స్మరణిక

బాధాగ్ని కుసుమం: కలల కళ్ల నిషా

జనవరి 2013

‘బాధాగ్ని కుసుమాన్ని ఆఘ్రాణిస్తున్న… క్షణాల మధ్య అగాథంలో స్వప్న చక్షువుల నిషా’ ను రుచి చూపించించిన కవి అజంతా.  పువ్వులు, అగ్నుల భాష కలిసిపోతే ఎలా వుంటుందో వాసన చూయించిన కవి. ‘కాంతా సమ్మితత్వా’న్ని వదులుకోకుండానే ‘అగ్నిసమ్మితమై’న కవిత అజంతాది.

తెలుగు అజంత భాష. తెలుగు పదాలు హల్లులతో కాకుండా అచ్చులతో అంతమవుతాయి. అందుకే తెలుగుకు ఇంతటి సంగీత శక్తి. తెలుగుదనాన్నే కాదు, తెలుగు సంగీతాన్ని వచన కవితలో అందించిన కవి అజంతా.

చిన్న చిన్న వాక్యాలు చుదువుకోడానికి బాగుంటాయి. వాటికి కాస్త పద మైత్రి కలిస్తే వచనం వేగంగా వెళ్లిపోతుంది. ఎక్కడున్నామో తెలిసే లోగా రైలు స్టేషన్ కు చేరుతుంది. చదవీ చదవక ముందే పద్యం అయిపోతుంది. పెద్ద వాక్యాల రూపంలోనే కవి తనదైన సంగీతం పలికించగలడనుకుంటాను. అలాగని వివరించలేదు గాని, ఒక సారి నా పద్యాలు చూసి, పెద్ద వాక్యాలుగా రాయి అని అయన ఇచ్చిన సలహా సారం అదేననుకుంటాను. అజంతాలో చిన్న వాక్యాలు చాలానే ఉంటాయి. సంగీత ఝరిని కొన్ని క్షణాలు ఆపడడమే, వచనానికి అలల రూపం ఇవ్వడమే వాటి పని. కాస్త ఆగి మళ్లీ మొదలవుతుంది వడిగా సాగే నది. మరీ ఎక్కువగా చిన్న వాక్యాలున్న చోట, కింద పేరు తీసేస్తే, అది అజంతా పద్యమని అనుకో బుద్ధి కాదు.

(పెనుమర్తి విశ్వనాథశాస్త్రి – అజంత)

తన భావవోద్విగ్నాలే కాదు, వాటిని మన కంటికి అందించే అక్షరాలు కూడా కలల్లోనివే అంటాడాయన. అందుకే, తన వ్రాతను ‘స్వప్నలిపి’ అన్నాడు. ఈ ‘లిపి’కి వేరే ప్రిఫిక్స్ లు చేర్చి, ఇతర కవులు తమ ప్రకటనలు తాము చేసుకున్నారు, శ్రీ శ్రీ తరువాత ఎందరో ‘ఫలానా శ్రీ’లు పుట్టినట్టు. అజంతాను ఒక తరం ఎంత ఇష్టంగా చదువుకుందో చెప్పడానికి ఈ ఉదాహరణ. వాళ్లు అజంతాను అనుకరించారని కాదు. నేర్చుకున్నారు. ప్రేమగా నమస్కరించారు.

 

అజంతా నాకు చాల చాల ఇష్టం. ఈ మధ్య కొత్తగా మితృడయన ఒక చదువరి సాయంత్రపు నడకలో ఎదురై ‘మిమ్మల్ని చదివితే అజంతా గుర్తుకొస్తాడ’ని అన్నాడు. అది నిజం కాదు గాని, ఆ మాటను గొప్ప మెచ్చికోలుగా తీసుకుంటాను. అంతిష్టం నాకు అజంతా అంటే. దేర్ఫోర్, ఈ చిన్ని రచన అబిమాన కలుషితమని మధ్యంతర హెచ్చరిక.

