ప్రత్యేకం

హంపివిరూపాక్షుడు – దక్షిణ భారతదేశ సాంస్కృతిక ప్రస్థానం

డిసెంబర్ 2017

వాల్మీకి రామాయణంలో కిష్కింధకాండ: సీతను రావణుడు అపహరించిన తర్వాత రాముడు, లక్ష్మణుడితో సహా సీతను వెతుకుతూ బయలుదేరాడు. కిష్కింధకు చేరుకున్నాడు. అక్కడ పంపాసరస్సును చూచాడు.

సౌమిత్రే! శోభతే పంపా వైడూర్యవిమలోదకా,
ఫుల్లపద్మోత్పలవతీ శోభితా వివిధైర్ద్రుమైః || (రామాయణం, కిష్కింధాకాండ – ౧.౩)

తా: లక్ష్మణుడా! పంపాసరస్సు వైడూర్యము వంటి స్వచ్ఛమైన నీటితో, వికసించిన తామరలతో, కలువలతో, తీరాన ఉన్న ఫలవృక్షాలతో ప్రకాశిస్తోంది చూడు!

ఆపై వాల్మీకి పంపాసరస్సును, కిష్కింధపరిసరాలను సుదీర్ఘంగా వర్ణించాడు. ఆ ప్రకృతి వర్ణనకు పరాకాష్ఠగా, రామునిచేత కంఠోక్తిగా ఒక్కమాట అనిపిస్తాడు.

యది దృశ్యేత సా సాధ్వీ యది చేహ వసేమహి, |
స్పృహయేయం న శక్రాయ నాయోధ్యాయై రఘూత్తమ || (౧. ౯౫)

తా: లక్ష్మణుడా! ఆ సాధ్వి సీత కనిపించి, మనం ఇక్కడ నివసించే అవకాశం వస్తే, అయోధ్యను, ఇంద్రపదవిని కూడా ఆశించను.

వాల్మీకి వర్ణనలో ఎక్కడా ’తుంగభద్ర’ అన్న నది ప్రస్తావన లేదు. ఆయన కిష్కింధలోని పంపను ’సరోవరం’ అని అంటున్నాడు. అయితే వాల్మీకి ప్రస్తావించిన మాతంగ, మాల్యవంత, ఋష్యమూక, గంధమాదనాది పర్వతాలను, ఇతర పోలికలను గుర్తెరిగి అది కర్ణాటకలోని “హంపి” ప్రాంతంగా చారిత్రకులు, ప్రాజ్ఞులు భావించారు. ఈ ప్రాంతంలో తుంగభద్రనది ’పంప’ అన్న పేరుతో ప్రసిద్ధం. ఈ పంపానది దక్షిణ దిశగా, ఋష్యమూక, మాతంగ పర్వతాలకు కనుచూపు మేరలో నేడు – ఠీవిగా ఒక రాజగోపురం, ప్రసిద్ధమైన దేవాలయం కనిపిస్తాయి. అది ’పంపావిరూపాక్ష’ స్వామి ఆలయం.

క్రీ.శ. పదమూడవ శతాబ్దంలో ఆ విరూపాక్షస్వామి ఆశీస్సులతో, విద్యారణ్యముని నేతృత్వంతో, హక్క, బుక్కలనబడే సోదరుల కర్తవ్యదీక్షతో ఒక సువిశాల సామ్రాజ్యం దక్షిణభారతదేశంలో ఏర్పడింది. అదే విజయనగరసామ్రాజ్యం. ఆ విశాల సామ్రాజ్యానికి మూలశక్తి విరూపాక్షస్వామి అనే ఈశ్వరరూపంలోని దైవం. ఎవరా విరూపాక్షుడు?

***

చాలా ప్రాచీన కాలంలో ప్రకృతి యొక్క శక్తులను దేవుళ్ళుగా, దేవతలుగా భావించి ఆరాధించేవారని చెప్పటానికి మన వాఙ్మయంలో కొన్ని ఆధారాలు కనిపిస్తాయి. వేదకాలంలో ’రుద్రుడు’ ఒక దైవం. ఈ ’రుద్ర’ శబ్దానికి నిరుక్తంలో ’రోరూయమాణః ద్రవతి ఇతి రుద్రః’ అని ఒక వ్యుత్పత్తి చెప్పారు. అంటే “హుర్రు…అన్న తీవ్రమైన శబ్దం చేస్తూ ప్రవహించే వాయువు” రుద్రుడు. వాయుదేవుడే రుద్రుడు అని చెప్పటానికి ఋగ్వేదంలోనూ కొన్ని సూక్తములు ఉన్నవి. తదనంతరకాలంలో రుద్రుడు – ’శివుడు’ గా పరిణమించటం, ఏకాదశ రుద్రులుగా వ్యాప్తి చెందటం జరిగాయి. హిందూ దేవతల వెనుక మార్మికమైన కథలు, కారణాలు ఉన్నాయి. అలాంటి కారణాలే విరూపాక్షుడికీ ఉన్నాయి.

విరూపాక్షుడు – అంటే విరూపమైన నేత్రము కలిగిన వాడు. అంటే సాధారణంగా అడ్డంగా ఉన్న కనుదోయికి భిన్నంగా నిలువుగా ఉన్న మూడవకన్నును నొసటన కలిగిన పరమేశ్వరుడు అని రూఢ్యర్థం. “వామదేవో మహాదేవో విరూపాక్షస్త్రిలోచనః” – అని అమరకోశం. ఇంకా లింగపురాణం, శివసహస్రనామాలలో ఈ శబ్దం ఉంది. నారాయణ సూక్తంలో విష్ణువు పేరు ’విరూపాక్షుడు’.

