వ్యాసాలు

ప్రబంధవిపంచిస్వరలహరి

ఆగస్ట్ 2016

సందర్భం, నాంది:

ధ్యాహ్నం. ఎండ ఉద్ధృతంగా లేదు కానీ, చురుక్కుమనే అంటూంది.  అయితే వాతావరణం ఆహ్లాదకరంగానే ఉంది. కొండ దిగి లోయకువస్తే కనుచూపుమేరా ఆకుపచ్చని తివాచీ పరుచుకున్నట్టు రాజనాల వరిపైర్లు. కయ్యల గట్లకు పక్కనే చిన్న చిన్న పంటకాలువలు ప్రవహిస్తున్నాయి. కాలువలలోంచి అక్కడక్కడా ఉబికి వచ్చిన ఎర్రటి కలువపూలు. అవి తమ పక్కన – కాస్త వంగిన వరిపైరుతో ఊసులాడుతున్నై. చల్లని గాలితో బాటూ ఆ కలువల పరిమళం నింపాదిగా వీస్తోంది.

తొందరగా ఈ ప్రదేశం నుంచి బయటపడాలి. అతని ఊరికి వెళ్ళాలి. కానీ అతడు ఊరికి వెళ్ళలేడు. ఆ త్రోవ కూడా తెలియదతనికి. జనావాసం కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చి చేరేడు. ఈ పచ్చని పైర్లకు కాస్త దూరంగా – ఏంటది? ఏదో మామిడితోపులా కనిపిస్తోంది. కాస్త దగ్గరగా వెళితే – అవును. మామిడితోపు. చుట్టూ అల్లిబిల్లిగా గోరంట తీగలు అల్లుకున్నాయి. ఓ చిన్నపాటి అడవిలా ఉంది. అడవి మధ్యలో ఏదో నల్లరాతి-కట్టడం. ఆ నల్లరాతి కంబాలతో కట్టిన కట్టడం చుట్టూ ద్రాక్షతీగలు అల్లుకొని ఉన్నాయి. ద్రాక్షలు గుత్తులు గుత్తులుగా ఆ మంటపాల చివర్లపైనుంచి వ్రేలాడుతున్నాయి. జాగ్రత్తగా చూస్తే ఆ కంబాలకు మధ్య అక్కడక్కడా గరుడపచ్చలు తాపించారన్నట్టు కనుక్కోవచ్చు. ఈ అడవి మధ్యలో భవంతి. అందులో పచ్చలు తాపిన కంబాలతో ఇల్లూ…ఇది మునివాటికా? ఉహూ.. కాదు. మునివాటిక ఇంత ఆడంబరంగా ఉండదు. ఎవరి నివాసమో అక్కడికే వెళ్ళి కనుక్కుంటే?

ఆ నవయువకుడు – ఆ కట్టడాన్ని చూసిన అబ్బురపాటుతోనూ, కాస్త అనుమానంతోనూ మరింత దగ్గరగా వెళ్ళేడు.

అప్పుడు తాకిందొక ఘాటైన పరిమళం. ఇందాకటి కలువపూలపరిమళాన్ని మరుగుపరుస్తూంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే – చిటికెడు కస్తూరి, దానికి రెట్టింపు కర్పూరము దట్టించి, సున్నమూ, వక్కా కలిపి వేసుకున్న తమలపాకు తాలూకు పరిమళం అది. ఎవ్వరో నిండు జవ్వని చిరునామాను చెబుతున్నట్టుగా ఉంది. ఇక్కడ ఎవ్వరో నివాసమున్నట్టు తెలిసిపోతూంది. అతడు మరింత దగ్గరగా అక్కడకు వెళ్ళేడు.

అంతే! అతని కళ్ళముందు ఓ మెరుపుతీగ కదులాడింది. ఆ మెరుపు తీగ కళ్ళు తామరపూవుల్లా ఉన్నాయి. కురులు తుమ్మెదల రెక్కలు. ముఖం పౌర్ణమి చంద్రబింబం….అంత అద్భుత సౌందర్యరాశిని అతడు చూసి ఉండలేదు. పైకి చెప్పలేదు కానీ మనసులో అనుకొని ఉంటాడు – “నా భార్య సోమిదమ్మ కూడా ఇంత సౌందర్యరాశి కాదే!”.

ప్రస్తావన:

పైని కథనం – అల్లసాని పెద్దనామాత్యుని మనుచరిత్రలో ప్రవరాఖ్యోపాఖ్యానమని ఈ పాటికి విజ్ఞులైన చదువరులు గ్రహించి ఉంటారు. మనోహరమైన కవిత్వాన్ని వచనంలోకి పరివర్తించే ప్రయత్నం అది. ఓ సిద్ధుడిచ్చిన ఆకు పసరుతో హిమాలయాలకు వెళ్ళిన ప్రవరుడనే బ్రాహ్మడు ఆ పసరు కరిగిపోతే ఇంటికెలా వెళ్ళాలో తెలియక ఆ పర్వతసానువులలో ఓ అమ్మాయి వద్దకు వచ్చి పడ్దాడు.

సాధారణంగా ఓ వచనరచనకు వాక్యనిర్మాణంలో ఔచిత్యం కావాలి. అంటే వాక్యనిర్మాణాన్ని కూర్చుని కుదురుగా దిద్దాలి. ఒక్కొక్క వాక్యాన్ని సానబట్టాలి. ఈ క్రమంలో ఆవేశం పనికిరాదు. అక్షరాల వెంబడి పాఠకుని కళ్ళను పరుగులెత్తించాలి. కథ ఆ అక్షరాలలో కరిగిపోవాలి.

