నేడు మనకు తెలిసిన తెలుగు పద్యం ఎప్పుడో సహస్రాబ్దాల క్రితం ఊపిరిపోసుకుంది. ఆ పసిబిడ్డకు పాలిచ్చి పెంచిన వారు కొందరు. మాటలు నేర్పిన కవయిత్రులు/కవులు ఇంకొందరు. వస పోసి లాలించి పాలించిన వారు ఇంకా కొందరు. ఆ పద్యానికి తప్పటడుగులు, నడకలు, నడతలు, సుద్దులు, బుద్దులు, వినయం ఒద్దిక, నగవు, పొగరు ఇవన్నీ నేర్పిన వారు ఇంకెంతో మంది. అలా అంతమంది ఆప్తబంధువుల లాలన, పాలనలతో – ప్రబంధకాలానికి తెలుగుపద్యం అపురూపమైన లావణ్యాన్ని సంతరించుకుని యౌవనవతి అయింది. ఈ అందమైన అమ్మాయికి అలంకారాలు, లయలు, హొయలు, విలాసాలు, ఆట, పాట నేర్పిన కవులు ప్రబంధకవులు. వారిలో అగ్రగణ్యుడు వసుచరిత్రకారుడైన రామరాజభూషణుడు/భట్టుమూర్తి.
తెలుగులో కావ్యప్రస్థానం సంస్కృతకావ్యాలకు అనుసృజనగా మొదలైనదని మనకు తెలుసు. అనుసృజనతో మొదలైనప్పటికీ సాధ్యమైనంత వరకు స్వతంత్రమైన రచనాసంవిధానాన్నే మనకవులు అనుసరించారు. ప్రబంధకాలంలో తెలుగు కవిత యొక్క స్వతంత్రత శిఖరాన్ని చేరుకొన్నది. అప్పటి వరకు సంస్కృతం నుంచి తెనుగు అనువాదాలకే తెనుగు రచన పరిమితం కాగా, పదునారవశతాబ్దం తరువాత వసుచరిత్ర మొదటిసారి సంస్కృతంలోనికి వసుచరిత్ర చంపువుగా అనువదింపబడినది. అంతే కాదు, సాధారణంగా ఇతర భాషాకవిత్వాలను అంతగా పట్టించుకొనని తమిళులు వసుచరిత్రను తమ భాషలో అనువదించుకున్నారు. వసుచరిత్రను అనుసరిస్తూ పిల్లవసుచరిత్రలు బయలుదేరినవి. ఈ కావ్యంలోని కొన్ని పద్యాలకు సంగీతబాణీలు కూర్చారు (శిష్టు కృష్ణమూర్తి వంటి) వ్యాఖ్యాతలు. (ఆ వ్యాఖ్యానం అలభ్యం). వీణియపై “లలనాజ, నాపాంగ, వలదావ, సదనంగ..” వంటి పద్యాలను పలికించే వారని పెద్దలంటారు. పద్యానికి పట్టం కట్టిన రచన ఈ ప్రబంధం. ఈ ప్రబంధంలో – తెలుగు పద్యం తాలూకు లావణ్యాన్ని ఎత్తిచూపిన ఒకానొక పద్యం పై వ్యాఖ్యానం ఈ వ్యాసం.
***
అదొక పెద్దకొండ. (పెనుగొండ). ఆ కొండ పేరు కోలాహలుడు. అతడు హిమాలయపర్వతరాజుకు సుతుడు. అంటే జగజ్జనని పార్వతీదేవికి అనుంగు తమ్ముడు. శంకరునికి ముద్దు మఱది. ఆ కోలాహలుడు అధిష్ఠాన నగరం దాపుల నున్నాడు. ఆ నగరాన్ని చుడుతూ, కొండచరియలో ఒద్దికగా, నిర్మలంగా, అమాయకంగా ఓ వాగు ప్రవహిస్తోంది. ఆ వాగు పేరు శుక్తిమతి. (ముత్యాలవాగు) ఆ శుక్తిమతిని కోలాహలుడు మోహించాడు. ఆమె ప్రవాహపు దారిని అడ్డగించినాడు. ఆ కన్నె అతణ్ణి వినయంగా ప్రార్థించి, అర్ఘ్యపాద్యాదులు స్వీకరించి, అడ్డు తొలగుమని వేడింది. కోలాహలుడు వినిపించుకొనలేదు. అతడు మోహపరవశుడై శుక్తిమతి చీరె కొంగు పట్టుకున్నాడు.
