వ్యాసాలు

లజ్జాగౌరి

జనవరి 2016

ర్ణాటక రాష్ట్రంలోని బాగల్ కోట జిల్లా, చరిత్రకూ, సుందరమైన మలప్రభా నదీపరీవాహక ప్రాంతానికి, కస్తూరి కన్నడ భాషా సౌరభాలకు ప్రసిద్ధి. ఒకప్పటి చాళుక్యుల రాజధాని అయిన బాదామి (వాతాపి) ఆ జిల్లాలోనే ఉంది. నాడు ఆ రాజులు కట్టించిన గుహాలయాలు, చుట్టుపక్క ప్రాంతాలలోని దేవాలయాలు నాటి ప్రాభవానికి సజీవ సాక్ష్యాలుగా నేడు నిలిచి ఉన్నాయి. ఇక్కడి పట్టదకల్లు దేవాలయప్రాంగణాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది.

చాళుక్యుల కాలం నాటి కొన్ని అవశేషాలను బాదామిలో ఒక సంగ్రహాలయంలో భద్రపరిచారు. ఆ మ్యూజియమ్ లోనికి ప్రవేశిస్తూనే ఒక వింత స్త్రీమూర్తి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం పేరు “లజ్జాగౌరి”. ఇదే విగ్రహాన్ని తెలంగాణాలో అలంపురం మ్యూజియమ్ లో చూడవచ్చు.

లజ్జాగౌరి – ఒక నగ్న స్త్రీమూర్తి. ఈ మూర్తి తన ఊరువులను పైకెత్తి, కాళ్ళను పైకి మడుచుకుని కూర్చున్నట్టుగా ఉంటుంది. ఎత్తైన చనుకట్టుతో ఈ మూర్తి, ప్రసవిస్తున్న స్త్రీ భంగిమను పోలి ఉండటం గమనించవచ్చు. ఈ విగ్రహానికి శిరస్సు లేదు. శిరస్సు స్థానంలో ఒక తామరపువ్వు, రెండు చేతులలో రెండు పద్మాలు కనిపిస్తాయి. కాలివ్రేళ్ళు కుంభాకారంలో కనిపిస్తాయి. నడుముపై ముడుతలు కూడా చూడవచ్చు. ఆధునికులకు కాస్త ఎబ్బెట్టుగా తోచగల ఈ స్త్రీమూర్తి ఒకానొక కాలంలో గ్రామీణ భారతంలో పలుప్రాంతాలలో పూజలందుకున్న దేవతామూర్తి!

లజ్జాగౌరి విగ్రహాలు బాదామిలోనే కాదు, కర్ణాటకలోని సిద్దనకొళ్ళ, మహాకూట, హొసపేట దగ్గరి వ్యాఘ్రేశ్వరి, నేటి తెలంగాణా-మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపురం, ఆంధ్రప్రదేశ్ దగ్గర నాగార్జునకొండ, తమిళనాడులో దశాసురమ్, మహారాష్ట్ర సతారా జిల్లలో వడగామ్, అజంతా గుహలలో ఒకానొక గుహలో, ఉస్మానాబాదులో తర అన్న గ్రామంలో, మాహోర్ఝరి, ఔరంగాబాదు దగ్గర భోగరదన్, ఉత్తరప్రదేశ్ లోని భీటా, ఒడిస్సాలో న్యువపద, ఇంకా దేశంలోని పలుప్రాంతాల్లో ఈ విగ్రహాలను గుర్తించారు. తద్వారా ఈ మూర్తి అర్చన భారతదేశంలోని పలుప్రాంతాల్లో కొనసాగినట్టు తెలుస్తూంది.

బాదామిలో మ్యూజియమ్ పక్కగా మెట్లదారి వెంబడి పైకెక్కితే, కొండపై ఒక పాడుబడిన దేవాలయం కనిపిస్తుంది. ఆ దేవాలయం లజ్జాగౌరి దేవాలయమట.

ఈ దేవాలయంలోని గర్భగృహం ఖాళీగా కనిపిస్తుంది. అంతే కాదు, బాదామిలో అగస్త్యతీర్థం ఒడ్డున రాష్ట్రకూటులు నిర్మించిన భూతనాథ దేవాలయం వెనుకవైపున ఉన్న ఒకానొక మందిరంలోనూ ఒకానొక నగ్నస్త్రీమూర్తి విగ్రహం గర్భగృహంలో కనిపిస్తుంది. ఈ మూర్తికి శిరస్సు కనిపిస్తుంది. కానీ ఈ విగ్రహం దేవాలయంలో స్థాపించి ఉండటం వలన – శక్తి ప్రతిరూపమైన స్త్రీమూర్తుల ఆరాధనలు ఆ కాలంలో విరివిగా కొనసాగేవని అర్థమవుతుంది.

