కవిత్వం

అన్వేషణలో

మే 2017

క సమాంతర దశ నుంచీ
మరో అసమాంతర దశలోకి
మళ్ళీ యింకో దాన్లోకి
మళ్ళీ మొదటికి -
యిలా తిరుగుతూనే
తర్కిస్తూనే వుంటాను.

ఎటెళ్ళినా
నన్ను చుట్టిన వంటరితనమే
యేదో రూపంలో
నా చుట్టూనే శ్వాసిస్తూ
నేను కల్పించుకున్న పనిలాగా కూడా -

‘నాతో ఇంకొకరు కూడా’
అనుకుంటూ
పాటతోనో, మాటతోనో
చెలిమి కడతాను.
ఎందరిలో యెక్కడున్నా
ఎక్కడినుంచో పిలిచినట్లు
నాలోంచే పలికి
పక్కనే చేరుతూ
మళ్ళీ నా వంటరితనమే,
నా శ్వాసలా నీడలా
నాతోనే!
*
తిరుగాడే గాలీ వంటరే
సహనమై నిలిచిన కొండా
ప్రశాంతమై నిదురించే కోనా
పనిలేకున్నా పరుగులెత్తే నదీ
పండి పులకించే నేలా
రెండు పొద్దుల్నీ మోసే నింగీ-
అన్నీ వొంటరొంటరివే!

కానీ
నీలా,నాలా- విడిగా
చినుకు చినుకుగా వున్నా,
జతకలుపుకుని
ప్రకృతై
ఒకటొకటిగా కలిసి వర్షమై
వంటరితనపు హద్దులు
చెరుపుకుంటూ
చెలిమి సంద్రాలై
పంచభూతాలై
జతపడుతూ
దేనికి దానికి గా విడివడుతూ
ఆటగా
మళ్ళీ వొక దశనుంచీ
మరోదాన్లోకి . . .!

 
 
Painting credit: pintarest