అప్పుడు……
ఉ||
వేణి చలింపఁ గంపితనవీనమృణాళభుజాగ్రకంకణ
శ్రేణి నటింప లోలశఫరీనిబిరీశకటాక్షకాంతి వి
న్నాణము చూప హంసకగణక్వణనంబులు మీఱ సైకత
శ్రోణి వివర్తితాబ్జముఖశోభితయై కడు సంభ్రమించినన్.
వేణి = నీటిపాయ/అల్లిన జడ
చలింపన్ = కదులాడగా
కంపిత నవీన మృణాళ భుజాగ్ర కంకణశ్రేణి
కంపిత = చలించిన
నవీన = క్రొత్తదైన
మృణాళ = తామరతూండ్ల
భుజాగ్ర = బాహువుల కొనలందు
కంకణ = జలబిందువుల/హస్తాభరణముల
శ్రేణి = వరుస
నటింప = నటనము చేయగా
లోల శఫరీ నిబిరీశ కటాక్షకాంతి
లోల = కదలుచున్న
శఫరీ = బేడిసమీనుల (Silver fish)
నిబిరీస = నిబిడమైన
కటాక్ష = క్రీగంటి చూపుల
కాంతి = ప్రకాశము
విన్నాణము చూప = తెలియరాగా
హంసకగణక్వణనంబులు
హంసకగణ = హంసలగుంపు యొక్క/కాళ్ళ అందియల
క్వణనంబులు = కలకలము
మీఱ = హెచ్చవగా
సైకతశ్రోణి = ఇసుకతిన్నెలు/ఇసుకతిన్నెలవంటి జఘనభాగము గల్గిన శుక్తిమతి
వివర్తితాబ్జముఖశోభితయై
వివర్తిత = ప్రక్కకు త్రిప్పుకొనిన
అబ్జముఖ = కమలములతో/కమలము వంటి ముఖముతో
శోభితయై = అలంకరింపబడినదై
కడు = మిక్కిలి
సంభ్రమించినన్ = తొందరపాటు పడెను.
ఈ పద్యానికి నదీపరంగా, కన్య పరంగా రెండు అర్థాలు. దీనికి శేషాద్రి రమణ కవుల తాత్పర్యం ఇలా ఉంది.
కోలాహలపర్వతము నదినడ్డగించుటచే నీటిపాయ చెదరెననియుఁ దామరతూండ్లు కలఁగెననియు, జలకణములు చిందెననియు, బేడిసమీ లెగిరి పడెననియు, హంసలు ధ్వని చేసెననియు, తామరపూలు కలతనొందెననియు (నదీపరమైన భావము)
శుక్తిమతి కొంగు కోలాహలుడు పట్టుకొన జడ కదలెననియు, భుజములు వణకుటచే కంకణములు మ్రోగెననియు ఓరకంటి చూపులొప్పారెననియు, కాలియందెలు మ్రోగెననియు, తొట్రుపాటుచేత మోము త్రిప్పుకొనెననియు (పడతి పరముగా నన్వయము).
***
ఈ అపూర్వమైన పద్యంలో ఎన్నో విశేషాలు. ఒక్కొక్కటీ వివరంగా చర్చించుకోవాలి.
1.
శఫరమంటే బేడిసమీను. Silver fish. దీనిని చంచలమైన కనులకు ఉపమానంగా సూచించటం తెనుగు కవిత్వ సాంప్రదాయం.
“కంపితనవీనమృణాళభుజాగ్రకంకణశ్రేణి, లోలశఫరీనిబిరీశకటాక్షకాంతి, హంసకగణక్వణనంబులు, వివర్తితాబ్జముఖశోభిత” ఇత్యాది శబ్దాలు రూపకములు. ఈ రూపకములన్నీ నది/యువతి యొక్క శరీరవిన్యాసములలో పరిణమిస్తున్నాయి. అందువలన ఇవి ఏకదేశవివర్తి రూపకములు. వేణి, కంకణ, హంసక, అబ్జముఖ వంటి శబ్దములు – శ్లిష్టములు. శ్లేషార్థకములు. అంటే అర్థద్వయం కలిగినవి.