లజ్జాగౌరి ఆరాధన ఖచ్చితంగా భారతదేశంలో ఏర్పడిందో చెప్పగలిగే స్పష్టమైన ఆనవాళ్ళు లేవు.మౌఖిక సాహిత్యంలో తప్ప కావ్య సాహిత్యంలో స్పష్టంగా, విస్తృతంగా లజ్జాగౌరి ప్రస్తావనలు లేకపోవటమూ ఒక విచిత్రమైన విషయం. క్రీ.శ. పండ్రెండవ శతాబ్దం తర్వాత, అంటే రాష్ట్రకూటుల పాలన తర్వాత ఈ విగ్రహాలు మృగ్యమవటం వింతలో వింత. విజయనగరకాలపు శిల్పాలలో ఎక్కడా ఈ విగ్రహాలు కనిపించిన ఆనవాళ్ళు లేవు. సమాంతరమైన మేక ముఖం, స్త్రీ దేహంతో కనిపించే రేణుకాదేవి శిల్పాలు, శిరస్సు కలిగిన నగ్న స్త్రీమూర్తి యల్లమ్మ విగ్రహాలు చోళుక కాలంలోనూ, విజయనగర రాజుల దేవాలయాలలో అక్కడక్కడా ఉన్నాయి.


అనంతపురం జిల్లా కంబదూరులోని మల్లేశ్వర దేవాలయంలో శిల్పాలు ఇవి. ఈ దేవాలయాన్ని చోళులు నిర్మిస్తే, విజయనగర రాజులు పునరుద్ధరించారు.

బహుశా మహమ్మదీయ, క్రైస్తవ మత ప్రభావం వల్లనో, శాక్తేయ ఆరాధన తగ్గుముఖం పట్టటం వల్లనో, లేక నగ్నరూపమైన విగ్రహారాధన “తప్పు” అన్న భావం వ్యాపించటం వల్లనో, లేక పట్టణ ప్రభావం ప్రాంతాలపై ప్రసరించటం వలననో, శైవ వైష్ణవ మతాల ప్రాబల్యం, భక్తి ఉద్యమాల ఫలితంగానో సభ్య దేవతామూర్తులకు విభిన్నమైన లజ్జాగౌరి వంటి దేవతల ఉపాసన కనుమరుగై ఉండవచ్చు.

ఇంతకూ ఈ లజ్జాగౌరి ఎవరు?

లజ్జాగౌరిని సంతాన సాఫల్యాన్ని ప్రసాదించే దేవతగా గ్రామీణులు పూజించేవారు. ఈశ్వరుని భార్య గౌరికి ఈమె ప్రతిరూపం. ఈమెయే భూదేవి అవతారమైన పరశురాముని తల్లి రేణుకాదేవి. పంటలను కాపాడి, సస్యాన్ని ప్రసాదించే శాకంబరీదేవి (బనశంకరీ దేవి). ఈ తల్లి యే ఎల్లమ్మ. అంటే ఎల్లరకూ అమ్మ.

భారతదేశంలో త్రిమూర్తుల భార్యలలో సరస్వతి జ్ఞానరూపిణి. లక్ష్మి సంపదలకు ప్రతిరూపం. గౌరీదేవి శక్తికి నెలవు. ఈ గౌరీదేవి భూదేవికి ప్రతిరూపంగా శాకంబరీదేవి లేదా బనశంకరిగా గ్రామీణులు భావించుకున్నారు. తన దేహంపై పంటలను పండించి, సకల జీవరాశులకూ, దేవతలకూ, దేవుళ్ళకూ కూడా ఆకలి తీర్చే శక్తి రూపిణి ఈమె. బాదామికి గ్రామ శివార్లలో శాకంబరీదేవి దేవాలయం కూడా ఉన్నది. గౌరీదేవి దేహమే సంతానాన్ని ప్రసాదించగల శక్తికి ప్రతిరూపంగా లజ్జాగౌరి మూర్తిగా భావించారు.

లజ్జాగౌరి విగ్రహాలన్నీ నదీ తటాక తీరాలలో దొరకడం గమనార్హం. ఇది యాదృచ్ఛికమో లేక సంతాన సంబంధమైన ఉపాసనలో నీటికి సంబంధించిన విషయమేదైనా ఉన్నదో స్పష్టంగా చెప్పగలిగే ఆనవాళ్ళు నేడు మనకు లేవు.

ఈ స్త్రీ మూర్తి దేనికి ప్రతీక? ప్రకృతి కార్యమైన శృంగారానికా? లేదా సంతాన సాఫల్యతకా? అన్న విషయం మీద చారిత్రక పరిశోధకులు తర్జనభర్జన పడ్డారు. ముఖ్యంగా పాశ్చాత్య పరిశోధకులు. భారతీయ దేవాలయ కళారూపాలలో గోపుర కుడ్యాల మీద శృంగార భంగిమలు ఉండటం కద్దు. అయితే గర్భగుడిలో మూర్తిగా ఆరాధించే దేవతలను శృంగార దృష్టితో నిర్మించడం, అర్చించటం కానరాదు. లజ్జాగౌరి మూర్తి భంగిమ శృంగారపరమైనది కాదు, సృష్టిపరమైనది. ఈ మూర్తి సంతాన సాఫల్యాన్ని ప్రసాదించే మూర్తిగానే ఒప్పుకోవలసి వస్తుంది.

