్రాపరిణయం’లో సుభద్రకు తొడిగిన ఆభరణాల్లో “మొగపు తీగె” ఒకటి. (కవయిత్రి ఈ సందర్భంలో – “మొగపు తీగె” ను పెళ్ళయిన స్త్రీకి కాక పెళ్ళికాని కన్య – సుభద్రకు తొడగటం గమనార్హం. ఇది పొఱబాటు కావచ్చు. లేదా వివాహితకు మాత్రమే వర్తించే ఆచారం కవయిత్రి కాలానికి/ప్రాంతానికి ఉండకపోవచ్చును)

కూచిమంచి తిమ్మకవి మాత్రం మొగపు తీగెను పెళ్ళయిన స్త్రీకి కట్టబెట్టి ఔచిత్యం పాటించాడు.

కం||
పడతుక యొక్కతె యపుడా
యొడయని బొడగనగ వచ్చె యొడ్డాణమునే
మెడనిడి మొగపుల తీగియ
నడుమున నిడి యలతి వలపు నాటుకొనంగన్. (రసికజన మనోభిరామం – 89)

రహదారిలో యువరాజు వెళుతున్నాడు. అతణ్ణి చూసే తత్తరపాటులో మొగపు తీగెను నడుముకు వడ్డాణంలా చుట్టుకుంది. మొగపు తీగె, వడ్డాణం ఒకే విధమైన ఆకారంలో ఉంటాయని ఈ పద్యం ద్వారా తెలుస్తుంది. ఇది సంస్కృత భాగవతంలో శ్రీకృష్ణుని మధురానగరవిహారఘట్టంలోనూ, మాఘుని శిశుపాలవధం లోనూ ఉన్న శ్లోకాలకు అనుకరణ.

***

ఈ నేపథ్యంతో తిరిగి మన “స్వైరవిహార ధీరలగు…” పద్యానికి వద్దాం. ’రూపు’ అన్న శబ్దానికి అర్థం అవివాహిత అలంకరించుకున్న ఆభరణమే అని అనుకుంటే – పద్యానికి భావం ఇలా పరిణమిస్తుంది.

నర్మసచివుడు అమ్మాయిని కనులారా ఎందుకు చూశాడు? “అమ్మాయి మెడలో అలంకరించుకున్న నగ – తీగె యా లేక రూపా?” అని తెలుసుకునేందుకు, కనులారా చూశాడు. పైగా నర్మసచివుడు ఆమెకు కాస్త దూరంగా పువ్వుఁదీవియల మధ్య ఉన్నాడు కాబట్టి, సాధారణంగా జాతరలలో ప్రదర్శించే ఆభరణాన్ని ఇప్పుడు పరులెవ్వరూ లేని చోట ఆమె వేసుకుంది కాబట్టి, తన రాజుకు కట్టబెట్టడానికి ఆ యువతి అవివాహితయే అని ’డబుల్ కన్ఫర్మ్’ చేసుకుందుకు అలా చూసి ఉంటాడని అనుకోవాలి. ఈ రూపు/తీగె (కుత్తుక కంటె) – బంగారే కానవసరం లేదు. కంటె – ఇత్తడి, పంచలోహంతోనూ చేసుకుని ఉపయోగించడం ఉండేది. (రాజన్న కవి గారు ’రూపు’ అంటే సరస్వతి బొమ్మ గల సువర్ణహారమని స్పష్టంగా చెబుతున్నారు. ఇది ఆసక్తికరం. దురదృష్టవశాత్తూ కవి గారు చెప్పిన వివరాల ఆనవాళ్ళు వ్యాసకర్తకు దొరకలేదు.)

***

కానీ జాగ్రత్తగా చదువుకుంటూ వస్తే – ఆ ఘట్టంలో అంతకు మునుపే కవి రామరాజభూషణుడు – నర్మసచివుడు గమనించిన స్త్రీ (గిరిక) – కన్యయే అని చెప్పి, కన్య, తరుణి అన్న శబ్దాలు పద్యాలలో ప్రయోగించినాడు.

సీ|| కన్నెపాదము లజుఁ గన్న మేటికి నైన బాలజంఘలు వరశాలి కైనఁ – (2-51)

చం||
తరువుల పొంతఁ బొంచి వసుధావరమిత్రుఁడు గాంచె నచ్చటం
దరుణిఁ దమోవినీలకచఁ దామరసోదరసోదరప్రభం
దరళవిలోచనం దతనితంబఁ దటిన్నిభగాత్రవల్లరిం
దరుణశశాంకఫాల నొకతన్విఁ దరంగవళిం దలోదరిన్. (2-25)

చెట్లచాటున పొంచి, వసురాజు మిత్రుడు ఆ మణిమందిరాన

తరుణిని = యుక్తవయసులో ఉన్న కన్యను
తమోవినీలకచను = చీకటివలే నల్లని కురులు గలదానిని
తామరస ఉదర సోదరప్రభన్ = పుప్పొడి సమానమైన కాంతిగలదానిని
తరళవిలోచనన్ = చంచలమైన కనులదానిని
తతనితంబన్ = విశాలమైన కటిస్థలము గలిగిన దానిని
తటిన్నిభగాత్రవల్లరిన్ = మెరుపుతో సమానమైన కాంతి గలదానిని
తరుణశశాంకఫాలన్ = నెలవంక వంటి ఫాలభాగము గలిగినదానిని
తరంగవళిన్ = నడుమున అలలవంటి మడతలు గలిగినట్టి దానిని
తలోదరిన్ = చదునైన పొత్తికడుపుగలదానిని
తన్విన్ = అందమైన తనువు గలదానిని గాంచినాడు.

