కవిత్వం

నడు, ఇంకా ముందుకు…

డిసెంబర్ 2015

న్నాళ్ళిలా
ఒక భ్రమను దాటి మరొక భ్రమ లోకి
యీ సంక్రమణం,
ఆశ్చర్యార్ధకంగా మారుతూ
యీ పయనం?
నడు, బయటకు నడు…దాటాల్సిన కర్తవ్యాల తీరాలు చాలానే వున్నై
కనపడని విచ్చుకత్తులూ
పరిధిని విస్తరించుకు
పరీక్షించేందుకు సిధ్ధంగా వున్నై
అంతరంగ మథనమూ
పరిహసిస్తూ వుంటూనే వుంది.నీ గాయాల్ని నలుగురికీ పంచి
బాధోన్ముఖుల్ని చేయనక్కర్లా
కనుబొమతోనే శాసిస్తున్న
స్వార్ధాన్ని కదనానికి పిలిచి మరీ నడు
నడువు నీ సహన జ్వాలను మండిస్తూ…

నీవు చీల్చుకొచ్చిన పరాభవాల వల నిజమే!
గెలిచిన పరిహాసమూ నిజమే!
నీ వెనుక చిరునవ్వై నిలిచిన ఆ రూపూ నిజమే!
నేటి రాత్రి వరకే నిలిచే చీకటి ముసుగూ నిజమే!
రేపటి వెలుగు కాగడా పట్టే
సూర్యుడి రాకా నిజమే!

నడు,
విజయపు దిక్కునే చూపుగా చేసుకుంటూ…