కవిత్వం

అడివి పిలుపు

ఫిబ్రవరి 2017

పొద్దట్నించీ
విసురు గాలి
కిటికీ తెరవమని గోల చేస్తోంది

నిరుటిదే
ఈ ఏడాది మళ్లీ
అదే హోరు
ఒక ప్రాచీన సముద్రానిది

రోడ్డుకు ఒక పక్కగా
పచ్చిక అంటిన టైర్లతో
వొంటరిగా ఒక కారు
దేనికో కాపలా అన్నట్టుంది
మరి, దానికి?… దానికెవరు?
కాపలా వున్నదానికెవరు కాపలా?

ప్లీజ్, మీ దగ్గరొక వాక్యం వున్నదా?
అది ఆరిపోక ముందే దాని లోంచి
ఒకట్రెండు రవ్వలు తీసి ఇస్తారా?
మీ గుండం మీకు వుంటుందిగా?!
నేను అగ్నికి అధికారిని కాను,
నాగలి వెనక నడిచే ఎద్దును
నేనూ వండుకోడం నేర్చుకున్నాను
నిద్రపోయిన చోట నిద్రపోవడం నేర్చుకున్నాను
స్థలానికి బందీని

ఈ స్థలం నాది కాదు
మహా అయితే
నేనొక కౌలుదారును

పొద్దట్నించీ గాలి
కిటికీని బాదుతోంది

ఇనుప తలుపులు

వాటిలో వురుములు
తమ ప్రతిబింబాలు చూసుకుంటున్నాయి
మెరుపులు అందాక వచ్చి
కరిగిపోతున్నాయి, అంత నలుపు

ఎక్కడో ఒక చిన్ని పగులు

కనిపించీ కనిపించనిది
ఒక సన్నని గాలి తెమ్మెర చెక్కిలి నిమురుతుంది
చల్లని స్పర్శ, ఎక్కడిదో పసరు వాసన,
ఆడివి వాసన; వాసన కూడా ఒక మాటే
వినగల చర్మానికి

పొద్దట్నించీ
హోరు హోరుగా
ఆకు పచ్చగా
పసరు వాసనగా
మంచు స్పర్శగా
ఆడివి పిలుస్తోంది

జంతు చర్మాల దుస్తుల
ఏరిన కాయల బువ్వల అరణ్యం

పొద్దట్నించీ హోరు
ఇనుప కిటికీకి పక్షి రెక్కలు మొలుస్తున్నట్లు