అదే పద్యమైతే – పద్యానికి ఔచిత్యం కావాలి కానీ, అది రసాభివ్యక్తికి పక్కవాయిద్యంగా అమరాలి. దీన్ని భావౌచిత్యం అనడం సబబు. దీనిని క్షేమేంద్రుడు అనే ఆలంకారికుడు విచారించిన ప్రబంధగత, గుణౌచిత్యాల సంగమం అనుకోవచ్చు. పద్యం నడతకు ఔచిత్యం కన్నా, రసావేశం ఎక్కువ మెరుగును చేకూరుస్తుంది. కవిత్వాన్ని మెరుపుతీగలా చేస్తుంది. వచన రచన అక్షరాలవెంబడి పరుగులెత్తిస్తే, పద్యరచన (తాలూకు భావావేశం) – సహృదయుడైన పాఠకుని (రస)చర్వణను బట్టి ఆస్వాద్యం అవుతూ వెళుతుంది.

పైని ఘట్టంలో, పర్వతసానువులలో త్రోవ తప్పిన ప్రవరుడికి వరూధిని అనే అప్సరస ఎదురైనప్పుడు ఆమె చర్యలను, మానసిక అవస్థను పెద్దన అపూర్వమైన భావావేశంతో వర్ణించాడు. అందులో ఆరంభశ్లోకం యిది.

సీ||

తతనితంబాభోగ ధవళాంశుకము లోని | యంగదట్టపుఁ గావి రంగు వలన

శశికాంతమణిపీఠి జాజువారఁగఁ, గాయ | లుత్తుంగకుచపాళి నత్తమిల్లఁ,

దరుణాంగుళీధూత తంత్రీస్వనంబుతో | జిలిబిలిపాట ముద్దులు నటింప,

నాలాపగతిఁ జొక్కి యరమోడ్పుఁ గనుదోయి | రతిపారవశ్యవిభ్రమముఁ దెలుపఁ,

గీ||

బ్రౌఢిఁ బలికించు గీతప్రబంధములకుఁ

గమ్రకరపంకరుహరత్నకటకఝణఝ

ణధ్వనిస్ఫూర్తి తాళమానములు గొలుప,

నింపు దళుకొత్త వీణ వాయింపుచుండి.

(స్వారోచిష మనుసంభవము – 2.27)

తత                                           = విశాలమైన

నితంబ ఆభోగ                             = జఘనపు పరిపూర్ణత గలిగిన

ధవళాంశుకములోని                     = తెల్లని చీరయందున్న

అంగదట్టపున్                              = పావడ యొక్క

కావిరంగు వలన                          = కెంపు రంగు (ప్రసారము) వలన

శశికాంత మణి పీఠి                      = చంద్రకాంతమణులు పొదిగిన అరుగు

జాజువారగన్                              = ఎరుపు రంగును సంతరించుకొనగా

కాయలు                                     = వీణ సొరకాయలు

ఉత్తుంగ కుచపాళిన్                       = ఉన్నతమైన స్తనభాగాలను

అత్తమిల్లన్                                  = ఒత్తుకొనగా

తరుణాంగుళీ                               = జవ్వని వ్రేళ్ళతో

ధూత                                         = కదిలించబడిన

తంత్రీస్వనంబుతోన్                       = తీగెల యొక్క నాదముతో

జిలిబిలి పాట                               = ముద్దులొలికే గానము

ముద్దులు నటింపన్                       = సొబగును కలిగింపగా

ఆలాపగతిన్                                = గానము నాలపించు రీతిచేత

చొక్కి                                         = పరవశించి

అరమోడ్పుఁగనుదోయి                  = సగము మూతబడిన కనులు

రతిపారవశ్యవిభ్రమమున్               = సురతమునందలి మైమరపాటును

తెలుపన్                                     = ఎఱిగింపగా

ప్రౌఢిన్                                       = నేర్పును

పలికించు                                   = వీణపై పలికించెడు

గీతప్రబంధములకున్                    = సంగీతరచనలకు

కమ్రకరపంకరుహ                       = మనోహరమైన హస్తపద్మముల తాలూకు

రత్న కటక                                  = రత్నములు పూన్చిన కడియముల యొక్క

ఝణఝణధ్వనిస్ఫూర్తి                   = ఝణఝణ మనే రవళి

తాళమానములు గొలుపన్              = తాళముల నియమములుగా నమరగా

ఇంపు                                        = హొయలు

తళుకొత్తన్                                  = మీరుచుండగా

వీణ వాయింపుచుండి.

తాత్పర్యం: వరూధిని అనే ఓ అప్సర స్త్రీ మణులు పొదిగిన చలువరాతి అరుగుమీద కూర్చుని వీణ వాయిస్తోంది. ఆ అమ్మాయి కావిరంగు పావడాపై తెల్లని చీర ధరించింది. ఆమె పావడా కెంజాయ రంగు కాంతులు తెల్లని చీరద్వారా చంద్రకాంతమణులు పొదిగిన అరుగుపైన ప్రసరిస్తున్నవి. వీణ సొరకాయలు ఆమె ఉన్నతమైన పయ్యెదను ఒత్తుకుంటున్నాయి. ఆ చిన్నది తన అందమైన వ్రేళ్ళతో వీణె తీగెను మీటుతూ, ఏదో జిలిబిలి పాటను ముద్దుగా పాడుకుంటోంది. ఆ తరుణి అరమూసిన కనులు రతి పారవశ్యముపు మైమరపాటును తెలుపుతున్నాయి. ఆ సుందరి తన చేతులతో వీణె తీగలు మీటినప్పుడు – చేతులకు ధరించిన రత్నాలకడియాల తాలూకు ’ఝణఝణ’ మనే నాదం ఆమె గానానికి తాళంగా అమరుతోంది. ఇన్ని హొయలతో ఆ చక్కనిది వీణ వాయిస్తోంది.

ఈ తాత్పర్యాన్ని చదివిన తర్వాత ఓ మారు సీసపద్యం మళ్ళీ చదువుకోవాలి. పెద్దపెద్ద బండరాల మధ్య ఒరుసుకుని ప్రవహించే తుంగభద్రానదీప్రవాహం లాంటి ఒరవడి కనిపిస్తుంది. చంద్రకాంతమణిపీఠిక – ఎఱుపు రంగు సంతరించుకోవడం, అరమోడ్పు కనుదోయి రతిపారవశ్య విభ్రమాన్ని తెలుపడం – ఇత్యాదులతో ఇది నిదర్శనాలంకారం.