ఋతగుం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం |
ఊర్థ్వరేతం ’విరూపాక్షం’ విశ్వరూపాయ వై నమో నమః || – నారాయణసూక్తం.

సంస్కృత పురాణ వాఙ్మయంలో కొన్నిచోట్ల సహస్రాక్షుడైన ఇంద్రుణ్ణి విరూపాక్షుడని ఉద్యోతించడం ఉన్నది. అంతే కాదు. కైలాసం – పరమేశ్వరుడికే కాక కుబేరునికి కూడా స్థానం. అక్కడి అలకాపురి – కుబేరుని ముఖ్యపట్టణం. అందుచేత విరూపాక్షుడు (ఈశ్వరుడు) అంటే పరోక్షంగా కుబేరుడు కూడానూ.గంగాదేవి అనే కవయిత్రి రచించిన మధురావిజయమనే కావ్యంలో, విజయనగరాన్ని వర్ణిస్తున్న ఈ శ్లోకం చూడండి.

యచ్ఛాఖానగరీం పంపామనేకధనదాశ్రితామ్ |
అధితిష్టన్ విరూపాక్షో న స్మరన్త్యలకాపురీమ్ || – ౧. ౬౬.

- అనేక వీధులుగల ఈ నగరిని, వివిధసంపదలున్న ఈ పంపా నగరాన్ని ఆశ్రయించిన విరూపాక్షుడు తనఊరైన అలకాపురిని స్మరించడమే లేదు. ఇక్కడ విరూపాక్షుడు అంటే కుబేరుడు అన్నది స్పష్టం. అనేక అర్థాలున్నప్పటికీ రూఢ్యర్థంలో విరూపాక్షుడు అంటే విశ్వేశ్వరుడే. ఈ విరూపాక్షుడిని దక్షిణ భారతంలో చాళుక్యులు తొలుతగా అర్చించినట్టు కనిపిస్తుంది.

***

చాళుక్యుల పట్టదకల్లు విరూపాక్షుడు

చరిత్రలో చాళుక్యులది ఆరవశతాబ్దము. వారి మొదటి రాజధాని వాతాపి/బాదామి. నేటి బాదామి కర్ణాటక రాష్ట్రంలోని బాగల్ కోట జిల్లాలో ఉంది. చాళుక్యుల సంస్కృతికి బాదామి మాత్రమే కాక చుట్టుపక్కల మలప్రభ నదీ తీర ప్రాంతాలయిన పట్టదకల్లు, ఐహోళె, మహాకూట వంటివి కూడా ప్రసిద్ధి. ఇందులో పట్టదకల్లు – చాలా ప్రాచీనమైన పట్టణం. గ్రీకు తత్వవేత్త టాలెమీ (PTolemy) వ్రాసిన ప్రపంచ భౌగోళికశాస్త్రంలో పట్టదకల్లు ప్రస్తావన ఉన్నదట. ఐదవ శతాబ్దానికి మునుపు అనేక స్థానిక సంస్థానాధీశులు ’పట్టదకల్లు’ కు వచ్చి పట్టాభిషేకం జరుపుకోవడం ఆనవాయితీగా ఉండేదట. పట్టదకల్లు – అంటే సంస్థానాధీశులు పట్టం కట్టుకోవడానికి ఏర్పరుచుకున్న స్థలం. ఆ ’పట్టదకల్లు’ లో నేడు మనకొక విరూపాక్ష దేవాలయం కనిపిస్తుంది. క్రీ.శ. 8 వ శతాబ్దంలో – చాళుక్యులలో రెండవ విక్రమాదిత్యుడు పల్లవులను జయించిన సందర్భంలో ఆతని భార్యలయిన త్రైలోక్యమహాదేవి, లోకమహాదేవి దక్షిణాదిన పల్లవుల రాజ్యం నుంచి శిల్పులను రప్పించి వరుసగా విరూపాక్ష, మల్లికార్జున దేవాలయాలను కట్టించారు. ఆపై విజయధ్వజాన్ని ప్రతిష్ఠించి దానిపై శాసనం వేయించారు.

***

పంపావిరూపాక్షుడు

క్రీ.శ. 1336 – ధాతృనామసంవత్సరం, వైశాఖశుద్ధసప్తమి నాడు శృంగేరి పరమాచార్యులు మాధవవిద్యారణ్యస్వామి విజయనగరసామ్రాజ్యాన్ని స్థాపించి హరిహరరాయలకు పట్టాభిషేకం చేసినట్టు ఐతిహ్యం. ఆ సమయంలోనే ఆయన విద్యానగరంలో హేమకూటాద్రిపై ఉన్న మూలవిరూపాక్షుని విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న చోటుకు మార్చి, పునఃప్రతిష్ఠించారు. ఆపై విజయనగరాన్ని తొలుతగా పాలించిన సంగమ ప్రభువులు విరూపాక్షస్వామికే కాక, పంపాదేవికి, భువనేశ్వరీదేవికీ ఆలయాలు కట్టించారు. ఆ దేవాలయానికే తదనంతరకాలం ఇమ్మడి ప్రౌఢదేవరాయల వారి కాలంలో గోపురం ఏర్పడింది.

