డైరీ

మరీచిక

సెప్టెంబర్ 2016

నాకొక కథ రాయాలని ఉంది. సువిశాల కథాజగత్తులో, వంద యేళ్లకు పైబడిన ఒక మహత్తరమైన సాంప్రదాయంలో, ఎందరెందరో మహానుభావులు కాలుపెట్టి పునీతం చేసిన ఆ దివ్యమందిరంలో వారి సరసన నిలబడకపోయినా, కనీసం వారి పాదధూళి సోకగలిగేలాగా, ఆ మందిరంలో ఏదో మూల ఒక అనామకుడిగా, విస్మృతకథకుడిగానైనా ఓ స్థానం కావాలని దురాశపడుతున్నాను.

అయితే కథలు రాయడానికి పనికి వచ్చే తెలివి, జ్ఞానము నాకు లేవు. నేనొక సామాన్యుణ్ణి. అనుభవాల అంతఃకుహరాలలో వస్తువును వెతికి చూసి, ఆ వస్తువుకు మెరుగులు దిద్ది, కథకు కావలసిన హంగులు జోడించి, మలుపులు తిప్పి, అందమైన ముగింపుకు చేరవేసే మెళకువ నాలో లేదు. ఎందుకంటే చూసిన, అనునిత్యం చూసిన చూస్తున్న సంఘటనల సారాంశానికి, కలుస్తున్న మనుషుల జీవితాలలో జరుగుతున్న ఒక మెలో డ్రామాకు ఒక అర్థం, అంతరార్థం, ముగింపు కనిపెట్టడంలో వైఫల్యమే తప్ప సాఫల్యం ఎన్నడూ నా దరికి చేరలేదు. నిత్యజీవితంలో కళ్ళెదుట కనిపిస్తున్న ఎన్నో విషయాలు అసంతృప్తికారకాలుగా, నిర్వేదభరితాలుగా అలాగే ఎందుకు జరుగుతున్నాయో, మరొకలా ఎందుకు జరుగవో, అవి తృప్తికరమైన తీరాలకు ఎందుకు చేరవో నాకు అర్థం కావటం లేదు. పోనీ ఏదో అలా జరిగాయి కాబట్టి జరిగే సంఘటనల వెనుక పరమార్థమూ, ఫార్ములా కనిబెట్టి వెలికితీసే చాతుర్యమూ, ఆ చాతుర్యాన్ని కథలో ఇమిడ్చే తెలివిడీ నాస్తి. ముగింపు లేని వాస్తవాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి, వాటిని ’కథ’ గా మలిచి ఆయా వాస్తవాలలో అంతర్లీనంగా కనిపించే ఒక బలీయమైన జీవితపు ’తపన’కు అన్యాయం చేయలేను.