(పైని పద్యంలో విశేషం కనిపిస్తూనే ఉంది. ’తన్వి’ కి గల విశేషణాలన్నిటిని ’త’కారాదిగా గల పదబంధాలచేత కవి కూర్చినాడు. ఎందుకు? తన్వి – అంటే “అందమైన తనువు” గలది. ఇది సాధారణ వ్యుత్పత్తి. తన్వి – అంటే – “త్” + “అను” + యస్యాః సా – అని విగ్రహవాక్యం సాధ్యమట. అంటే “త”కారాన్ని అనుసరించిన విశేషణములు కలిగినది కాబట్టి తన్వి అయినది. అందుకనే “తన్వి” కి గల విశేషణాలన్నిటిని “త” తో మొదలయ్యే పదబంధాలతో తయారు చేశాడు మూర్తికవి.)

ఇలా కన్య, తరుణి అని చెప్పటమే కాక ఇంకా -

మ||
కమనీయాకృతియోగ్యకీర్తనములం గన్పట్టు నా శ్యామ యా
సుమబాణాంబక యాయమూల్యమణి యా చొక్కంపుఁబూబంతి యా
సుమనోవల్లరి యా సుధాసరసి యా సొంపొందుడాల్దీవి యా
కొమరుంబ్రాయపురంభ యా చిగురుటాకుంబోఁడి నీకే తగున్.
(2- 52)

ఆ అమ్మాయిని నఖశిఖపర్యంతం వర్ణించి చివరన నర్మసచివుడు తన ప్రభువుతో – ఆ అమ్మాయి “నీకే తగును” అని అంటాడు. ఇంత స్పష్టంగా “నీకే తగు” నని నర్మసచివుడు తేల్చి చెప్పిన తర్వాత – తిరిగి ఆ అమ్మాయి అవివాహితయే అని నొక్కి చెప్పడానికి “రూపు” అన్న శబ్దానికి కన్యలు ధరించే ఆభరణం అనే భావాన్ని వివక్షించి, మరో రెండు పద్యాల తర్వాత కవి ’రూపు’ శబ్దాన్ని ప్రయోగించాడా? అని అనుమానం వస్తుంది.

అలా అని పై భావానికి విరుద్ధంగా – రూపు అంటే కేవలం చూచిన స్త్రీ యొక్క ఆకారవిశేషాన్ని మాత్రమే కవి ఉద్దేశించినాడా? అదీ అదివరకే అమ్మాయిని నఖశిఖపర్యంతము శృంగారరసం చిప్పిల్లేట్టు వర్ణించిన పిదప కూడా తిరిగి పునరుక్తిగా ఆమె సౌందర్యాన్ని ప్రస్తావిస్తూ ’రూపు’ శబ్దాన్ని ప్రయోగించాడా? నారాయణాచార్యులు గారు పొఱబడ్డారా? ఇలా అనుకునీ తృప్తి పడడానికి వీల్లేదు. ఇంతకూ మూర్తి కవి ఉద్దేశించిన భావం ఏది?