బాదామికి కొంతదూరంలో, మలప్రభ నది ఒడ్డున “మహాకూటేశ్వర” క్షేత్రం ఉంది. స్కాందపురాణంలోని “శాకంబరీ మహాత్మ్యం” లో ఈ దేవాలయం గురించిన ఉటంకింపు ఇది.

తటే మలాపహారిణ్యాః సంతి లింగాని కోటిశః|
తాని సర్వాణి గదింతుం నాలం వర్షశతాన్యపి ||
బిల్వరాజీవనం చాత్ర విద్యతే సుమనోహరమ్ |
శివయా సహితః శంభుర్విశ్ర్యామతి సుఖంత్విహ ||
విష్ణుపుష్కరిణీ తీరే మల్లికార్జున సన్నిధౌ |
పాతాలేశం పినాకీశం లజ్జాగౌర్యాహ్వయం తథా ||
కోటిలింగ వైష్ణవేశం వీరభద్రేశ్వరం తథా |
నారసింహం వామనాఖ్యం శృగాలేశ్వరమేవ చ||
ఏతాని నవలింగాని దురతఘ్నాని తాపసాః |
పర్వతే కోటిలింగాని బిల్వచందన రాజితే ||

(శాకంబరీ మాహాత్మ్యం, 8.19 – 23)

(మలప్రభా నదీ తీరంలో కోటానుకోట్ల లింగాలున్నాయి. వాటిని లెక్కపెట్టటానికి వందల యేళ్ళయినా సరిపోవు. అక్కడ అందమైన మారేడు తోపు కూడా ఉన్నది. శక్తితో కూడిన శివుడక్కడ సుఖంగా కొలువై ఉన్నాడు. విష్ణుపుష్కరిణి తటాన, మల్లికార్జున సన్నిధిలో పాతాలేశ, పినాకీశ, లజ్జాగౌరీశ, కోటిలింగ, వైష్ణవేశ, వీరభద్రేశ, నారసింహ, వామన, మరియు శృగాలేశ్వర నామాలతో నవలింగాలు పాపాలను బాపుతూ ఉన్నాయి. మారేడు, చందన వృక్షాలతో కూడిన పర్వతంపై కోటిలింగాలున్నవి.)

శక్తితో కూడిన శివుడు, లజ్జాగౌరితో కూడిన ఈశ్వరుడు అన్న పేర్లు గమనార్హం. లజ్జాగౌరి ఈ క్షేత్రపాలిక. ఆ దేవి విగ్రహం కూడా చాలా కాలం క్రితం ఇక్కడ ఉండేదట. ఇక్కడ ఈశ్వరుని తొమ్మిది రూపాలలో అర్చిస్తారని స్థలపురాణం. లజ్జాగౌరి ఉపాసన కొనసాగిన తెలంగాణాలోని అలంపురంలోనూ బాదామి చాళుక్యులు కట్టించిన నవబ్రహ్మేశ్వర దేవాలయాలు ఉండటం ఆసక్తికరమైన విషయం. అయితే అలంపురంలోని నవబ్రహ్మేశ్వరులు వరుసగా – తారక, స్వర్గ, పద్మ, బాల,విశ్వ, గరుడ, కుమార, అర్క, వీర నామధారులు.

మహాకూట క్షేత్రపాలకుని పేరు మహాకూటేశ్వరుడు. ఈయననే ముకుటేశ్వరుడన్నారు. కూట శబ్దానికి “గూఢము”, “అబద్ధము” అన్న అర్థాలున్నాయి. లజ్జ అంటే సిగ్గు. లజ్జాగౌరి అంటే సిగ్గుతో కూడిన గౌరి. కర్ణాటకలో జానపదులు చెప్పుకునే మౌఖిక సాహిత్యపు కథలు రెండు ఉన్నవి.

మొదటిది:
ఒకానొకప్పుడు ఈశ్వరుడు, గౌరీదేవి భూలోకంలో విహరిస్తూ, శృంగారక్రీడలో మునిగి తేలుతూ ఉన్నారు. ఆ సమయంలో సప్తర్షులు పరమేశ్వర దర్శనార్థం విచ్చేశారు. తమలోకంలో ఉన్న ఆదిదంపతులు పరవశాన్ని వీడి సప్తర్షులను గమనించి సిగ్గుతో నీరైపోయారు. తమను గమనించనందుకు సప్తర్షులు కినిసి, శంకరుని లింగరూపంలో మాత్రమే పూజలు అందుకొంటాడని శపించారు.

రెండవకథ:
గౌరీశంకరులు ఒకానొక కొలనులో జలక్రీడలు సల్పుతున్నారు. ఆ సమయంలో ఒక భక్తుడు వారిని చూడటానికి వచ్చాడు. భక్తుని చూడగానే దంపతులకు సిగ్గు ముంచుకొచ్చింది. పరమేశ్వరుడు పరుగెత్తి గర్భగుడిలో లింగం వెనుక దాగాడు. గౌరీదేవి నీట మునిగి కనుమరుగయింది. చాలా ఎక్కువగా సిగ్గుపడ్డ కారణాన గౌరీదేవి “లజ్జాదేవి” గా పరిణమించింది.

