కవిత్వం

నీవే కదా?

మార్చి 2015

కసారి నడిచి వెళ్ళిన
నీ పాదముద్రల చల్లని స్పర్స
మనసున ఆరక ముందే మళ్ళీ
పరిమళించే కళ్ళతో
ఎలా బంధిస్తావో తెలియదు.
పరధ్యానంలో ఉన్న నన్ను
మౌనంగా నవ్వుతూ
మంత్రమేస్తావు

ప్రశ్నై కరిగేటంతలోనే
పక్కనే చేరి
పొంతన కుదరని
రంగుల చిత్రమై ఉక్కిరి బిక్కిరి చేస్తావు

ఎక్కడంటే అక్కడే
అదాటున
గుండె పూల గంపను అటూ ఇటూ కదిల్చి
నీ గులాబి చేతుల స్పర్శతో
కురిసీ కురియని మెత్తని రంగులనన్నీ
సుతారమైన వ్రేళ్ళతో అద్దు కుంటావు

మనసంతా చిత్రపటాన్ని చేసి
తెల్లని ఆనందాన్ని
నల్లని విషాదాన్ని
పచ పచ్చని వసంత పు వెన్నెలనీ
అల్లరిగా ఒలకబోస్తావు

కనులంచున జారే బాధా,
పెదవి పై విరిసే ఆనందమూ
గుండె లోతుల్లో కురిసిన వాన
నీవే అయి
ప్రశ్నగా,
అనుభూతిగా,
ఆశ్చర్యమై ప్రవహి స్తావు

నీ పేరేమని ప్రశ్నించే లోపే
రూపు మార్చుకుని
సజీవ
శబ్ద చిత్రమై నిలిచే నీవు…!?

 

**** (*) ****