***

చరిత్ర – రాజకీయం

వసుచరిత్రలో ’రూపు’ ను ధరించింది గిరిక అనబడే నాయిక. సాధారణంగా ప్రధాన నాయిక సుక్షత్రియ, దైవకన్య, అప్సరస లేదా, రాచకన్నె కావడం నాటి ప్రబంధన్యాయం. గిరిక కోలాహలుని కుమార్తె. కోలాహలుడు హిమవంతుని సుతుడు. అయితే – ’రూపు’ అన్న నగను ధరించే సాంప్రదాయం – స్థానికమైనది, సామాజికంగా ఉన్నతవర్గాలకు చెందనిదీ, నిమ్నవర్గాలలో ఉన్నదీని. గిరిక కోలాహలుని కుమార్తె. కోలాహలుడు – హిమవంతుని సుతుడు. హిమవంతుని పుత్రిక – పార్వతి అజ్ఞాత గోత్ర అని కవి ఒకచోట సూచించాడు. (అజ్ఞాతగోత్ర యనాది శక్తి సుగోత్ర…5.34). హిమవంతుని సుతుడు కోలాహలుడూ, ఆతని కుమార్తె గిరికా అజ్ఞాతగోత్రలే. మరి అటువంటి కన్యను రామరాజభూషణుడు ఎందుకు నాయికగా చేశాడు? ఈ ప్రశ్న నేటికి అసంబద్ధమేమో కానీ, ఆనాటి సాంఘికపరిస్థితుల్లో చర్చనీయమైన విషయం. వసుచరిత్రలో నాయకుడు వసురాజు – సాక్షాత్తూ ఆరవీటి రామరాయలు. వసుచరిత్ర – మనుచరిత్రకు ధీటుగా, ఆ కావ్యాన్ని అధిగమించే ప్రయత్నంతో వ్రాసిన కావ్యమని ఇప్పటికి అనేక విశ్లేషకులు తేల్చిచెప్పిన విషయమే. వసుచరిత్రలో వసురాజు, మనుచరిత్ర నాయకుడైన స్వరోచి ఇద్దరూ సమానంగా ధీరులైనప్పటికీ, కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. ఒక్క నాయకుని విషయమే కాక వసుచరిత్రలో ఇతరత్రా విషయాలకూ, మనుచరిత్రాది ప్రబంధాలకూ మధ్య వ్యత్యాసాలను గుర్తించాలంటే ఆ కాలపు చారిత్రక, రాజకీయ నేపథ్యాన్ని పరిశీలించాల్సి ఉంటుంది.

తెలుగు కావ్యప్రస్థానంలో ప్రబంధయుగానికి స్వర్ణయుగం శ్రీకృష్ణరాయల వారి కాలం. మనుచరిత్ర, పారిజాతాపహరణం, ఆముక్తమాల్యద, పాండురంగమహత్మ్యము వంటి అద్భుత ప్రబంధాలను రాయల వారి కాలానికి కొంత అటునిటుగా ప్రబంధకవులు మహాప్రతిభతో తీర్చినారు. ఈ ప్రబంధాలన్నీ ఏ దానికి అదే సాటి. మనోజ్ఞమైన వర్ణనలకు, అద్భుతమైన వ్యుత్పత్తికి ప్రబంధాలు ప్రసిద్ధం. దాదాపు ఈ ప్రబంధాలన్నిటిలో కథాభాగం పురాణసంబంధమైనది (ఒక్క కళాపూర్ణోదయము తక్క). ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు బ్రాహ్మణ, సుక్షత్రియుల సాంప్రదాయాలకు దగ్గరగా ఉన్నవి. ఆముక్తమాల్యద వంటి కావ్యాలలో అక్కడక్కడా వేదాంతపరమైన శాస్త్రచర్చలూ కద్దు. ఇక తిరుమల తాతాచార్యుల వంటి శాస్త్రపండితుల ప్రభావమూ నాటి సమాజంలో, సమాజరూపాలైన కావ్యాలలో తప్పలేదు. ఇతర ప్రబంధాలతో పోల్చి చూస్తే వసుచరిత్రలో ’వేదాంత, పురాణ స్పర్శ’ ఒకింత తక్కువ. వసుచరిత్రకు మహాభారతంలోని ఉపరిచరవసువు కథ ఆధారమైనా, తన కథ పురాణాన్ని, కల్పనను సమ్మేళనం చేసిన మిశ్రమ కథయని కృత్యాదిలో కవి చెప్పాడు.

ఉ||
కేవలకల్పనాకథలు కృత్రిమరత్నము లాద్యసత్కథ
ల్వావిరి పుట్టురత్నముల వారితసత్కవికల్పనావిభూ
షావహపూర్వవృత్తములు సానలఁ దీరిన జాతిరత్నముల్
గావున నిట్టిమిశ్రకథగా నొనరింపుము నేర్పు పెంపునన్. (1.19)

(పురాణాల నుండి గ్రహింపకుండా, సొంత కల్పనతో రచించిన కథావస్తుకావ్యాలు పచ్చలు, గాజురాళ్ళవంటి కృత్రిమరత్నాలు. కావున పురాణములను ఆసరాగా గొని, వాటిని సానబట్టి మిశ్రమమైన కథ రచింపమని కృతిభర్త తిరుమలరాయడు ఆనతిచ్చాడు.)

వసుచరిత్ర సంగీత, జ్యోతిష్య, అలంకారశాస్త్ర ప్రసంగాలకు పెట్టనిగని. శ్లేష, చమత్కారాలు, సమాసోక్తి, పర్యాయోక్తులు అనేకం. కృష్ణరాయలవారి కాలంలో అల్లసాని పెద్దన, పింగళి సూరన, నంది తిమ్మన, తెనాలి రామకృష్ణుడు, మాదయగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, ధూర్జటి – ఇత్యాది కవిదిగ్గజాలందరూ బ్రాహ్మణులు. ఇక రాయల వారిది శ్రీవైష్ణవం. వీరందరి కంటే వయసులో చిన్నవాడు, కాపు కవి అయిన భట్టుమూర్తి – ప్రతిభావంతుడు, పండితుడూ అయినప్పటికీ కృష్ణరాయలవారి కాలానికి బ్రాహ్మణకవులతో పోటీపడి తన ప్రతిభను ప్రదర్శించడానికి సరైన అవకాశాలు బహుశా దొరికి ఉండవు. దొరికినా పెద్దన, తిమ్మన గార్లను కవిత్వస్పర్ధలో ధిక్కరించే అవకాశం ఉండి ఉండదు. అలా మూర్తి కవి తన ప్రతిభను పూర్తిస్థాయిలో ఆవిష్కరింపజేసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.