లజ్జ – లంజ

తెలుగులో, సంస్కృతంలో ఇతరత్రా భారతదేశ భాషల్లో వేశ్య, దేవదాసి అన్న అర్థాలలో “లంజ” అన్న శబ్దం ఉన్నది. ఇది నేడు ఒక తిట్టు. అశ్లీలమూ, అసభ్యమూ అయిన శబ్దం. కానీ ప్రాచీనకాలంలో, ముఖ్యంగా జనపదాలలో ఈ శబ్దానికి – నేటి కాలంలో ఉన్న క్షుద్రమైన అర్థం లేదని చూచాయగా తెలుసుకోవచ్చు. ఈ నాటికీ రాయలసీమలో కొన్ని ప్రాంతాలలో ఈ మాటను సాధారణ రూపంలో ఉపయోగించటం ఉంది. ఈ అశ్లీలమైన శబ్దానికి మూల రూపం ఏమిటో తెలియదు. ద్రవిడ శబ్దాలు “ర”, “ల” తో మొదలవవు కాబట్టి ఇది ద్రవిడభాషాశబ్దం కాదు. (Information Courtesy: సురేష్ కొలిచాల గారు) సంస్కృతనాటకాలలో “హంజే, హంజికే” అన్న ప్రయోగాలు కనిపిస్తాయి. నాయిక చెలికత్తెలను సంబోధించే తీరు అది. “లంజ” శబ్దానికి అది పూర్వరూపమేమో తెలియదు.

అలాగే – లజ్జా శబ్దానికి లంజ శబ్దానికి కొంత పోలిక, నేపథ్యమూ కనిపించటం విశేషం. పైన చెప్పుకున్న మహాకూట క్షేత్రానికి “నందికేశ్వరం” అన్న మరొక పేరు ఉంది. ఈ పేరు ఇప్పటికీ ఉంది. నందికేశ్వరం – ఇది అసలైన పేరు కాదు. ఈ పదబంధానికి మూలరూపం “లంజికేశ్వరం” లేదా “లంజిగేసరం”. దీనికి నిదర్శనాలు ఉన్నాయి.

బాదామి చాళుక్యుల వంశంలో మూడవ రాజు మంగలేశుడు (క్రీ.శ 597 – 609) అక్కడి రెండవ గుహాలయంలో (విష్ణువు గుహ) రెండు దాన శాసనాలు చెక్కించాడు. ఆ రెండు శాసనాలలో “లంజిగేసరం” అన్న ఊరిని దానమిస్తున్నట్టుగా ఉంది.
అందులో ఒక శాసనం ఇది.

క్రీ.శ. 598 లో చెక్కించిన ఆ కన్నడ శాసన పాఠం ఇది.

“స్వస్తి శ్రీమత్ ప్రిథివి వల్లభ మంగలేసనా కల్మనె గె ఇత్తొదు లంజిగేసరం దేవక్కె పూనిఱువ మాలకారన్గె అర్దవిసది ఇత్తొదానఱెవోన్ పఞ్చ మహాపాతకనక్కుం ఏఱినెయా నరకదా పుఱుఅకుమ్”

ఇదే గుహలో రెండవ శాసనంలోనూ “లంజికేశ్వరం” గ్రామాన్ని పదహారు మంది బ్రాహ్మణులకు నిత్యభోజనాల సంతర్పణ కోసం వ్రాసి ఇస్తున్నట్టుగా ఉంది.

మహాకూట – అన్న క్షేత్రానికి అదివరకే అధిష్టాన దేవుడైన మహాకూటేశ్వరుని నామం ఉండగా, తిరిగి నందికేశ్వర నామం సంశయాత్మకమైనందునా, పైగా చాళుక్యప్రభువు మంగలేశుని దానశాసనంలో లంజికేసరం అన్న శబ్దం ప్రస్తావింపబడి ఉండటం మూలానా, ఆ క్షేత్రానికి లంజికేశ్వరమని పేరున్నట్టు అర్థమవుతుంది. అంటే లజ్జాగౌరి – లంజికేశ్వరి అన్న శబ్దాలు సమానార్థకాలని స్ఫురిస్తున్నది. దీని సంస్కార రూపమే నేటి నందికేశ్వరమయింది.