విద్యానగరాన్ని – స్వామి విద్యారణ్యులు నిర్మించతలపెట్టటానికి పూర్వం ఈ రాజ్యం ఇతర రాజుల పరిపాలనలో ఉండేది. చాళుక్యులు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు. వారే హేమకూటంపై మూలవిరూపాక్షుణ్ణి ప్రతిష్ఠించారు. హేమకూటంపై ఇతరత్రా దేవాలయాలనూ కట్టించారు. ఇవి చాళుక్యుల రేఖానగర శైలిలో నేటికీ శిథిలరూపంలో కనిపిస్తాయి. హేమకూటం అంటే ప్రస్తుతం విరూపాక్షదేవాలయానికి దక్షిణంలో ఉన్న చిన్న గుట్ట.

చాళుక్యుల కాలంలో విజయనగర ప్రాంతానికి పంపాక్షేత్రమని పేరు. క్రీ.శ. 1012 నాటి బాదామి చాళుక్యరాజు ఐదవ విక్రమాదిత్యుని కాలపు ఒక శాసనంలో పంపాపతి అయిన మహాకాలునికి చేసిన దానం గురించిన వివరణ ఉంది. అలాగే క్రీ.శ. 1199 నాటి కలిదేవుని శాసనంలో – విరూపాక్షుడు, పంపాదేవి అన్న పేర్లు ఉన్నాయి. (యిది నేటి దేవాలయంలో ఉత్తరద్వారం వద్ద ఉంది) అంతకంటే ప్రాచీనమైన చాళుక్యవినయాదిత్యుని (క్రీ.శ. 680-696) తామ్రశాసనంలో విరూపాక్ష, పంపాపతిల ప్రస్తావన ఉంది. ఆ శాసనపు ఛాయాచిత్రం యిది.

పంపయే కన్నడభాషలో ’హంపి’ గా పరిణమించింది. హంపి లోని హేమకూట, విరూపాక్ష నామధేయాల వెనుక- ఇదివరకు మనం చెప్పుకున్న మార్మికత, విచిత్రమైన కథలూ దాక్కుని ఉన్నాయి.

మౌఖికసాహిత్యంలో పంపాదేవి

తుంగభద్ర నదికి ’పంప’ అనే పేరు పురాణాల్లో కనిపిస్తుంది. ఇదివరకే చెప్పుకున్నట్టు – రామాయణంలో వాల్మీకి కూడా కిష్కింధలో ’పంపాసరస్సు’ అనే ప్రస్తావించాడు. విరూపాక్షునికి పంపాపతి అని పేరు. పంపాదేవి- విరూపాక్షుని మొదటి భార్య. ఈమె ఎవరు? అన్న విషయంపై చాలాకాలం మునుపు స్థానికంగా ఒక కథ వ్యాప్తిలో ఉండేది. మౌఖిక సాహిత్యంలో భాగమైన ఈ కథను ఆంగ్లేయులు బళ్ళారి – మదరాసు కైఫీయత్తులలో నమోదు చేశారు.

పంప – అనే ఓ అమ్మాయి బ్రహ్మపుత్రిక. ఈ యువతి ఈ హంపి పరిసర ప్రాంతాలలోని మాల్యవంతపర్వతం పై నివాసం ఉండేది. మాతంగ, ఋష్యమూక పర్వత ప్రాంతాలలో సంచరిస్తూ, మునులకు పూలూ పళ్ళూ సమర్పిస్తుండేది. అక్కడి మునులు ఈమె భక్తికి సంతోషించి, ఏదైనా వరం కోరుకొమ్మన్నారు. ఆమె ఎంతో సంతోషించి – విరూపాక్షుడిని భర్తగా అనుగ్రహించమని కోరింది. అందుకు మునులు అంగీకరించి ఆమెకు మంత్రోపదేశం చేశారు. అలా మంత్రోపదేశం పొందిన ఆ యువతి స్థానిక హేమకూటంపై మహాదేవుని గురించి తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి విరూపాక్షుడు ఆమెను అనుగ్రహించి పత్నిగా స్వీకరించాడు.సాధారణంగా పురాణాలలో ఈశ్వరుని భార్య పార్వతి/ఉమ. ఈమె హిమవంతుని పుత్రిక అని మనకు తెలుసు. అలాగే – భగీరథుడు ఆకాశగంగను నేలకు దింపినపుడు, ఆమె ఉద్ధృతిని ఆపడానికి ఈశ్వరుడు గంగను తన జటాజూటంలో బంధించాడు. ఆ విధంగా గంగ ఈశ్వరుని రెండవభార్య అయింది. అయితే హంపిలో విరూపాక్షుని మొదటి భార్య (నదికి చిహ్నమైన) ’పంప’. రెండవభార్య భువనేశ్వరీదేవి. (భువనేశ్వరి – చాళుక్యుల కాలపు గ్రామదేవత. ఈ దేవి రూపమే నేటి కర్ణాటక రాజ్యమాత అయింది). కాస్త సూక్ష్మంగా ఊహిస్తే – ఈ విరూపాక్షుడనే ఆయన స్థానికంగా గొప్ప రాజు కానీ, గొప్ప వీరుడు కానీ అయి ఉండాలి. ఈ మహాసత్వుని భార్య కావాలని పంప అనే యువతి తపన పడి ఉండాలి. తద్వారానే పైని కథ పుట్టి ఉంటుంది. ఇది ఊహే అయినా అసంభావ్యం కాదు. హంపిలో విరూపాక్షుని మూలవిగ్రహం పైన కూడా ఓ ముఖం కనిపిస్తుంది. డోమింగో పేస్ అన్న యాత్రికుడు కూడా తను వ్రాసిన చరిత్ర వృత్తాంతములో ఈ విషయం గురించి చెప్పాడు.