కృష్ణరాయలు క్రీ.శ || 1530 లో గతించిన తర్వాత, ఆయన సవతి తమ్ముడైన తుళువ అచ్యుతరాయలకు సింహాసనం దక్కింది. క్రీ.శ 1530 నుంచి క్రీ.శ. 1542 వరకూ – పన్నెండేళ్ళపాటూ రాజ్యం చేసిన అచ్యుతరాయల వారి కాలంలో – ఎందుచేతనో తెలుగులో కవిత్వ వ్యాసంగాలు, శాస్త్రచర్చలూ జరిగినట్టు కనబడదు. బహుశా కృష్ణరాయల వంటి మహారాజు, తనయుణ్ణి కోల్పోయి గొప్ప పరితాపంతో గతించిన తర్వాత, తిమ్మరుసు వంటి మహాసత్త్వుడు జైలుపాలయిన తర్వాత, పెద్దన, అరణపుకవి వంటి పెద్దలు తిరుగుముఖం పట్టిన తర్వాత, తాతాచార్యులు మొదలైన న్యాయాధీశులు వయోవృద్ధులైన పిదప – ఒక తీవ్రమైన స్తబ్ధత ఏర్పడి ఉంటుంది. (అచ్యుతరాయలు పరమదుర్మార్గుడని ’ఫెరిస్తా’ అనే చారిత్రకుడు వ్రాశాడు. బహుశా కృష్ణరాయల తర్వాత ’పోర్చుగీసు’ వారికి ప్రాబల్యం తగ్గటం వల్ల ఈ విధంగా వ్రాసి ఉంటారని “హెరాస్” అనే మరొక చారిత్రక రచయిత అభిమతం.)

అచ్యుతరాయలు దుర్మార్గుడని కొందరు చారిత్రకులు తీర్మానించటానికి ఆతని బావ సలకము తిమ్మరాజు మరొక కారణం. సలకము తిమ్మడు కోశాధిపతి, మంత్రీ కూడాను. అచ్యుతరాయలు గతించిన తర్వాత, రాజకీయాలు ఈతని చుట్టూ సాగినవి. ఈ సలకము తిమ్మరాజు దుర్మార్గుడని చెప్పటానికి మార్కాపురంలో చెన్నకేశవస్వామి దేవాలయంలోని గరుడమంటపంపైని శిథిలశాసనం ఒకటి ఆకరం. (Page 7, The Aravidu dynasty of Vijayanagara Vol .1 – Rev. Henry Heras) ఈతడు రామరాయ, తిర్మలరాయ సోదరులను బంధించడమే కాక, విజయనగరాన్ని దోచుకోవటానికి ఆదిల్ శాహ్ ను ఆహ్వానించాడని కథనం. రామరాయ సోదరులు తప్పించుకుని గుత్తి, ఆదవాని ప్రదేశాలకు వెళ్ళి, తగిన సైన్యం సమకూర్చుకుని సలకము తిమ్మని సంహరించారని ఒక కథ. వసుచరిత్రకారుడు రామరాయ, తిర్మలులకు ఆంతరంగికుడు కాబట్టి ఈతని మతమూ ఇదే.

మరొక కథ ప్రకారం సలకము తిమ్మడు దేశభక్తుడు. సదాశివరాయలను సింహాసనంపై నిలబెట్టడానికి ప్రయత్నించి, రామరాయ, తిర్మలులతో గొడవపడి చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏదేమైనా, సలకము తిమ్మని కథ సందేహాస్పదమైనది.

అచ్యుతరాయలు – నాటి విద్యానగరంలో రెండు అద్భుతమైన ఆలయాలు కట్టించినాడు. (హంపి శాసనం) అంతే కాక శ్రీశైలము, శ్రీకాళహస్తి క్షేత్రాలకు అచ్యుతరాయలు భూరిదానాలు చేశాడని అక్కడి శాసనాల ద్వారా తెలుస్తూంది. అంతే కాదు అచ్యుతరాయలు సవరము చెన్నప్పనాయకుని వంటి దళవాయిని చేరదీసి పైకి తెచ్చాడు. తదనంతరకాలంలో తంజావూరిలో తెలుగువైభవం ప్రబలడానికి ఈ చర్య నాంది. అచ్యుతరాయల వారి కాలంలో పరిపాలనా సంస్కరణలు, గ్రామవ్యవస్థలో చక్కని మార్పులు జరిగినట్టు మోపూరు (కడప జిల్లా), గౌనివారిపల్లె (అనంతపురం) ఇత్యాది అనేక శాసనాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి అచ్యుతరాయలు పరమ దుర్మార్గుడని ఖచ్చితంగా నిర్ధారించడానికి వీలు లేదు.