లంజికేశ్వరంలోని లంజిక – అన్న శబ్దమే సంస్కృతీకరింపబడి లజ్జాగౌరి అన్న పేరుగా ఏర్పడిందని కన్నడ భాషాపండితుల ఉవాచ. అంటే గౌరీదేవి పేరే “లంజిక”. స్త్రీ మూర్తి విగ్రహం – నిర్లజ్జతకు నిదర్శనంగా ఉండటం మూలాన ఆ మూర్తికి శోభనమైన పేరు కూర్చవలసిన అవసరం ఏర్పడి – లంజిక అన్న శబ్దం లజ్జాగౌరిగా మార్చి ఉంటారని కొందరు దూరాన్వయాలు చేశారు. లజ్జాగౌరి – లజ్జ విడిచిన గౌరి లేదా లజ్జాహీనమైన గౌరి అని ఆంగ్లంలో కొందరు వ్యుత్పత్తి చేసి Shamelss Goddess అన్నారు. ఈ శబ్దం అంత ఒప్పుకోదగింది కాదు.

లజ్జా అంటే అమ్మవారి పేరు అని చెప్పడానికి మరొక నిదర్శనం బ్రహ్మాండపురాణంలో, లలితాసహస్రనామంలోని 142 వ శ్లోకం.

“మిథ్యాజగదధిష్టానా ముక్తిదా ముక్తిరూపిణీ |
లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాదివందితా ||”

లజ్జా అన్నది లలితాదేవి సహస్రనామాలలో ఒకటి. లలితాసహస్రనామాలలో మరొక శ్లోకం (35) లజ్జాగౌరి మూర్తికి దగ్గరగా ఉన్నది. “కంఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణీ” – కంఠం క్రిందు నుంచి కటి పర్యంతమూ కూటరూపంలో ఉన్న మూర్తి. ఇది లజ్జాగౌరి మూర్తితో పోలుతుంది.

ఈ తథ్యామిథ్య అంతా క్రీ.శ. ఆరవ దశాబ్దం నేపథ్యంలో జరుగుతున్నదని గమనించగలరు. అప్పటికి కన్నడ/తెలుగు భాషల స్వరూపం వేరు. ఈ రోజు మనకు “లంజ” అన్న శబ్దం వినిగానే ఆ శబ్దం కలిగించే ఉలికిపాటు, అశ్లీలధ్వని, అమంగళమూ నాడు ఉండవలసిన అవసరం లేదని మనం తెలుసుకోగలగాలి. బహుశా లజ్జాగౌరి (లంజిక) విగ్రహ రూపం, నగ్నత్వం, తర్వాతి కాలంలో పట్టణ ప్రభావంతో లంజిక అన్న శబ్దం నీచత్వానికి ప్రతిరూపంగా మారి ఉండవచ్చు.

అదితి ఉత్తానపద

లజ్జాగౌరి ఉపాసన ఖచ్చితంగా ఏ కాలంలో ప్రారంభమయినది తెలియకుండా ఉన్నది కానీ నగ్న స్త్రీ ఉపాసన సింధునాగరికత, మెసపొటేమియా, గ్రీకు నాగరికతల లోనూ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. స్త్రీ మూర్తులలో లజ్జాగౌరిని పోలిన ప్రాచీనమైన మూర్తిని గురించి ఋగ్వేదంలో ఉటంకింపులు కనిపిస్తాయి. ఆ ఋగ్వేద మాత పేరు అదితి ఉత్తానపద.

అదితి ఉత్తానపద: ఋగ్వేదంలోని అనేక ఋక్కులలో ఉటంకింపబడిన ఒకానొక దేవత పేరు అదితి. ఆమెనే “అదితి ఉత్తానపద” అన్నారు. ఈ దేవత జగత్తుకంతటికీ మాత. ఈ అదితియే జనయిత్రి, పృథ్వి, మహామాత కూడా.

అదితిర్ ద్యౌరదితిర్ అన్తరిక్షమ్ అదితిర్ మాతా స పితా స పుత్రః |
విశ్వే దేవా అదితిః పఞ్చ జనా అదితిర్ జాతమ్ అదితిర్ జనిత్వమ్ ||
(1-089-10)

అదితియే ఆకాశము, అదితియే అంతరిక్షము, అదితియే తల్లి, తండ్రీ, పుత్రుడూ కూడాను. అదితియే పంచజనులైన విశ్వే దేవులు, పుట్టినది, పుట్టబోయేది కూడా అదితియే.

దేవానాం యుగే ప్రథమే ऽసతః సద్ అజాయత |
తద్ ఆశా అన్వ్ అజాయన్త తద్ ఉత్తానపదస్ పరి ||

10-072-03

దేవతల మొదటి యుగంలో అసత్తు నుంచి సత్ అన్నది పుట్టింది. ఆపై ఆకాశపు అంచులు ఉత్తానపదం నుంచి పుట్టాయి.

భూర్ జజ్ఞ ఉత్తానపదో భువ ఆశా అజాయన్త |
అదితేర్ దక్షో అజాయత దక్షాద్ వ్ అదితిః పరి ||

10-072-04

పాదాలను విడదీసిన ఆ మూర్తి నుంచి భూమి, భూమి నుంచి ఆకాశము పుట్టాయి.

