కవిత్వం

ఆట!

సెప్టెంబర్ 2017

కొన్ని వెలుతురు నీడలు
కొన్ని చీకటి కిరణాలు
అల్లుకున్న ఒక వెదుకులాట
ఆటస్థలంలో
ఎపుడూ మనదో
కొత్తపలకరింత

నీవూ నేనూ
పక్కపక్కగా
మనంగా కాకుండా
విడివిడిగా
ఎదురెదురుగా
వేసే అడుగులు
ఒక్కొకటిగా
ముందుకో
పక్కకో
ఐమూలకో
ఒకోసారి వెనక్కో కూడా

విజయం ఎవరిదైనా
యుద్ధంలోనూ
సంతోషాన్ని వెదుక్కోడం
ఎపుడూ ఓ అసహనమైన ఆశ్చర్యమే

ఆడాల్సిందేగా
ఎవరో ఒకరు మరొకరి కోసం
గెలిచి ఓడేందుకో
ఓడి గెలిపించేందుకో
ఒకరి ముందు మరొకరు
కదలలేక నిలిచేందుకో

ఇపుడు మాట
కదిపే వంతు
నీదా? నాదా?