సమీక్ష

ఆత్మాభిమానం కోటేశ్వరమ్మ గారి ఇంటి పేరు!

మార్చి 2013

ఈ జీవితానికి నాకు మధ్య ఎప్పుడూ యుద్దమే!

నా భాధతోనే కాదు – ఈ లోకంలోని భాధ అంతటితోనూ,

చీకటి అంతటితోనూ నా నిరంతర పోరాటం.

అందుకే ఈ చరిత్ర బాధార్ణవం -ఒక శోకార్ణవం

 -చలం

‘నిర్జన వారధి ‘ రచయిత్రి కొండపల్లి కోటేశ్వరమ్మగారి బాధ కూడ పూర్తిగా వ్యక్తిగతం కాదు, సామాజికమైనది, రాజకీయమైనది కూడ. అందుకే ఆమె బాధ ప్రతి పాఠకుని హృదయాన్ని పిండి వేస్తుంది. ఈ పుస్తకం కోటేశ్వరమ్మగారి అంతర్వాహిని గా సాగినా, ఆమె శైలి, కధనంలోని భిన్నత్వం మనల్ని పుస్తకం పూర్తి అయ్యిన దాకా వదలనివ్వదు.

తన తొంభై రెండు ఏళ్ళ వయస్సులో ఇంచుమించు ఎనిమిది దశాబ్ధాలు ప్రజాజీవితంలో గడిపిన ఆమె  జీవితం కచ్చితంగా ఇతర స్రీల జీవితాల కంటే వైవిధ్యమైనది, విశిష్టమైనది. ఆమె జీవితం ఉద్యమం, సాహిత్యం, సంగీతం, నాటకంతో పెనవేసుకొని ఆమెను ఒక విభిన్న వ్యక్తిగా నిలబెట్టాయి. ఉద్యోగాన్ని కూడా తన మనసుకు నచ్చిన విధంగా మలచుకొని తన సర్వ జీవచైతన్య శక్తులు చివరివరకు సజీవంగా ఉంచగలిగారు. అందుకే తొంభై ఏళ్ళ వయసులో కూడా తేటినీలాపురం పక్షులని చూసి పరవశించగలిగారు.

ఈ పుస్తకంలో జాతీయోద్యమం, తెలంగాణా సాయుధపోరాటం,కమ్యునిస్టు ఉద్యమంలో ఆమె తన పాత్రను వివరించటంతో బాటు తనతో పని చేసిన వారిని పేరు పేరునా తలుచుకొన్నారు. కఠోర అజ్నాత వాసంలో ఆమె డెన్ లో ఉన్నప్పుడు, గర్భం పోగొట్టుకొని, కదలలేని నిస్సహాయస్థితిలో ఆమె మైల బట్టలు ఉతికిన కామ్రేడ్ నరశింహరావును తరువాత పోలిసులు చంపివేసారని విన్నప్పుడు ఆమె పడ్డ వేదన పుస్తకంలో సజీవంగా రికార్డ్ చేయగలిగారు. తన సమకాలికులు మానికొండ సూర్యావతి, డా. అచ్చమాంబ, ఉదయం, తాపీ రాజమ్మ  మొదలైన వారితో ఆమె మహిళ సంఘ కార్యక్రమాలు, వారి స్నేహం హృద్యంగా వర్ణించారు. సుందరయ్యగారు, చండ్ర రాజేశ్వరావు గారు వంటి మహోన్నత వ్యక్తుల సాంగత్యం ఆమెకు ఊపిరి పోసాయి.

కొండపల్లి సీతారామయ్యగారితో ఆమె వైవాహిక జీవితం వ్యధాభరితంగా ముగిసినా ఆమె ఉన్నతికి, ఆమె లోని ప్రతిభను వెలికి తీయటానికి, ప్రజాజీవితంలో ఆమెను మమేకం చేయటానికి ఆయన అందించిన తోడ్పాటు గొప్పది. ‘గ్రహింపే కాదు, ప్రశ్నించే ధైర్యం కావాలి’ అని ఆయన నూరి పోసారు. కన్యాశుల్కం నాటకంలో నటించటానికి  ’వేశ్యగా ముద్ర పడతానేమోనని ఆమె తటపటాయిస్తుంటే మూడు రోజులు నిరాహరణ దీక్ష చేసి ఆమెను ఒప్పించారు. ఆమె సాంఘీక జీవనానికి, సర్వతోముఖాభివౄద్ధికి తోడ్పడిన భర్తే ఆయన బలహీనతలను  ప్రశ్నించినప్పుడు “నువ్వు అందరితో చనువుగా ఉంటే నేను కూడా నిన్ను అనుమానించవచ్చుకదా”! అని ఆయన మానసిక ధౌర్భల్యాన్ని బయట పెట్టుకొన్నారు.  ”నువ్వు వితంతువైనా నిన్ను పల్లకీ ఎక్కించాను” అని ఆమెలో ఇన్నాళ్ళు తనే పెంచి పోషించిన ఆత్మస్తెర్యానికి గొడ్డలి వేటు వేసారు.

జీవితంలో ఈ దెబ్బే ఆమెను నిర్వాణంగా మార్చింది. బహుశ తరువాత జీవితంలో కొడుకు,కూతురు, తల్లి మరణాల దుఃఖాలు అధిగమించడానికి ఇది తొలి మెట్టు అయి ఉండాలి. చివరి దశలో తన దగ్గరకు చేరిన సీతారామయ్యగారిని తామరాకు మీద నీటి బొట్టు లాగ, ఎలాంటి ఉద్విగ్నతలకు లోను కాకుండా చూడగలిగింది. మానసికంగా ఆయనను స్వీకరించలేక పోయినా, తోటి మనిషిగా ఆదరించగలిగిన మానసిక పరిపక్వతకు చేరుకో గలిగారు.