అదితిర్ హ్య్ అజనిష్ట దక్ష యా దుహితా తవ |
తాం దేవా అన్వ్ అజాయన్త భద్రా అమృతబన్ధవః ||

10-072-05

దక్ష! ఆ అదితియే నీ కూతురిగా పుట్టినది. అమృత బంధువులు, భద్రులైన దేవతలు ఆమె నుంచి ప్రభవించారు.

దక్షప్రజాపతికి పదముగ్గురు కుమార్తెలు. వారిలో అదితి ఒకత్తె. వారందరినీ కశ్యప మహర్షి వివాహం చేసుకున్నాడు. ఆ పదముగ్గురి సంతానమే చరాచర జీవరాశులు. కశ్యప మహర్షికి అదితికి పుట్టిన వారు ఆదిత్యులు. వారే దేవతలు.

ఈ అదితియే లజ్జాగౌరి, లేదా లజ్జాగౌరికి పూర్వరూపమని చారిత్రకులు, ఇండాలజిస్టులు భావిస్తున్నారు. హరప్పా నాగరికతలో తల దించుకున్న స్త్రీ మూర్తి, ఆమె యోని నుండీ ఒక తీవె వెలువడుతున్నట్టుగా చిహ్నాలున్న విగ్రహమొకటి బయటపడిందట. ఈమెయే ఆ అదితి అన్న మాతృదేవత గా భావించబడుతున్నది.

స్త్రీ మూర్తి – మార్మికత

లజ్జాగౌరి విగ్రహంలో మరొక చిత్రమైన విషయం గమనించదగినది. ఈ స్త్రీ మూర్తికి శిరోరహిత మూర్తి. తల స్థానంలో పద్మం ఉండటం ఒక చిత్రం. ఇది ఒక మార్మికమైన విషయం.

స్త్రీమూర్తి ప్రకృతికి నిదర్శనం. పురుష మూర్తి మేధకు చిహ్నం.
స్త్రీ హృదయమైతే – పురుషుడు ఆలోచన.
స్త్రీ వామార్ధమైతే – పురుషుడు దక్షిణభాగం.
స్త్రీ శరీరమైతే – పురుషుడు శిరస్సు.
స్త్రీ క్షేత్రం – పురుషుడు బీజం.

క్షేత్రభూతా స్మృతా నారీ, బీజభూతః స్మృతః పుమాన్ |
క్షేత్రబీజసమాయోగాత్ సంభవః సర్వదేహినామ్ ||
(మనుస్మృతి 9 -33)

ప్రకృతి-పురుషుల సమగ్రరూపమే సృష్టి. అదే అర్ధనారీశ్వర తత్త్వం. వామభాగం (హృదయం ఉన్న భాగం) పార్వతిదైతే, దక్షిణభాగం ఈశ్వరునిది. మేధకు పరిమితి ఉంది. మేధ ఆలోచిస్తుంది కట్టడి చేయడానికి, నియమసహితమైన జీవనానికి మార్గాలు అన్వేషిస్తుంది. స్త్రీ శక్తికి పరిమితులూ, బాహ్యనియమాలు లేవు. ఆ శక్తి విలయానికి, జన్మకూ కూడా ఆదిభూతమైనది. విలయానికి మూలమైన శక్తి కాళీదేవి అయితే, సృజనకు మూలమైన శక్తి గౌరీదేవి.

శిరోరహిత శరీరం స్వచ్ఛమైన స్త్రీత్వానికి, ప్రకృతికి, శక్తి రూపానికి నిదర్శనం. తామరపువ్వు సృజనకు సంకేతం. మహావిష్ణువు పద్మనాభుడు. పద్మం ద్వారా ఆయన సృష్ట్యాదిలో బ్రహ్మను పద్మంలో నిలిపినట్టు విష్ణుపురాణం.

లజ్జాగౌరి శిరస్సు లుప్తమైనందున, శిరస్సు స్థానంలో పద్మం ఉండటం మూలానా, రెండు చేతులలో పద్మాలు ధరించటం మూలాన, ఈ మూర్తి సృజనకు మూలమైన ప్రకృతి శక్త్యాత్మకమైన గౌరీదేవికి ప్రతీక. కొన్ని ప్రాంతాలలో లభ్యమైన లజ్జాగౌరి విగ్రహాల పక్కన గోవు విగ్రహం కూడా కనిపిస్తుంది. గోవు – పృథివి స్వరూపం. భూమాతయే లజ్జాగౌరి.

గ్రీకు బౌబో దేవత

ప్రాచీన రోమనులు “బౌబో” (Baubo) అన్న పేరుతో ఒక స్త్రీమూర్తిని కొలిచే వారు. ఆమె కూడా సంతాన సాఫల్యం ప్రసాదించే స్త్రీ దేవత. ఈ మూర్తి అర్చన క్రీ.పూ. రెండవ శతాబ్దం నుండి దాదాపు క్రీ.శ. రెండవ శతాబ్దపు మధ్య కాలంలో విరివిగా సాగేదట. “ఆర్యుల దందయాత్ర” సిద్ధాంతాన్ని నమ్మే కొందరి అంచనా ప్రకారం, భారతదేశంలో లజ్జాగౌరి – గ్రీకుదేవత బౌబోకు ప్రతిరూపం. గ్రీకు దేవత భారతదేశంలో అడుగిడిన తర్వాత ఇక్కడి తాత్విక ధోరణులకు, సిద్ధాంతాలకు అనుగుణంగా రూపు మార్చుకుని, శిరోరహిత మూర్తిగా నెలకొందట.