ఈ సీసపద్యం తాలూకు విశేషాలను పద్యనిర్మాణ దృష్టితోనూ, ఇతరత్రా విశేషాల నేపథ్యాలతోనూ విహంగవీక్షణ చేయడం ఈ వ్యాసలక్ష్యం.

***

సీసపద్యము:

సీసపద్యము – దేశీ ఛందస్సు. వస్తువును సావకాశంగా వర్ణించడానికి, సంస్కృతంలో ప్రౌఢరచనలను తెనుగులోనికి అనువదించడానికి, ప్రతిపాదంలోనూ దృష్టాంతాలను సంతరించడానికి, గేయంలా పాడుకోవటానికి, సంగీతపు రాగాలను సాహిత్యంలో నిమంత్రించడానికి, మహాసన్నివేశనిర్వహణకు, కథాగమనాన్ని నిర్మించడానికి,  గర్భ, బంధకవిత్వాది ఇతరత్రా మరెన్నో ప్రయోగాలకు అనువైన ఛందోలక్షణాలను అందంగా నిలుపుకున్నది సీసం. తెలుగు కవుల ప్రతిభావిలాసాలకు నిలువెత్తు నిదర్శనం. నన్నయ్య చేత నగిషీలు దిద్దుకుని. నాచన సోముని నవీన గుణాలను సంతరించుకుని, తిక్కన అర్థస్ఫూర్తికి నిదర్శనమై, శ్రీనాథుడి చేత సిరులద్దుకుని, పోతన చేతులలో పోతపోసుకుని, రామరాజ భూషణకవి సంగీతనాదానికి భూషణమై సీసం శిఖరాగ్రాన్ని పొందింది. నేడు లభిస్తున్న ఆధారాలను బట్టి – తెలుగులో మొట్టమొదటి సీసపద్యాన్ని ఒక శిథిలశాసనంలో లిఖించారు. ఇది 9 వ శతాబ్దపు శాసనం.

సీ||

శ్రీనిరవద్యుండు చిత్తజాతసముండు | శివపదవరరాజ్యసేవితుండ

ఖిలుడు ననృతరిపుబలుడు నాహవరావ | దండమోద్య సిఘాసనుండగణిత

దానమాన్యుండు దయానిలయుండును | భండన నండన పండరంగు

……………………….కొలదిలేని | కొట్టము ల్వోడిచి గుణకనెల్ల

ఆ||

తాని పక్షపాతి……………

………………………..

………………………..

………..విభవగౌరవేంద్ర.

ఆ సీసపద్యం వచనంలా ఉంది. పాదానికి పాదానికి మధ్య విరుపు లేదు. దీనిని ’గునుగు సీసం’ అంటారు. దేశీకవిత మొదటి రోజులతీరు యిది. ఏ పాదానికి ఆ పాదం ప్రత్యేకంగా ఉండడం అంటే ప్రతిపాదాంతవిరామం – సంస్కృతకవిత లక్షణం. నన్నయ, మారన్న ఇత్యాది కవులు సంతరించిన సీసపద్యాలలో రెండు ధోరణులూ కనిపిస్తాయి. అయితే పూర్తిగా ఒక్కొక్క పాదం దేనికదే స్వతంత్రంగా ఉండటమే లక్షణంగా మారటం – బహుశా శ్రీనాథుని కాలంలో జరిగిన పెద్ద మార్పు. శ్రీనాథ కవిసార్వభౌముని “శృంగారనైషధం” (శ్రీహర్షుని నైషధీయచరితానికి తెనుగు సేత) లో 108 సీస పద్యాలు ఉన్నాయి. అందులో కేవలం ఒకే ఒక్క (గునుగు) సీసపద్యంలో మాత్రం రెండుపాదాలు కలిపికట్టుగా సాగడం కనిపిస్తుంది. (అవధారుదేవి! దివ్యకిరీటకోటి..3-120)  మిగిలిన అన్ని పద్యాలున్నూ పాదాంతవిరామచిహ్నాలతో కూడినవే. ఇలాంటివి హరవిలాసంలో ఒకటి (2-15), కాశీఖండంలో రెండు మాత్రమే కనిపిస్తాయి. అనువాద సౌలభ్యం కోసం, భావాన్ని మరింత చిక్కగా, అందంగా, మూలకావ్యానికి యథారూపాన నిలిపేందుకు కవిసార్వభౌముడు మార్గ పద్దతి అనుసరించి ఉంటాడనిపిస్తుంది. అలా శ్రీనాథుని తర్వాత దేశీఛందస్సు, పూర్తిగా మార్గఛందో లక్షణాన్ని సంతరించుకుంది. ఈ పరిణామానికే కాబోలు ఆధునికులు కొందరు శ్రీనాథుని విమర్శించారు. లక్షణం మార్పు చెందినా, శ్రీనాథుడు సీసపద్యానికి కొత్త ఒరవడి కల్పించాడు. శ్రీనాథుని సీసపద్యాల పాదాల మధ్య విరుపు – ఎవరో అప్సరస పారిజాతాన్ని తుంచినట్టు అలవోకగా ఉంటుంది. లలితమైన భావాలతో, అచ్చెరువు గొలిపే పదబంధాలతో కవిసార్వభౌముడు సీసపద్యాన్ని నవనవోన్మేషంగా తీర్చాడు. అయితే శ్రీనాథుని అనుసరించిన తదనంతర కాలపు కవులలో కొందరు పాదాంత విరామాన్ని సరిగ్గా ఉపయోగించలేదు.