అచ్యుతరాయల తర్వాత చాలా కొద్ది కాలం వెంకటదేవరాయల వారు సింహాసనానికి వచ్చి గతించారు. రాజ్యంలో అంతఃకలహాలు, కుట్రలూ మొదలైన కాలం అది. కృష్ణరాయల వారి తుళువ వంశ వారసుడు సదాశివరాయలను నామమాత్రంగా సింహాసనంలో కూర్చోబెట్టి – రాయలవారి అళియడు (అల్లుడు) ఆరవీటి రామరాయలు పరిపాలన సాగించినాడు.

రాజ్యంలో అంతఃపురరాజకీయాలతో సంబంధం లేని సామాన్య ప్రజలకు ధర్మబద్ధంగా సింహాసనం దక్కవలసిన తుళువ వంశంపై గురి. కొత్తగా వచ్చిన అళియనిపై విశ్వాసం పాదుకొనలేదు. అరమనె లో మాత్రం అల్లుడైన ఆరవీటి వానికి మద్దతు బాగా ఉన్నది. ఓ వైపు బహమనీ సుల్తానుల గొడవ. ఎప్పుడెప్పుడు కల్యాణదుర్గాన్ని ఆక్రమించాలా అన్న దురుద్దేశ్యంతో గోలకొండ నిజాము.

ఈ సంధియుగంలో, శాస్త్రచర్చలకు పేరుపడిన బ్రాహ్మల అవసరం కాక, వీరులైన ప్రజావర్గాల ’పురుషకారం’ రాజ్యానికి ఎక్కువగా అవసరమైన నేపథ్యంలో, ఆరవీటి రామరాయలపై ప్రజలకు విశ్వాసాన్ని కలిగించే అవసరాన్ని కూడా పురస్కరించుకుని – రామరాజు, తిర్మలులకు ఆంతరంగికుడైన మూర్తికవి ’వసుచరిత్ర’ రచనను మొదలుపెట్టి ఉండవచ్చు. వసుచరిత్రలో వసురాజు – అళియరామరాజే. భట్టుమూర్తి – అళియని చాళుక్య వంశజునిగానూ, సాక్షాత్తు కోదండరాముని గానూ కూడా ఉద్యోతించి వర్ణించాడు. కళ్యాణదుర్గం, తదితరప్రాంతాలలో బోయల ప్రాభవం ఎక్కువ. బోయలు లేదా బోయర్లు (వ్యాధులు) – విలువిద్యానిపుణులు. మహాశూరులు. కృష్ణరాయల కాలంలో అప్పాజీతో కలిసి రాయలు బోయలను సైన్యంలో చేర్చుకున్నాడు. తదనంతర కాలంలో ఈ బోయలు కళ్యాణదుర్గం పాళేగార్లుగా స్థిరపడినారు. బహుశా స్థానికులైన వీరి సహాయంతో, ఏబదివేల సైన్యంతో ఆరవీటి రామరాయలు – గోల్కొండనవాబును తరిమి, కల్యాణదుర్గాన్ని జయించినాడు. తిర్మలరాయలు చేరదీసిన మరొక స్థానిక నాయకుడు సొన్నలాపురం – హండే హనుమప్ప నాయకుడు. ఇతడు కల్యాణదుర్గం యుద్ధంలో గోలకొండ నవాబును సోదరులకు పట్టి కానుకనిస్తే, తిర్మలుడు అతనికి బహుమతిగా నందేల,బుక్కరాయసముద్రం, ధర్మవరం,కణేకల్లు, కారుగోడు ప్రాంతాలను రాసిచ్చాడని అనంతపురం కైఫీయత్తులో ఉంది. ఈ హనుమప్ప నాయకుని వంశం వారే అటుపై అనంతపురం/బుక్కరాయసముద్రం పాళేగార్లు అయినారు. (The Annals of Hande Anantapuram – GV Appa Row – వావిళ్ళ వారి ప్రతి)

కళ్యాణదుర్గంపై విజయాన్ని పురస్కరించుకుని భట్టుమూర్తి వసుచరిత్రలో చెప్పిన పద్యం ఇది.