చాళుక్యుల బాదామి వద్ద మహాకూటం అనే ప్రదేశం ఉంది. విద్యానగరాన చాళుక్యులకు చెందినది హేమ కూటం. పరమేశ్వరుడు ముకుటేశ్వరుడుగా కల్యాణం అయిన తర్వాత గౌరితో కలిసి మహాకూటంలో స్థిరపడ్డాడు. ఆయనే విరూపాక్షుడుగా – పంచముఖుడుగా హేమకూటాద్రిపైన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అలా తపస్సు చేసుకుంటున్న సమయంలో మన్మథుడు ఆయనపై బాణాలను సంధించాడు. ఈయన మూడవ కన్ను తెరిచాడు. మన్మథుడే కాక, ఆ వెనకనున్న హేమకూటంపై ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా కరిగి నీరైపోయాయి. ఆ నీళ్ళు అన్నీ ఒక పల్లపు ప్రదేశానికి చేరినై. తదనంతరకాలంలో అక్కడ విజయనగరప్రభువులు ఓ పుష్కరిణిని కట్టించారు. విరూపాక్షదేవాలయం పక్కన, తుంగభద్రానదికి వెళ్ళేదారిలో మన్మథపుష్కరిణి వెనుక కథ యిది. ఇది స్పష్టంగా, విరూపాక్షుని కథకు తదనంతర కాలంలో, బహుశా, పుష్కరిణి కట్టిన తర్వాత ఏర్పడిన కథగా ఊహించవచ్చు.

భారతదేశంలో క్రీ.శ నాలుగు నుంచి ఏడవ శతాబ్దం – అనేక మార్మిక సంప్రదాయాలు/కథలు ఏర్పడిన కాలం. గజముఖుడైన గణపతి ఆరాధన ఆ కాలంలోనే అనూహ్యంగా వ్యాప్తిలోకి వచ్చింది. ఎన్నెన్నో పురాణగాథలు ఆ కాలంలోనే సంభవించాయి. ముకుటేశ్వరుడూ, లజ్జాగౌరి, బనశంకరి, రేణుకాయెల్లమ్మ,కోటర తదితర రూపాలను అర్చించటం ఆ కాలంలో ప్రబలింది. బౌద్ధంలో వజ్రయాన మత ప్రభావంతో తాంత్రిక విద్యల ప్రాబల్యమూ హెచ్చింది.

చాళుక్యుల నాటి కుమారరాముని కథలో కూడా చారిత్రక నేపథ్యం కలిగిన మౌఖికసాహిత్యం కనిపిస్తుంది. కాంపిల్య నగరాధీశుడైన కుమారరాముడు – ముష్కరులను ఎదుర్కొని ’గండుగలి’ (మగధీరుడు) అనే బిరుదు సంపాదించాడు. ఈయన కథ ’సారంగధర చరిత్ర’ ను పోలి ఉంటుంది. బళ్ళారి జిల్లాలో సండూరు కొండలనడుమ చాళుక్యుల రేఖానగరనిర్మాణ పద్ధతిలో కుమారరామునికి ఒక దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో ’స్త్రీలు’ ప్రవేశించరు. ఈ ఆచారానికి, ఆయన కథకూ మధ్య లంకె కుదురుతుంది.

భారతదేశచారిత్రకయవనికలో మార్మికసంప్రదాయపు ప్రాధాన్యం ప్రాధాన్యత హెచ్చుగా ఉన్న కాలం అది. మార్మికసంప్రదాయంలోని విశిష్టత ఏమంటే – కథలకూ, అవి సంధించే ప్రశ్నలకూ జవాబు మెదడులో మెదులుతూ ఉంటుంది కానీ దొరకదు. అసంబద్ధమని వదిలి వేయడమూ పూర్తిగా కుదరదు. స్పష్టాస్పష్టతల మధ్య ఉన్న సత్యమేదో తొంగిచూస్తూ, ఆసక్తి రేకెత్తిస్తూ ఉంటుంది. హంపి చుట్టూ కొండలూ, కొండలంతటా అనేకానేక శిలలూ ఉంటాయి. అయితే హేమకూటం మాత్రం – కాస్త చదునుగా ఉంటుంది. అక్కడ కట్టడాలు, చిన్న చిన్న దేవాలయాలు నిర్మించే సందర్భంలో ఇలా జరిగిందా? లేక నిజంగానే శివుడనే నిజమైన (స్థానిక దైవస్వరూపమైన) వ్యక్తి అక్కడి శిలలను కాల్చి దగ్ధం చేశాడా? లేదా ఏదో చిన్న ప్రకృతి ఉత్పాతమో ఏదో జరిగితే దానికి చిలువలుపలవలుగా కల్పించుకుని ఈ కథ ఏర్పడిందా? హేమకూటం (పైడిరాశి) అనే ఆ చిన్నగుట్ట సాయంసంధ్యలో బంగారాన్ని పుటం పెట్టి కాల్చినట్టు బంగరు రంగులో కనిపిస్తూ ఉంటుంది. అలా బంగరు రంగులో ప్రకాశించే గుట్టలా (హేమకూటం) కనిపిస్తున్నది కాబట్టి దానికి కారణాలను వెతుక్కుని పురాణకథలకు అన్వయించుకుని, ఈ పేరును తగిలించారా? అంతు పట్టని ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఇలా ప్రశ్నలను సంధించి – విద్యార్థులకు విద్యగరపడం ఉపనిషత్తుల కాలంలో కనిపిస్తుంది. (జెన్ బౌద్ధపద్ధతిలోనూ ఇది ఉండేది) చాళుక్యుల కాలానికి ఆ పద్ధతి యొక్క ఆనవాళ్ళు మిగిలాయి. (చాళుక్యుల రెండవపులకేశి – హర్షవర్ధనుణ్ణి జయించాడు. హర్షవర్ధనుని ఆస్థానకవి రచించిన హర్షచరిత్రలో కొంతవరకు ఉపనిషత్తుల ఆనవాళ్ళుగా మిగిలిన ఋష్యాశ్రమాల వర్ణన ఉన్నది.). ఆ విద్యా రీతులే ఈ కథలకు మూలాధారం కావచ్చు.