నాటినుండి తెలుగులో ఎందరో కవుల, వేలాదిగా గల అందమైన సీసపద్యపు రాశులు పోగయ్యాయి. ఈ మహారాశిలో ఏ రత్నం మీకు ఇష్టమైనది? అని ఓ మారు అంతర్జాలంలో చర్చ వచ్చింది. దాదాపు పదేళ్ళ నాటి మాట యిది. చాలా చిక్కుప్రశ్న. తెలుగులో ఒక్క శ్రీనాథుడే 811 సీసపద్యాలను రచించాడట. ఇక ఊహించవచ్చు. అన్ని రత్నాలలో ఏ రత్నాన్ని ఎన్నుకున్నా, మరెన్నో రత్నాలకు అన్యాయం చేయవలసి వస్తుంది. అయినప్పటికీ మాన్యులు, రసికులూ మంచి మంచి పద్యాలను ఏరారు. ఆ చర్చను సావకాశంగా ఈ లంకెలో చదువుకోవచ్చు కానీ ప్రస్తుతానికి వస్తే -

కొన్నిసీసపద్యాలు:

సీస పద్యానికి ఛందో నియమాలు ఉన్నా, సాధారణంగా సీసపద్యపు నడతను గమనించడానికి కొన్ని పద్యాలను చూద్దాం.

పోతన ప్రహ్లాదచరిత్రలోని అపురూపమైన సీసపద్యం.

సీ||

మందార మకరంద మాధుర్యమునఁ దేలు | మధుపంబు వోవునే మదనములకు

నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు | రాయంచ సనునె తరంగిణులకు

లలిత రసాల పల్లవ ఖాది యై చొక్కు | కోయిల సేరునె కుటజములకు

పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక | మరుగునే సాంద్ర నీహారములకు

గీ||

అంబుజోదర దివ్య పాదారవింద

చింతనామృత పాన విశేష మత్త

చిత్త మేరీతి నితరంబు చేర నేర్చు

వినుత గుణశీల! మాటలు వేయు నేల.

 

శ్రీనాథుని ప్రసిద్ధ చాటువు

 

సీ ||

చక్కని నీ ముఖ చంద్ర బింబమునకుఁ | గల్యాణ మస్తు ! బంగారు బొమ్మ!

నిద్దంపు నీ చెక్కు టద్దంపు రేకకు | నైశ్వర్య మస్తు! నిద్దంపు దీవి!

మీటినఁ బగులు నీ మెఱుఁగు బాలిండ్లకు | సౌభాగ్యమస్తు! భద్రేభ యాన!

వలపులు గులుకు నీ వాలుగన్నులకు న | త్యధిక భోగోస్తు! పద్మాయతాక్షి!

గీ ||

మధురిమము లొల్కు నీ ముద్దు మాటలకును

వైభవోన్నతిరస్తు! లావణ్య సీమ !

వన్నె చిన్నెలు గల్గు నీ మన్న నలకు

శాశ్వత స్థితి రస్తు! యోషాలలామ!

 

తెనాలి రాముని ఉద్భటారాధ్యచరిత్రలోని సీసపద్యం ఇది.

సీ||

తరుణ శశాంక శేఖర మరాళమునకు | సార గంభీర కాసారమగుచు

కైలాసగిరి నాథ కలకంఠ భర్తకు | కొమరారు లేమావి కొమ్మయగుచు

సురలోక వాహినీ ధర షట్పదమునకు | ప్రాతరుద్బుద్ధ కంజాతమగుచు

రాజ రాజ ప్రియ రాజకీరమునకు | మానిత పంజరస్థానమగుచు

గీ||

ఉరగ వల్లభ హార మయూరమునకు

చెన్ను వీడిన భూధర శిఖరమగుచు

లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి

అద్రినందన బొల్చె విహారవేళ.

 

తిక్కన విరాటపర్వంలోని ప్రసిద్ధసీసం.

 

సీ ||

కాంచనమయ వేదికా కనత్కేతనో | జ్జ్వల విభ్రమమువాఁడు కలశజుండు;

సింహ లాంగూల భూషిత నభోభాగ కే | తు ప్రేంఖణమువాఁడు ద్రోణసుతుఁడు;

కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట | ధ్వజ సముల్లాసంబువాఁడు కృపుఁడు;

లలితకంబుప్రభాకలిత పతాకా వి | హారంబువాఁడు రాధాత్మజుండు;

తే ||

మణిమయోరగ రుచిజాల మహితమైన

పడగవాఁడు కురుక్షితిపతి; మహోగ్ర

శిఖరఘన తాళతరువగు సిడమువాఁడు

సురనదీసూనుఁ; డేర్పడఁ జూచికొనుము.

పై సీసపద్యాలన్నిటిలో ఏ పాదానికి ఆ పాదం ప్రత్యేకంగా ఉన్నది. సాధారణంగా పాదంలోని పూర్వార్థం లక్షణాన్ని, ఉత్తరార్థం లక్ష్యాన్ని సూచిస్తూంది. (ఇది సీసపద్యపు బలమైన లక్షణం కాదు), లేదా పాదపు పూర్వ,పర అర్ధభాగాలు యత్తదర్థకంగా ఉన్నాయి. సీసపద్యపు పాదాంతాలు ప్రథమా/సంబోధన ప్రథమా విభక్తితోనో, ఇతర విభక్తి ప్రత్యయాల తోనో అంతమవుతున్నాయి. ఇటువంటివి సీసపద్యపు అతి-సాధారణ రీతులు. ఒక్క తిక్కన సీసపద్యంలో మాత్రం అర్ధపాదంలో శబ్దం విరుగుతున్నది. (ఉదా: కే| తు ప్రేంఖణము, వి | హారంబు వాడు)

తుంగభద్రప్రవాహం:

పై లక్షణాలు లేని తెలుగు సీసపద్యాలు ఎన్నో ఉండవచ్చు. అయితే సాధారణంగా ఆంధ్ర కవులు సంతరించే సీసపద్యాలలో ఎక్కువభాగం పైని చెప్పిన పద్ధతులలోనే తీర్చబడి ఉన్నాయి. పైన ప్రస్తావించిన లంకెలో యువకవులు పేర్కొన్న సీసపద్యాలలోనూ ఇవే లక్షణాలు గమనించవచ్చు.