 

ఈ అభిమానం మొదట్నించీ ఉన్నది కాదు. చాల ఆలస్యమయ్యింది అజంతాను తెలుసుకోడానికి. గుడిహాళం రఘునాథం అనే కవి లేకపోయి వుంటే, ఆనాటి నన్ను తను అంతగా ప్రేమించకపోయి వుంటే, విభేదాల్ని నంజుకుంటూ నా ఖాళీ గ్లాసుతో తన గ్లాసు తాటించి ఛీర్లు కొట్టకపోయి వుంటే, నేను అజంతాను తెలుసుకోడం ఇంకా చాల ఆలస్యమయ్యేది. రఘు ఇప్పుడు లేడు. అజంతా కూడా లేరు. లేరూ? ఉన్నారనే అనుకుంటున్నా. ఇప్పుడు పేర్లు చెప్పను గాని, అజంతా నుంచి ఉప్పందుకుని రాస్తున్న కవికుమారులు ఎందరో ఉన్నారు. ఊరికే రాయడం కాదు, చాల గొప్పగా రాస్తున్నారు.

 

మాకు తెలీకుండానే ఒక సాయంత్రం రాత్రయిపోయిన అద్భుత వేళ, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ క్యాంటీన్ దగ్గర ఆరుబయట అజంతా సంగతి వచ్చింది. గుర్తున్నంత వరకు అక్కడ సునారె, అసురా, గుడిహాళం, నేనూ ఉన్నాం. ‘అజంతా అర్థం కాడు, అర్థం కాని కవిత్వాలెందుకు?’ అనేశాను అప్పటి నా జ్ఙాన, నిబద్దతలను సమపాళ్లలో రంగరించి. ‘మాకు అర్థమయ్యాడు, నీకెందుకు అర్థం కాడ’ని రఘు సవాలు. సవాళ్లను సవాళ్లుగా మాత్రమే తీసుకునే ఒక సద్గుణం నన్నెన్నో సార్లు కాపాడింది. వాటిలో ఇదొకటి.

 

ఆ రాత్రి నల్లకుంట లోని మా ఇల్లు నాబడు ఒక ఇరుకు సింగిల్ రూం చేరి, అప్పుడే అచ్చయిన అజంతా ‘కంప్యూటర్ చిత్రాలు” (1981 జులై ఇరవై నాలుగు ‘ఆంద్రజ్యోతి’) పద్యాన్ని ఎన్ని సార్లు చదివానో చెప్పలేను. తెల్లారిన సంగతి గమనించ లేదు. ‘ఇక నిద్రపోరా నాయ్నా పొద్దున్నే ప్రెస్సులో ‘విమోచన’ పత్రిక పనుంద’ని నాకు నేను చెప్పుకోబోయి, అప్పుడే మా జయమ్మ లేచి ఏదో పని మీద బయటికి వెళ్లడానికి సిద్ధమవుతుంటే చూసి, చిన్న నవ్వు నవ్వేసి, అలాగే ఆ సిరిచాప మీదే కూర్చుని అజంతాతో విబేధిస్తో, ఆయన మీద అమిత ప్రేమతో రాసిన ‘కంట్రోల్ ది కంప్యూటర్’ సృజనలో అచ్చయి, మొదట సారి ప్రేమలేఖ రాసి, దానికి జవాబు వచ్చినా రాకున్నా ఆ అమ్మాయిని మరిచిపోని అబ్బాయిలా అజంతా ప్రేమలో పడిపోయాన్నేను.

 

అజంతా గొప్ప స్నేహశీలి. రుజు స్వభావి. చాల తక్కువ మాట్లాడతారని అంటారు. అది నా అనుభవం కాదు. మనకు ఏది/ఎవరు ఇష్టమో అది/వారు ఆయనకూ ఇష్టమైతే, ఎట్టా మాట్లాడుతారంటే, ఆయన దగ్గర్నించి వచ్చాక చాల చాల రోజులు అక్కడ కూర్చుని ఉన్నట్టే, ఆయన మాటలు వింటున్నట్టే మత్తు మత్తుగా ఉంటుంది.