చాలా మంది జీవితంలో అద్భుతాలు చూస్తారు. గొప్పమనుషులను కలుసుకుంటారు. గొప్ప అనుభవాలు పోగు చేసుకుంటారు, జ్ఞాపకాలను మిగుల్చుకుంటారు, అందమైన అనుభూతులను దాచుకుంటారు, వాటి సారాన్ని పదిమందికి పంచగలుగుతారు. అదేం చిత్రమో కానీ, నేనెప్పుడూ గొప్పవారిని కలుసుకోలేదు. వారితో తగినంత సమయం గడపలేదు. కానీ ’గొప్పతనం’ మాత్రం నేను నడిచే దారుల్లో ఫుట్ పాత్ ల పక్కన, మురికి వీథుల్లో, చాలామంది పట్టించుకోని చోట్ల, అనేక విషయాలలో కనిపిస్తూనే ఉంటుంది. ఈ మహానగరంలో అడిగిన వెంటనే వచ్చే ఆటో వాలా, ఆంగ్లంలో కాక తెలుగులో పరిచయం చేసుకొనే తెలుగువాడు, సౌమ్యంగా మాట్లాడి చిల్లర వెంటనే ఇచ్చేసే సిటీబస్సు కండక్టరూ, కాయగూరల బేరంలో ఎదుటివాళ్ళ స్టేటస్ గురించిన అంచనా లేక, పదిరూపాయలు బేరం తగ్గించుకునే కూరగాయలావిడ, సిటీబస్సులో ఎక్కిన వెంటనే దొరికే సీటు – ఇలాంటివి నాకు అద్భుతాలు. ఇంత చవకబారు స్పందనలు ఉన్న వ్యక్తికి కథలు రాసే అర్హత ఎంతమాత్రం ఉంటుంది? వీటన్నిటినీ ఉదారంగా ఆమోదించి, ’సింప్లిసిటీ’ అని మెచ్చుకున్న వాళ్ళు – నాతో బాటు షేర్ ఆటో ఎక్కటానికీ, ప్రభుత్వం సరఫరా చేసే ఐదురూపాయల భోజనాన్ని ఆస్వాదించడానికీ వెనకాడడం చూసి నవ్వుకునే ’సేడిజమ్’ ఒకింత లేకపోలేదు. అలాంటి సాడిస్టు లక్షణాలున్నవాడికి ఏమి ఉదాత్తత ఉంటుంది? తనకు లేని ఉదాత్తతను ఎలా ఎదుటివాడికి చెప్పగలడు?

నాలాంటి అమాం బాపతు గాళ్ళను పెంచి పోషించడానికి నవీన కాలంలో సామాజిక మాధ్యమాలు కొన్ని ఉదారంగా నడుం కట్టాయి. అబద్ధాలను నిజాలు చేయడానికి పనికి వచ్చే అవకాశాలిస్తూ. అలాంటి చిల్లర టిఫినీలు కాదు,మీల్స్ కావాలి నాకు. (ప్లేట్ మీల్స్ అయినా సరే).

“నీ జీవితంలో కథలు లేవా? అంటే, నీవు జీవించనేలేదా?” అని దోస్తొయెవ్ స్కీ లా ఎవరైనా అడిగితే – బుర్ర గోక్కోవాలి. ఎందుకంటే వాస్తవం కంటే సాహిత్యం ఒకమెట్టు పైనే ఉంది కాబట్టి, కథ ఒక ఉదాత్తమైనదని ఒప్పుకోవాలి. అలాంటి ఉదాత్తమైన అనుభవాలు నాకు లేవు. ఉన్నవి వాస్తవాలే. అయితే ఒక్కోసారి కొన్ని సంఘటనల, అనుభవాల వెనుక కారణాలను వెతుక్కుంటూ, ఆలోచనలను తవ్వుకుంటూ వెళితే నిర్వేదకరమైన ఊహలు నాకు ఎదురొస్తాయి. దీన్ని చెప్పడానికి ఓ చిన్న అనుభవం మీతో పంచుకుంటాను.

మామూలుగానే ఒకానొక సాయంత్రం ఆటో కోసం వేచి చూస్తూ నిలబడి ఉన్నాను. అప్పటికే పదిమంది ఆటోలవాళ్ళు నన్ను నిరాకరించారు. అప్పుడు ఒక ఆటో వాడు నన్ను ఎక్కించుకున్నాడు. బస్ స్టాండు వరకూ దింపుతానన్నాడు, అదీ మీటర్ ధరకే. ఆ రోజు నేనున్న పరిస్థితి ఎలాంటిదంటే – అతనికి మీటరుకు రెట్టింపు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాను. ఎలాగైనా బస్ స్టాండ్ చేరుకుని తొందరగా ఊరికి వెళ్ళాలి.