ఈ నేపథ్యంతో ఇదివరకటి అల్లసాని పెద్దన పద్యానికి వస్తే – ఇందులో ఏ పాదానికి ఆ పాదం ప్రత్యేకార్థాన్ని నింపుకొని లేదు. వరూధిని వర్ణనలో నాలుగు అంశాలూ, ఆపైన ఎత్తుగీతి ఉన్నాయి. మొదటి భాగం అయిన

1. తతనితంబాభోగ ధవళాంశుకము లోని | యంగదట్టపుఁ గావి రంగు వలన

శశికాంతమణిపీఠి జాజువారఁగన్.

యొక్క భావం – ఒక్క పాదంలో ఇమిడిపోక, రెండవ పాదానికి చొచ్చుకు వచ్చింది.

 

2. కాయ | లుత్తుంగకుచపాళి నత్తమిల్లఁ

 

ఈ వర్ణన – పద్యనిర్మాణపరంగా కాస్త చిన్నదై పోయింది.

 

3. దరుణాంగుళీధూత తంత్రీస్వనంబుతో | జిలిబిలిపాట ముద్దులు నటింప,

4. నాలాపగతిఁ జొక్కి యరమోడ్పుఁ గనుదోయి | రతిపారవశ్యవిభ్రమముఁ దెలుపన్,

పైని రెండు పాదాలు కుదురుగా ఉన్నాయి.

తిరిగి ఎత్తు గీతిలో మొదటి పాదం “బ్రౌఢిఁ బలికించు గీతప్రబంధములకుఁ” – కుదురుగా ఉండి, ఆపై

5.

కమ్రకరపంకరుహరత్నకటకఝణఝ

ణధ్వనిస్ఫూర్తి తాళమానములు గొలుప

 

ఇక్కడ – ఉత్తరపాదంలోనికి వర్ణన వ్యాపించింది. తిరిగి “ఇంపు తళుకొత్తు” చివరి పాదంతో ముచ్చటగా ముగుస్తున్నది.

ఇలా ఈ సీసపద్యం పోతనాదుల సీసపద్యపు నడకతో పోలిస్తే విభిన్నంగా తోస్తుంది. ఈ విధమైన పద్యపు అస్తవ్యస్తపు గతిని ఆధునికులు, శ్రీనాథాదుల మార్గకవిత్వ లక్షణాలతో పోల్చి, అంగీకరించకపోవడం ఉన్నది. ఇది విలక్షణం కాదు కానీ, విభిన్నం. ఎత్తైన కఠిన శిలలూ, బండరాలను ఒరుసుకుంటూ చక్రతీర్థం వద్ద నిండుగా ప్రవహిస్తూ, ఋష్యమూక పర్వతాన్ని దాటి సన్నటి పాయగా మారి నెమ్మదై, మలుపు తిరిగి రమణీయమై, ఆపై అల్లనల్లన కదులుతూ పలుహొయలు పోతున్న తుంగభద్ర నదీప్రవాహం లాంటి జీవంతమైన పద్యశిల్పం యిది. (పోలిక కోసం ఈ క్రింది ఛాయాచిత్రాలను గమనించండి.)

కాలువలకు తప్ప నదీప్రవాహానికి కట్టడి ఉండదు. నదీ మార్గం – నది ప్రవాహస్వభావంతో, నేల యొక్క ఎత్తుపల్లాలతో స్వతః సిద్ధంగా ఏర్పడవలసిందే. రసప్రవిష్టమైన కవిత్వ మార్గం కూడా అంతే – వస్తువు యొక్క స్వస్వభావంతో, వశ్యవాక్కు అయిన కవి మనోవిశిఖల నుండి అప్రయత్నంగా వెలువడి తనంతట తనే ఒక రూపును సంతరించుకుంటుంది.

ఈ ఒరవడి, అస్తవ్యస్తపు నడక – పద్యంలో వస్తువైన అప్సరస భోగపరాయణత్వాన్ని, ఆమె చంచలమైన మనస్సు స్థితినీ, అద్భుతమైన రీతిలో ఉద్యోతిస్తున్నది. ఇక్కడ మరొకపార్శ్వం గమనించదగినది. పద్యం ఒరవడి – వాగు పారే తీరులా, ఉద్ధృతంగా ఉంది. కానీ అందుకు ఉపకరించిన శబ్దసంచయం సీసపద్యపు పాద ప్రథమార్థాలు, మిగిలిన చోటల్లా, ఎక్కువభాగం – మాధుర్యభరితంగా, సంయోగాక్షరాలు లేకుండా, నిర్మల సలిలవాహినిలా ఎంత తీయందనాలు చిందుతున్నాయో ఈ క్రింది పదబంధాలలో చూడండి.

తతనితంబాభోగ ధవళాంశుకము లోని…

శశికాంతమణిపీఠి జాజువారఁగఁ గాయ…

దరుణాంగుళీధూత తంత్రీస్వనంబుతో జిలిబిలిపాట…

నాలాపగతిఁ జొక్కి ….

బ్రౌఢిఁ బలికించు గీతప్రబంధములకుఁ…

ప్రవరుని కంటికెదురైన అప్సర స్త్రీ వరూధినిని ఇంత భావావేశంతో వర్ణించిన పెద్దన అదే ఘట్టంలో తొమ్మిది పద్యాల తర్వాత తిరిగి వరూధిని కళ్ళతో ప్రవరుని చూచి వర్ణించిన తీరు యిదీ.

 

ప్రవరుని వర్ణన.