***

చాళుక్యశిల్ప వస్తువు

సాధారణంగా చాళుక్యుల దేవాలయాలన్నీ రేఖానగరనిర్మాణాలయితే పట్టదకల్లులోని ఈ రెండు దేవాలయాలు మాత్రం ద్రవిడవిమానపద్ధతిలో నిర్మితమై ఉండటం గమనించవచ్చు. పట్టదకల్లులోని విరూపాక్షునికి, హంపిలోని విరూపాక్షునికి మధ్య కొన్ని విచిత్రమైన సామ్యాలు కనబడతాయి. ఎందుచేతనో ఈ రెండు దేవాలయాలపైన ముష్కరుల దాడి జరుగలేదు. (చుట్టుపక్క ప్రాంతాలన్నిటా తీవ్ర దాడి, దారుణవిధ్వంసం జరిగినప్పటికీ). ఈ రెండు దేవాలయాలలోనూ, నేటికీ నిత్యపూజలు జరుగుతున్నాయి. ఈ రెండు దేవాలయాలనూ, వాటి వెనుక దాగిన సంస్కృతినీ అనుశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.

జాగ్రత్తగా గమనిస్తే బాదామి చాళుక్య శిల్పాలలోనూ, ఆ శిల్పాలు చెప్పే కథలలోనూ, శిల్పనిర్మాణంలోనూ నాటి దేవతా మూర్తులలోనూ, దేవాలయ నిర్మాణంలోనూ, అప్పటి కాలానికి చెందిన కథలలోనూ పురాణకథలనేపథ్యమూ, మౌఖికసాహిత్యస్పర్శ, ఒక విధమైన మార్మికత (Mysticism) కనిపిస్తాయి.

“ఆషాఢమాసంలో మగనెమలి – తనివితీరా నృత్యం చేసింది. ఆపై అలసిపోయి, నృత్యాన్ని ఆపి ఆనందబాష్పం రాల్చింది. ఆ కన్నీటి చుక్కని ఆడునెమలి మింగి గుడ్డు పెట్టింది.”

“సూర్య భగవానుడు చీకట్లను చీల్చుకుని సముద్రం నుండి ఉబికి వచ్చాడు. అతని భార్యలిద్దరూ తిమిరాలపై అస్త్రాలను సంధించారు. దేవతలు సూర్యుణ్ణి పొగుడుతున్నారు. అసురులు వెనక్కు మరలుతున్నారు. మనుషులు అబ్బురపాటుతో చూస్తున్నారు, లోకం ఆరంభమవుతూ ఉంది.”

“వరాహమూర్తి భూదేవిని సముద్రగర్భం నుంచి పైకి తీసుకుని వచ్చాడు. దేవతలు ఆనందించారు. తెలిసిన పురాణ కథ అయినా ఈ వరాహమూర్తి నిలువెత్తు ఆకారాన్ని చెక్కిన తీరు చూస్తే – ఆ మూర్తిని చిహ్నంగా కాక, నిజంగా అలాంటి మూర్తి ఉండి ఉండేవాడన్నట్టుగా, చెబుతుందా శిల్పం”.

కథలే కాక, శిల్పనిర్మాణం లోనూ, ఆ శిల్పాల ఆకారంలోనూ, కళ్ళల్లోనూ ఏదో తీక్ష్ణత, ఆ శిల్పి ఇతమిత్థమని ఏమి చెప్పదలుచుకున్నాడో అంతుబట్టని భావాలూ కనిపిస్తాయి. చాళుక్యుల శిల్పానికి పరాకాష్ట అనదగిన బాదామి మొదటి గుహాలయపు ఆనందతాండవపరమేశ్వరుని శిల్పంలోనూ చాలా అద్భుతం కనిపిస్తుంది. చూడండి. ఆ శిల్పంలో నృత్యం తాలూకు 92 ముద్రలు ఉన్నాయని అంటారు.