శా||
విశ్వామిత్రునిఁ గొల్చి రాముఁడతఁ డుర్విం జెందెఁ గళ్యాణము
న్విశ్వామిత్రులు గొల్వ రాముఁడితఁ డుర్విం జెందెఁ గళ్యాణమున్
శశ్వత్కీర్తులు రాములయ్యిరువురున్ సాధించు కళ్యాణ లా
భైశ్వర్యంబులు ధర్మనిర్మథన ధర్మాలంబన వ్యక్తముల్. (వసుచరిత్ర – 1.47)

నాటి ఇక్ష్వాకుకులతిలకుడైన రాముడు విశ్వామిత్రుని సేవించి భూమిపై సీతతో వివాహాన్ని సాధిస్తే, నేటి ఆరవీటి రామరాయలు విశ్వానికి అమిత్రులు (నిజాం సేన) కొల్వగా కళ్యాణదుర్గాన్ని సాధించినాడు. ఆ రాముడు కళ్యాణలాభైశ్వర్యాల కోసం ధర్మమార్గాన్ని వీడితే (తాటకిని చంపుట, ధనుర్భంగం వగైరా), ఈ ఆరవీటి రామరాయలు ధర్మాన్ని అవలంబించాడు.

ఇక్కడ రెండవపాదంలో విశ్వామిత్రులు – అన్న శబ్దాన్ని విశ్వ+ అమిత్రులు అని వ్యాఖ్యాతలన్నారు. అలా అయిన పక్షాన “విశ్వాऽమిత్రులు” అని అవగ్రహసహితంగా (“ऽ” తో కలిపి) వ్రాయడం జరగాలి. అలా లేదు కాబట్టి – “విశ్వామిత్రులు కొల్వ…” – అంటే విశ్వామిత్ర గోత్రానికి కానీ, సంతతికి కానీ చెందిన కొన్ని వర్గాల వారు రామరాజును కొలువగా అని ఉద్దేశించి ప్రయోగించాడా? ఏమో!

భట్టుమూర్తి రామాలయాన్ని నిర్మించి ఒక తటాకాన్ని నిర్మించినట్టు ఈ కవి యొక్క ఇంకొక్క కావ్యము హరిశ్చంద్రనలోపాఖ్యానం లోని ఈ క్రింది పద్యం వల్ల తెలుస్తూంది.

సీ||
సుతులఁ బెక్కండ్ర శాశ్వతరామనామ ధ
న్యులఁ జేసి పిలుచు భాగ్యోదయంబు
రచితాగ్రహారంబు రామచంద్రపురాంక
పూతంబొనర్చిన పుణ్యరేఖ
నవదివ్యభవనంబు సవరించి శ్రీరామ
విభుఁ బ్రతిష్టించిన విపులమహిమ
రామసరోనామరమణీయముగఁ దటా
కము వినిర్మించిన ఘనయశంబు
తే.గీ.
సఫలతవహించు నీ హరిశ్చంద్ర నలక
థా యుగ నిబంధ చిత్ర బంధ ప్రబంధ
మంకిత మొనర్పు రఘుభర్త కఖిలభర్త
కురుతరాభీప్సితము లెల్ల నొదవు నీకు. (హరిశ్చంద్రనలోపాఖ్యానం 14)

బహుశా కళ్యాణదుర్గవిజయాన్ని పురస్కరించుకుని భట్టుమూర్తి – కల్యాణదుర్గంలో అళియరాయలే రాముడు – అన్న ఉద్దేశ్యాన్ని వ్యాపింపజేయడానికి – కోదండరామాలయాన్ని కట్టించి లేదా పునరుద్ధరించి ఉండవచ్చు. (కల్యాణదుర్గంలో కోట ముంగిట చిన్న పట్టాభిరామాలయం ఒకటి ఉంది. దీనిని కట్టించిన వారెవరో తెలియదు. విజయనగరరాజులు కట్టించినట్టు స్థానిక చరిత్ర. విజయనగరశైలి ఈ దేవాలయంలో స్పష్టంగా కనబడుతుంది). ఈ కోవెలలో రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. ఈ రాముడు ఇక్కడికి నైరుతిదిశగా ఉన్న పెనుగొండ కు అభిముఖుడు. ఈ ప్రాంతాలలో ప్రముఖమైన నాటి రామాలయం బహుశా ఇదొక్కటే. భట్టుమూర్తి కట్టించిన దేవాలయం ఇదేనా? చారిత్రకులు తేల్చవలసిన సంగతి ఇది.

ఇక్కడ మరొక పార్శ్వం కూడా ఉంది. నేటి రాయలసీమ ప్రాంతంలో బయటపడిన శాసనాలలో ఆరవీటి రామరాయల శాసనాలు తక్కువ. తుళువ వంశ వారసుడైన సదాశివరాయలవారి శాసనాలు మాత్రం అనేకం. (తెలుగు శాసనాలే 150 కి పైగా ఉన్నాయి. కన్నడ శాసనాలు అదనం.)