సీ||

వదన ప్రభూత లావణ్యాంబు సంభూత | కమలంబులన వీని కన్నులమరు

నిక్కి వీనులతోడ నెక్కసెక్కములాడు | కరణి నున్నవి వీని ఘనభుజములు

సంకల్పసంభవాస్థానపీఠికవోలె | వెడదయై కనుపట్టు వీనియురము

ప్రతిఘటించు చివుళ్ళపై నెఱ్ఱవాఱిన | రీతి నున్నవి వీని మృదుపదములు

తే||

నెరటేటి యసల్ తెచ్చి నీరజాప్తు

సానఁబట్టిన రాపొడి చల్లి మెదిపి

పదను సుధనిడి చేసెనో పద్మభవుఁడు

వీని గాకున్నఁ గలదె ఈ మేనికాంతి.

(స్వా.మ -2.36)

తాత్పర్యం: ఈ సుందరుని కనులు, ముఖకాంతి అన్ని నీట జన్మించిన పద్మముల లాగా ఉన్నాయి. వీని ఎత్తైన భుజములు – పైకి నిక్కి కళ్ళతో ఎకసెక్కములాడుతున్నట్టు ఉన్నాయి. వీని వక్షస్థలం విశాలమై, మన్మథుని ఆస్థాన పీఠికలా ఉంది. వీని అరిపాదాలు, చివురుటాకుల ఎర్రదనాన్ని ధిక్కరిస్తున్నాయి. జంబూనది ఒడ్డున ఉన్న ఒండ్రుమట్టి (జంబూ నది ఒక పౌరాణిక నది. జంబూద్వీపంలో ప్రవహిస్తుంది. జంబూనది ఒడ్డున ఒండ్రుమట్టి బంగారమని పురాణకథనం) ని తెచ్చి, సూర్యచక్రాన్ని సానబట్టి, రాలిన పొడిని ఆ బంగరు రంగు ఒండ్రుమట్టిలో చల్లి మెదిపి బ్రహ్మ ఈతని శరీరాన్ని పోతపోసి తయారు చేసినట్టుగా ఈతని మేనికాంతి. (సూర్యుని వేడిమి తగ్గించడానికి త్వష్టప్రజాపతి ఆ సూర్యబింబపు చివర్లను వజ్రాయుధంతో అరగదీశాడని పురాణ కథ)

ఈ సీసం ఇందాక చెప్పిన తిక్కన, పోతన సీస పద్యాల లక్షణాన్ని పోలి ఉంది.  ప్రవరుని కన్నులు, ఘనభుజములు, ఉరము, పదములు వేటికవి ఒక్కొక్క పాదానికి నిమంత్రించి కుదురుగా తీర్చిదిద్దినాడు కవి. ఒక స్త్రీ సౌందర్యాన్ని, మానసికావస్థను, ఆమె చేస్తున్న వీణావాదనా క్రియను చిత్రించేప్పుడు పద్యాన్ని ఒకరకంగా, యువకుని రూపాన్ని వర్ణించినప్పుడు తద్భిన్నంగా వర్ణించటం బహుశా పెద్దన – అపురూపమైన, విచిత్రమైన పద్యశిల్పం. ఇది విచిత్రమైన విషయం కూడా. ఎందుకంటే ప్రకృతిలో స్త్రీ సౌందర్యం – సౌష్ఠవమూ,లలితమూ, సుకుమారమూ. పురుష సౌందర్యం – కఠినమూ, ధీరగంభీరమూ. అయితే పెద్దన కవితలో ఇవి తారుమారు! ఆ తారుమారును కనిపించనివ్వక పద్యాన్ని నడపడం పెద్దన ప్రతిభ!

 

అల్లసాని పెద్దన స్వారోచిషమనుసంభవం – మార్కండేయపురాణంలోని ఉపకథ. పెద్దనకంటే ముందు మారన మార్కండేయపురాణాన్ని తెనుగు చేశాడు. ఆయన కావ్యంలోనూ వరూధినిప్రవరాఖ్యోపాఖ్యానం ఉంది. మారన్న వరూధిని – ’లలితాంగజితకాంచనప్రభ’ – అంటే పసిడివెలుగులను ధిక్కరించే నెర మేని సోయగములు గలది. పెద్దన వరూధిని ’విద్యుల్లతవిగ్రహ’ (మెరుపు వంటి మేను గలది). పైగా పాలనురగ వంటి చీరెను కట్టుకుంది. ఈవిడ మెరుపుకు ’కాంట్రాస్టు’ గా పెద్దన గారి ప్రవరుడు బంగరుకాంతితో ఒండ్రుమట్టిని, సూర్యరజమునూ కలుపగా తయారయ్యాడు.

మారనకవి మార్కండేయపురాణ ఘట్టంలో వరూధినియే ప్రవరాఖ్యుని మొదట చూస్తుంది. ఆపై కథ అంతా సూటిగా నడిచిపోతుంది. వరూధిని తాలూకు తాంబూలపు ఘుమఘుమ, వల్లకీస్వర మధురిమ – అల్లసాని పెద్దన కూర్పు.

పెద్దన ప్రవరాఖ్యుని పురుష సౌందర్యాన్ని – వరూధిని చూచినట్టు, ఆమె కన్నులతో వర్ణించాడు. అయితే మన ’తతనితంబాభోగ..’ సీసపద్యాన్ని, ప్రవరుని కళ్ళతో కాక, అక్కడ ఉన్న మూడవ వ్యక్తి అయిన కవి కన్నులతో చిత్రించాడు. దీనివెనక ఔచిత్యం ఉంది. ప్రవరాఖ్యుడు ధర్మమెఱిగిన వాడు, వివాహితుడు, గేస్తు. ఆతడు వరూధిని యొక్క ఉన్మత్త అవస్థనూ అరమోడ్పు కనుదోయిలో కదిలే రతిపారవశ్య విభ్రమాన్ని చూడడం ఉండదు. అందుచేత అక్కడ సందర్భవశాత్తూ నాయికను పెద్దనే తన కన్నులతో చూచాడు. ఈ కవిత్త్వం – ఒకొక్క శబ్దాన్ని పేర్చుకుంటూనో, ఒక్కో పదాన్ని చెక్కుకుంటూనో నిర్మింపబడలేదని,  తనంతట తనే అలా వెల్లువలా, ఉరకలెత్తి ప్రవాహంలా పారిందని ఇందాకే ప్రతిపాదించబడింది. అల్లసాని పెద్దనకు ఆ రసాభివ్యక్తిని కలిగించిన పరిసరాలను, నేటి హంపి పరిసరాలలో కొంత ఊహించవచ్చు.