జీవి పుట్టుక ఓ విస్మయకరమైన విషయం. ఈ జన్మ కు ఆధారభూతమైన స్త్రీ నాటి దేవత. స్త్రీ – సృజనకు మూలరూపం. చాళుక్యుల కాలం నాటి ముఖ్యమైన పరమేశ్వర రూపం మహాకూటేశ్వరుడు. ప్రముఖ దేవత లజ్జాగౌరి. ఇతర దేవతారూపాలయిన భువనేశ్వరి, బనశంకరి, ఎల్లమ్మ, రేణుక తదితరాలు కూడా భూదేవి రూపాలే. ఈ స్త్రీదేవతా రూపాలూ, నవబ్రహ్మలూ ఇత్యాదులకు సంబంధించిన మౌఖిక కథలలోనూ అంతు తెలియని మార్మికత తొంగి చూస్తూ ఉంటుంది. (ఈ వ్యాసం చూడండి.) ఇక్కడ ఓ ప్రశ్న కూడా ఉదయిస్తుంది. చాళుక్యుల కాలం నాటి ఐహోళె శాసనంలో కాళిదాసూ, భారవి కవుల పేర్లు పేర్కొనబడి ఉన్నాయి. కాళిదాసాదుల కావ్యాలకు, అంతకు ముందు ఏర్పడిన వేద, పురాణాది కథలలోని అంతుబట్టని విషయాలను భగవంతుని లీలలకు నిదర్శనంగా భావించి చాళుక్యులు కళలనూ, శిల్ప, దేవాలయనిర్మాణాదులనూ, వారి సాంప్రదాయాన్ని నిర్మించుకున్నారా? లేక ఇతర కారణాలతో ఏర్పడిన మార్మిక సంప్రదాయాలను ప్రాచీన కావ్య పురాణాదులకు అన్వయించుకున్నారా? – అన్న విషయం అంతుపట్టదు. చాళుక్యరాజుల ప్రస్థానమే బహువిచిత్రంగా ఉంటుంది. ఎవరో ముని ’చుళుకం’ లో జలాల నుంచి వచ్చారని ఓ కథ. చుళుకానికి సంబంధించినది చౌళుక అవాలి కానీ, చాళుక్య అవదు. ఆంధ్రులే చాళుక్యుల పూర్వీకులని కొందరు చారిత్రకులంటారు. వీరు నిజంగా ఎక్కడి వారో, వారి పూర్వచరిత్ర ఏమిటో స్పష్టంగా చెప్పగలిగే ఆనవాళ్ళు తెలియలేదు. ఏదేమైనా, చాళుక్యులు, వారి కాలం ప్రధానంగా పురాణకథలతోనూ, వాటి వెనుక మార్మికమైన లక్షణాలతోనూ కూడి ఉంది.

***

విజయనగరశిల్పం

ఇక విజయనగర సామ్రాజ్య కాలపు తీరుని గమనిస్తే – శిల్పాలలోనూ, సాహిత్యంలోనూ, నాటి కథలలోనూ, ప్రజల జీవనంలోనూ, లలితకళలలోనూ స్పష్టంగా గొప్ప వైభోగం, రసికత కనిపిస్తాయి. అదృష్టవశాత్తూ ఈ కాలానికి చెందిన విషయాలు నేటికి స్పష్టంగా రికార్డు అయి ఉన్నాయి.

సంగీతం పలికించే రాతి స్థంభాలు, శిల్పప్రాభవం తో అలరారే అనేకదేవాలయాలు, విశాలమైన నగర వీథులు, అంగళ్ళ రతనాలు, వేలాది గుర్రాలు, ఏనుగులు, ఇతరత్రా వ్యాపారవస్తువులూ, కేవలం కర్పూరాది వాసన ద్రవ్యాలకోసం ఏర్పడిన బజారు – విపరీతమైన భోగం. డోమింగో పెరెస్ మాటల్లో విజయనగర ప్రాభవం తాలూకు చిన్న నమూనా యిది.

“He who wears such jewels can understand the sort of things so great a lord would wear. Then to see tha grandeur of the nobles and men of rank, I cannot possibly describe it all, nor should I be believed if I tried to do so;…I have no words to express what I saw and to try and tell of all I saw is hopeless. ”

విజయనగరప్రాభవం, సాహిత్యం, జీవనవిధానాల గురించి ఈ చిన్ని వ్యాసంలో చర్చించటం చూపించటం వృథా. ఈ వ్యాసలక్ష్యమూ అది కాదు. ఇక్కడ చెప్పదల్చుకున్నదేమంటే – విజయనగరప్రాభవం అత్యున్నత ప్రమాణాలను అందుకొంది. ఇది ’రసికుల’ కాలం. మహాభోగుల కాలం. చాళుక్యుల కాలం నాటి సమాజ మార్మిక వ్యక్తీకరణకూ, విజయనగర కాలపు వైభోగానికి మధ్య చాలా ఆసక్తికరమైన వారధులు ఈ నాడు హంపిలో మిగిలి ఉండటం విశేషం. అవి – హేమకూటం, విరూపాక్షస్వామి దేవాలయం.

***

బిష్టప్పయ్య గోపురం

హంపిలో విరూపాక్షస్వామి గోపురాన్ని రెండవ దేవరాయల (ఇమ్మడి ప్రౌఢదేవరాయలు) దండనాథుడైన ప్రోలుగంటి తిప్పయ క్రీ.శ. 1426-1448 మధ్యకాలంలో కట్టించినాడు. దేవాలయంలోపలి ఇతర నిర్మాణాలు తదనంతర కాలంలో ఏర్పడినవి. ఈ గోపురంపైన శిల్పాన్ని చూడండి.