ఈ రూపకములు నదిని వర్ణిస్తూ, యువతి యొక్క సంభ్రమములలో పర్యవసిస్తున్నవి. అంటే కవి – నదిపై యువతిని superimpose (ఆరోపితం) చేశాడు. ఇది చాలా చాలా అరుదైన, అద్భుతమైన ప్రక్రియ. ఈ విధమైన superimpose అన్న ’కళ’ సాహిత్యం ద్వారా మాత్రమే సాధింపగల ప్రక్రియ అని, ఇటువంటి ప్రయత్నాన్ని ’చిత్రం’ ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేస్తే విఫలం కావచ్చుననీ అంటారు శ్రీ నిడుదవోలు వేంకటరావు గారు.
2. “వేణి చలింపఁ…” పద్యానికి వావిళ్ళవారి వ్యాఖ్యానప్రతిలో ముందుమాట వ్రాస్తూ, శ్రీ నిడుదవోలు వెంకటరావు గారు ఈ మాట అంటారు. “కవి, చిత్రకారునికన్నా మిన్న యని రామరాజభూషణుడు మహాసమర్థతతో నిరూపించినాఁడు. ఈ పద్యమున శుక్తిమతీనది స్త్రీవలె సంభ్రమముతో వచ్చునట్టు నద్భుతభంగిని చెప్పినాఁడు. దీనిని రవివర్మ గంగావతరణముతో పోల్చిన చిత్రకారుడెట్ల కృతార్థుడు కాలేకపోయెనో తెలియవచ్చును.
పద్యమున శ్లేషచేత మనకు స్త్రీ మనోనేత్రములకు అగుపడుచున్నది. ప్రకృతిలో కన్నులకగుపడునది నదియే. రవివర్మ ఆకాశగంగ యవతరించుట చిత్రించఁబోయి గంగ వచ్చునట్లు కొన్ని గీతల మూలమునఁ దెలిపి, యా వెనుక వాని మధ్య నొక స్త్రీమూర్తిని లిఖించినాడు. దీనివలన ఆతని ఆశయము భగ్నమైనది…”
స్థూలంగా వారి తాత్పర్యమేమిటంటే, ఈ పద్యం చిత్తరువుకన్నా మరింత సమర్థమైనది. చిత్రంకన్నా సమర్థవంతంగా ఈ పద్యం నదిని యువతిగా మనోనేత్రం నుందు నిలుపుతోంది. వేంకటరావు గారు ప్రస్తావించిన రవి వర్మ చిత్రించిన ఆ గంగావతరణ చిత్రము యిదీ.
3. శ్రీ నిడుదవోలు వారి వ్యాఖ్యను అనుసరిస్తూ ఆలోచిస్తే, ఈ పద్యం ఒక చిత్తరువు కాదనీ, ఇదొక చలనచిత్రము (Multimedia) తరహా పద్యమని మనకు తెలియవస్తుంది. ఈ విధమైన చలనచిత్ర ప్రక్రియకు దోహదం చేస్తున్నవి ఈ పద్యంలోని క్రియాపదాలు. వీటిని కవి ఎంతో నేర్పుతో, తెనుగులో కూర్చాడు. “చలింపన్, నటింప, విన్నాణము సూప, మీఱన్, కడు సంభ్రమించినన్.” ఈ తెనుగు క్రియలన్నిటినీ ప్రకృతంలో జరుగుతున్నట్టుగా కల్పించడంతో ఈ పద్యం ఒక చలనచిత్రాన్ని రూపుకట్టిస్తోంది. ఇటువంటి ప్రక్రియలు సంస్కృతసాహిత్యంలో అరుదు. సంస్కృతంలో పదచిత్రాలే ఎక్కువ. తెనుగు సాహిత్యంలో ఇటువంటి ’చలన’చిత్రాల ఒరవడిని ఎత్తుకు తీసుకు వెళ్ళిన కవి, ఆంధ్రకవితాపితామహుడు అల్లసాని పెద్దన అని చెప్పుకోవాలి.
సంస్కృతంలో శ్లోకాన్ని ఒక వాక్యరూపంలో నిమంత్రించి, క్రియ (ధాతువు)తో ముగించటం సాంప్రదాయంగా వస్తోంది. బహుశా అందుకనే సంస్కృత సాహిత్యంలో పదచిత్రాలే ఎక్కువగా కనిపిస్తాయి. వసుచరిత్ర కావ్యాన్ని, అప్పయ్యదీక్షితపండితుని శిష్యుడైన కాళహస్తి కవి సంస్కృతంలో పరివర్తించినాడు. ఆ కావ్యంలో “వేణి చలింపఁ..” పద్యానికి సంస్కృతంలో అనువాదం యిది.