ఆటో అబ్బాయి కొంతసేపయిన తర్వాత మాటలు కలిపేడు. ఆ తర్వాత నేను కూర్చుని ఉన్న సీటు పక్కనా, వెనుకా చూడమన్నాడు. అక్కడ కొన్ని సినిమా తారల ఫుటోలు, కొన్ని కవితలూ రాసి ఉన్నాయి. అన్నిటిలోనూ ఆ ఆటో అబ్బాయి ఉన్నాడు. సినిమా తారలతో ఫుటో దిగటం చవకబారు హాబీయే కదా అనుకున్నాను. ఆ తర్వాత కాసేపటికి ఆ అబ్బాయి ‘కథ’ చెప్పాడు. అతని కుటుంబం చిన్నది. అయితే అతడు కుటుంబ బాధ్యతకన్నా మరొక గొప్ప సామాజిక బాధ్యత ఒకటి తీసుకున్నాడు. అతడు తీరిక వేళల్లో సినిమాలలో ఫైట్లలో పాల్గొంటాడు. ఒక్కొక్కసారి మంచి ఆఫర్ (అంటే ఆ పూటకు బిరియానీ అన్నమాట) వస్తే ఎక్స్ట్రా గా కూడా. అంతే కాక, అతను ఒక సినిమా రచయితకు ఘోస్టు. ఈ విధంగా వచ్చిన డబ్బులతో అతను ఒక అనాథశరణాలయాన్ని నడుపుతున్నాడు. అతడు గొప్ప వ్యక్తా? కాదా? యేమో?

ఆటోలో దిగేప్పుడు అతనికి అదనంగా కొంత ఇవ్వాలని అనిపించింది. నిజానికి ఆ సమయంలో మిగిలిన ఆటోవాళ్ళు అడిగే ’ఎగస్ట్రా’ యే అది. అది ఇవ్వటం మూలాన నాకు ఏ ’లాస్’ కూడా లేదు. పైగా నా అహం తృప్తి చెందుతుంది కూడా. అయితే డబ్బు ఇస్తే అతణ్ణి అవమానించినట్లవుతుందని ఓ మూల సందేహం. ఇచ్చిన తర్వాత అతను – చెప్పిన కథ విని (అది అబద్ధం అయితే) నేను మోసపోయినట్లవుతుందన్న శంకా ఉంది. బస్సు కదిలిపోతూందన్న ’సాకు’ తో ఆటో దిగి త్వరగా, ఆ పైకం ఇవ్వకనే వెళ్ళిపోయాను చివరికి. ఆ రోజు ఆ అబ్బాయి నన్ను సమయానికి దిగబెట్టటం వలన సరైన సమయానికి బస్సు దొరికి ఓ ముఖ్యమైన ’ఘటన’కు సరిగ్గా అరగంట ముందే మా ఊరికి చేరుకోగలిగాను. ఈ ’ఘటన’ ను – ఘనంగా జరపడానికి పైన చెప్పిన ఆటో అబ్బాయికి ఇచ్చే పైకానికి పదింతలు వ్యర్థంగా ఖర్చు పెట్టి నన్ను నేను ఆత్మవంచన చేసుకున్నది నిజం. ఆ అబ్బాయికి చేయవలసిన ’సాయం’ చేయకపోవడంతో కలిగిన ’అనుభవం’ – కేవలం ఇదుగో ఇక్కడ ఇలా చెప్పుకోవడానికి పనికి వచ్చిన స్వార్థమై, వ్యర్థమయింది.

అనుభవాలే కథలకు ముడిసరుకయితే ఈ నా అనుభవశకలానికి ఓ కథానికగా మార్పు చెందటానికి కావలసిన వస్తువు ఉందనే నా అంచనా. అయితే అలాంటి కథ ఎలా రాయాలో నాకు తెలియదు. రాస్తే భేషజంగానో, కల్పనగానో, చవకబారుతనంగానో మారకుండా శిల్పంలా ఎలా మలచాలో తెలియదు. అలా మలిచే ప్రయత్నంలో ఆ కథ తాలూకు ఒరిజినాలిటీకు అన్యాయం చేయడం కూడా లోని కథకుడికి నచ్చట్లేదు. పైని అనుభవాన్ని ఉపయోగించుకుని కథ రాస్తే, అది ఆ అనుభవాన్ని స్వార్థానికి వాడుకున్నట్టవుతుంది. (ఆల్రెడీ అయిపోయిందా?). స్వార్థం – ఓ ఖచ్చితమైన అబద్ధం. కొందరు జీవితానుభవాలతో నాటకీయమైన ఒక ’కల్పన’ ను కథగా చెబుతారు. మనసులో పుట్టిన కథలు – ’గగన కుసుమాలు’ అనవచ్చా?