ఇది ప్రస్ఫుటంగా విజయనగరకాలపు దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశంలో ఆలయాలపైన ఈ బూతు శిల్పాలు ఖచ్చితంగా ఎప్పటి నుంచి ఏర్పడ్డాయో తెలీదు. (బహుశా గుప్తుల కాలం నుంచి కావచ్చు) ముఖ్యంగా గోపురంపైన. చాళుక్యుల గోపురాలు ఇదివరకు చెప్పుకున్నట్టు రేఖానగర నిర్మాణాలు. వాటిపై ఈ విధమైన శిల్పాలను చిత్రించే అవకాశం లేదు. స్త్రీలను, పురుషులను విలాసంగా చిత్రీకరించిన శిల్పాలు నాడు లేకపోలేదు.కానీ ఉద్దేశ్యం వేరు. పట్టదకల్లులో ముఖమంటపముఖద్వారాన్ని చూడండి. ఇక్కడ ఈ రెండు శిల్పాలలో ఆకర్షణీయమైన స్త్రీ విగ్రహాలు ఉన్నప్పటికీ, ఆ శిల్పాల వెనుక ఉద్దేశ్యం – రాచజంటనూ, పల్లెజంటనూ పోల్చి చూపటమే అని తెలుస్తుంది. ఇవి శృంగారాన్ని ఉద్దేశించినవి కాదు అని అనుకోవాలి.

సమాజపు తీరు తెన్నులే ఆయా సమాజాలలో మనుషుల ఆలోచనలను ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తే – శృంగారం ఒక భోగం అనే విజయనగర కాలం నాటి ఆలోచన తీరు విరూపాక్ష శిల్పంలో కనిపిస్తుందని ఊహించవలసి వస్తుంది. సృజన అన్నది సృష్టి అనే విస్మయానికి మూలమైన కార్యమని చాళుక్యుల కాలపు లజ్జాగౌరి కథ గురించి ఇదివరకే చెప్పుకున్నాం. విస్మయకరమైన సృజన, విలాసమైన జీవితపు భోగంగా విజయనగర కాలానికి పరిణమించింది.

అంటే చాళుక్యుల నాటి మార్మిక సాంప్రదాయం విజయనగరకాలానికి రసికత సాంప్రదాయంగా మార్పు చెందింది. ఈ రెంటికి సూచనాప్రాయమైన వారధిలా హంపి విరూపాక్షస్వామి దేవాలయం నెలకొంది. ఈ దేవాలయానికి సంబంధించి ’పంప’ కథ మార్మికమైనది. (ఈశ్వరునికి ’పంప’ అనబడే పేరు గల భార్య పురాణాలలో లేదు. గంగ స్వరూపమే పంప అనుకున్నా, ఆవిడ ఈశ్వరుని మొదటి భార్య కాదు.). హేమకూట, మన్మథన హొండె ఉదంతాలు కూడానూ. అయితే దేవాలయంలో రంగమంటపం, బిష్టప్పన గోపురంపై దక్షిణ, పశ్చిమ దిశలలో నగ్న శిల్పాలు, మంటపాలలో యాళి స్థంభాలు, ప్రధాన స్థంభాలపై బంగారు పూత ఇవన్నీ వైభోగకరమైన విషయాలు. (ఇక్కడ మరో విషయం ప్రస్తావించక తప్పదు. విజయనగరంలో భోగకరమైన జీవితానికి సమాంతరంగా తార్కిక, ఆముష్మిక సాంప్రదాయమూ సాగింది. బుక్కరాయల కాలంలో మాధవవిద్యారణ్యులు భారతీయ దర్శనాలకు, వేదాలకు వ్యాఖ్యానాన్ని సంతరించారు. సాళువ నరసింహరాయలకు అన్నమయ్య, పురందరదాసు, అక్షోభ్యతీర్థులు, వంటి మునిపుంగవులకూ సముచిత స్థానం నాడు నెలకొంది. భక్తిఉద్యమ ప్రభావమూ నాడు ఉన్నది. అది సంగీతసాహిత్యాలకు బాసటగానే నిలిచింది.)

పంపా విరూపాక్షదేవుని వైభోగానికి మరో రూపు చైత్రమాసపు పంప-తేరు. చైత్రమాసంలో – వసంతోత్సవం జరుగుతుంది. ఈ వసంతోత్సవ వైభవాన్ని కన్నడకవి విరూపాక్ష-వసంతోత్సవ అన్న పేరుతో గ్రంథస్థం చేశాడు. కృష్ణరాయల ’జాంబవతీకల్యాణ’ సంస్కృత నాటకం ఆ వసంతోత్సవ రోజులలో ప్రదర్శింపబడుతుండేదని ఐతిహ్యం.

ఇలా పురాణ సంబంధమైన మార్మికత చాళుక్యుల కాలం నుంచి విజయనగరకాలానికి వచ్చేసరికి రసికతాసాంప్రదాయంగా పరిణామం పొందింది. ఇదే రీతి సాహిత్యంలోనూ ప్రవేశించింది. పురాణకావ్యాలు ప్రబంధకావ్యాలయ్యాయి. ప్రబంధాలలోనూ వైవిధ్యం. భక్తి, రసనిర్భరత, కథాసంవిధానం, సామాజికపరిశీలనం, శ్లేష, ఇలా ప్రబంధకావ్యాలు పలుపోకడలు పోయినాయి.శిల్ప, చిత్రకళల ప్రస్థానాలు చెప్పనవసరమే లేదు.