ఈ ఊహలకు సరైన కారణాలు కానీ, ఆధారాలు కానీ కనబడవు. పాశ్చాత్యులకు భారతీయమైనదేదీ ఇక్కడిది కాదు, మరెక్కడి నుంచో సంక్రమించినదన్న సంకుచితమైన దృష్టి మెండు. గ్రీకులో ఇటువంటి ఆనవాళ్ళు ఒకవేళ దొరికి ఉండకపోతే వాళ్ళే ఈ దేశంలో మూర్తి ఆరాధన అసహ్యకరమైనదని, ఆటవికమైనదని నిర్ధారించి ఉండేవారు. గ్రీకు దేశంలో బౌబో ఉపాసన ఉండేది కాదు కాబట్టి నగ్న స్త్రీ ఉపాసనను గుర్తించి భారతదేశానికి పాకిందని కల్పించారు. ప్రాచీన కాలం నుంచే Iconography లోనూ, శిల్పశాస్త్రంలోనూ అత్యున్నత ప్రమాణాలు సాధించిన భారతదేశం గ్రీకు దేవత విగ్రహాన్ని అరువు తెచ్చుకుని మార్చుకునే అవసరం కనబడదు. లజ్జా గౌరి – గ్రామదేవత. గ్రీసు దేశం ద్వారా వచ్చిన బౌబో అన్న దేవత గ్రామీణ భారతంలో ఎందుకు నెలకొన్నదని స్పష్టంగా వివరించగలిగే ఆధారాలు కూడా లేవు.

బహుశా వేదకాలంలోని అదితి ఉత్తానపద, రేణుక, లేదా మౌఖిక సాహిత్యపు గాథల్లోని స్త్రీ దేవతలకు గ్రామీణులు రూపం కల్పించుకుని ఉంటారు. భిన్న రూపాలలో, భిన్న నామాలతో ఈ స్త్రీమూర్తి ఉపాసన అనేక ప్రాంతాలకు పాకి ఉంటుంది. అందుకనే లజ్జాగౌరి అన్నపేరు అనేక నామాంతరాలతో కనిపిస్తుంది. అదితి, కోటవి, రేణుక, యల్లమ్మ, మాతంగి, నగ్నగాత్రి, ఆద్యశక్తి, శాకంబరి వంటి పేర్లు చాలా కనబడతాయి.

రేణుక

ఈ స్త్రీమూర్తి తో ముడివడి ఉన్న రేణుక, రేణుక ఎల్లమ్మ, ఎల్లమ్మల ఉపాసన కూడా గ్రామ ప్రాంతాలలో ఉంది. రేణుకాదేవి జమదగ్ని భార్య. పరశురాముని తల్లి. రేణుక అంటే సూక్ష్మమైన ఇసుక కణం. మౌఖిక సాహిత్య కథ ప్రకారం ఈవిడ మలప్రభ నదీతీరంలో రోజూ ఇసుకతో కుండను తయారు చేసి ఆశ్రమానికి నీరు పట్టుకొచ్చేది. ఓ మారు గంధర్వ దంపతుల జలక్రీడను చూసి వివశురాలైన రేణుక నీరు తేలేకపోయింది. ఆమె పాతివ్రత్యం భంగమైనదని, జమదగ్ని ఆమెకు మరణదండన విధించాడు.ఐదుగురు కుమారులలో చివరి వాడైన పరశురాముడు తన తల్లిని, నలుగురు అన్నలను వధించాడు. ఆపై తండ్రి వరం కోరుకొమ్మంటే తల్లిని బ్రతికించాలన్నాడు. రేణుకను బ్రతికించే ప్రయత్నంలో పొరబాటున యల్లమ్మ అన్న ఒక అన్య వర్ణపు స్త్రీ తలను అతికించారు. పొరబాటు తెలుసుకుని యల్లమ్మకు రేణుక దేహాన్ని అతికించి ఆమెను కూడా బ్రతికించారు. అప్పటి నుంచి యల్లమ్మ, రేణుకాదేవి కూడా గ్రామదేవతలై పూజలందుకుంటున్నారు.

రేణుకాదేవి కథ, ఆమె ఉపాసన కూడా లజ్జాగౌరి దేవతకు చెందిన మలప్రభ నది పరివాహక ప్రాంతానికి చెంది ఉండటం గమనార్హం. చాళుక్యుల కాలం నాటి యల్లమ్మ దేవాలయం బాదామిలో కనిపిస్తుంది. (గుహాలయాలకు వెలుపల, అగస్త్యతటాకం తీరంలో). ఈ యల్లమ్మ విజయనగర కాలంలోనూ ఉంది. హంపిలో పట్టణద యల్లమ్మ దేవాలయం ఉంది. రేణుకాదేవియే కాకతీయులు పూజించిన ’ఏకవీర’ మాత కూడానూ.