కథకొక శిల్పమూ, ఒరవడీ కావాలని కొందరు. అంటే ఒక నిర్దుష్టమైన స్ట్రక్చర్ అన్నమాట. నాకు శిల్పమూ, చిత్రలేఖనమూ వంటివి రావు. నిర్మించటమూ తెలీదు. తెలిసిందల్లా లోకాన్ని చూడటం. చూడటంలోనే వెతకటం అన్న అర్థమూ ఉంది. ఏం వెతుకుతున్నావని అడిగితే ఏమో తెలియదు అని కూడా చెప్పవలసి ఉంటుంది. మరి తెలియనప్పుడు ఎందుకు చూడాలి? ఏం వెతకాలి? ఏదో ఎక్కడో మినుకుమంటున్న ఒక ఆశ, ఒక ఆర్తి – దాహాన్ని తీర్చకపోయినా, దాహం తీరగలదన్న భరోసా ఇవ్వగలిగిన మరీచికగా నేను అవగలనన్న ఆకాంక్ష!

కథ రాయాలంటే – ఫ్రేం వర్క్ కావాలని కొందరు గొప్ప విమర్శకులు చెబుతారు. ఆ ఫ్రేం వర్క్ తెలుసుకోవాలంటే ఇజాలు తెలియాలి. నాకు యే ’ఇజమూ’ తెలియదు. మార్క్సిజమో, కేపిటలిజమో పట్ల అవగాహన అసలే లేదు. ప్రవాహంలో బడి కొట్టుకుని పోతూ ఉన్న నీటికణానికి, ఆ ప్రవాహం తాలూకు నది పేరు, లక్షణాలు తెలిసే అవకాశం లేదు. నేనా నీటిచుక్క లాంటి వాణ్ణి. ఆ నీటిచుక్కకు దాహం తీర్చడంలో భాగమూ ఉంది, కానీ ఒక్క చుక్కతో ఏ ఒక్క వ్యక్తి దాహమూ తీరడం అసాధ్యం అన్న భావనా ఉంది.

ఇదిగో, ఇదే…ఇలా ప్రతిచిన్న విషయానికి మెదడులో భాగాలు అరిగిపోయేట్టు ఆలోచించటమే వచ్చిన సమస్య. ఇంతకూ ఏమిటి అసలు విషయం?

మొదట చెప్పినట్టు – నేను కథకుడు కావాలి. కథాసాంప్రదాయంలో ఓ చిన్ని చోటు కావాలి.

కానీ ’కథ’ రాయకూడదు.
అది ’అబద్ధం’ కనుక.
నిజమే రాస్తే?
అది ’కథ’, కథకు గల సారం, శిల్పం, డ్రమటైజేషన్ వంటి నిర్వచనాల దృష్ట్యా ఆ ’కథ’ అబద్ధమవుతుంది.

అంటే – కథకుడు కావాలని కథ కాకుండా రాసిన ఈ కథ – గాలిలో తేలిన ఓ ఊహ. Non-Existant.

ఇది ఒక స్వాప్నికుడి ’కల’. స్వాప్నికుడికి ’కల’ ఇచ్చిన ఆశ్వాసం మెలకువ ఇవ్వదు. ఇది రాయలేని కథ. రాయని కథ కూడా. ఇదొక మరీచిక.

**** (*) ****