(Kannada inscription of SadaSivaraya at Kambadur, near Kalyanadurgam)

ఆ కాలం లోనే పెన్న తీరంలో పెన్నహోబిళం దేవాలయనిర్మాణం జరిగింది. (ఈ ప్రాంతాలలో ఉన్న నారసింహులందరినీ కీర్తించిన – అన్నమయ్య పెన్నహోబిళాన్ని కీర్తించలేదు. ఆయన కాలానికి అక్కడ ప్రసిద్ధమైన కోవెల లేదు.) కృష్ణరాయల వంశపు తుళువ సదాశివరాయలు ప్రజలకు కనబడకపోయినా, ఆతణ్ణి గుత్తి దుర్గంలో బంధించినట్లు ప్రజలు చెప్పుకొంటున్నా – ఆయన పేరును శాసనాల్లో చెక్కించటం – అళియరామరాయలు స్థానిక ప్రజల విశ్వాసాన్ని చూరగొనటానికి చేసిన ప్రయత్నంలో భాగమని ఊహించవచ్చు.

రామరాజభూషణుని స్వస్థలం నేటి కడప జిల్లా “భట్టుపల్లె” అని వ్యాఖ్యాతలు చెబుతారు. అయితే – ఈయన తన జీవితచరమాంకంలో, బహుశా తిరుమలరాయల హయాంలో కల్యాణదుర్గాన్ని కార్యక్షేత్రంగా చేసుకొని ఉండవచ్చునేమో అని అనుమానం వస్తుంది. కల్యాణదుర్గం – మూణ్ణాలుగు తరాల క్రిందట, సంగీతానికి నెలవట. వసుచరిత్రలో చాలా పద్యాలు సంగీతజ్ఞులు బాణీలు కట్టి పాడవచ్చునన్నట్టు ఉంటాయి. అటువంటి పద్యాలను భట్టుమూర్తి వసుచరిత్రలో కోకొల్లలుగా నింపినాడు. అలాంటి అచ్చతెనుగు పద్యము/పాట కొక్క ఉదాహరణ ఇదీ.

సీ||
మెఱుఁగొప్పు నెఱిగొప్పు నెఱగప్పు తఱిగప్పు
జలదమాలిక చొప్పు దెలుపలేదొ
బలువాలు గల నేలు తెలివాలు గనుడాలు
కలువపూదెర మేలు దెలుప లేదొ
నలువైన కళ లీనఁగల లేనగవు సోన
కలశాబ్ధితెర మేన నిలుప లేదొ
కనకంపు ననసొంపు కడ నుంపు రుచిపెంపు
పసిఁడితీఁగల గుంపు మెసఁగ లేదొ
తే||
ప్రాణసఖులార నెయ్యంపుటలుకఁ బూని,
యేల యీ బాల యీ వేళ నీ విశాల
యవనికాభ్యంతరమ్మున కరిగె ననఁగ
ననుఁగు నెచ్చెలి మఱియు నెయ్యమున జేరి.
(3.69)

గిరికాదేవి కురులు వర్షాకాలపు మేఘాలగుంపులాగా, తెలిచూపులు కలువపూతెరలాగా, ఆమె లేనగవు పాలవెల్లి తరగల్లాగా, ఆమె మేను పసిడితీగె లాగా ఉంది కదా. అలా ఆమె మేను తెరలా ఉండగా, తిరిగి ఆమె తెరచాటుకెళ్ళడం ఎందుకు?

పైని సీస పద్యంలో, పద్యపు నడతలో, శబ్దాలలో ఛాయామాత్రంగా నేటి రాయలసీమ ’యాస’ ను ఔత్సాహికులు గుర్తించవచ్చు. నెఱి కొప్పు = గొప్పదైన జడతాలూకు ముడి, తఱి = అంటే వర్షాకాలం. తరీవ్యవసాయం – అంటే చెరువులసాయంతో చేసే సేద్యం. ఈ మాట ఇప్పటికీ వాడుకలో ఉంది. నెఱ కప్పు = అంటే చిక్కటినీలం లేదా నలుపు. (కప్పు – కన్నడలో నలుపు) కనకంపు నన = చామంతిపువ్వు.

పై నేపథ్యంలో భాగంగా – భట్టుమూర్తి అనబడే రామరాజభూషణుడు – స్వయానా కాపు. పైగా పెనుగొండ, కల్యాణదుర్గం చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న అన్ని జాతులను, సాంఘిక వర్గాలను వారి సాంప్రదాయాలనూ, అలవాట్లనూ, జీవనశైలిని సూక్ష్మంగా పరిశీలించి ఉంటాడు. అలా ఆ నేపథ్యంలో అలవోకగా ఈ ’రూపు’ అన్న శబ్దం దొరిలిందని భావించడానికి అవకాశం ఉంది. ఈ వ్యాసంగం అంతా ‘ఆకాశఖడ్గచాలనం’ లా అనిపించవచ్చు. అయితే చెప్పదల్చుకున్నదేమంటే – వసుచరిత్ర రచన వెనుక – విపరీతమైన శాస్త్రవైదుష్యం, సంగీతపు రుచితో బాటు సాంఘిక, రాజకీయ, చారిత్రక నేపథ్యం చిక్కగా అల్లుకుని ఉంది. అందులో అతిచిన్న పార్శ్వం ఈ “రూపు” గురించిన ఉదంతం. వడ్లగింజలో బియ్యపుగింజ!