వేణీ చచాల బిసవద్భుజకంకణానాం
శ్రేణీ ననర్త విబభుశ్శఫరీకటాక్షాః
నాణీయసీ పరిరరాణ చ హంసకాలీ
శ్రేణీలసత్పులినసాచితమబ్జవక్త్రమ్ || (178)
చచాల = చలించెను.
ననర్త = నర్తించెను
విబభుః = ప్రకాశించెను
పరిరరాణ = రవములు సలిపెను.
ఇవన్నీ స్థిరమైన ధాతు రూపాలు. శ్లోకం ఆఖరు పాదంలో మాత్రం “లసత్” అన్న ధాతురూపం “సంభ్రమించినన్” అన్న అర్థంలో ముగుస్తోంది.
తెలుగులో “చలింపన్, నటింప..” ధాతురూపాలు సంస్కృతములో పరివర్తితమయ్యే సరికి సంస్కృతశ్లోకం పదచిత్రాల సముదాయంగా మారటం స్పష్టంగా పైని శ్లోకంలో గమనింపవచ్చు.
4. వేణి చలింపఁ – మన పద్యంలో శబ్ద గుణాల గురించి కూడా చెప్పుకోవాలి. పద్యాన్ని ఎడమచేతితో ఆడించేంత నైపుణ్యం గల ఒక గొప్ప కవి వ్రాసిన పద్యం యిది.అందుకనే గణయతి ప్రాసలు, తమంతట తాము అమరిపోయినట్టుగా అనాయాసంగా సమకూరటం పద్యంలో గమనించవచ్చు. అంతే కాదు, పద్యం చదువుకుంటూ వెళుతుంటే, అదే క్రమంలో అర్థమూ కుదురుతూ పోతోంది. ఇలా పద్యపు వరుసలో అర్థము సమకూరటాన్ని “రీతి” అని నిర్వచించినారు ఆలంకారికులు. “యథార్థక్రమ నిర్వహణం రీతిరిత్యభిదీయతే”. ఇటువంటి పద్యాలు వసుచరిత్రలో కొల్లలుగా కనిపిస్తాయి.
ఈ పద్యంలో – నాయిక శుక్తిమతి (నది) విభ్రమం కూడా అంతకంతకు పెరుగుతూ వెళ్ళటం స్పష్టంగా ప్రతీయమానం అవుతోంది.
మొదట ఆ యువతి
౧. వేణి (జడ) చలించింది
౨. అటుపై తామరతూడువంటి భుజాగ్రం నటించింది.
౩. పిమ్మట మీలవంటి క్రీగంటి చూపు ప్రకాశం దాల్చింది
౪. తదనంతరం కాలియందల రవములు మీఱినవి.
౫. ముఖం శోభించింది.
చలించి, నటించి, విన్నాణము చూపి, మీఱి, – చివరన ’కడు సంభ్రమించినది’. ఈ ఎత్తుగడ కవి వివక్షితమో, అవివక్షితమో తెలియదు కానీ, నిష్ణాతుడైన కావ్యకర్త యొక్క పద్యశిల్పంగా యిది తోస్తున్నది.
5. ఇందాక సంస్కృతకావ్యాలలో పదచిత్రాల గురించి చెప్పుకున్నాం. సంస్కృతంలో సాధారణంగా పదచిత్రాల సాంప్రదాయం ఎక్కువ. అయితే ’చలనచిత్ర’ రూపాలు కూడా సంస్కృతంలో అక్కడక్కడా లేకపోలేదు. అమరుశతకంలో ఈ క్రింది శ్లోకం చూడండి.
ఆలోలా మలకావళిం విలుళితాం భిభ్రచ్చలత్కుండలం
కిఞ్చిన్మృష్ట విశేషకం తనుతరైః స్వేదామ్భసాం జాలకైః |
తన్వ్యా యత్సురతాన్త తాన్తనయనం వక్త్రం రతివ్యత్యయే
తత్త్వాం పాతు చిరాయ కిం హరిహర బ్రహ్మాదిభి ర్దైవతైః ||
పురుషాయిత కేళిలో యే తన్వి యొక్క ముఖము పై ముంగురులు చలించి, చెదరిన వరుసను తాల్చి, చెవిపోగులు ఊగి ,సూక్ష్మములైన చెమటబొట్టులచేత నుదుటి బొట్టు కొంచెం చెరగి, కనులు అలసియుండుట గలదో, అట్టి సుందరముఖము నిన్ను రక్షించుగాక. హరిహరబ్రహ్మాది దేవులచేత ప్రయోజనమేమి?