మౌఖిక, మార్మిక సాంప్రదాయాలతో పట్టదకల్లు, పంప విరూపాక్ష దేవాలయాలకు ఒనగూడిన సామాజిక ప్రయోజనం ఏమంటే – ఈ దేవాలయాలను ముష్కరులు విధ్వంసం చేయలేదు. హంపిని మొత్తం కొల్లగొట్టిన సుల్తానులు ఈ ఒక్క దేవాలయం జోలికి రాకపోవడం విశేషం. ఇటువంటివి కొన్ని కొన్ని ప్రముఖ ’మహిమాన్విత’మైన ప్రదేశాల విషయాలలో జరుగుతుంటాయి. (ప్రముఖ ఉదా: తిరుపతి)ఇందుకు స్థానికుల భక్తిప్రపత్తులూ, చుట్టూ అల్లుకుని ఉన్న కథలూ కూడా కారణంగా చెప్పుకోవచ్చు. విరూపాక్ష దేవాలయాల విషయంలోనూ ఇదే జరిగి ఉండాలి.

ఈ చారిత్రకపరిణామానికి మధ్య కేంద్రబిందువై నేడు – హంపి విరూపాక్షదేవాలయం దర్పంగా ఎన్నో కథలను చెలియ పంపకు చెబుతున్నట్టుగా బిష్టప్పన గోపురం నిలబడి ఉంది. ఈ గోపురాన్ని పదిహేడవ శతాబ్దంలో పునరుద్ధరించారని, బిష్టప్పయ్య అనే శిల్పి ఈ గోపురాన్ని పునః నిర్మాణంలో పర్యవేక్షించాడని, ఆ బిష్టప్ప శిల్పం దేవాలయ గోపురం లోపలి వైపున ఉన్నదని పరిశోధకులు చెబుతారు. ఏది ఏమైనా ఆ హంపి విరూపాక్ష దేవాలయం, ఆ గుడి తాలూకు 165 అడుగుల (49.6 metres) తొమ్మిదంతస్తుల సమున్నతమైన గాలి గోపురం- దక్షిణభారతదేశపు దేవాలయ వాస్తుకళకు, పౌరాణిక, మార్మిక సాంప్రదాయాలకు, ఉజ్జ్వలమైన చరిత్రకు, దక్షిణరాజ్యరమారమణుడైన శ్రీకృష్ణరాయల వారి జ్ఞాపకాలకు, విద్యారణ్యస్వామి వారి సన్నిధికి, అపూర్వ దేవాలయ శిల్పప్రాభవానికి, పైకప్పులో చిత్రించిన అపూర్వ చిత్రకళానైపుణ్యానికి, అద్భుతమైన మంటపాలకు, వసంతోత్సవాది పండుగలకు, తదితర సాంప్రదాయాలకు, ప్రబంధ సాహిత్యానికి, వైదికమత దర్శన వాఙ్మయ రచన ప్రేరణకు, భోగపరాయణతకూ వేదికగా నిలిచి ఉంది.

***

సీ||
పంపావిరూపాక్ష బహుజటా జాటికా | రగ్వధ ప్రసర సౌరభ్యములకు
తుంగభద్రాసముత్తుంగ వీచీఘటా | గంభీర ఘుమఘుమారంభములకు
కళసాపురప్రాంత కదళీ వనాంతర | ద్రాక్షాలతాఫల స్తబకములకు
కర్ణాటి కామినీ కర్ణహాటకరత్న | తాటంకయుగ ధాళదళ్యములకు

గీ ||
నిర్నిబంధ నిబంధమై నెనయు కవిత
తెలుగునను సంస్కృతంబున బలుకనేర్తు
ప్రౌఢదేవేంద్రరాయ భూపాలవరుని
సమ్ముఖమ్మున దయజూడు ముమ్మ సుకవి !

తాత్పర్యం:

ఓ ముమ్మ కవి! పంపావిరూపాక్షస్వామి (ఈశ్వరుని రూపం) యొక్క విశాలమైన జడలలో ధరించిన కొండగోగు పూల పరిమళాల వలే, తుంగభద్రానది ఎత్తైన అలల తాకిడి యొక్క గంభీరమైన నినాదాల లాగా, కళసాపురపు అరటితోటల నడుమ తీవెలకు వ్రేలాడుచున్న ద్రాక్షగుత్తులకు సరిపోలు విధంగా, కర్ణాట యువతులు చెవులలో అలంకరించుకున్న ముత్యాల చెవిపోగుల తళతళల మాదిరి చిక్కగా అల్లిన కవితను, తెలుగు సంస్కృతాలలో చెప్పగలవాడను. నన్ను మీ మహారాజైన ప్రౌఢదేవేంద్రరాయని ఎదుటకు కొనిపోవయ్యా!

శ్రీనాథ కవిసార్వభౌముడు, హంపి లో ప్రౌఢదేవరాయల వారి సముఖానికి అవకాశం కల్పించమని మమ్మ కవిని ప్రార్థించిన సందర్భంలో చాటువు ఇది. తెనుగు కవి శ్రీనాథకవిసార్వభౌముడు దక్షిణాధీశుని ముత్యాలశాలలో – దీనారటంకాల తీర్థమాడించటానికి కూడా ఆ విరూపాక్షుని దీవెనలే తోడ్పడి ఉంటాయి.

**** (*) ****