సీతారామయ్యగారు తన పూర్తి జీవితాన్ని, సాహసాలతోను,త్యాగాలతోను గడిపారు. కాని తన స్రీ పట్ల ఆయన క్రూరమైన ఉదాసీనత, దుర్మార్గమైన అవకాశవాదం, పితృసామ్యసమాజ నేపధ్యంలో మనకు అర్ధం అవుతున్నప్పటికీ, (ఆమోదం కాదు) కమ్యునిష్ట్ వ్యతిరేకులకు, కమ్యునిష్ట్ విమర్శకులకు ఇది ఒక సువర్ణావకాశంగా మారింది. ‘ఈనాడు’ లో ఈ పుస్తకం గురించి చదివిన నా మిత్రులు కొందరు ఆశ్చర్యంగా ఫోన్ చేసారు.( కొందరి గొంతులో సంభ్రమం కూడా వినిపించింది.)

భర్త తిరస్కారానికి గురైన చాలా మంది స్రీల లాగనే ఆమె ఆంధ్ర మహిళాసభకు చేరారు. అందరి తల్లులలాగే పిల్లలు తనకు దూరమైన, వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తు కావాలనుకొన్నారు. ప్రజానాట్యమండలి కళాకారిణి గా, విప్లవ వనితగా తన హోదాలన్నీ వదిలేసి నిరాడంబరమైన మేట్రిన్ ఉద్యోగానికి తన మనఃశరీరాలను బదలాయించగలిగారు. చివరకు తన తల్లి తండ్రుల నుండి సంక్రమించిన ఆస్తిపై అధికారాన్ని వదులుకోని, ఆత్మగౌరవంతోను, స్వాభిమానంతో నిలబడ్డారు. పురుషాదిక్యతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరు చరితాత్మకమైనది. అందుకే  ఆమె అప్రకటిత స్రీ వాది. ఆత్మగౌరవం మూర్తీభవించిన మానవి. చదువు వదిలేసి కొడుకు విప్లవకారుడుగా మారటానికి తన తప్పు ఏమైనా ఉందా అని ఆమె మధనపడటంలో తల్లిగా ఆమె మనస్సును అర్ధం చేసుకోవచ్చు. పరిణితి చెందిన కొడుకు తమ దగ్గర ఉన్న సంవత్యర కాలం ఆమె పూర్తి ఆత్మస్తెర్యానికి తోను, సంతోషం తోను ఉన్నట్లు అన్పిస్తుంది.

అంతలోనే అతని మరణం( రాజ్యహత్య), దాన్ని ఆమె దిగమింగుకున్న వైనం కళ్ళనీరు తెప్పించింది. ఎందరో కామ్రేడ్స్ ప్రాణత్యాగం చూసిన ఆమె తన కన్నపేగుకే అది అనుభవం అయినప్పుడు అందరిలా విధిని నిందించకుండా, కొడుకు మరణానికి కారణాలు అన్వేషిస్తూ తిరిగింది.

ఆమె తన ఉద్యోగ జీవితంలో అలవర్చుకొన్న నిబ్బరం, చదువు పెద్దగా లేకపోయినా తాను సొంతంగా పెంపొందిచుకొన్న దృఢ చిత్తం; విద్యావతి, డాక్టర్ అయిన వారి కూతురు కరుణలో లోపించాయి.కరుణ మరణం ఆమె అంతిమ దుఃఖం.

చండ్ర రాజేశ్వరరావు గారు ఆమె గురించి “అక్షర బువ్వ నిన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది” అన్నారు. ఆయన మాట ఎంత వాస్తవమో పుస్తకానికి అనుబంధంగా ఉన్న ఆమె రచనలు చదువుతుంటే అర్ధం అవుతుంది. రచనా వ్యాసాంగాన్ని ఆమె వెంటిలేషన్ గా ఉపయోగించుకొన్నారు.

చందు (కుమారుడు) మీద ఆమె రాసిన కవితను చదివితే కళ్ళనీళ్ళు పెట్టుకోని వారు ఉండరంటే అతిసయోక్తి కాదు.

చందూ!

అమ్మ అక్కున వొదిగి,

చెక్కిలిపై చేతులెట్టి మక్కువ నెరపిన

చక్కదనాల బాల చంద్రుని రూపం,

పోలిసుల కంట పడనీయక అమ్మ

తన ఎదలో పదిలపరిచిందిరా!”

మహాశ్వేతా దేవి కన్నతల్లి నవలకు ఇలాంటి తల్లులు ఎందరో ప్రేరణ అయి ఉంటారు.

మానికొండ సత్యవతి, ఉదయం గార్ల గురించిన  రచనలు ఆమె హృదయంలో ముంచి పంచిన స్నేహ పరిమళాలు వెదజల్లాయి. మధురవాణి  పాత్ర ను ఆమె అర్ధం చేసుకొన్న తీరు అద్భుతం.

ఓల్గాగారు “జీవితంలో అత్యంత క్లిష్టమైన ఘట్టంలో దిటవుగా ఉండటానికైనా, మళ్ళీ నిర్లిప్తంగా తన జీవితం కొనసాగించటానికైన ఎంత శక్తి కావాలి! అంత శక్తి దాగి ఉంది కోమలంగా, సున్నితంగా, ప్రేమగా కనిపించే కోటేశ్వరమ్మలో” అంటారు ఆమెను ఉద్దేశించి.

ఆమె సుధీర్ఘ రాజకీయ, ఉద్యమ, సాంస్కృతిక, వ్యక్తిగత జీవితం నుంచి ఆధునిక మహిళలు నేర్చుకోవలిసినది ఎంతో ఉంది.