రేణుకాదేవి కూడా భూదేవి రూపమే. దీనికి నిదర్శనం స్కాందపురాణంలోని రేణుకా మహాత్మ్యంలో కనబడుతుంది. దేవదానవ యుద్ధంలో ఓడిన దేవతలు విష్ణువును ప్రార్థిస్తే, ఆయన ఇలా అభయమిచ్చాడు.

అదితేః సంభవిష్యామి యదా గర్భే సురోత్తమాః|
తదాహం ద్విజరూపేణ ఘాతయిష్యామి దానవాన్ ||
త్రిసప్తకృతః పృథివీం కృత్వా నిఃక్షాత్రియామహమ్ |
బ్రాహ్మణేభ్యః ప్రదాస్యామి దక్షిణార్థం మఖే శుభే ||
ఏకవీరేతి విఖ్యాతా సర్వకామప్రదాయినీ |
అదితిర్యాం మదంబా సా సంభవిష్యతి భూతలే ||
(స్కాందపురాణం, సహ్యాద్రి ఖండము, రేణుకామహాత్మ్యం, 1.14-1.16)

సురోత్తములు జన్మించిన అదితి (రేణుకాదేవి) గర్భంలో, బ్రాహ్మణుడిగా నేను జన్మిస్తాను. భూమిని పలుమార్లు చుట్టి క్షత్రియులను నిర్జిస్తాను. యజ్ఞం చేసి బ్రాహ్మణులకు భూదానం చేస్తాను. నా తల్లిగా ఏకవీర పేరుతో, అన్నికోర్కెల పంటగా అదితి భువిపై జన్మించి కీర్తిగడిస్తుంది.

కూటవి

కూట్ట, కూటరా, కూటవి, కూటవై – ఇలా రకరకాల పేర్లు కలిగిన ఒక స్త్రీమూర్తి ప్రస్తావన ప్రాచీన తమిళ సాహిత్యంలోనూ, మౌఖిక సాహిత్యంలోనూ, ప్రాకృత సాహిత్యపు మూలల్లోనూ కనిపిస్తుంది. శ్రీమద్భాగవతంలో బాణాసురుని తల్లి పేరు కూటరా దేవి. వివస్త్ర అయిన ఈ స్త్రీమూర్తి బహుశా తాంత్రిక దేవత కావచ్చు. ఈ స్త్రీమూర్తి ఉపాసకులను కూడా ఆ పేరుతోను పిలిచేవారు. వారు అగుపడితే అరిష్టమని భావించేవారు.

లజ్జాగౌరి ఉపాసనతో ముడివడిన మరొక స్త్రీమూర్తి కూటవి.

తమిళనాడులోనూ, ఇతర ప్రాచీన దేవాలయాలలోనూ సప్తమాతృకల విగ్రహాలు అక్కడక్కడా కనిపిస్తాయి. అదేవిధంగా దశమహావిద్యలలో “ఛిన్నమస్త” అన్న రూపం శిరో రహితంగా కనిపిస్తుంది. లజ్జాగౌరి ఉపాసన బహుశా తాంత్రిక ఉపాసనతో కూడా ముడివడి ఉండవచ్చుననిపిస్తుంది.

భారతదేశం మహా విచిత్రమైన, మార్మికమైన, ఆధ్యాత్మికమైన భూమి. ఆధ్యాత్మికత, శిల్ప, చిత్రకళలూ, అనూచానమైన ఉపాసన, భక్తి విశ్వాసాలూ, సాహిత్యము, సాంప్రదాయము – ఇలా విభిన్నమైన విషయాలకు మధ్య ఒక అదృశ్యమైన తీవె యొక్క సమన్వయం కనిపిస్తుంది. లజ్జాగౌరి అన్న గ్రామదేవత మీద గత శతాబ్ద కాలంలో విస్తృతంగా పరిశోధన జరిగింది. ముఖ్యంగా పాశ్చాత్యులు ఈ మూర్తిని గురించి చాలా ఆసక్తి చూపారు. లజ్జాగౌరి మూర్తి విగ్రహాలను అమెరికాలో కొన్ని ప్రాంతాల మ్యూజియం లలోనూ నెలకొలిపినారు.

అయితే పూర్తిగా భారతీయ నేపథ్యంలో, చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా కొనసాగిన పరిశోధనలు అరుదనే చెప్పాలి. తెలుగులో లజ్జాగౌరి మీద వ్యాసాలు కానీ సమాచారం కానీ ఎందుచేతనో అస్సలు లేదు.. చాలా విస్తృతమైన అంశాన్ని గురించి రేఖామాత్రంగా పరిచయం చేయటానికి చేసిన ప్రయత్నం ఈ వ్యాసం.

**** (*) ****

(ఛాయాచిత్రాలు 5,6: వికీపీడియా సౌజన్యంతో.)