హంపి – విరూపాక్షస్వామి కోవెల కు వెళ్ళే త్రోవలో ఒకచోట త్రోవకు ఎడమ వైపున, అరటి, మామిడి కొబ్బరి తోపుల మధ్య, వరిచేల దాపున ఒక మనోహరమైన ప్రాంతం ఉంది. శ్రీకృష్ణదేవరాయలవారు అక్కడ ఉగ్రనరసింహ మూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. పక్కనే తుంగభద్ర కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కాలువ సరిగ్గా ఓ మంటపం మధ్య నుంచి ప్రవహిస్తూ ఉండడం గమనార్హం. శిథిలమైన ఆ మంటపం ఆనవాళ్ళు ఈనాడు మనకు కనిపిస్తాయి. విజయనగరం వైభవంగా వర్ధిల్లిన రోజులలో అక్కడ కంబాలపై మణులు పొదిగారేమో. చలువరాయి అరుగు క్రింద కాలువ నీరు పారేలా కట్టి ఉన్నారేమో. నాటి కాలంలో ఏ విద్యానగరసుందరియో ఆ తిన్నెపై కూర్చుని అలవోకగా మంజీరశోభితమైన పాదాలను నీటిపై కదిలిస్తూ హొయలు పోయిందేమో! అల్లసాని పెద్దన తీర్చిన వరూధిని, అక్కడే, ఆయన అపురూపమైన ఘంటం నుంచి అక్షరరూపంలో జాలువారి అ-క్షరమై నిలిచిందా? ఏమో.

నేటి ఒకానొక శిథిలమంటపం – నాడు కవికి ప్రేరణగా నిలిచిందా? అని తేల్చివేయడానికి ఆస్కారం ఉన్నది కానీ మనుచరిత్రలో సూక్ష్మంగా చూస్తే అటువంటి ఆనవాళ్ళు ఇంకా కనిపిస్తాయి. నాలుగవ ఆశ్వాసంలో స్వరోచి తన మిత్రులతో కలిసి – ఒక శిఖరంపైన మంటపంలో మిత్రులతో కలిసి ముచ్చటిస్తుంటాడు. పైన తుంగభద్రానది బొమ్మలలో అటువంటివి కనిపిస్తాయి. అలా మనుచరిత్రలో పెద్దన వర్ణించిన హిమాలయ సానువుల రూపాలు హంపి పరిసరాలలో (యథాతథంగా కాకపోయినా, ఛాయామాత్రంగా) కనిపిస్తాయి. పుట్టపర్తి నారాయణాచార్యుల వారు – వరూధిని పెనుగొండ ఆడబడుచని, జటిల ద్రాక్షాగుళుచ్ఛములు, కలువలూ, మందారాల ఆనవాళ్ళు అక్కడివనీ అంటారు. విరూపమైన ఈ నాటి పెనుగొండకు విరుద్ధంగా నాడు సస్యసంపద అంత వైభోగంగా ఉండేదేమో, వరూధిని అక్కడి ఆడపడుచే అయి ఉండవచ్చును కూడా. కానీ హంపి అదృష్టవశాత్తూ అవే పోలికలతో నేటికీ నిలిచి ఉంది. తన  నివాసస్థానమైన విద్యానగరపు పరిసరాలలోని ఈ మనోహరమైన సానువులు పెద్దనకు ప్రేరణ కావడంలో అత్యుక్తి లేదు.

***

ఇతరవిశేషాలు:

మనుచరిత్రలోని ఇదే ఘట్టాన్ని అనుసరిస్తూ రామరాజభూషణుడు వసుచరిత్రలో నాయికాగమన సన్నివేశాన్ని తీర్చిదిద్దాడు. ఆ ఘట్టంలో గిరిక వర్ణన ఈ లంకె లో చూడవచ్చు. ఆ వర్ణన “తరువుల పొంతఁ బొంచి వసుధావరమిత్రుఁడు….” అన్న పద్యంలోనిది.

రామరాజభూషణుడు వర్ణించిన నాయిక తాలూకు సన్నివేశము, పెద్దన మనుచరిత్రలోని సన్నివేశమూ ఒకే విధమైనవే. భూషణకవి నాయికను వర్ణిస్తే, పెద్దన నాయిక యొక్క ’వీణావాదన క్రియ’ ను వర్ణిస్తూ, ఆమె సౌందర్యాన్ని ఉద్యోతించాడు. సాధారణంగా సీసపద్యపు వస్తువుకు ఇది అరుదు. పెద్దన పద్యంలో అభినయప్రధానమైన దృశ్యనాటకపు తీరు కనిపించడం విశేషం.

అభినయము – ’ణీఙ్’ ప్రాపణే అన్న ధాతువుకు “అభి” ఉపసర్గతో ’అభినయము’ అన్న శబ్దం సిద్ధిస్తుంది. ప్రయోగమును ప్రాపింపజేయునది – ప్రాపణము లేదా నయము. అభినయము – అంటే రూపక అర్థాన్ని సామాజికులకు చేరవేసే ప్రక్రియ.(Act of communication) ఈ అభినయము – నాట్యశాస్త్రం ప్రకారం నాలుగు విధాలు.

౧. ఆంగికము

౨. వాచికము

౩. సాత్వికము

౪. ఆహార్యము

 

వరూధిని వీణ వాయిస్తున్నప్పుడు ఆమె కంకణాల ఝణఝణస్ఫూర్తితో కదులాడే హస్తాలకదలిక ఆంగికాన్ని, ముద్దులు నటించే జిలిబిలిపాట – వాచికాన్ని, రతిపారవశ్యపు అరమోడ్పు కనుదోయి – సాత్వికాభినయాన్ని, ధరించిన చీర, కావిరంగు అంగదట్టమూ ఆహార్యాన్ని – సూచిస్తున్నాయి.  వరూధిని చేత పలికించిన వల్లకీస్వరనాదం, ఆమె పారవశ్యవిభ్రమం ఇత్యాది అభినయాలన్నీ కలిపి జాలువారిన ఈ పద్యం ఆ ఘట్టాన్ని మొత్తం కాంతిమంతం చేస్తోంది.