***

వసుచరిత్ర కథ కూడా క్లుప్తంగా చెప్పుకోవాలి. కోలాహలుడు హిమవంతుని పుత్రుడైన పర్వతరాజు. ఆతడు శుక్తిమతి అనే నదీకాంతను అడ్డగించి బలాత్కరించాడు. ఆ నది జనపదాలపై పడి ప్రవహిస్తే, అధిష్టానరాజు ఆ కోలాహలుణ్ణి కాలితో ఎగదోశాడు. ఈ చర్యకు ఇంద్రుడు సంతోషించి అధిష్టానరాజుకు ఒక విమానాన్ని బహూకరించాడు. శుక్తిమతికి కాలక్రమంలో గిరిక జన్మించింది. ఈ గిరికను వసురాజు కేళీవనంలో చూసి అటుపై వివాహం చేసుకున్నాడు. మహాభారతంలో ఉపరిచరవసువు కథ ఈ కావ్యానికి ప్రేరణ.

వసుచరిత్రలో కోలాహలపర్వతమే ఘనగిరి (పెనుగొండ) అని, శుక్తిమతి అన్న నది – ముత్యాలవంక అనే చిన్ని చెఱువు అని ఆరవీటి రామరాయలు – వసురాజు అని, పెన్నను దారి మళ్ళించి పెనుగొండకు చేర్చే అవసరమే వసుచరిత్ర కావ్యకథకు ప్రేరణ అయి ఉండవచ్చునని, ఇలా ఈ రచన వెనక రాజకీయ నేపథ్యం ఉండవచ్చునని పుట్టపర్తి వారు చాలా విపులంగానూ, అద్భుతంగానూ విమర్శించారు. (విమర్శ తరంగిణి, వసుచరిత్ర సాహితీసౌరభము)

పుట్టపర్తి వారు పేర్కొన్న ’పెన్న దారి మార్పు’ ఘట్టం కాక నది మార్గాన్ని మళ్ళించే మరొక చారిత్రక ఘట్టం శ్రీకృష్ణరాయల వారి కాలంలోనూ జరిగింది. నాగలాపురం దగ్గర, కొండల మధ్యా పల్లంలోకి నీరు పారేలాగున, రాయల వారు ’జోయోడి లాపాంటె” అనే పోర్చుగీసు నిపుణుని నేతృత్వంలో, ఇరవై వేల మంది పనివారితో కలిసి ఒక చెరువును నిర్మించసాగాడు. ఆ తటాకనిర్మాణంలో భాగంగా ఓ కొండను చీల్పించాడు. దాపులనున్న తుంగభద్ర (లేదా మరొక చెఱువు) నుంచి ఈ చెఱువుకు నీరు పారడానికి విడివిడిగా మూడు తూములు పెట్టించాడు. అంతే కాక, మూడుతడవలు విఘ్నం ఏర్పడితే, జలదేవతకు బలిగా కారాగారంలో మరణశిక్ష అనుభవిస్తున్న కొంతమంది ఖైదీల తలలను తెగగొట్టించాడు. ఇంకా జంతుబలులు కూడా విస్తృతంగా చేశాడు. ఈ ఉదంతాన్ని “పెరెస్” అనే పాశ్చాత్య యాత్రికుడు వ్రాశాడు. ఈ చెఱువు – నేడు హొస్పేట దగ్గర తుంగభద్ర ఆనకట్ట సమీపంలో ఉన్న ’డన్నాయకన-కెరె’ అని కొన్ని ఆధారాలద్వారా తెలుస్తుంది . (విద్యానగర చరిత్ర – శీరిపి ఆంజనేయులు గారు) ఈ నేపథ్యం నుంచి వసుచరిత్ర కారుడు కథాభాగాన్ని గిల్లుకొని, భారతంలో ఉపరిచర వసువు ఉపాఖ్యానానికి సమన్వయించాడా? ఏమో!

***

ఇప్పుడు ప్రశ్న మళ్ళీ మొదటికి. ఇంతకూ రూపు అంటె ఆభరణమా లేక ఆకారవిశేషమా?

ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం దొరకదు. బహుశా ఉండదేమో కూడానూ. రెండు విధాల ఆలోచనలనూ రేకెత్తించి పాఠకులను తికమకపెట్టటానికే కవి ఈ ప్రయోగం చేసి ఉంటాడని అనుకొని తృప్తిపడవలసి ఉంది. శ్లేష చక్రవర్తి – రామరాజభూషణుడి వసుచరిత్రలో అలా పాఠకుడిని తికమకపెట్టే పద్యాలు కోకొల్లలు.

**** (*) ****

(ఈ వ్యాసానికి మూలం – సురేష్ కొలిచాల గారితో రూపు – ఆభరణమా? ఆకారవిశేషమా? అన్న విషయంపై జరిగిన సంభాషణ. సురేష్ గారికి కృతజ్ఞత.)