కవిత్వం

చూడు,చూస్తూనే వుండు!

డిసెంబర్ 2016

చూడు,
ద్రవిస్తూ
ఒక బిందువులా మొదలై
చుట్టుముడుతున్న
నీ అనవసరావసరాల
ఆధునిక సుప్రభాతాన్ని.
నిను సంభ్రమింపజేస్తూ
ఆవిష్కృతమౌతున్న
ఓ సమ్మోహన యుగాన్ని.

చూడు,
ఆర్ద్రతను కోల్పోతున్న
గుండెల తెరల మీద
వ్రేలి కొసలతో లాగబడుతున్న ఆనందంలో
వెఱ్ఱితనాన తూగి
తాంత్రిక బాణామతి గుంపులై
వూయలూగుతున్న
అవ్యక్త జగాల్ని.

చూడు,
గొలుసు తెంపుకున్న మృగాలై
దారి పొడవునా సృష్టిస్తున్న
మత్తెక్కిన, అలవిమాలిన
అతిశయాల్ని,
దారి తప్పి
గమ్యమెరుగని తిమిరసర్పాలై
పోటీ పడి తిరుగుతున్న
అహంకారపు యౌవనాల్ని,
అజ్ఞాన శకలాల్ని.

చూడు,
యీ చలువగదుల అంగళ్ళనీ, ఆనందాల్నీ
పోటీ పడుతూ
గగనాన్ని ముద్దాడే హర్మ్య సమూహాల్నీ
వర్ణప్రపంచమై నిను
కౌగలిస్తున్న కరపత్రాల్నీ.

చూడు,
నిన్ను బానిసను చేసి
మత్తెక్కించి,
చక్రపు చట్రంలో పరిగెత్తిస్తున్న
ఆ కనుపించని దళారీని,
వాడిపైన చేరి
కనుగీటుతో
కాలాన్ని కదిలిస్తున్న కామందునూ.

చూడు,
ఎవరి మాటల అవసరంకోసమో
ఓ భ్రమలా సృష్టింపబడి
కనుపించని వలై
నీ చుట్టూ బిగుసుకుంటూ
నీ స్వేచ్ఛకే వురివేస్తున్న
అంతర్జాలపుకుట్రనూ.

అన్నీ, అన్నీ
చూస్తునే వుండు

రేపటి వుదయం ఆగిపోయేవరకూ,
నీ కాళ్ళ కింద
మిగిలిన అడుగు నేలైనా
నీకు తెలీకుండానే
కబళింపబడేంతవరకూ…