శ్రీకృష్ణరాయలు ఓ మారు కొలువులో సంస్కృతాంధ్రాలలో కవిత్వం చెప్పి గండపెండెరం కొమ్మంటే, పెద్దన లేచి సుదీర్ఘమైన ఉత్పలమాలిక చెప్పాడని ఒక ఉదంతం. ఆ ఉత్పల మాలిక ఇలా సాగుతుంది.

పూఁత మెఱుంగులుం బసరుపూఁప బెడంగులుఁ జూపునట్టివా

కైతలు? జగ్గు నిగ్గు, నెనగావలెఁ గమ్మన గమ్మనన్వలెన్

 

అలవోకగా నిండు పేరోలగంలో ధారాసదృశంగా, రసరమ్యంగా కవిత చెప్పిన పెద్దన వరూధిని ఘట్టంలోనూ సద్యః స్ఫూర్తిగా, గమ్ము, గమ్మను సువాసనలీనుతూ ఈ సీసపద్యాన్ని పలికించాడనుకోవడంలో అనౌచిత్యం ఉండరాదు.

***

పెద్దన పద్యాన్ని గురించి కొందరికి ఒక అనుమానం రావచ్చు. ఇందులో ఏమున్నది. ప్రబంధస్థాయి అంగాంగ వర్ణన కదా అని. ఇక్కడ ఉన్నది అంగాంగ వర్ణన కాదని, కథలో భాగమైన ఓ అప్సర, మహాభోగిని మానసిక అవస్థకు దర్పణమని మనవి. స్త్రీ శారీరక సౌందర్యాన్ని సూచించినా అది రసికతను తప్ప కాముకత్వాన్ని సూచించడం లేదని గమనించాలి. ఈ విషయసంబంధంగా క్షేమేంద్రాచార్యుని ఔచిత్యవిచారచర్చలో ఆచార్యుడు పరిహార్యమని సూచించిన ఒక శ్లోకాన్ని గమనించాలి.

 

ఊరుమూలనఖమార్గపఙ్క్తిభిస్తత్ క్షణం హృతవిలోచనో హరః |

వాససః ప్రశిథిలస్య సంయమం కుర్వతీం ప్రియతమామవారయత్ ||

(కుమారసంభవం – ౮.౮౭)

 

కాళిదాసు చేసిన ఈ వర్ణన మిక్కిలి అశ్లీలంగా ఉందని క్షేమేంద్రుడు ఉటంకించాడు. ఆది దంపతుల శృంగారాన్ని ఇలా వర్ణించిన నేపథ్యంలో, ఓ భోగిని, అప్సరస మానసికావస్థకు దర్పణమైన పెద్దన కవిత, ఔచిత్యవంతంగానూ, ఎంతో హుందాగా ఉన్నదనాలి. అల్లసాని పెద్దన గారి ఈ పద్యం గురించి పుట్టపర్తి నారాయణాచార్యుల వారు రెండు భిన్న వ్యాసాలలో ప్రస్తావించారు. వారి వివరణలో రెండు వాక్యాలు.

“తరుణాంగుళి, తతనితంబము, రతిపారవశ్యవిభ్రమము, ప్రౌఢి, జిలిబిలిపాట, ఇంపుతళుకొత్తు – వంటి శబ్దములు ధ్వనిపుష్టిచే వానాకాలమునందలి మయూరములవలె మదించియున్నవి. ఆంధ్రభాషయందు అరుదుగా గానఁబడు నతి మనోహరములగు పద్యములలో నిదియొకటి యనుటకేమాత్రము సందేహమును లేదు….”

పుట్టపర్తి వారికే కాదు, సహృదయులకెవరినైనా ఝల్లుమనిపించి, మనసు మురిపించే ప్రబంధ కవిత యిది. కవి యొక్క భావావేశం కవిత్వం ద్వారా అంతే సాంద్రంగా పాఠకుడిని చేరడమే ఉత్తమకవిత లక్షణమని నిర్వచించుకుంటే, ఈ పద్యంలో ఆ లక్షణం జిగేలుమనే కాంతితో కనిపిస్తుంది.

***

ముగింపు:

సా వై పశ్చాద్వరీయసీ స్యాత్ | మధ్యే సంహ్వరితా పునః పురస్తాద్ ఉర్వి ఏవమేవ హి యోషాం ప్రశంసన్తి పృథుశ్రోణీర్విమృష్టాన్తరాంసా మధ్యే సంగ్రాహ్యేతి జుష్టామేవైనామేతద్దేవేభ్యః కరోతి |

(శతపథ బ్రాహ్మణం – ౧.౨.౫.౧౬)

ఆ యజ్ఞవేదిక పడమర (దిగువ) వైపు విశాలంగా ఉండాలి. ఆపై మధ్యన సన్నదై, తూరుపుకు వెళ్ళే కొద్దీ విశాలమవుతూ సాగాలి. ఎలాగంటే జఘన భాగాన విశాలంగా,భుజాలకు మధ్య కుంచించుకుని, మధ్యభాగాన సన్నగా ఉండే స్త్రీ ఆకారంలా. దేవుళ్ళకు ప్రీతికరంగా యజ్ఞకుండాన్ని నిర్మించాలి.

అల్లసాని పెద్దన – కవిత్వయజ్ఞానికై వరూధిని అన్న దేవతాస్త్రీ తతనితంబ ప్రస్తావనతో చేసిన కమనీయకల్పన కాబోలు మనుచరిత్రలోని ఆ పద్యం.

**** (*) ****