 

బెల్లంకొండ రామదాసు కవిత్వం భలే ఇష్టం నాకు. ‘నయాగరా’ అనే పుస్తకంలో మొదట కుందుర్తి, చివర ఏల్చూరి సుబ్రహ్మణ్యం (‘ఏసూ ఏసుకో ఒక గళాసు’ అనే శ్రీశ్రీ పద-చమత్కారం లోని  ఏ.సు.), ఆ యిద్దరి మద్యలో బెల్లంకొండ రామదాసు వుంటారు. రామదాసు పద్యంలో ఒక చోట ‘తిరగలి రాళ్ల మధ్య గింజ’ అని వున్న ఇమేజ్ ని గుర్తు చేసి, ఆ ఇద్దరి మధ్య రామదాసు గారు తిరగలిరాళ్ల మధ్య గింజలాగే వున్నారని అనేశాను తెగించి. అనేసి అజంతా ఏమంటారోనని ముఖం మరో వైపు తిప్పుకున్నాను. అజంతా పరవా లేదన్నట్లు కళ్లతోనే భుజం తట్టి, ఇక తనూ, రామదాసు మద్రాసు (చెన్నై) లో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ చెప్పిన కబుర్లతో ఆ చీకటి రాత్రి భళ్లున వెన్నెల కురిసింది.

 

ఆ మాటల్లో నాకు బాగా ఇష్టమయినది: తమ చిరు/నిరుద్యోగపు రోజులవి. ‘నిరుద్యోగి వెంకట్రావు’లు దారి పొడుగునా ‘చెట్లై కూలుతున్న’ రోజులవి. ఇద్దరూ జేబులో డబ్బుల్లేకుంఢా హోటల్లో భోంచేసి వెళ్తున్నప్పుడు, రామదాసు గారు ‘రేపు’ అంటో ఒక మాటను కౌంటరు మీదికి విసిరే వారట. ఇది నన్నెంతగా హాంట్ చేసిందంటే, చాల రోజుల తరువాత ఒక కథలో దాన్ని ఉపయోగించుకుంటే గాని మనసు ఊరుకోలేదు.

 

అజంతా భయపడిన వాడని అంటారు. కాదని నా అభిప్రాయం. భయపడిన ప్రపంచాన్ని వ్యక్తం చేసిన వాడు. రోడ్ల మీద మనషుషుల భయాన్ని తన భయం చేసుకున్న వాడు. కవిగా ఉన్నత ప్రమాణాలు పెట్టుకుని జీవించిన మనిషి. ఆయన భయపడింది ‘మీడియోక్రిటీ’కి మాత్రమే. అలాగని ఆ సంగతి బయటికి చెప్పలేని మొహమాటస్తుడు. ‘మీడియోక్రిటీ’కి నిజమైన విరుగుడు శ్రమ, శ్రద్ధ.

 

పలువురు గొప్ప కవుల్ని, అప్పటికి అచ్చు కాని (వాళ్ల) పద్యాలతో పరిచయం చేస్తూ అబ్బూరి వరద రాజేశ్వర రావు గారు రాసిన ‘కవన కుతూహలం’ పుస్తకానికి అజంతా రాసిన ముందు మాట చదివారా? అది ఎట్టాగూ చదివి తీరాల్సిన పుస్తకమే. ఇప్పటికి చదవకపోతే తప్పక చదవండి. ముందుమాటలో అజంతా దాదాపు ఇదే మాట చెబుతూ; పని నుంచి ఇంటికి వచ్చాక శుబ్రంగా స్నానం చేసి, మాసిన బట్టలు మార్చుకుని, శ్రద్ధగా కూర్చుని ఈ పుస్తకం తెరవండని అంటారు. (నిజమైన) భక్తుడు పూజకు కూర్చున్నంత శ్రద్ధ పుడుతుంది పుస్తకం చదవక ముందే మనకు. ఆ తరువాత ఏ మంచి పుస్తకం పట్టుకున్నా కాస్త మనస్సును శుభ్రం చేసుకుని, శ్రద్ధగా కూర్చోవాలనిపిస్తుంది. ఎట్టా రాయాలో కాదు, ఎట్టా చదవాలో కూడా తెలుసుకోవచ్చు అజంతా నుంచి.