భట్టుమూర్తి కవి – తన యొక్క నరసభూపాలీయ కావ్యారంభంలో, తనను తాను అమరేశ్వరుని యొక్క సమస్రముఖదృష్టి గలవాడని చెప్పుకొన్నాడు.
“బాణు వేగంబును, భవభూతి సుకుమార
తయు, మాఘు శైత్యంబు, దండిసమత,
…….
…..
యమరేశ్వరుని సహస్రముఖదృష్టి”
ఇక్కడా మూర్తి కవి శ్లేషనుపయోగించాడు. అమరేశ్వరుని సహస్రముఖదృష్టి ఇంద్రుని వేయికనులచూపు అని, అమరుకవి యొక్క బహుముఖీన ప్రజ్ఞ అని అర్థాలు. అమరుకవిని వసుచరిత్రకారుడు ప్రస్తావించాడు కాబట్టి, ఆయన శ్లోకం ద్వారా కొంత ప్రేరణ గొని ఉన్నాడని ఊహించటం అర్థరహితం కాబోదు. అయితే మన తెనుగు కవి యువతి యొక్క సంభ్రమాలను చిత్రిస్తూ, నదిపై యువతిని ఆరోపం చేశాడు. అచేతనమైన నదిని, పర్వతాన్ని నాయికానాయకులుగా తీర్చటం తెలుగులోభట్టుమూర్తి కవియే మొట్టమొదటగా చేశాడు.
6. నాయికానాయకులను స్త్రీ పురుషులుగా కల్పించుట – కాళిదాసు ప్రేరణ అని శ్రీ కొరిడె రాజన్నశాస్త్రి పండితులు ఓ వ్యాసంలో పేర్కొన్నారు.శ్రీ రాజన్న శాస్త్రి పండితుడు పేర్కొన్న కాళిదాసు శ్లోకం యిది.
వీచిక్షోభస్తనితవిహగశ్రేణికాఞ్చీగుణాయాః
సంసర్పన్య్తాః స్ఖలితసుభగం దర్శితావర్తనాభేః |
నిర్విన్య్ధాయాః పథి భవ రసాభ్యన్తరః సన్నిపత్య
స్త్రీణా మాద్యం ప్రణయ వచనం విభ్రమో హి ప్రియేషు || (మేఘదూతమ్ 1.29)
ఉజ్జయినికి తూర్పు దిశలో వెళ్ళుమని యక్షుడు మేఘునితో చెబుతూ, దారిలో నిర్వింధ్య నదిని చూచి, దానితో సంభోగించుమని చెపుతున్నాడు.
ఓ మేఘుడా! నిర్వింధ్య నది నిన్ను వలచిన నాయికగా నీకడకు వచ్చును. అలలచలనము చేత కదిలింపబడిన పక్షుల కూజితములే – ఆ నది (యువతి) మొలనూలి శబ్దములు. ఆ (నది) సుడిగుండములే నాభి. మేఘుడా! ఆమెతో కూడి నీవు ఆ రసములను గ్రహింపుము. ఆమె వలచుటకు మునుపే కూడుట యెట్లు అన్న సందేహము వలదు. ఎందుకంటే, స్త్రీలు తమ వివిధములైన విలాసములతో ప్రణయమును ప్రకటింతురు. కావును ఆమెకు ప్రియుడవు కమ్ము.
కాళిదాసమహాకవి అమోఘమైన శ్లోకం యిది. ఈ శ్లోకంలోని సంభోగశృంగారపు ఘాటును తెనుగు కవి తగ్గించుకొన్నాడు. వసుచరిత్ర – సన్నివేశపరంగా అనిష్టురాలైన నాయికపై, మోహపరవశుడైన నాయకుని ధాష్టీకం. అయినప్పటికీ, కవి అందులో ఔచిత్యాన్ని పద్యపు ఎత్తుగడ ద్వారా పరిహరించినాడు. కాళిదాసు మేఘదూత శ్లోకంలో సన్నివేశం ప్రణయబద్ధమైనా శ్లోకంలో ఘాటైన శబ్దాల తీరు వలన కొంత ’అరుచి’ కలిగించే అవకాశం ఉంది.
7. వస్తుపరంగా ఈ పద్యం కాళిదాసును అనుకరించినది అని రాజన్నశాస్త్రి గారన్నారు. వసుచరిత్రపై కూలంకషమైన వ్యాసం వ్రాసిన వజ్ఝల చినసీతారామశాస్త్రి గారు “వేణి చలింపఁ..” పద్యశైలి సంస్కృతకవి శ్రీహర్షుని శైలిని పోలినదని అభిప్రాయపడ్డారు. శాస్త్రి గారి వ్యాఖ్య యిది.
“నియతములగు యతిప్రాసములను మాత్రము నిలిపియు, నతిమనోహరమగు తూఁగు వెలయునట్లు పద్యముల నడిపించు నేర్పు రామరాజభూషణునకే గలదని చెప్పవచ్చును.
శ్లో. వాచం తదీయాం పరిపీయ మృద్వీం మృద్వీకయా తుల్యరసాం స హంసః|
తత్యాజ తోషం పరపుష్టఘోషే (ఘుష్టే) ఘృణాం చ వీణాక్వణితే వితేనే ||
యని యిట్లు నైషధకావ్యమున శ్రీహర్షుఁ డానుషంగికానుప్రాసములతోఁ దాండవమాడి యున్నాఁడు. అట్టి రీతులు శ్రీనాథుని యాంధ్రీకరణమున నంతగా నగపడవు. రామరాజభూషణునకుఁ గల శ్రీహర్షుని కవితామార్గముల ననుసరించుటయందలి యభిరుచి యీ విషయమునను జూపఁబడినదని తోఁచుచున్నది.
ఇట్లె యర్థాంతరస్ఫోరకముగఁ గవిత్వము చెప్పు నభిరుచియు శ్రీహర్ష మార్గానుసరణ లోలుపత్వమును వెల్లడి సేయుచున్నది.”
శాస్త్రి గారు ఉటంకించిన “వాచం తదీయాం..” శ్లోకార్థం యిది.
“ఆ హంస ద్రాక్షతో సమానమైన రుచి గల దమయంతీదేవి పలుకులను మిక్కిలి శ్రద్ధతో నాలకించి, కోకిలకూజితము పై సంతోషమును త్యజించినది. వీణానాదమందు విరక్తి పొందినది. అనగా ఆ దమయంతి పలుకులు ద్రాక్షరసము కన్నా, కోకిల కూజితములకన్నా, వీణానాదముకన్నా మధురముగానున్నవని యర్థము” – (నైషధీయచరితమ్ – 3.60)
వజ్ఝల వారు శ్రీహర్షుని పోలిక చెప్పినా, రాజన్నశాస్త్రి గారు కాళిదాసును అనుకరించినట్లు చెప్పినా, ప్రస్తుత వ్యాసకర్తకు (నాకు) అమరుకుని శ్లోకం స్ఫురణకు వచ్చినా, ఇవన్నీ భట్టుమూర్తి పద్యానికి గల విభిన్న పార్శ్వాలను సూచిస్తాయనటం న్యాయం.
ఏతావతా, రామరాజభూషణకవి మార్గం స్వతంత్రమైనది, సంస్కృతకవిత్వరీతులకు ధీటైనదని ఒప్పుకోక తప్పదు.
***
అట్లు సంభ్రమించిన ఆ నదిపై పర్వతానికి గల అతిశయగుణంతో కోలాహలుడు కోపముతో ముఖము జేవురింపగా ఆమెను బలవంతంగా పరిగ్రహించాడు. అది రసాభాసమని వ్యాఖ్యాతలు పేర్కొన్నారు.
ఈ వసుచరిత్ర కావ్యం – ప్రబంధకాలంలో పుట్టినది. ప్రబంధకవులకు కథ చెప్పటం కన్నా, వర్ణనలమీద, వ్యాకరణ, జ్యోతిష్య, సంగీత, నాట్యాది శాస్త్ర విషయాలపైన,భాషపైన, అలంకారాలపైన, ఆలంకారిక పద్ధతులపైన గురి. ఈ కాలంలో కథకన్నా, పద్యం రాణకెక్కింది. అందుచేత ఆ దృష్టిలో చదువుకుంటేనే ఉత్తమం.
ఇరవై ఒకటవ శతాబ్దంలో అల్పమైన వ్యుత్పత్తి కలిగి, మూడు నాలుగు వ్యాసాలు చదివిన ఒక సాధారణ పాఠకుడికే విషయాలు తెలిస్తే, నాటియుగంలో సంగీతసాహిత్యాలను మథించిన ఎందరు రసికులను ఈ కావ్యం ఉర్రూతలూగించిందో!
“మూర్తికవీ, ధన్యుఁడవీ వన్నిటన్.”
**** (*) ****
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్