(అజంత – స్కెచ్ వేసింది రామశాస్త్రి)

‘మీడియోక్రిటీ’కి సంబంధించి ఆయన మాటలు ఎంత పదునుగా ఉండేవంటే, ఆయన ఎవరి గురించి ఆ మాట చెబుతారో వాళ్ల మీద మనకు చాల జాలి వేస్తుంది. ఎంత జాలి అంటే, ఆ ఫలానా మనిషి స్థానంలో మనల్ని మనం ఊహించుకుని వణికి పోతాం. ఎప్పటికీ అతడిలా కాకుండా వుండాలని నిశ్శబ్దంగా ఒక సంకల్పం చెప్పుకుంటాం.

 

కనిపించినపుడంతా అతి వినయం ప్రదర్శించే ఒక కవి గురించి, ‘తల పైకెత్తితే ఎక్కడ  తెగిపోతుందో అన్నట్టుంటాడు’ అన్నారు అజంతా. నాకు పలు మార్లు గుర్తొచ్చే వాటిలో ఈ దృశ్య-వాక్యం ఒకటి. మరీ ఎక్కువగా గుర్తు  పెట్టుకున్నానో ఏమో దీన్ని. ఏదో పని వడి ఎవరినైనా మనసులో లేని మెచ్చికోలుతో ప్లీజ్ చెయ్యబోతే అజంతా వాక్యం తల లోంచి మెరుపులా దూసుకుపోతుంది.

అట్టాంటి వాళ్లుండాలి. వాళ్ల మాటలు వినాలి. వినగలగడం ఒక అదృష్టం. ఆ అదృష్టం పట్టిన వారిలో నాది చివరి పంక్తి అని తెలుసు. అది చాలు. వినడమంటే ఒప్పేసుకోవడమని కాదు. శ్రద్ధగా వినడమని, విని, మనకు మనం నిర్ణయానికి రావడమని అర్థం. కవిగా శ్రీశ్రీ పద్ధతి కూడ అదే అనుకుంటాను. శ్రీశ్రీ చనిపోయినప్పుడు, శ్రీశ్రీకి ‘ముందూ తరువాతా చీకటి’ అని అజంతా అనడానికి అదీ ఒక కారణం కావచ్చు. తను స్వయంగా అంతటి నిర్భయుడు కాకపోయి వుంటే, అజంతా ఇప్పుడు వుండే వారు కాదు, ‘తలెత్తితే తల తెగిపోతుందని భయమా’ అంటో మన తలల్లో మెరుపై దూసుకుపోవడానికి.

 

తెల్లని చీకటిలో నల్లని మెరుపు అజంతా. ‘రోడ్లు నమస్కరించాల్సి’న కవి అజంతా. వీథి మానిసిని కావ్య నాయకున్ని చేసుకుని అతడికి నేనున్నానని బాసట పాట పాడిన గాయకుడు అజంతా.

 

అజంతాతో సంవాదం ఎప్పటికీ అయిపోదు. అయన శైలి కూడా సంవాదాత్మకమే. ‘స్వప్న లిపి’లో ఆయన పద్యాలన్నీ ఉన్నాయో లేవో. ఇవి నా పద్యాలని ఆయన అనుకున్నవన్నీ ఉన్నాయి. దాదాపు అన్నిటిలో అయన నేరుగా మనతో మాట్లాడుతారు, ఊరించి, ఊగించి, కూకటి వేర్లు కదిలించి.

 

ఒకసారి రాయడంతో, అచ్చేయడంతో పద్యం ఆగిపోదని, నిత్యం వృద్ధి చెందుతుంటుందని అంటారు అజంతా. ఏ పద్యం అచ్చయిన రూపంలో ఆఖరుది కాదని అయన భావించారు. కవిగా తన పని అయిపోయిందని ఆయన ఎప్పుడు అనుకోలేదు. తానింకా ‘లిట్మస్ టెస్టు’ దాటలేదనే భావించారు. దాటడానికి, కవనమే జీవనమై తపించారు. ఆ కాసిన్ని పద్యాలతో ఒకటి రెండు తరాల్ని ఊపేసి, ప్రభావితం చేసినా తన గురించి తాను అనుకున్న ఈ మాటల్లో నటన ఏమాత్రం లేదు. అవి ఆయన నిజంగా అనుకున్నవే. ఇది కూడా మనకు పాఠమే.